ప్రసిద్ధిచెందిన సహోదరుడు

ప్రసిద్ధిచెందిన సహోదరుడు

ప్రశ్న:

రెండవ కొరింథీ 8:18 లో చెప్పబడిన సంఘములన్నిటిలో ప్రసిద్ధిచెందిన సహోదరుడెవడు?

జవాబు:-

బైబిల్లో ప్రతి సంగతి వ్రాయబడలేదు, యెహోషువ భార్య యెవరు? ఏలీయా తల్లిదండ్రులెవరు? వాని వంశావళి ఏది? మున్నగు అనేక ప్రశ్నలకు బైబిలులో జవాబు దొరకదు. ఎందుకు? అక్కరకు వచ్చినదే యున్నది గాని, వారు వీరూరకయే అడిగెడి ప్రతిదానికి బైబిలులో దేవుడు జవాబు పెట్టలేదు.

మనకు సంబంధము లేదు గనుక పెట్టలేదు.అయితే రక్షణ సంబంధముగా అదేమిటో, ఎట్లు కలుగునో, కలిగితే సూచనలేవో, రక్షింపబడిన తరువాత ప్రవర్తించేది యెట్లో, నరకమెటువంటిది, తండ్రి యిల్లు యెటువంటిది మున్నగు విషయాలు దండిగాను వివరముగాను ఆకర్షణీయము గాను బైబిల్లో ప్రభువు వ్రాయించి పెట్టినందులాయనకు స్తోత్రము కలుగునుగాక.

ఈ రెండవ కొరింథీ 8:18 లో నున్నవాని పేరు మనకు బయలుపర్చబడలేదు. పేరు లేకపోయినా ఆయననుగురించి తెలియవచ్చిన సంగతులేవనగా :

రక్షింపబడినవాడై యుండెను – ఎందుకంటే సహోదరుడని పిలువబడు చున్నాడు.

తన్ను రక్షించిన ఆ గొప్ప సువార్త విషయమై మిక్కిలి ఆసక్తి గలవాడని తెలియుచున్నది; ఎందుకంటే సువార్త విషయములోనే చెప్పబడియున్నాడు.

ఒక స్థలములో కాదు, నానా స్థలములు తిరిగి ఆయా సంఘముల పరిచయము ఇతడు చేసినట్టున్నది; ఎందుకంటే సంఘములన్నిటిలో పేరుపొందినవాడతడు అని వ్రాయబడినది.

మంచి పేరు గలవాడు. ఇతని దగ్గర దుర్వాసన లేదు స్తోత్రము. ఎక్కడికి వెళ్ళిన మంచిపేరే గాని క్రీస్తుకు ప్రతికూలముగా నడిచినట్టు చెడ్డ సమాచారమే లేదు. గనుక అతని పేరు ప్రసిద్ధికెక్కినది సామాన్యము కాదు, యితనిలో నాయకత్వ గుణముండెను.

ఇతడు ఇతర సహోదరుల నమ్మకమునకు యోగ్యుడు కాబట్టి పౌలు కావేళ యప్పగింపబడిన యుపకార ద్రవ్యము (8:19) విషయమై ప్రయాణము చేయుటకు తీతుతో కూడా ఇతడు సహోదరులచేత ఏర్పరచబడెను. అహహా ఇట్టి యోగ్యుని పేరు స్పష్టముగా మనకు తెలిసియుంటే యెంతో మంచిది. చాలమంది చేతిలో కానుక డబ్బుపడితే కొడుకు పెండ్లికొరకో, భూమిని కొనుటలోనో దాని పాడుచేసి చెడ్డపేరు తెచ్చుకొనిరి. ఇట్లు పడకుండ పౌలు తనతో తీతును, వీనిని, 8:22 లో చెప్పబడిన మరియొకనిని తోడుచేసికొనెను. లేదా పోగైన చందా విషయమై మామీద నెవడైన తప్పు మోపునేమోయని పౌలు హెచ్చరిక కలిగి యుక్తముగానే ప్రవర్తించెను. (2 కొరింథీ 8:20).

ఇతడు సంఘ దూత అనియు లేక చిన్న అపోస్తలుడనియు రెండవ కొరింథీ 8:23 లో వ్రాసిన వాక్యము నాధారముచేసికొని చెప్పగలము. (మూలభాషలో చూడండి). ఇతడు క్రీస్తు మహిమయై యుండెనని 8:23లో నున్నది. అహహా, ఒక కాలమందు మనవలె దేవుని మహిమను పొందలేకపోయిన ఈ పేరు లేని వ్యక్తి క్రీస్తును నమ్మినందుచేత క్రీస్తు మహిమయైపోయెను చూడండి.

మహిమ లేనివారిలో క్రీస్తు తన మహిమ ధారపోసేవాడనియు గనుక సువార్త సారమేదనగా మహిమలేని వారికి క్రీస్తు చనిపోయి లేచినందు వలన మహిమ కలుగుచున్నదనియు దీనిలో తెలిసికొంటున్నాము. ఇతడు మూడవ సువార్తను దానితోకూడ అపొస్తలుల కార్యముల గ్రంథమును వ్రాసిన లూకాయని యొక నిఘంటువు సలహాయిచ్చుచున్నది.

ఈ సువార్తికుడైన లూకా పౌలుతో తిరిగినవాడని అపొ. కార్యములో అప్పుడప్పుడు “మేము” “మమ్మును” అనే పదము కనబడుటచేత తెలియుచున్నది. త్రోయకు రెండవ యాత్రమీద పౌలు సీలలు వచ్చినప్పుడు గ్రంథము వ్రాసిన లూకా వారిని కలిసికొన్నట్టున్నది. గనుక 16:10-18 వరకు తరచుగా “మేము” “మేము” అని వ్రాస్తున్నాడు. 16:19,40 లో లేచిన అల్లరి తొందరలలో లూకా లేడు. ఎచ్చటికో వెళ్లిపోయినట్టున్నది. తిరిగి మూడవ యాత్రలో త్రోయ చేరినది మొదలుకొని యెరూషలేము చేరువరకు లూకా వచ్చి పౌలును కలిసికొన్నట్టున్నది. 20:5,6,7,8; 21:1,7 మరియు 21:17 వరకు చూడండి. “మేము” అని తిరిగి వచ్చినది.

రోమాకు ఖైదీగా పౌలు వెళ్ళుచుండగా లూకా తోడుగానున్నాడు. కాబట్టి – అపొ. కార్య. 27,28 అధ్యాయముల సాక్ష్యము ద్వారాను, కొలొస్సై 4:14 వంటి వచనములద్వారాను ఎడబాయకుండ వైద్యుడైన లూకా తరచుగా పౌలును హత్తుకొని ఆయనతో యాత్ర తిరిగినది తెలియవచ్చి నందునను రెండవ కొరింథీ 8:18 లో పేరు లేకుండ ప్రసిద్ధిచెందిన సహోదరుడుగా సూచింపబడినవాడు లూకాయేయని కొందరు తీర్మానించిరి. ఆలాగుండవచ్చును. అయితే కొంత కాలమాగి ఆ ప్రశ్న నన్ను మహిమలో అడిగితే మరి మంచిది.

సంపూర్ణమైన జవాబు అప్పుడే యిస్తాను. ఇప్పుడు తెలియనివి యప్పుడు తెలిసిపోవును – 1 కొరింథీ. 13:12. లేక నన్ను అడుగక మీరే నేరుగా ప్రభువును విచారించి తెలిసికొంటారేమో! అక్కడికి మహిమలో రారేమో! లూకా తన యాత్రలవలనను వ్రాసిన తన గ్రంథాలవలనను సంఘములన్నిటిలో పేరుపొంది యుంటాడు. కాబట్టి చెప్పబడినవాడితడే అని నమ్మిన నమ్మవచ్చును. అయితే దీనిలో ముఖ్యమైన సంగతి ఏదనగా లూకాను గూర్చి లేక పేరు లేని ఈ సహోదరునిగూర్చి చెప్పబడినట్టు మీ సంగతి యెట్లు? రక్షింపబడితిరా లేదా? మంచి పేరున్నదా లేదా? సహోదరులలో ముల్లుగానా లేక ప్రసిద్ధికెక్కిన సహాయార్థముగానా, ఎట్లున్నది మీ సంగతి? ఇట్లు విచారించుకొని బ్రతుకు దిద్దుకొని క్రీస్తు మహిమకు జీవిస్తే నింతే చాలును. (1 కొరింథీ 10:31).

Leave a Comment