స్కాట్లాండులో హింసలు (క్రీ.శ. 1527-1558)

స్కాట్లాండులో హింసలు (క్రీ.శ. 1527-1558)

మార్టిన్ లూథర్ యొక్క ఉపదేశములు మరియు నిజవిశ్వాసులకు రోమన్ కేథలిక్ సంఘముతో కలిగిన విభేదములు ఐరోపా, గ్రేట్ బ్రిటన్ మరి అనేక దూర ప్రాంతములలో గొప్ప ఫలితములు కలిగించెను. అవి అనేకమంది హృదయములలో మంచి స్పందన కలిగించి, దేవుని వాక్యములోని సత్యాన్వేషణకు వారిని నడిపించెను.

అట్టి సత్యాన్వేషకులలో పాట్రిక్ హామిల్టన్ (Patrick Hamilton) అను స్కాట్లాండ్ దేశస్థుడు ఒకడు. లేఖనములలోని సత్యమును నేర్చుకొనుటకు అతడు, అతని ముగ్గురు స్నేహితులు పశ్చిమ-మధ్య జర్మనీలోని మార్ బర్గ్ (Marburg) విశ్వవిద్యాలయమునకు వెళ్లిరి. అది ఐరోపాలోని మొట్టమొదటి ప్రొటెస్టంట్ విశ్వవిద్యాలయము.

ఈ విశ్వ విద్యాలయము 23 సంవత్సరముల వయస్సుగల హెస్సీ (Hesse) పట్టణ యువ రాజైన ఫిలిప్చే స్థాపించబడెను. అక్కడ పాట్రిక్, అతని స్నేహితులకు మార్టిన్ లూథర్, ఫిలిప్ మెలాంగ్డన్ (Philipp Melanchthon) లతో స్నేహమేర్పడెను. జర్మన్ వేదశాస్త్ర పండితుడైన మెలాంగన్ క్రీ.శ. 1521 లో ప్రొటెస్టంట్ సిద్ధాంతముమీద ‘లోసి కమ్యూనెస్’ (Loci Communes) అను మొదటి వ్యాసమును వ్రాసెను. లూథర్, మెలాంగన్ల రచనలు, సిద్దాంతములద్వారా పాట్రిక్, అతని స్నేహితులు కేథలిక్ (మత) సంఘమును విడిచి ప్రొటెస్టంట్ విశ్వాసములోనికి మార్పుచెందిరి.

విశ్వాసముయొక్క నిజమైన జ్ఞానముతోను, దైవత్వముతోను పురికొల్పబడిన పాట్రిక్ హామిల్టన్ స్కాట్లాండ్కు తిరిగివెళ్లి లేఖనములలో స్పష్టముగ చూపించబడిన క్రీస్తుయొక్క న్యాయమార్గములను తన దేశ ప్రజలకు ఉపదేశించవలెనన్న ఆతృత కలిగియుండెను. కనుక ఆలస్యముచేయక తన ముగ్గురు స్నేహితులను వెంటబెట్టుకొని, స్కాట్లాండ్ తిరిగివచ్చి బోధించుట ప్రారంభించెను.

వెంటనే, పరి. అంద్రెయ చర్చి ఆర్చిబిషప్ జేమ్స్ బీటన్ అను కఠినుడైన మతగురువు హామిల్టన్ ఉపదేశములనుగూర్చి విని, తనయెదుట హాజరుకావలెనని హామిల్టన్కు కబురు పంపెను. మత సిద్ధాంతములలో వాదము పెట్టుకొనుటకిది మంచి అవకాశమని హామిల్టన్ తక్షణమే ఆర్చిబిషపు దర్శించెను.

కొద్దిసేపు విచారించిన తరువాత ఆర్చిబిషప్ అతనిని బంధించి ఉదయము వరకు తన భవనములోని అసహ్యకరమైన స్థలములో ఉంచి, మతద్రోహిగా చిత్రీక రించుటకు బిషప్ సభయెదుట హాజరుపరచెను. తీర్థయాత్రలు, ప్రక్షాళనము, పరిశు ద్ధులకొరకు ప్రార్థనలు, మృతులకొరకు ప్రార్థనలు, విగ్రహారాధనలను నిరాకరించుట, పోప్యొక్క గొప్పతనమును తిరస్కరించుట అను నేరములు అతనిపై మోపిరి. తనపై మోపబడిన నేరములన్నియు వాస్తవమేనని హామిల్టన్ అంగీకరించగా, ఆ మధ్యాహ్నమే అతనిని సజీవదహనము చేయవలెనని బిషప్ మొండిగా తీర్పు చెప్పెను.

చూడవచ్చిన జనసమూహము హామిల్టన్ను తప్పనిసరిగ కాల్చి చంపెదరని నమ్మ లేదు. బహుశః వారు అతనిని భయపెట్టి, తన సిద్ధాంతములను విడచి రోమా మత సిద్ధాంతములను తిరిగి స్వీకరించునట్లు చేసెదరని తలంచిరి. అయితే తాము పొరపాటు పడిరని వారు త్వరలోనే తెలిసికొనిరి.

ఉరికంబమునొద్దకు హామిల్టన్

అయితే ఆ మందు పేలలేదు కాని చేతులు, ముఖము మాత్రము కాలినవి. ఇంకా ఎక్కువ తుపాకీమందు తెచ్చి, అతని చుట్టూగల కట్టెలపై చల్లి నిప్పు ముట్టించిరి. తుపాకీ మందు అప్పుడుకూడ పేలలేదు కాని తెల్లని అగ్నిజ్వాలలు చెలరేగి హామిల్టన్ ను చుట్టుముట్టెను. మంటలు అతనిని ఆవరించినప్పుడు, “యేసుప్రభూ, నా ఆత్మను చేర్చుకో! ఎంతకాలము ఈ రాజ్యమును చీకటి ఆవరించును? ఈ మనుష్యులక్రూరత్వము నెంతవరకు నీవు అనుమతించెదవు?” అని గట్టిగా పలికెను.

ఆ కట్టెలు చూచుటకు పచ్చగా ఉన్నవి కాని తరువాత అవి నెమ్మదిగా కాలుటవలన అతనికి బాధ ఎక్కువైనది. అయినను, ఆ బాధను క్రీస్తునందలి ధైర్యముతో అతడు భరించెను. అతని హతసాక్షి మరణమును చూచిన నిజవిశ్వాసులందరు దేవుని కృప అతనికి తోడుగా ఉండుట గమనించిరి. ఇట్లు పాట్రిక్ హామిల్టన్ హతసాక్షి మరణము క్రీ.శ. 1527 వ సంవత్సరములో సంభవించెను.

క్రీ.శ. 1529 లో హెన్రీ ఫారెస్ట్ (Henry Forest) అను క్రైస్తవ సన్యాసి పాట్రిక్ హామిల్టన్ బోధించిన సిద్ధాంతములు సత్యమని చెప్పుట ప్రారంభించెను. ఇది ఆర్చిబిషప్ జేమ్స్ బీటన్కు తెలియగా, హెన్రీ ఫారెస్ట్ను చెరసాలలో బంధించి, అతడు చేసిన నేరములను విచారణచేయుటకు ఒక మతాధికారిని పంపెను.

అతడు ఒప్పుకొనిన విషయములను వాస్తవమునకు రహస్యముగా ఉంచవలెను, కాని ఆర్చిబిషప్ ఆజ్ఞ ప్రకారము ఆ మతాధికారి ‘మోసగాడైన యూదా’ వలె ఫారెస్ట్ ఒప్పుకొనినవన్నియూ ఆర్చిబిషప్కు తెలియజేసెను. ఫారెస్ట్ తన ఒప్పుదలలో “పాట్రిక్ హామిల్టన్ మంచివాడని అతడు బోధించిన ఉపదేశములు లేఖనానుసారమైనవి” అని తెలియజేసెను.

హెన్రీ ఫారెస్ట్ ఒప్పుకొనిన విషయములను అతనికి వ్యతిరేక సాక్ష్యముగా చూపించి అతనిని సజీవదహనము చేయవలసినదిగా ఆర్చిబిషప్ ఆజ్ఞాపించెను. హెన్రీ ఫారెస్ట్ పేరు ప్రఖ్యాతులుగల దైవజనుడు కనుక ప్రజలకు ఎక్కువగ బాధ కలిగింపకుండ, అతనిని ఏవిధముగ చంపవలెనో ఆలోచన చేయుటకు ఆర్చిబిషప్ సభను సమావేశపరచెను.

ఆర్చిబిషప్ పనివారిలో ఒకడైన జాన్ లిండ్సే “పాట్రిక్ హామిల్టన్ను కాల్చినప్పుడు వచ్చిన పొగ ఎవరిమీద వ్యాపించునో వారందరిపై ఫారెస్ట్ ప్రభావము చూపించును కనుక భూమిలో ఇంటికి అడుగు భాగమున కట్టబడిన గది (Cellar) వంటి రహస్యస్థలములో చంపుట మంచిది” అని సలహా యిచ్చెను. ఆర్చిబిషప్ దానికంగీకరించి, ఆ గదిలోనికి ఫారెస్ట్ను తీసికొనిపోయి అతనికి ఊపిరాడకుండ దట్టమైన తలదిండు ముఖమునకు అదిమిపెట్టి చంపెను.

క్రీ.శ. 1534 లో డేవిడ్ స్ట్రాటన్ (David Stratton), నార్మన్ గార్లె (Norman Gourlay) సువార్త సత్యముకొరకు సంతోషముగ తమ ప్రాణములనర్పించిరి. పాప ప్రక్షాళనము పోప్ చేయలేడని, పోప్ అంత్యక్రీస్తని, స్కాట్లాండ్పై ఆయనకు అధికారము లేదని చెప్పినందుకు స్ట్రాటన్, గార్లెలను నిర్బంధించిరి.

స్ట్రాటన్ జాలరియగుటకూడ నేరమైనది. ఈగిల్స్గ్ (Eglesgrig) పట్టణ పాస్టరైన రాబర్ట్ లాసన్ (Robert Lawson) స్ట్రాటన్ పట్టుచున్న చేపలలో దశమ భాగమడిగినప్పుడు, స్ట్రాటన్ లాసన్ కిచ్చుటకు చేపలను పడవనుండి బయటకు విసరగా వాటిలో కొన్ని చేపలు నీటిలో పడెను. అందుకు లాసన్ కోపోద్రేకుడై స్ట్రాటన్ దేవుని సంఘమునకు దశమభాగ మిచ్చుట ఇష్టము లేనివాడని భావించి అతనిని మతద్రోహియని నిందించెను.

రోజ్ పట్టణ బిషప్ స్ట్రాటన్, గార్లెలను బంధించి వారు మతద్రోహులని తీర్పుచెప్పి, ఎడిన్బర్గ్ (Edinburgh), లేథ్ (Leith) ల మధ్య పెద్ద పచ్చికబయలుమీద వారిని సజీవదహనము చేసెను. దగ్గరలోనున్న ఫైఫే (Fife) వాసులు ఆ మంటలను చూచి భయకంపితులై, స్ట్రాటన్, గార్లెలు నమ్మినట్లు ఇక వారు నమ్మకుందురని ఆర్చిబిషప్ తలంచెను.

మతద్రోహులని నిందింపబడిన స్ట్రాటన్, గార్లెలు అగ్నికి భయపడక దేవుడు తమకిచ్చిన ఆత్మలను తిరిగి సంతోషముగా దేవునికే అర్పించిరి. వారి గొప్ప విమోచకుడైన యేసుప్రభువుద్వారా నిత్యజీవములో మహిమ పునరుత్థానమును పొందుదురని వారికి తెలియును.

క్రీ.శ. 1538 లో డాలర్ పట్టణ పాస్టరైన డీన్ థామస్ ఫారెట్ (Dean Tho- mas Forret) తన సంఘములో ప్రతి ఆదివారము క్రొత్త నిబంధన గ్రంథమును బోధించుచుండెను. ఈ విధముగా బోధించుట స్కాట్లాండ్లో అరుదు. ఎందుకనగా, వాడుక ప్రకారము స్కాట్లాండ్లో మతాధిపతులు ఎన్నడూ లేఖనములలోని విషయము లను బోధింపరు.

అందువలన మతాధిపతులు అసూయతో డంకెల్డ్ (Dunkeld) అను బిషప్నకు థామస్ ఫారెట్ మతద్రోహియని ఫిర్యాదు చేసిరి. థామస్ ఫారెట్ లేఖనములలోని మర్మములను ప్రజలకు వారి స్వభాషలో బోధించెను. కాని మత గురువులు ఎన్నడూ ప్రజలు అర్థము చేసికొను వారి స్వభాషలో బోధింపలేదుగనుక ప్రజలు వారిని అసహ్యించుకొనిరి.

పైగా థామస్ ఫారెట్ బోధించినందుకు ప్రజలు అతనికిచ్చుటకు తెచ్చిన ఆవు, విలువైన బట్టలు మొదలగు బహుమతులను అతడు తీసికొనలేదు. ఇదేవిధముగా మతాధిపతులుకూడ తప్పక చేయవలెనని ప్రజలు తలంచిరి.

థామస్ ఫారెట్ను విచారణ చేయుటకు బిషప్ డంకెల్డ్ పిలిపించి ఆవు, బట్టలు మొదలగు బహుమతులను తీసికొనవలెననియు, జీతము లేకుండ ప్రతి ఆదివారము బోధించుట చాల కష్టమనియు, ఈ విధముగా అతడు చేయకపోవుటవలన ప్రజలు ఇతర సంఘ నాయకులను ఈర్ష్యభావముతో చూచెదరనియు, పవిత్ర మాతృసంఘము (Holy Mother Church) యొక్క స్వేచ్ఛను తెలియజేయు మంచి పత్రికలను, సువార్తలను మాత్రమే అతడు బోధింపవలెననియు చెప్పెను.

అందుకు థామస్ ఫారెట్ “ఆదివారములు మాత్రమే బోధించుట చాలదని, తన పేద సంఘస్థులనుండి ఆవును, బట్టలను, లేక వారిచ్చెడి దేనినైనను తీసికొని, దానికి బదులుగా తనకు కలిగినది ఏదయిన వారికిచ్చెదన”ని చెప్పెను. ఆ విషయములో వారిద్దరు ఒక ఒడంబడికకు వచ్చిరి. అదేవిధముగ “బిషప్ తనకు పరిశుద్ధ గ్రంథములో మంచి పత్రికలను మంచి సువార్తలను, చెడ్డ పత్రికలను చెడ్డ సువార్తలను చూపించి నట్లయిన మంచివాటినే బోధించి చెడ్డవాటిని వదలివేయుదున”ని చెప్పెను.

దానికి బిషప్ కోపోద్రేకుడై “క్రొత్త, పాత నిబంధనలనగా ఏమిటో నాకు ఎన్నడు తెలియనందుకు నేను దేవునిని అభినందించుచున్నాను. నాకు నా ఆరాధన పుస్తకము, బిషప్లు పండుగ సమయములలో అనుసరించు పుస్తకము తప్ప మరేమియు తెలి యదు. నీ దారిన నీవు వెళ్లు. నీ చోద్యములు నీతో తీసికొని వెళ్లు.

నీవు తప్పుడు అభిప్రాయములలో కొనసాగుచున్నచో దానికి నీవే బాధపడెదవు, అవి ఏరీతిగను ఫలితములను మార్చజాలవు” అని చెప్పెను. “దేవుని యెదుట నా పని న్యాయమైనదను నమ్మకము నాకున్నది, కనుక దాని ఫలితములతో నాకు సంబంధము లేదు” అని ఫారెట్ సమాధానమిచ్చి, అక్కడనుండి వెడలెను.

కొద్దికాలములోనే థామస్ ఫారెట్కు, కైలర్ (Keillor) మరియు బేవరిడ్జ్ (Beveridge) అను క్రైస్తవమత సన్యాసులకు, డంకన్ సింప్సన్ (Duncan Simpson) అను పేరుగల మతాధిపతికి, రాబర్ట్ ఫారెస్టర్ (Robert Forrester) అను సంఘస్థునికి, మరికొందరికి బిషప్ డంకెల్డ్ సంజాయిషీ పిలుపులు పంపెను. వారు బిషప్ సభ యెదుట హాజరైన దినమున వారందరిని మతద్రోహులని తీర్పు చెప్పిరి.

వారు తమ పక్షముగా వాదించుకొనుటకెట్టి అవకాశము వారికీయబడలేదు. ఎందుచేతననగా వారే ప్రధాన మతద్రోహులు మరియు ప్రజలకు మతద్రోహమును ఉపదేశించు అధ్యాపకులు. కనుక వారందరిని ఎడిన్బర్గ్ (Edinburgh) లోని కేజిల్ హిల్ (Castle Hill) కు తీసికొనివెళ్లి సజీవదహనము చేసిరి.

క్రీ.శ. 1543 లో స్కాట్లాండ్ మత సంస్కర్తయైన జార్జ్ విషార్ట్ (George Wishart) కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయములో ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు రోమన్ కేథలిక్ పాస్టరైన జాన్ నాక్స్ (John Knox) ను నిజ క్రైస్తవ సిద్ధాంతములోనికి మార్చెను. విషార్ట్ మర్యాద, వినయము కలవాడు. అనేక ప్రాంతములు దర్శించిన మంచి మనిషి, పేదలయెడల దయచూపించుచూ, తన విషయములో పిసినారితనముకలిగి ఉపాధ్యాయ వృత్తిని, అన్నింటికంటే ముఖ్యముగా దేవుని ఎక్కువగా ప్రేమించెను.

దినమునకు రెండుమారులు భోజనము, నాలుగు దినములకొకసారి ఉపవాసము, గడ్డిపరుపుపై నిద్రించుట అతని అలవాట్లు. అతడు లేఖనములను ఉపదేశించుటలో తీవ్రమైన పట్టుదల కలవాడగుటచే కొందరు అతడు కఠినుడనిరి. మరికొందరైతే అతనిని చంపుటకు అతడు చెప్పినది చాలునని అతనిపై ద్వేషముకలిగి ఉండిరి.

అయితే ప్రభువు అతని పక్షముగా ఉండెను. విషార్ట్ వారి దుర్మార్గమును ఖండించి వారిని మంచి మార్గములకు ప్రోత్సహించుటవలన కొందరు అతనియెడల అభిమానము కలిగి యుండిరి. రోమా మత నాయకులు మాత్రము అతని సంఘసంస్కరణ సిద్ధాంతములకు సంతోషించలేదు.

క్రీ.శ. 1544లో తన స్వదేశములో సత్యసువార్తను బోధించవలెనను ఆశ అతనికి అధికమైనందున విషార్ట్ కేంబ్రిడ్జిని విడచి స్కాట్లాండ్ చేరెను. అతడు మొదట మాంట్రోస్ (Montrose) లోను, తరువాత దనీ (Dundee) ల వద్ద సువార్త ప్రకటించెను. ఈ ప్రదేశమునందే పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికయొక్క అర్థమును, మరియు మార్టిన్ లూథర్ట్చే ముప్పది సంవత్సరముల పూర్వము తిరిగి కనుగొనబడిన ‘విశ్వాసముద్వారా నీతిమంతునిగా తీర్చబడుట’ (Justification by faith) అను సిద్ధాంతముల అర్థమును ఉపదేశించెను.

అతడు ఉపదేశించుచున్నప్పుడు ప్రదర్శించిన స్వేచ్ఛాస్వాతంత్ర్యములకు మతాధిపతులుకూడ మిక్కిలి భయపడిరి.
ఆ తరువాత విషార్ట్ రెండు సంవత్సరములు స్కాట్లాండ్ అంతటా పర్యటించెను. అనేక పర్యాయములు రోమా మతాధిపతులు అతనిని ఉపదేశించకుండ చేయవలెనని ప్రయత్నించుటచే విషార్ట్కు చాలవరకు ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడినవి. అతడు పశ్చిమ స్కాట్లాండ్లో ఉన్నప్పుడు దనీ పట్టణములో అంటువ్యాధి ప్రబలినదని విని వ్యాధిగ్రస్తుల శరీరములకు, ఆత్మలకు సేవచేయవలెనని అక్కడకు వేగిరమే వెళ్లెను. వారు అతనిని సంతోషముతో చేర్చుకొనిరి.

విషార్ట్ దనీని వదలి మాంట్రోసుకు చేరకముందు స్కాట్లాండ్ కార్డినల్ మరియు ఆర్చిబిషప్యైన డేవిడ్ బీటన్ (David Beaton) విషార్ట్ను చంపుటకు మతాచార్యుడైన జాన్ వైటన్ (John Weighton) ను నియమించెను.

విషార్ట్ ‘ఆత్మను, శరీరమును స్వస్థపరచుట’ అను అంశముపై ప్రసంగము ముగించి వేదికనుండి క్రిందికి వచ్చు సమయములో అతనిని చంపుటకు మతాచార్యుడైన వైటన్ తన గౌనులో బాకును దాచియుంచి వేదిక మెట్లయొద్ద అవకాశముకొరకు కనిపెట్టుకొని యుండెను.

మొత్తముమీద, ఆ మతాచార్యుడు చేతిని గౌనులో పెట్టుకొని తనగురించి వేచియుండుట విషార్ట్ చూచి అతనితో “నా స్నేహితుడా, నీవు కోరునదేమిటి?” అని ప్రశ్నించెను. అంతట ఆ మతాచార్యుడు బాకును తన గౌనునుండి బయటకు తీయుటకు ప్రయత్నించుచుండగా విషార్ట్ వేగముగా ఆ బాకును లాగుకొనెను. భయపడిన మతా చార్యుడు మోకరించి, తన ఉద్దేశ్యమును ఒప్పుకొని విషార్ట్ను క్షమాపణ అర్థించెను.

ఆరోగ్యవంతులనుండి వేరుచేయబడి దడి వెలుపల వేచియున్న అనేకమంది అంటు వ్యాధిగ్రస్తులు ఏమి జరిగినదో తెలుసుకొని, ఆ ద్రోహిని వారికి అప్పగించమని అడిగిరి. ఆ కోపములో వారు దడి విరుగగొట్టి ఆ మతాచార్యుని తీసుకొనివెళ్లెడివారే కానీ విషార్ట్ అతనిని పట్టుకొని, అని చెప్పెను. ఈ విధముగా ప్రజలను నెమ్మదిపరచి తనను చంపుటకు ప్రయత్నించిన ఆ దుష్ట మతాచార్యుని ప్రాణము రక్షించెను.

ఎవరయితే అతనిని గాయపరచకోరుదురో వారు ముందు నన్ను గాయపరచుడి

విషార్ట్ మాంట్రోసుకు తిరిగివచ్చిన వెంటనే, స్కాట్లాండ్ కార్డినల్ అయిన బీటన్ అతనిని చంపుటకు పూనుకొని ఒక కుట్ర పన్నెను. విషార్ట్ ముఖ్య స్నేహితుడు ప్రాణాంతకమైన ఘోరవ్యాధితో బాధపడుచు తనను వెంటనే రావలసినదిగ కోరినట్లు ఒక ఉత్తరమును సృజించి, దానిని విషార్ట్కు పంపెను.

విషార్ట్ మాంట్రోస్నుండి తన స్నేహితుని ఇంటికి వెళ్లు దారిపొడవున అతనిని చంపుటకు బీటన్ అరువదిమంది సైనికులను దాచియుంచెను. కాని విషార్ట్, అతని స్నేహితులు ఆ ప్రదేశమును సమీపించి అక్కడున్న పరిస్థితులు ఆందోళనకరముగా ఉన్నవని అనుమానించి ప్రయాణము కొనసాగించలేదు.

విషార్ట్ తన స్నేహితులతో ‘ముందుకు సాగుటకు దేవుడు నన్ను నిషేధించెను. ముందు ద్రోహము పొంచియున్నది. మీలో కొందరు నాకంటే ముందుగా వెళ్లి, జాగ్రత్తగ అక్కడి పరిస్థితులను కనుగొని నాకు తెలియజేయుడి’ అని చెప్పెను.

కార్డినల్ నియమించిన సైనికులు పొదలమాటున దాగియుండుట విషార్ట్ స్నేహితులు కనుగొని, వేగముగ తిరిగివచ్చి విషార్ట్కు ఆ సంగతి తెలిపిరి. విషార్ట్ ‘నా జీవితము ఆ రక్తపిపాసి చేతులలో అంతమౌనని నాకు తెలియును, కాని చాటున దాగి యుండుటవలన కాదు’ అని వారితో చెప్పెను.

అనతికాలములోనే, క్రీ.శ. 1546 లో విషార్ట్ దక్షిణ స్కాట్లాండులోని తూర్పు లోథియన్ (East Lothian) లో కాక ్బర్న్ (Cockburn) అను వ్యక్తితో నివసించు చున్నాడని కార్డినల్కు తెలిసి, విషార్ట్ను అదుపులోనికి తీసికొనుమని ప్రాంతీయ గవర్నరును ఆదేశించగా గవర్నరు తన మనఃస్సాక్షికి విరోధముగ అతనిని నిర్బంధించి, ఎడిన్ బర్గ్ తీసికొనివెళ్లి, పరి. అంద్రెయ భవనములో బంధించెను.

విషార్ట్ రాజద్రోహము, మతద్రోహమునకు సంబంధించిన సిద్ధాంతములను బోధించుచున్నాడని కార్డినల్ ఆరోపించి మరునాటి ఉదయము తన బిషప్ సభయెదుట హాజరుకమ్మని అతనికి తాకీదు పంపెను. కార్డినల్ యుద్ధమునకు వెళ్లుచున్నట్లు సాయుధులైన నూరుమంది సేవకులు సైనిక దుస్తులు ధరించి ఆయుధములతో కవాతు చేయుచు విషార్ట్ను అబ్బె దేవాలయము (Abbey Church) నకు తీసికొని వచ్చిరి.

విషార్ట్ అనుచరులు, అభిమానులు అతనిని తమవద్దనుండి విడిపించుకొని పోవుదురని, లేక అతడే తప్పించుకొని పారిపోవుటకు ప్రయత్నించునని కార్డినల్ సేవకులు భయపడిరి. కాని అతడు శాంతముగా వారిని వెంబడించెను. దేవాలయ ద్వారమువద్ద అతడు క్షణమాగి డబ్బులు ఉన్న తన చిన్నసంచిని మెట్లయొద్ద వేచియున్న పేదవానికి విసిరెను.

విషార్ట్ దేవాలయములోనికి ప్రవేశించి కార్డినల్, అతని బిషప్ల సభయెదుట నిలువబడెను. ముసలివాడైన జాన్ లాండర్ (John Lander) అను మతాధికారి విషార్ట్కు వ్యతిరేకముగా పదునెనిమిది నేరములు చదివి వినిపించెను. ఆ నేరములు శాపములతోను, వేషధారణతోను, బెదిరింపులతోను నిండియుండెను.

అతడు చదువుట చాలించిన తరువాత విషార్ట్ను చూచి “నీవు దొంగవు, దేశద్రోహివి, మతము విడిచి పారిపోయిన వాడవు, నీవు చేసిన నేరములన్నిటికి తగిన సాక్ష్యములు మేము నిరూపించెదము, ఈ నేరములకు నీ జవాబు ఏమిటి?” అని అరచెను.

విషార్ట్ మొదట మోకరించి ప్రార్థించెను. తరువాత, అతడు క్రీస్తువలె శాంతము వహించి “నన్ను తీర్పు తీర్చు మీరు నా మాటలు, నేను బోధించిన సిద్ధాంతములేమిటో తెలిసికొనుట న్యాయము.

అప్పుడు మీ ఆత్మల నాశనమును గురించి నేను అన్యాయ ముగా మరణము పొందను. కనుక దేవుని మహిమకొరకు, ఘనతకొరకు, మీ క్షేమము కొరకు, మరియు నా ఆత్మ రక్షణకొరకు, నా మాటలు ఆలకించుడని న్యాయాధిపతులైన మిమ్మును మనఃపూర్వకముగా బ్రతిమాలుకొనుచున్నాను” అని చెప్పెను.

దానికి లాండర్ విషార్ట్ను నిందించుచు, “ఓ మత విరుద్ధమైనవాడా, దేశద్రోహి, దొంగ ! నీవు బోధించుట న్యాయము కాదు. సంఘము ఏ అధికారము ఇవ్వకుండగనే బోధించు అధికారమును నీవే నీ చేతులలోనికి తీసికొంటివి” అని పెద్దగా అరచెను.

వారు చేయ తలంచినది విషార్ట్ గ్రహించి, పలు విజ్ఞాపనలు చేసి విఫలుడయ్యెను. పదునెనిమిది నేరములలో అతనిని మతద్రోహిగా నిరూపించి, వ్రేలాడదీసి, కాల్చి చంపవలెనను తీర్పు చెప్పిరి.

విషార్ట్ను చంపబోవు ఉదయము కార్డినల్ ఇద్దరు సన్యాసులను చెరసాలలోని అతనియొద్దకు పంపెను. వారు అతనికి నల్లని అంగీని ధరింపచేసి తుపాకీమందు సంచులను అతని శరీరములోని పలుభాగములకు కట్టి, అతని చేతులు వెనుకకు స్కాట్లాండులో హింసలు విరిచికట్టి, మొలచుట్టు ఇనుపగొలుసును బిగించి, మెడచుట్టు కట్టబడిన తాడును చేతపట్టుకొని అతనిని దహనముచేయు స్థలమునకు నడిపించిరి.

విషార్ట్ పూర్తిగా దహనమై చనిపోవువరకు అతని అభిమానులు, స్నేహితులు అడ్డుకొనకుండ కార్డినల్ బీటన్ తుపాకులు ధరించిన తన సైనికులను చుట్టూ నిలువబెట్టించెను. విషార్ట్ సజీవదహనము గావింపబడు స్థలమునొద్దకు వెళ్లుమార్గములో మతాచార్యులలో ఒకరు అతనితో “జార్జ్ విషార్ట్, మేరి మాతను ప్రార్థించుము, ఆమె నిన్ను తన కుమారునిగా అంగీకరించి మధ్యవర్తిత్వము నడుపును” అని చెప్పెను. అందుకు విషార్ట్ “ఆగండి! నన్ను శోధింపవద్దు, నా సహోదరులారా, అగ్ని నన్ను ఎంతగానో ఆకర్షించుచున్నది” అనెను.

ఉరికంబమువద్ద అతడు మోకరించి మూడుసార్లు ప్రార్థించెను. “ఓ లోకరక్షకా, నన్ను కనికరింపుము. పరలోకపు తండ్రీ, నీ పరిశుద్ధ చేతులకు నా ఆత్మను అప్పగించు చున్నాను, నాపై నిందమోపినవారిని క్షమించుము, నా హృదయపూర్వకముగా నేను వారిని క్షమించియున్నాను. వారు తెలియక నన్ను నిందించినందుకు వారిని క్షమింపు మని నేను వేడుకొనుచున్నాను” అని ప్రార్థించెను.

అప్పుడు అక్కడ గుమి కూడిన ప్రజలవైపు తిరిగి “దేవుని కృపద్వారా నాకు అనుగ్రహింపబడిన వాక్యము, సత్య సువార్తలకొరకు ఈ దినమున నేను మనుష్యుల చేతులలో బాధననుభవించుచున్నాను. దుఃఖముతోకాక సంతోష హృదయముతో భరించుచున్నాను. క్రీస్తుకొరకు అగ్నిని భరించుటకు నేను పంపబడితిని. నా ముఖమును సమీపించి చూడుడి, నేను అగ్నికి భయపడుటలేదు కనుక నా ముఖము కళ మారలేదు. ఈ రాత్రే నేను నా రక్షకుడైన క్రీస్తుతో కలసి పరలోక రాజ్యములో నిశ్చయముగా భుజించెదన”ని చెప్పెను.

అది విని, తలారి విషార్ట్ యెదుట మోకరించి ‘అయ్యా, దయచేసి నన్ను క్షమించుము, నీ మరణము విషయములో నేను నిర్దోషిన’ని చెప్పెను. అందుకు విషార్ట్ ‘నా దగ్గరకు రమ్ము’ అని సమాధానమిచ్చెను. అతడు రాగానే, అతని చెంపమీద ముద్దుపెట్టుకొని, ‘నా ప్రియుడా, నేను నిన్ను క్షమించితిననుటకిది నిదర్శనము. నీ పని నీవు చేయుము’ అని పలికెను.

అతని శరీరము కాలి బూడిదగువరకు ఉరిమ్రానుమీద నిప్పులపై విషార్ట్ వ్రేలాడదీయబడెను. పెద్దమంటలలో అతడు కాలిపోవుట చూచిన ప్రజలు ఏడ్వకుండ ఉండలేకపోయిరి. అమాయకపు గొఱ్ఱపిల్లను వధించినందుకు వారు మతాధికారులను నిందించి, కోపోద్రేకులై కార్డినల్ బీటన్ ను చంపి, అతని కోటను ఆక్రమించిరి.

విషార్ట్చే నిజ క్రైస్తవ సిద్ధాంతములోనికి మార్పుచెందిన జాన్ నాక్స్ ఆ కోటలోని సేనతో చేరి సువార్తను ప్రకటించుట మొదలుపెట్టెను. వెంటనే నాక్స్ తిరుగుబాటు దారులందరికి బోధకుడయ్యెను. మరుసటి సంవత్సరము అనగా క్రీ.శ. 1547, జూలైలో ఫ్రెంచివారి సహాయముతో రోమన్ కేథలిక్లు ఆ కోటను మరల ఆక్రమించి నాక్స్ని ఖైదు చేసిరి. క్రీ.శ. 1549, ఫిబ్రవరిలో నాక్స్ విడుదలై కొంతకాలము ఇంగ్లాండు, జర్మనీలలో ఉపదేశించి, తరువాత స్విడ్జర్లాండులోని జెనీవా ఆంగ్ల సంఘమునకు పాస్టరుగా నియమింపబడెను.

అక్కడ జెనీవాను ‘దేవుని పట్టణము’ (City of God) గా మార్చిన ఫ్రెంచి వాస్తవ్యుడు, స్విస్ వేదాంతశాస్త్ర పండితుడైన జాన్ కేల్విన్ (John Calvin) యొద్ద శిష్యునిగా చేరెను. కొంతకాలమునకు మరల స్కాట్లాండ్ తిరిగి వచ్చి ఆ దేశములో పెద్దలచే సంఘపాలన నిర్వహించు ప్రొటెస్టంట్ క్రైస్తవ పద్ధతిగల సంఘము (Presbyterianism) ను స్థాపించెను.

స్కాట్లాండులో చనిపోయిన చివరి హతసాక్షి 82 సంవత్సరముల వయస్సుగల వాల్టర్ మిల్ (Walter Mill). ఇతడు క్రీ.శ. 1558 లో హతసాక్షి మరణము పొందెను. యౌవన ప్రాయములో మిల్ కొంతకాలము అంగస్ (Angus) లోని లూనాన్ సంఘము (Lunan) నకు పాస్టరుగా పనిచేసెను.

అతడు ఒకసారి జర్మనీ వెళ్లి అక్కడ సత్యసువార్తను విని, స్కాట్లాండ్ తిరిగివచ్చి రోమన్ కేథలిక్ సంఘ విషయము లన్నిటిని ప్రక్కనబెట్టి సంస్కరణ సిద్ధాంతమును ఉపదేశించుట ప్రారంభించెను. అనతికాలములోనే స్కాట్లాండ్ బిషప్లు అతనిని మతద్రోహిగా అనుమానించుట మొదలుపెట్టిరి.

తనను నిర్బంధించెదరని గ్రహించిన మిల్ తన సంఘమును వదలి కొంతకాలము దాగియుండెను. తరువాత అతడు తన సంఘమునకు తిరిగివచ్చి ఉపదేశించుటకు రాణి అనుమతించెను. అయినను కొద్దికాలమునకే ఇద్దరు మతా చార్యులు మిల్ను భయపెట్టి ఎడిన్బర్గ్ లోని పరి. అంద్రెయ కోటకు తీసికొనిపోయిరి.

మొదట మిల్ను హింసించుట, కాల్చుటద్వారా భయపెట్టిరి. కాని, ఈ హింసలు, శ్రమలు మిల్ను తన సంస్కరణ సిద్దాంతములు, బోధలనుండి మార్చలేకపోయినవి. అందుచే వారు మిల్ తన క్రియలు తప్పు అని ఒప్పుకొనినచో అతనికి అబ్బె చర్చ్ జీవితాంతము మతాధిపతి స్థానము కల్పింతుమని ఆశచూపిరి. అయినను మిల్ వారు చూపిన ఆశలకు వ్యతిరేకముగా నిజవిశ్వాసములో మరింత బలపడెను.

అప్పుడతడు పరి. అంద్రెయ కోట వేదికపై బిషప్లముందు విచారింపబడుటకు తేబడెను. మిల్ పెద్ద వయస్సుకలవాడగుటచేత, మరియు చెరసాలలో అనుభవించిన శిక్ష కారణముగా సహాయము లేకుండ వేదిక మెట్లు ఎక్కలేకపోయెను.

అతడు వారికి వినబడునంత గట్టిగా మాట్లాడలేని బలహీనుడని బిషప్లు తలంచిరి. అయితే అక్కడ చేరిన క్రైస్తవులందరు ఆనందించునట్లు మిల్ ధైర్యముగాను, గంభీరముగాను మాట్లాడగా బిషప్లు కంగారుపడిరి. మిల్ వేదికపై మోకరించి చాలసేపు ప్రార్థించెను.

కార్డినల్ బీటన్ కాలమునుండి అక్కడ పాస్టర్గా పనిచేయుచున్న ఆండ్రూ ఓలిఫాంట్ (Andrew Oliphant) మిల్తో, “సర్ వాల్టర్ మిల్, మీరు అధిక సమయము ప్రార్థించి మా ప్రభువుల (బిషప్ల) కాలమును వృధాచేసిరి. ఇక లేచి మీమీద మోపబడిన నేరములకు సమాధానము చెప్పుమ”నెను. ప్రార్థించుట ముగిసిన తరువాత మిల్.

నీవు నన్ను 'సర్ వాల్టర్'

అనుకున్నరీతిగా విచారణ సాగెను. చివరకి ఆండ్రూ ఓలిఫాంట్ అతనితో “నీ తప్పుడు అభిప్రాయములను ఉపసంహరించుకొననిష్టపడుదువా?” అని మిల్ను ప్రశ్నించెను. “నేను పదివేల జీవితములనైనను వదలుకొందును కాని ఈ పరలోక సిద్దాంతములోని ఒక అణువుకూడ వదలుకొనను” అని జవాబిచ్చెను.

అప్పుడు ఓలిఫాంట్ మిల్ను మరుసటి దినమున ఉరితీసి చంపవలెనను తీర్పు ప్రకటించగా అతనిని మరల చెరసాలకు తీసికొనిపోయిరి. అతనిని సజీవ దహనముచేయు స్థలమునకు తీసికొని వచ్చినప్పుడు అతని శత్రువులుకూడ ఆశ్చర్యపడునంతగా తన వయస్సు, బలహీనస్థితిని మించునట్లు వాల్టర్ మిల్ తన భావములను, సిద్ధాంతములను చాల దృఢముగ తెలియజేసెను.

ప్రార్థనానంతరము అక్కడ చేరినవారితో “ప్రియ స్నేహితులారా, దేవునియెదుట చాల ఘోర పాపిగా నన్ను నేను భావించుకొనుచున్నాను. ఈ రోజు నేను ఈ విధముగా బాధననుభవించుటకు నేను చేసిన దోషములు కారణము కాదు.

కాని, మనందరికొరకు పాత, క్రొత్త నిబంధనలలో ఉంచబడిన యేసుక్రీస్తునందలి విశ్వాసమును కాపాడుటకే. అట్టి విశ్వాసముకొరకు నిజ క్రైస్తవ హతసాక్షులు సంతోషముగా తమంతట తామే అర్పించుకొనిరి కనుక వారికి శాశ్వతానందమైన పరలోకము వాగ్దానము చేయబడెను.

అట్టి హతసాక్షులలో ఒకనిగా ఉండుటకు ఆయన నన్ను ఎంచుకొనినందున నేను దేవునికి వందనములు చెల్లించుచు నా జీవితములో ఆయన సత్యమును ముద్ర వేయుచున్నాను. నా ప్రాణమును ఆయన యొద్దనుండి పొందితిని, ఆయన మహిమ కొరకు దానిని తిరిగి ఆయనకే అప్పగించుచున్నాను.”

“మీరు రెండవ మరణమును తప్పించుకొనకోరితే మతాధిపతులు, బిషప్లు, సన్యాసులు, బోధకులు, ఉపదేశకులు, అధికారులు, అంత్యక్రీస్తును వెంబడించువారు చెప్పెడి అబద్ధములవలన మోసపోకుడి. మీరు నాశనమునుండి విమోచింపబడి నిత్య.

జీవమును పొందుటకు యేసుక్రీస్తు, ఆయన కృపమీద మాత్రమే ఆధారపడుడి” అని మిల్ చెప్పుచుండగా ప్రజలందరిలో గొప్ప దుఃఖము, విచారము కలిగెను. అతని ధైర్యము, గంభీరము, దృఢత్వము, విశ్వాసపు మాటలు వారి హృదయములను మండించెను.

అప్పుడు వారు వాల్టర్ మిల్ను కొయ్యకు వ్రేలాడదీసి, క్రిందనున్న కట్టెలకు నిప్పు ముట్టించిరి. జ్వాలలు అతనిని కాల్చుచుండగా “ప్రభువా, నన్ను కనికరింపుము! ప్రజలారా, సమయముండగానే దేవుని ప్రార్థించుడి” అని పలుకుచు ఈ లోకమును విడచి, తనకొరకు మరణించిన ప్రభువునొద్దకు వెళ్లెను.

స్కాట్లాండ్కు క్రీ.శ. 1560 లో మతోద్దారణ పూర్తిగా వచ్చినప్పుడు, పెద్దలచే సంఘపాలన నిర్వహించు ప్రొటెస్టంట్ క్రైస్తవ్యము (Presbyterianism) ను జాతీయ మతముగా పార్లమెంట్ స్థాపించెను. అప్పుడు ప్రజలు రోమన్ కేథలిక్ దేవాలయము లలోనున్న విలువైన విగ్రహములను తీసివేసి వాటిని వాల్టర్ మిల్ హతసాక్షి మరణము పొందిన స్థలములో కాల్చివేసిరి.

Leave a Comment