పదిహేడవ అధ్యాయము
ప్రభువు ప్రార్థన
ప్రభువు తన ప్రజలకోసం చేసిన ప్రత్యేకమైన విన్నపాలు
మన ప్రభువైన యేసు చేసిన “ప్రధాన యాజకుని ప్రార్థన”ను మనము ఈ అధ్యాయములో చూడగలము. ఈ ప్రార్థనలో ఆయన తన స్వంతవారికోసం విజ్ఞాపన చేశాడు. ఆయన ఇప్పుడు పరలోకంలో ఉండి తన ప్రజలకోసం ప్రార్థిస్తూ, తన ప్రజల పక్షంగా చేస్తున్న ప్రస్తుత పరిచర్యయొక్క చిత్రపటాన్ని ఇది చూపిస్తూ ఉంది.
ప్రభువు ప్రార్థన అర్థం
మార్కస్ రెయిన్స్ఫోర్డ్ (Marcus Rainsford) ఇలా అన్నారు – “దేవుని కుడిపార్శ్వమున ఉండి, పావనుడగు మన ప్రభువు చేయుచున్న విజ్ఞాపనకు ఈ ప్రార్థన ఒక చక్కని దృష్టాంతము. ఈ ప్రార్థనలో – తన ప్రజలకు వ్యతిరేకముగా ఒక్క మాటగాని, వారి యొక్క తప్పిదములు – లోపములను గూర్చిన ప్రస్తావనగాని, వారు చేసిన వాటిని గూర్చిన ప్రస్తావనగాని లేదు.

‘వారందరు ఆయనను విడిచి పారిపోయిరి’ అని వ్రాయబడినట్లుగా ఇంక కొంతసేపట్లో వారందరూ తనను విడిచి వెళ్ళనైయున్నారని ఎరిగికూడా దానినిగూర్చి ప్రస్తావించలేదు. కేవలం – తండ్రి ఏర్పాటులోనున్న వారిని గాను, తనతో సహవాసము కలిగియున్నవారినిగాను, పరలోకమునుండి వచ్చి వారికి తాను అనుగ్రహింపదలచిన తన పరిపూర్ణతను స్వీకరించిన వారిగాను మాత్రమే ఆయన వారినిగూర్చి తన ప్రార్థనలో మాట్లాడాడు.”
Read and Learn More Telugu Bible Verses
ప్రభువు బోధించిన ప్రార్థన

“గమనించండి, ప్రభువు తన ప్రజలకోసం చేసిన ప్రత్యేకమైన విన్నపాలన్నీ ఆత్మీయ విషయాలకు సంబంధించినవే. అన్నియు పరలోకసంబంధమైన ఆశీర్వాదాలను సూచిస్తున్నాయి. ధనసంపదలు, పేరు ప్రఖ్యాతులు.
ఈ లోకసంబంధమైన అధికారము, పలుకుబడి, ఉన్నత స్థానములు – వీటన్నిటినీ వారికోసం ప్రభువు తండ్రిని అడుగలేదు. గాని దుష్టునినుండి వారిని కాపాడుమని, లోకములో వారిని ప్రత్యేకపరచుమని, వారికి అప్పగించబడిన పనిని నెరవేర్చుటకై సామర్థ్యమును దయచేసి తిరిగి వారిని క్షేమముగా పరలోకమునకు చేర్చుమని ప్రార్థించాడు. ‘ఆత్మ వర్థిల్లుట’ అనునది అన్నిటికంటే మిన్నయైనది. అది నిజమైన అభివృద్ధికి సూచిక వంటిది.”
యేసు తనకప్పగింపబడిన పనినిగూర్చి ప్రార్థించుట (17:1-5) : 17:1
‘నా గడియ వచ్చియున్నది’ అని యేసుప్రభువు చెప్పుచున్నాడు. ఆయన గడియ అప్పటివరకు రానందువలననే ఆయన శత్రువులు అంతకుముందు అనేక సార్లు ప్రయత్నించినను ఆయనను పట్టుకొనలేకపోయిరి.
కాని ఇప్పుడు ప్రభువు మరణించవలసిన సమయము ఆసన్నమైనది. ‘నీ కుమారుని మహిమపరచుము’ అని యేసు ప్రార్థించాడు. ఆయన తనముందున్న సిలువ మరణమును చూచుచున్నాడు. ఆయన చనిపోయి సమాధిలోనే ఉండినట్లయితే, మనుష్యులందరిలో ఒకనిగానే లోకము ఆయనను లెక్కకడుతుంది.
కాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపటంద్వారా ఆయనను మహిపరచినట్లయితే, ఆయన దేవుని కుమారుడనియు మరియు లోకరక్షకు డనియు చెప్పుటకు అది ఒక ఋజువుగా ఉంటుంది. ఆయన చేసిన ఈ మనవిని దేవుడు అంగీకరించాడు.
“నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు .. ” అని ప్రభువు ప్రార్థిస్తున్నాడు దీని అర్థము తరువాతి రెండు వచనములలో వివరించబడింది. ప్రభువైన యేసు తనయందు విశ్వాసముంచు వారికి నిత్యజీవము అనుగ్రహించుటద్వారా తన తండ్రిని మహిమపరచాడు.
భక్తిహీనులైన స్త్రీ, పురుషులు మారుమనస్సుపొంది ప్రభువైన యేసుయొక్క జీవమును ఈ భూమిపై ప్రత్యక్షపరచుట ద్వారా దేవునికి అత్యధికమైన మహిమ కలుగుతుంది.
17:2 ఆయన చేసిన విమోచన కార్యము ఫలితముగా దేవుడాయనకు సర్వమాన వాళిపై అధికారమనుగ్రహించాడు. తండ్రి తనకనుగ్రహించిన వారికి నిత్యజీవమిచ్చు టకు ఆయన అర్హుడగుటకు ఈ అధికారము తోడ్పడినది. భూమి పునాదులు వేయ బడకముందే కొందరిని క్రీస్తుకు చెందినవారుగా దేవుడు చూచాడు : అయితే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో అట్టి వారందరికి రక్షణను అనుగ్రహించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రక్షకుని యందు విశ్వసించి రక్షింపబడనివారు ఎవరూ ఉండరు.
మత్తయి 6:9–13 వచనాలు – ప్రభువు ప్రార్థన
17:3 దేవుని మరియు ప్రభువైన యేసును ఎరుగుటద్వారా నిత్యజీవము పొంద గలము. నిజమైన దేవుడు, వాస్తవంగా ఎంతమాత్రము దేవుళ్ళు కాని విగ్రహములకంటె భిన్నమైన వాడు. నిత్యజీవమునకు ఉమ్మడి మూలాధారముగా తండ్రియైన దేవునితో పాటు యేసుక్రీస్తుయొక్క నామముకూడా ఇక్కడ ప్రస్తావించబడింది అనగా వారిద్దరూ ఒక్కటే ‘నీవు పంపిన యేసుక్రీస్తు … అని ప్రభువు ఇచ్చట తనను గూర్చి చెప్పుటను గమనించండి. ‘క్రీస్తు’ లేక ‘మెస్సీయా’ – ఈ రెండింటికీ అర్ధము ఒక్కటే. ఇక్కడ యేసు తనను గూర్చి ‘మెస్సీయ’ గా చెప్పుకొనుచున్నాడు.
17:4 ‘చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని’ – అని ప్రభువు పలుకుచున్నప్పుడు – తాను అప్పటికే చనిపోయి, సమాధిచేయబడి, తిరిగిలేచినట్లుగా ఆయన మాట్లాడుచున్నాడు.
ఆయన పాపరహితమైన తన జీవితముద్వారా, సూచకక్రియలు చేయుటద్వారా, తన శ్రమ, మరణము మరియు పునరుత్థానములద్వారా తండ్రిని మహిమపరచియున్నాడు. తండ్రి తన కప్పగించిన రక్షణకార్యమును ఆయన సంపూర్తి చేసియున్నాడు.

రైల్ (Ryle) అనునతడు చెప్పినవిధముగా – “సిలువ మరణము తండ్రికి మహిమను తెచ్చినది. అది ఆయన జ్ఞానమును, విశ్వాస్యతను, పరిశుద్ధతను మరియు ప్రేమను మహిమ పరచినది, తాను నీతిమంతునిగా ఉండి, భక్తిహీనులను నీతిమంతులుగా తీర్చుటకై ఒక ప్రణాళికను సిద్ధపరచిన ఆయనను జ్ఞానవంతునిగా అది చూపినది.
స్త్రీ సంతానము సర్పమును తలమీద కొట్టును’ అను వాగ్దానమును నెరవేర్చిన ఆయనను నమ్మదగిన వాడుగా అది చూపినది. తన ధర్మశాస్త్రపు విధులన్నీ మన గొప్ప ప్రతినిధియైన యేసుక్రీస్తుద్వారా నెరవేర్చబడాలని కోరడంద్వారా అది ఆయనను పరిశుద్ధునిగా చూపినది.
తనతోపాటు నిత్యుడైన తన కుమారుడినే మధ్యవర్తిగా, విమోచకునిగా మరియు స్నేహితునిగా పాపియైన మానవునికి అనుగ్రహించినందువలన అది ఆయనను ప్రేమస్వరూపిగా చూపినది”.
“సిలువ మరణము కుమారునికికూడా మహిమను తెచ్చినది.
అది A యొక్క కనికరమును, సహనమును, ఆయనశక్తిని, అధికారమును మహిమపరచినది. మనకొరకు మరణించి, మనకు బదులుగా శ్రమననుభవించి, మన నిమిత్తము తన్ను తాను పాపముగాను, శాపముగాను అగుటకు అప్పగించుకొని, మనలను విమోచించు టకై తన స్వంత రక్తమును వెలగా చెల్లించిన ఆయనను ‘అత్యంత కనికరము గలవాడు’గా అది చూపినది. యేసుక్రీస్తు ఒక్క మాటచే తన తండ్రియొద్దనున్న దూతలను పిలువ గలడు.
సిలువ మరణంనుండి విడుదల పొందగలడు. ఈ అవకాశము తనకున్నప్పటికీ మనుష్యులందరు అనుభవించే సాధారణ మరణమును గాక, ఏ మానవుడూ తన మనస్సుతో గ్రహించలేని బాధకు, వేదనలకు తన్నుతాను ఇష్టపూర్వకముగా అప్పగించు కొనిన ఆయనను ‘అధికమైన సహనము కలిగినవాడు’గా అది చూపినది.
సర్వ లోకముయొక్క అపరాధముల భారమును భరించి, సాతానుని జయించి, సాతాను చెరపట్టిన వారిని దోచుకొనిన ఆయనను ‘అత్యంత శక్తిమంతుని’గా అది చూపినది”.
ప్రార్థనలోని ప్రాముఖ్యములు – ప్రభువు ప్రార్థన
17:5 క్రీస్తు ఈ లోకమునకు రాకపూర్వము ఆయన పరలోకములో తండ్రితోకూడ నివసించాడు. దేవదూతలందరూ ప్రభువును చూచినపుడు దైవత్వముయొక్క సంపూర్ణ మహిమను వారు ఆయనలో చూశారు. అక్కడున్న ప్రతి నేత్రము ఆయనను దేవునిగానే చూచినది.
కానీ ఆయన మానవుల మధ్యకు వచ్చినప్పుడు దైవత్వముయొక్క మహిమ ముసుగు వేయబడినది. భూమిమీద ఉన్నప్పుడుకూడా ఆయన దేవుడే అయినప్పటికీ ఆ విషయము అనేకులకు స్పష్టముగా బోధపడలేదు.

ఆయనను కేవలం ఒక వడ్రంగి యొక్క కుమారునిగానే వారు చూచారు. పరలోకమందు తనకున్న మహిమతో తిరిగి తనను మహిమపరచుమని ఇక్కడ రక్షకుడు ప్రార్థించుచున్నాడు. “నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము” అనగా “పరలోకమునందలి నీ సన్నిధితో నన్ను మహిమపరచుము, నేను నరావతారిగా జన్మించక మునుపు నీతో కలసి ఏ విధమైన మహిమను కలిగియుంటినో ఆ మహిమను తిరిగి అనుగ్రహించుము” అని అర్ధము.
క్రీస్తు తన శిష్యులకోసం ప్రార్థించుట (17:6-19) :
17:6 యేసు తన శిష్యులకు తండ్రి నామమును ప్రత్యక్షపరచియుండెను. లేఖనము లలో ‘నామము’ అనునది ఆ వ్యక్తిని, అతని గుణలక్షణములను, స్వభావమును తెలియజేస్తుంది. ‘క్రీస్తు’ పూర్తిగా తండ్రిని ప్రత్యక్షపరచాడు. శిష్యులు లోకములో నుండి కుమారునికి అనుగ్రహింపబడిరి.
అవిశ్వాసులైన మానవ సమూహమునుండి వేరుచేయబడి, క్రీస్తుకు చెందియుండుటకు వారు ప్రత్యేకించబడిరి. ‘వారు నీ వాక్యము గైకొనియున్నారు’ అని ప్రభువు చెప్పుచున్నాడు. వారిలో ఎన్నో తప్పిదములు, లోటుపాట్లు ఉన్నప్పటికీ, వారు తన బోధను నమ్మి విధేయత చూపించినారని చెప్పుచూ వారిని హెచ్చించుచున్నాడు.
వారికి వ్యతిరేకముగా ఒక్క మాటకూడ పలుకలేదు. ‘వారందరు ఆయనను విడిచి పారిపోయిరి’ అని వ్రాయబడినట్లుగా ఇంక కొంతసేపట్లో వారందరూ విడిచి వెళ్ళనైయున్నారని ఎరిగి కూడా దానినిగూర్చి ప్రస్తావించలేదు.
17:7 రక్షకుడు సంపూర్ణముగా తండ్రిని ప్రత్యక్షపరచియుండెను. తాను తన స్వంత అధికారముతో ఏమియు మాటలాడక, ఏమియు చేయక, తండ్రి తనకు బోధించిన విధముగానే సమస్తమును చేసితినని ఆయన తన శిష్యులకు వివరించాడు. కాబట్టి తండ్రియే కుమారుని పంపెనని వారు తెలిసికొనిరి.
ప్రభువు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత
17:8 వాస్తవానికి క్రీస్తు తనకు తానుగా ఈ పనిని ఆరంభించలేదు కాని, తండ్రి. చిత్తమునకు విధేయుడై ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఆయన యెహోవా దేవునియొక్క పరిపూర్ణ సేవకుడు.
17:9 ఒక ప్రధాన యాజకునిగా ఆయన లోకముకొరకు కాదుగాని తన శిష్యుల కొరకు ప్రార్థించాడు. ఆయన లోకముకొరకు కూడా ప్రార్థించకపోలేదు. “తండ్రి! వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము” అని ఆయన సిలువపై తనను హింసించినవారికోసం ప్రార్థించాడు.
కాని ఇక్కడయితే విశ్వాసు లందరికీ ప్రతినిధిగా దేవుని సింహాసనముయెదుట ప్రార్థించుచున్నాడు. దేవుని సింహాసనము యెదుట ఆయన చేయు ప్రార్థన తన స్వంతవారికోసం మాత్రమే.
17:10 తండ్రియైన దేవునికి, కుమారునికి మధ్యగల ఏకత్వమును ఈ వచనములో చూడగలము. కేవలం మానవమాత్రుడైన ఒక వ్యక్తి ఈ మాటలను సత్యపూర్వకంగా పలుకలేడు. ఒకవేళ మనము దేవునితో ‘నావన్నియు నీవి’ అని చెప్పగలమేమో గాని ‘నీవన్నియు నావి’ అని మాత్రము ఆయనతో చెప్పలేము. కుమారుడు సమానమైనవాడు కావుననే ఆయన ఈ మాటలు చెప్పగలిగినాడు.
ఈ భాగమంతటిలోనూ ఆయన తనయొక్క పేద, వెనుకబడిన మందను చూపుతూ, ప్రతివ్యక్తినీ అనేక రంగులతో కూడిన వస్త్రాన్ని ధరింపజేస్తూ, ‘నేను వారియందు మహిమపరచబడియున్నాను’ అని ప్రకటిస్తున్నాడు.
17:11 ప్రభువైన యేసు, తాను పరలోకమునకు తిరిగి వెళ్ళుటకు అపేక్షించడాన్ని మళ్ళీ ఇక్కడ మనము చూస్తాము. ఆయన అప్పటికే పరలోకమునకు వెళ్ళి పోయినట్లుగా ప్రార్థించాడు తన ప్రజలందరూ ఏకముగా ఉండి, తండ్రిచేత కాపాడబడాలని ఆయన తండ్రిని వేడుకొన్నాడు.
వారు ఇకపై భయంకరమైన శోధనలు, శ్రమలు అనుభవించ వలసియున్నదని ఆయనకు తెలుసు. వారిలో విభజనలు వచ్చి విడిపోయే ప్రమాదం కూడా ఉంది. కావుననే “మనము ఏకమైయున్నలాగున వారును ఏకమై యుండాలి” అని యేసు ప్రార్థించాడు.
తనకు తండ్రితో ఉన్న సహవాసములో ఏ విధమైన ఏకత్వము ఉందో, అదే విధమైన ఏకత్వమును వారుకూడా అనుభవించి ఆనందించాలని ఆయన కోరుకొన్నాడు. “పరిశుద్ధుడవైన తండ్రీ!” అని ఆయన తండ్రిని సంభోదించడాన్ని గమనించండి.
‘పరిశుద్ధుడు’ అనే మాట అనంతమైన దూరములో (అందనంత ఎత్తులో) ఉన్న వానినిగూర్చి చెప్పబడుతుంది. అయితే ‘తండ్రి’ అనే మాట ఎంతో సన్నిహితముగా (అతి దగ్గరలో) ఉన్న వానిని గూర్చి చెప్పబడుతుంది.
17:12 రక్షకుడు తన శిష్యులతో ఉన్నప్పుడు వారిని తండ్రి నామమందు కాపాడి నాడు. (అనగా తండ్రియొక్క శక్తి, అధికారములద్వారా). “నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు” అని యేసు చెప్పుచున్నాడు.
‘నాశన పుత్రుడు’ అనగా ఇస్కరియోతు యూదా, అనగా – తండ్రి కుమారునికి అనుగ్రహించిన వారిలో యూదాకూడా ఒకడనియు మరియు యూదా ఒకప్పుడు నిజమైన విశ్వాసియనియు దీని అర్థము కాదు. దానికి ఈ విధముగా అర్థము చెప్పవచ్చును – “నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని.
వారిలో ఎవరును నశింప లేదు, కాని లేఖనము నెరవేరునట్లుగా నాశనపుత్రుడు నశించెను.” ‘నాశన పుత్రుడు’ అను మాటకు – ‘నిత్యత్వముండు నరక శిక్షకు యూదా నియమింపబడియున్నాడు’ అని అర్ధము.
లేఖనము నెరవేర్చబడాలి కాబట్టి క్రీస్తును ద్రోహముతో అప్పగించుటకు యూదా బలవంతపెట్టబడలేదు. కాని రక్షకుని అప్పగించుటకు అతడే నిర్ణయించుకొని యున్నాడు కావున ఆ విధముగా లేఖనము నెరవేరినది.
17:13 తన శిష్యుల సమక్షంలో తాను ఎందుకు ప్రార్థించుచున్నాడో, దానిని ప్రభువు ఇక్కడ వివరించుచున్నాడు. అది ఆయన ఈ విధంగా వారితో చెబుతున్నట్లుగా ఉంది- “ఇవి- పరలోకంలో దేవునియెదుట నిరంతరం నేను చేయబోవు విజ్ఞాపనా ప్రార్థనలు. అవి ఎన్నటికీ ఆగిపోవు.
ప్రభువు ప్రార్థన మరియు నిత్యజీవితం
అయితే ‘నా సంతోషములో అత్యధికంగా మీరు పాలిభాగస్థులగునట్లు మీ క్షేమాభివృద్ధిని కోరి నేను పరలోకంలో ఏ విధమైన పరిచర్యను చేయనైయున్నానో మీరు స్పష్టముగా గ్రహించాలని ఇప్పుడు మీ వినికిడిలో ఈ లోకంలో నేను ఈ విజ్ఞాపనలు చేయుచున్నాను.”
17:14 ప్రభువు తన శిష్యులకు దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. దానిని వారు స్వీకరించారు. ఫలితంగా లోకము వారిని వ్యతిరేకించి వారిని ద్వేషించింది. వారు ప్రభువైన యేసు స్వభావ లక్షణాలను కలిగిన వారు కాబట్టి లోకము వారిని ద్వేషించింది. లోకసంబంధమైన విషయాలలో వారు ఇమిడిపోలేదు.
17:15 విశ్వాసులందరినీ వెంటనే పరలోకమునకు తీసికొనిపొమ్మని ప్రభువు తండ్రిని కోరలేదు. వారు కృపలో ఎదుగునట్లు మరియు క్రీస్తుకు సాక్షులుగా ఉండు నట్లు వారు ఇక్కడే విడిచిపెట్టబడాలి. దుష్టత్వమునుండి లేక దుష్టునినుండి వారు కాపాడబడాలనేది ఆయన ప్రార్థన. తప్పించుకొని పారిపోవడం కాదుగాని భద్రపరచ బడాలని ఆయన కోరికయైయున్నది.
17:16 క్రీస్తు ఈ లోకసంబంధి కానట్టుగా క్రైస్తవులును ఈ లోకసంబంధులు కారు. యేసు నామమునకు స్థానములేని ఈ లోకసంబంధమైన వినోదములలో పాలు పొందుటకు మరియు ఈ లోకసంబంధమైన సహవాసములతో కలసిపోవుటకు క్రైస్తవుడు శోధించబడినపుడు అతడు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి.
17:17 ‘ప్రతిష్ఠ చేయుట’ అనగా – ‘ప్రత్యేకించుట’. విశ్వాసులను శుద్ధిచేయగల ప్రభావము దేవుని వాక్యమునకు ఉంది. వారు దానిని చదివి దానికి విధేయత చూపించుచున్నప్పుడు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా వారు ప్రత్యేకించబడతారు.
ఇక్కడ ప్రభువు చేయుచున్న ప్రార్ధనకూడా అదే. ఈ లోకము నుండి దేవునికోసం ప్రత్యేకపరచబడి, దేవుడు వాడుకొనుటకు అర్హులైన ప్రజలను ప్రభువు కోరుకొంటున్నాడు. “నీ వాక్యమే సత్యము” అని యేసు చెప్పుచున్నాడు. చాలమంది ఈ రోజుల్లో చెప్పుచున్నట్లుగా “నీ వాక్యము సత్యమును కలిగియున్నది” అని కాక “నీ వాక్యమే సత్యము” అని ఆయన చెప్పుచున్నాడు.
17:18 దేవుని వ్యక్తిత్వమును మానవులకు తెలియపరచే ఉద్దేశ్యంతో ప్రభువైన యేసును తండ్రి ఈ లోకమునకు పంపించాడు. తాను త్వరలో తిరిగి పరలోకమునకు వెళ్ళబోవుచున్నానని యేసుకు తెలుసు. కాని రాబోవు తరాలవారు దేవుని గురించిన సాక్ష్యమును, సంగతులను ఇంకను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ పని పరిశుద్ధాత్మ శక్తి సహాయంతో విశ్వాసులద్వారా జరగాలి. క్రైస్తవులు దేవునితో సమానులు కారు కాబట్టి ప్రభువైన యేసువలె సంపూర్ణముగా దేవునిని ప్రత్యక్షపరచలేరు. కాని లోకమునకు దేవుని ప్రత్యక్షపరచుటకే విశ్వాసులు ఇక్కడ ఉన్నారు. ఈ కారణము చేతనే ప్రభువైన యేసు వారిని ఈ లోకములోకి పంపెను.
17:19 ‘ప్రతిష్ఠ చేయుట’ అనగా ‘పరిశుద్ధపరచుట’ అనే అర్థమునే తప్పనిసరిగా కలిగియుండాల్సిన అవసరం లేదు. స్వభావసిద్ధముగా మన ప్రభువు పరిశుద్ధుడై యున్నాడు. కాని ఇక్కడ ఆయన – ‘నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను’ అంటున్నాడు.
అంటే – తన తండ్రి తన కప్పగించిన పనికోసం ప్రభువు తన్నుతాను ప్రత్యేకించుకొను చున్నాడని దీని అర్థము. ఈ లోకమునకు వెలుపలి స్థానమును తీసికొని మహిమలో ప్రవేశించుటద్వారా ప్రభువు తన్ను తాను ప్రత్యేకించుకొనుచున్నాడనికూడా దీని అర్థమైయుండవచ్చును. “ఆయన ప్రతిష్ఠించుకోవడం అనేది మనకు మాదిరిగాను మరియు శక్తిగాను ఉన్నది” – అని వైన్ (Vine) అనునతడు చెప్పాడు. మనము ఈ లోకమునుండి ప్రత్యేకించబడి ఆయనతో పాలుపంపులు పొందవలసియున్నది.
విశ్వాసులందరికోసం క్రీస్తు ప్రార్థించుట (17:20-26) :
17:20 ఇప్పటి వరకు తన శిష్యుల కొరకు మాత్రమే ప్రార్థించిన మన ప్రధాన యాజకుడగు యేసు ఇప్పుడు తన ప్రార్థనను ఇంకను విస్తరింపజేయుచున్నాడు. ఇంకను భూమిపై జన్మించని తరాలలో ఉన్న విశ్వాసులందరి కోసం ఆయన ప్రార్థిం చాడు. వాస్తవానికి విశ్వాసియైన ప్రతివ్యక్తి ఈ వచనమును చదివినపుడు ‘యేసు కోసం ప్రార్ధించాడు’ అని చెప్పగలడు.
17:21 ఈ ప్రార్థన విశ్వాసుల మధ్య ఐక్యత కొరకు చేయబడింది. కానీ ఇప్పుడు మాత్రం అది పాపుల రక్షణను దృష్టిలో పెట్టుకొని చేయబడింది. తండ్రికి, కుమారునికి మధ్య జీవములోను, ఉద్దేశ్యములోను ఐక్యత ఉన్నది. విశ్వాసులందరూ క్రీస్తు యొక్క జీవమును కలిగి యున్నారు.
కాబట్టి వారు ప్రభువుతోను, తోటివిశ్వాసులతోను ఐక్యతను కలిగియుండాలి. లోకములో ఉన్నవారందరూ విశ్వసించెదరని ఈ వచనము బోధించుట లేదు. కానీ క్రైస్తవులందరూ తమ సంఘటిత సాక్ష్యముద్వారా అందరూ విశ్వసించునట్లుగా గట్టి ప్రేరణను కలిగించవలసియుంది.
క్రీస్తు తన పరిశుద్ధులతో కూడ తిరిగివచ్చినపుడు మరియు ఈ ఐక్యత ప్రత్యక్షముగా కనుపరచబడినపుడు ప్రభువైన యేసును తండ్రియే పంపెనని ఈ లోకము తెలుసుకొంటుంది. అందువలన కొంచెముగా ఉన్న ఈ సమయములోనే ఆ సత్యమును ప్రకటించుటకు మనము అపేక్షించాలి.
ప్రభువు ప్రార్థన మరియు నిత్యజీవితం
17:22 11వ వచనములో ప్రభువు – ‘సహవాసములో ఐక్యత’ కోసం ప్రార్థించాడు. 21వ వచనంలో ‘క్రీస్తును గూర్చి సాక్ష్యం చెప్పే విషయంలో ఐక్యత’కోసం ప్రార్థించాడు. ఇప్పుడు ‘మహిమలో ఐక్యత’ కోసం ప్రార్థిస్తున్నాడు. పరిశుద్ధులందరూ మహిమా శరీరములు ధరించుకొనే సమయంకోసం ఇది (ఈ ప్రార్ధన) ఎదురుచూస్తూ ఉంది.
“నీవు నాకు అనుగ్రహించిన మహిమ” అనగా ఆయన పునరుత్థానుడై ఆరోహణమగు నపుడు కలిగే మహిమ. మనము ఈ విధమైన మహిమను ఇంకను కలిగియుండలేదు. మనపట్ల దేవునికున్న ఉద్దేశాలనుబట్టి చూస్తే ఆ మహిమ మనకు అనుగ్రహించబడింది.
కాని రక్షకుడు మనలను పరలోకమునకు తీసికొని వెళ్ళినపుడు మాత్రమే ఈ మహిమను మనము పొందుతాము. క్రీస్తు ఈ భూమిపై తన రాజ్యమును స్థాపించుటకు తిరిగి వచ్చునపుడు, ఆ మహిమ ఏమిటో సర్వలోకమునకు తేటగా విశదమవుతుంది.
ఆ సమయంలో తండ్రికి – కుమారునికి, కుమారునికి – ఆయన ప్రజలకు మధ్యఉన్న ప్రాముఖ్యమైన ఐక్యతను ఈ లోకము గుర్తిస్తుంది. అప్పుడు వారు (చాలా ఆలస్యంగా) యేసు దేవునియొద్దనుండి పంపబడినవాడని నమ్ముతారు!
17:23 యేసు – దేవుని యొద్దనుండి పంపబడిన వాడని మాత్రమే కాక, దేవుడు క్రీస్తును ఏవిధంగా ప్రేమించాడో అదేవిధమైన ప్రేమతో విశ్వాసులనుకూడ ప్రేమించా డని ఈ లోకము అప్పుడు తెలుసుకొంటుంది, మనము తండ్రియైన దేవునిచే అంత అధికముగా ప్రేమించబడినామనే విషయం నమ్మశక్యంగా ఉండదు.
కానీ అది వాస్తవం. 17:24 తన ప్రజలు మహిమలో తనతోకూడ ఉండాలని కుమారుడు కోరు చున్నాడు. విశ్వాసులు మరణించిన, ప్రతిసారీ ఈ ప్రార్థనకు జవాబు లభిస్తుంది. ఈ విషయాన్ని మనం అర్ధం చేసుకుంటే, మన దుఃఖ సమయాలలో ఇది మనకు ఎంతో ఆదరణ నిస్తుంది.
ఒక విశ్వాసి ‘మరణించుట’ అంటే ‘అతడు క్రీస్తుతోకూడ ఉండు టకు వెళ్ళుట’ మరియు ‘ఆయన మహిమను చూచుట.’ ఈ మహిమ ‘ఈ లోకం ఉనికిలోకి రాకముందే దేవునితోకూడ ఆయనకున్న దైవత్వముయొక్క మహిమ మాత్రమే కాదు. రక్షకునిగా, విమోచకునిగా ఆయన సంపాదించుకున్న మహిమకూడా.’ జగత్తు పునాది వేయబడకముందే దేవుడు క్రీస్తును ప్రేమించెననుటకు ఈ మహిమ ఒక ఋజువుగా ఉన్నది.

17:25 యేసుక్రీస్తుద్వారా ప్రత్యక్షపరచబడిన దేవుని చూచుటలో ఈ లోకము విఫలమైంది. అయినను కొందరు శిష్యులు మాత్రం దేవుడే యేసును పంపినాడని విశ్వసించారు. ఆయన సిలువ వేయబడక ముందు సర్వమానవాళిలో కేవలం కొద్దిమంది మాత్రమే నిజంగా ఆయనను ఎరిగిన వారున్నారు. వారు కూడ ఆయనను (సిలువ మరణానికి ముందు) విడిచిపెట్టనై యున్నారు.
17:26 ప్రభువైన యేసు తన శిష్యులతోకూడ ఉండినప్పుడు ఆయన వారికి తండ్రి నామమును తెలియజేశాడు. మరియొక విధంగా చెప్పాలంటే తండ్రిని వారికి ప్రత్యక్ష పరచాడు. ఆయనయొక్క మాటలు – క్రియలు అన్నీకూడా తండ్రియొక్క మాటలు – క్రియలే. తండ్రియొక్క పరిపూర్ణ ప్రత్యక్షతను వారు క్రీస్తులో చూచారు.
పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యద్వారా ప్రభువైన యేసు ఇంకను తండ్రి నామమును వెల్లడి పరచు చున్నాడు. పెంతెకొస్తు దినము నాటినుండి, తండ్రియైన దేవుని గూర్చి విశ్వాసులకు పరిశుద్ధాత్మ బోధించుచున్నాడు.
‘దేవుడు ఎలాంటి వాడు’ అనే విషయాన్ని ప్రాముఖ్యంగా దేవుని వాక్యముద్వారా మనం తెలుసుకోగలం. ప్రభువైన యేసుద్వారా ప్రత్యక్షపరచ బడిన తండ్రిని ఎవరైతే అంగీకరిస్తారో వారు తండ్రిచేత ప్రత్యేకంగా ప్రేమించబడతారు.
ప్రభువు ప్రార్థన మరియు నిత్యజీవితం
ప్రభువైన యేసు విశ్వాసులందరిలో నివసిస్తున్నాడు కాబట్టి, తండ్రియైన దేవుడు తన స్వంత కుమారునివలెనే వారిని చూడగలడు. రెయిస్ (Reuss) ఇలా చెప్పాడు – “భౌతిక ప్రపంచంయొక్క సృష్టికి పూర్వం కుమారుని రూపంలో సరియైన అంశాన్ని కలిగియున్న దేవుని ప్రేమ, నూతన ఆధ్యాత్మిక ప్రపంచం సృష్టించబడిన నాటినుండి కుమారునితో ఐక్యపరచబడిన వారందరిలోనూ దానిని కనుగొంటుంది.”
దీనికి గోడెట్ (Godet) తన అభిప్రాయాన్ని ఇలా జతపర చారు – “కచ్చితంగా చెప్పాలంటే తన కుమారుని ఈ భూమిపైకి పంపించడంలో తండ్రియైన దేవుడు కోరుకున్నదేమిటంటే – మానవాళి అంతటిలో ఆయన తనవంటి బిడ్డలతోకూడిన కుటుంబమును తనకోసం – తయారు చేసుకోవాలని.”
ప్రభువైన యేసు ప్రతి విశ్వాసిలో ఉంటాడు కాబట్టే క్రీస్తును ప్రేమించినట్లుగానే దేవుడు ప్రతి విశ్వాసినికూడా ప్రేమించగలడు. “ప్రియము, దేవుని కెంతో ప్రియము కాలేను నేను మరింత ప్రియము యేసును ప్రేమించే తండ్రి ప్రేమ అట్టిదే నాకొరకు ఆయన ప్రేమ.”