జాన్ విక్లిఫ్ : సేవ, హింసించబడుట (క్రీ.శ. 1377-1384)
జాన్ విక్లిఫ్ (John Wycliffe) జన్మస్థలము ఇంగ్లాండులోని యార్కైర్ (York- shire). ఇతడు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయములో చదివి తత్వజ్ఞానశాస్త్రము, వేదాంత శాస్త్రములందు పండితుడయ్యెను. ఆ కాలములో విక్లిఫ్ అపార పాండిత్యముగల వేదాంత శాస్త్రజ్ఞునిగను, మిక్కిలి గౌరవింపదగిన తర్కపండితునిగను ప్రసిద్ధిగాంచెను. క్రీ.శ. 1374 లో ప్రభుత్వపు కొలువులో చేరి, రోమన్ కేథలిక్ సామంత రాజులు రోముకు చెల్లింపవలసిన కప్పము విషయమై పోప్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుటకు అతడు నైరుతి బెల్జియంలోని బ్రుజెస్ (Bruges) పట్టణమునకు రాయబారిగా పంప బడెను.
అక్కడ కొంతకాలము గాంట్ పట్టణమునకు చెందిన జాన్ (John of Gaunt), రాజైన లంకాస్టెర్ ప్రభువు (Duke of Lancaster) లతో స్నేహము చేసెను. ఆ కాలములో విక్లిఫ్ సంఘ సిద్ధాంతములలోని లోపములను గ్రహించి, వాటిని సంస్కరింపవలెనని, ఇంగ్లాండు సంఘమును ప్రక్షాళనము చేయుటకు రాజే న్యాయబద్ధమైన అధికారియని తలంచెను. అతని ఉద్దేశ్యములు రోమన్ కేథలిక్ సంఘ బోధలకు, ఆచారములకు పూర్తి వ్యతిరేకముగ ఉన్నవి. కనుకనే “భిన్నమతావలంభికులు” (Lollards) అని పిలువబడు విక్లిఫ్కు, అతని అనుచరులకు మతాధికారులందరు వ్యతిరేకముగ నిలిచిరి.
విక్లిఫ్ గొప్ప ఆక్స్ఫర్డ్ విద్యావేత్త, తత్త్వశాస్త్రజ్ఞుడు. అతని సిద్ధాంతములను వ్యతిరే కించువారు సహితము ఆ విషయమును గుర్తించిరి. వారు అతని బలమైన, సహేతుక మైన వాదములకు ఆశ్చర్యచకితులైరి. విక్లిఫ్ చనిపోయిన కొన్ని సంవత్సరములకు అతని స్నేహితుడైన వాల్డెన్ (Walden) పోప్ ఐదవ మార్టిన్‌కు ఈలాగున ఒక ఉత్తరము వ్రాసెను :

మతము నీతిమాలి చెడిపోయినప్పుడు విక్లిఫ్ ప్రభావము వ్యాప్తిచెందెను. ప్రజలు కేవలము పెదవులతో ప్రభువును ఆరాధించుచున్నారు. కాని, వారి జీవితములను మార్చగల ఆయన గొప్ప శక్తిని తృణీకరించిరి. అనేకులకు వారి సంప్రదాయములు, మూఢనమ్మకములు ముఖ్యము.
అది ఆత్మీయ అంధకార యుగము. ఎందుకనగా, పరిశుద్ధ లేఖనములను ప్రత్యక్షముగ తెలిసికొను అవకాశము సామాన్య ప్రజలెవరికీ లేదు. అనేకమంది మనుష్యులు ఈ చీకటి, సందేహమను రాజ్యమునకు నడిపింపబడు చున్నారు. సంఘముయొక్క ఆచారములు, మూఢ నమ్మకములు ప్రజలను రక్షించునని, పోప్ ప్రకటించిన కార్యములు నెరవేర్చినచో పరదైసు లభ్యమగునని మతాచార్యులు వారికి బోధించిరి.
తొలి క్రైస్తవులు అన్యులచే హింసింపబడి, హతసాక్షులైరి. అయితే జాన్ విక్లిఫ్ మాత్రము క్రీస్తు పవిత్ర నామమును ఎరిగినవారినుండి హింసలు ఎదుర్కొనవలసి వచ్చెను. అతని బోధనలు కేథలిక్ మతనాయకులకు కోపము కల్గించెను. అవకాశమున్న ప్రతి పద్ధతిలో వారు అతనిని ఖండించిరి.
మొదట మత సన్యాసులు, మత నాయకులు విక్లిఫ్ను వ్యతిరేకించిరి. తరువాత బోధకులు, బిషప్‌లు, ఆర్చిబిషప్‌లు వారితో కలసిరి. సైమన్ సద్బురి (Simon Sudbury) అను ఆర్చిబిషప్ విక్లిఫ్ను ఆక్స్‌ఫర్డ్‌లోని తన ఉద్యోగమునుండి తొలగించెను. చివరకు పోపూడ విక్లిఫ్మీద వ్యతిరేక చర్యలు చేపట్టెను.
గాంట్ పట్టణ జాన్, లంకాస్టర్ ప్రభువు, నార్తుంబెర్లాండ్ మొదటి ప్రభువైన లార్డ్ హెన్రీ పెర్సీ (Lord Henry Percy) లు విక్లిఫ్కు అనుకూలముగా ఉండి, మధ్యవర్తిత్వము నడిపినందున విక్లిఫ్ కొంతకాలము కేథలిక్ సంఘాధికారమునుండి తప్పించుకొనగలిగెను. అయితే బ్రమ్హమ్ మూర్ (Bramham Moor) యొద్ద నాల్గవ హెన్రీకి వ్యతిరేకముగ లార్డ్ హెన్రీ పెర్సీచేసిన తిరుగుబాటులో క్రీ.శ. 1408, ఫిబ్రవరి 20న చంపబడెను. ఆ తరువాత మిగిలిన ఇద్దరు ప్రభువుల ఆశ్రయముకూడ నిరుపయోగమైనది. క్రీ.శ. 1377 లో బిషప్లందరు విక్లిఫ్పై చర్యతీసికొనవలసినదిగ ఆర్చిబిషప్ సైమన్ సద్బురిని పురికొల్పుటలో కృతకృత్యులైరి.
ఇంతకుపూర్వమే సద్బురి విక్లిఫ్ను తన సిద్ధాంతములను బోధింపకుండ ఆటంక పరచెను. మరలా ఇప్పుడు విక్లిఫు బిషప్‌ల సమావేశమునకు హాజరుకావలసినదిగ ఆజ్ఞాపించెను. విక్లిఫ్ను బలపరచు లౌకిక నాయకులు తోడురాగా విక్లిఫ్ సమావేశము నకు హాజరయ్యెను. ఈ సభ లండనులోని పరి. పౌలు దేవాలయములో జరిగెను.
ప్రభువులు, జమిందారులు, బిషప్ లు, ఆర్చిబిషప్‌లు అందరు కలసి ఆ దేవాలయములో సమావేశమైరి. విక్లిఫ్ వారియెదుట నిలువబడవలసియుండెను. అతడు ‘జవాబు చెప్పవలసిన అనేక విషయములున్నవి’ కనుక అతడు కూర్చుండుట మంచిదని పెర్సీ ప్రభువు విక్లిఫ్ను కూర్చుండుమని చెప్పెను. దీనికి ఆగ్రహించిన లండన్ బిషప్ విక్లిఫ్ నిలుచుండవలసినదేనని చెప్పెను.
ఆ విషయమై అనేక వాగ్వి వాదములు జరిగెను. అక్కడ చేరిన జనసమూహము తమ అసహనమును వ్యక్తపరచిరి. ఇరుపక్షములు ఒకరినొకరు బెదరించుకొనిరి. లౌకికపక్షము మతాధికారులపై లౌకిక చర్య తీసికొనెదమని, మతపక్షము లౌకికాధికారులపై మతపరమైన చర్య తీసికొనెదమని బెదరించుకొనిరి.
ఇంతలో అందరు వినునట్లు లంకాస్టర్ ప్రభువు లండన్ బిషప్ ను అవమానపరచు మాటను గట్టిగ, అతని ప్రక్కనవున్న వ్యక్తితో అనుటవలన గుంపులోని అనేకమంది ఆ మాటకు గట్టిగా అరచి, తమ బిషప్ ను ఈ విధముగ అవమానించుటను సహించమని చెప్పిరి. నిందించుకొనుట, జగడమాడుకొనుటతో సభ ఆ ఉదయము తొమ్మిదిగంటలకు రద్దయినది. తిరిగి సమావేశము జరుగలేదు.
క్రీ.శ. 1377 లో మూడవ ఎడ్వర్డు (Edward III) అనంతరము రెండవ రిచర్డు (Richard II) ఇంగ్లాండునకు రాజయ్యెను. అతని ప్రసంగములనుండి సంపాదించిన అనేక వ్యాసముల ఆధారములతో రోమా బిషప్‌లు విక్లిఫ్కు వ్యతిరేక పోరాటము సాగించిరి.
- అవి : ఆరాధనలో పాదిరి ప్రార్థనచేసిన తరువాత రొట్టె, ద్రాక్షారసము నిజమైన క్రీస్తు శరీరముగా మారవు.
- రోమా సంఘము అన్ని సంఘములకు అధినేత కాదు, ఇతరులగు అపొస్తలుల కంటె పేతురునకు క్రీస్తు ఎక్కువ అధికారమునీయలేదు.
- ఏ యితర పాదిరి (Priest) కంటె పోప్ వద్ద సంఘపు తాళపుచెవులు లేవు.
- భూమిమీద ప్రతి క్రైస్తవ వ్యక్తియొక్క జీవితమును శాసించుటకు తగినది సువార్త మార్గము తప్ప మరి యే శాసనము కాదు.
- మతస్థులైన ప్రజలను పరిపాలించుటకు చేయబడిన శాసనములన్నియు యేసుక్రీస్తు సువార్తకు గోడకు వేసిన సున్నముకంటె అధిక పవిత్రతను ఆపాదింపలేవు.
- ఆజ్ఞను అతిక్రమించినవారిని శిక్షించి, వారిని ఖైదు చేయు కారాగారములు పోషక్కుగాని, మతాధికారులకుగాని ఉండరాదు.
ఈ సిద్ధాంతములను ఎచ్చటను బోధింపరాదని బిషప్‌లు, మతాధికారులు విక్లిఫ్ను ఆదేశించిరి. అయితే అతడు మునుపటికంటె బలముగాను, ధైర్యముగాను లేఖనముల లోని సత్యములను ప్రకటించుటకు నిశ్చయించుకొనెను. అనేకమంది పెద్దలు, ఇతర ప్రభువుల సహకారముతో సామాన్యప్రజల మధ్య తన సిద్ధాంతములను బోధించెను.
మూడవ రిచర్డ్ పరిపాలన మొదటి సంవత్సరములో పోప్ ప్రతిస్పందించి విక్లిఫ్ సిద్ధాంతము వ్యాపించుటకు, వేళ్లూనుటకు అవకాశము కలిగించిన ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయమును నిందించుచు సూటిగ శ్వేతపత్రమును విడుదలచేసెను. విశ్వవిద్యా లయ ప్రతినిధులు, అధికారులు ఆ శ్వేతపత్రమును తీసికొని దానిని గౌరవింపవలెనా? లేక లజ్జాకరమైనదిగా భావించి దానిని తిరస్కరించవలెనా? అని వారిలో వారు ఆలోచన చేసిరి. పోప్ విడుదల చేసిన శ్వేతపత్రములోని అంశములు :
“లండన్ బిషప్ అధికారములోగల లుటెర్ వర్త్ (Lutterworth) సంఘాధ్యక్షుడు, వేదాంతాచార్యుడైన జాన్ విక్లిఫ్ విషయములు నమ్మకస్తు లైన అనేకమంది మనుష్యులద్వారా మాకు తెలిసినవి. ఏమనగా అతడు ద్వేషించదగిన మూర్ఖస్థితికి చేరినాడని, తప్పుడు సిద్ధాంతములను భయము లేకుండ బహిరంగముగ బోధించుచు, సంమౌన్నత్యమును కూలద్రోయు విధముగ అతడు చెడు స్వభావముతో తప్పుడు బోధలను, సిద్ధాంతములను ప్రకటించుచు సంఘమును, లౌకిక ప్రభుత్వమునుకూడ బలహీనపరచు చున్నాడు.
అధికారములోను, ఐశ్వర్యములోను గొప్ప కీర్తి గడించిన ఇంగ్లాండు రాజ్యములో అతడు తన తప్పుడు అభిప్రాయములను వ్యాపింపజేయు చున్నాడు. ఇంగ్లాండు తన విశ్వాసముయొక్క పవిత్రతను ప్రకాశింప జేయుచు, లేఖనములలో నిర్దిష్టమైన గొప్ప జ్ఞానముగల, కీర్తి గడించిన మనుష్యులను అందించుటకు అలవాటుపడెను. వారు తమ విధానములలో పరిపక్వత పొందిరి.
వారు భక్తిలో శ్రేష్ఠులు, కేథలిక్ విశ్వాసమును ధైర్యముగా కాపాడగలిగినవారు. అయితే విక్లిఫ్ తన సిద్ధాంతములద్వారా క్రీస్తు మందలో కొందరిని అపవిత్రపరచుచు కపట విశ్వాసముతో సరళ మార్గమునుండి తప్పుదారిన నరకమను గోతిలోనికి వారిని నడిపించు. చున్నాడు.
అందువలన మీ అధికారమును ఉపయోగించి మీరు జాన్ విక్లిఫ్ను బంధించి లేక బంధింపబడునట్లు చేయవలసినదిగ మిమ్ములను గట్టిగా ఆదేశించుచున్నాము. నమ్మకమైన గట్టి బందోబస్తుతో కేంటర్ ్బరి ఆర్చి బిషప్, లండను బిషప్లయొద్దకు లేక ఏ ఒక్కరియొద్దకైనను అతనిని పంపించుడి.”
పోప్ వద్దనుండి వచ్చిన మరి రెండు ఉత్తరములు జాన్ విక్లిఫ్మీద అతనికున్న “కోపమును వ్యక్తము చేసెను. మూడు నెలలలోపు బిషప్ లు ఆ సమస్యను పరిష్కారము చేయలేకపోయినట్లయితే, విక్లిఫ్ను తనయెదుట హాజరుపరచవలెనని పోప్ వ్రాసిన ఉత్తరములలో ఒకటి సూచించెను. అలాగే విక్లిఫ్ సిద్దాంతములకు ఏవిధమైన పరపతి కలిగింపవద్దని ఇంగ్లాండు బిషప్‌లకు వ్రాసిన రెండవ ఉత్తరములో హెచ్చరించెను. విక్లిఫ్కు వ్యతిరేకముగ బిషప్లందరు ఏకమగుటకు ఆ ఉత్తరములు దోహదపడినవి. వారి యెదుటికి విక్లిఫ్ను రప్పించుటకు వారందరు తీర్మానించిరి.
విక్లిఫ్ కేసు పరిశీలనకు వచ్చిన రోజున రాజైన రెండవ రిచర్డ్ కొలువునుండి లూయిస్ క్లిఫర్డ్ (Lewis Clifford) అనునతడు బిషప్‌లు ఉన్నచోటికి వచ్చి, జాన్ విక్లిఫ్కు వ్యతిరేకముగా ఏవిధమైన శిక్ష విధింపరాదని వారికి ఆజ్ఞాపించెను. వారిలో అనేకమంది నిశ్చేష్టులగునంతగ అతని మాటలు బిషప్‌లకు దిగ్రమ కలిగించెను. ఆశ్చర్యకరమైన దేవుని కృపాకార్యములద్వారా పోప్ ఆగ్రహమునుండి జాన్ విక్లిఫ్ రెండవసారి తప్పించుకొనెను.
ప్రకటించుటకు, బోధించుటకు ఎక్కువ సమయము లభించినందున విక్లిఫ్ పరవశించెను. అతడెంత ఎక్కువ బోధిస్తే బిషప్‌లు, మతాధికారులు అంత ఎక్కువగా కోపించిరి. క్రీ.శ. 1378, మార్చి నెలలో విక్లిఫ్కు ఎక్కువ శ్రమలు కలుగజేసిన నాయకుడైన పోప్ పదకొండవ గ్రెగరి ఆకస్మికముగా చనిపోయెను. ఆ తరువాత కాన్స్టన్స్ సభ క్రీ.శ. 1417 లో ఐదవ మార్టిన్ (Martin V) ను పోప్ ఎన్నుకొనెను.
అదే సమయములో ఇంగ్లాండు ప్రజలు సామాన్యులు, ప్రభువర్గము అను రెండు వర్గములైరి. ఆ కాలములో కేంటర్బరి ఆర్చిబిషప్ సైమన్ సబ్బురిని కోపోద్రేకులైన కొందరు తీసికొనిపోయి శిరచ్ఛేదము చేసిరి. అతని తరువాత వచ్చిన కేథలిక్ నాయకుడైన విలియమ్ కోర్టెనే (William Courtney) కూడ మతద్రోహులను నిర్మూలించుటలో తక్కువవాడేమి కాదు.
విక్లిఫ్, అతని అనుచరులు ఇంగ్లాండులో గొప్ప శక్తి, ప్రభావము కలవారగు చున్నందున, అప్పటి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయముయొక్క అధ్యక్షుడైన విలియమ్ బెర్టన్ (William Berton) ఎనిమిదిమంది మత సన్యాసులను, నలుగురు ఇతరులను సమావేశపరచి, విక్లిఫోను అతని అనుచరులతోను సహవాసము చేయువారెవరికైనను తీవ్రమైన శిక్షలు విధింపబడునని శాసనమును జారీచేసెను. విక్లిఫ్ను, అతని అనుచరు లను సంఘమునుండి వెలివేసి ఖైదుచేయుదునని బెదిరించి, ‘మీ చెడ్డపనులు, తప్పుడు బోధల’ను విస్మరించి, పశ్చాత్తాపపడవలసినదిగా మూడు దినముల వ్యవధినిచ్చెను.
పర్యవసానముగ విక్లిఫ్ పోప్ ను, మతనాయకులను కాదని సరాసరి రాజునకు విన్నవించుకొనవలెనని తలంచెను. అయితే రాజైన లంకాస్టర్ ప్రభువు అతనిని వారించి, న్యాయస్థానమునకు, బిషప్ తీర్పునకు లోబడవలెనని హెచ్చరించెను. అందువలన విక్లిఫ్ మరియొకసారి సమస్యలతో చుట్టబడి రోమా మతాధికారుల ముందు నిలువవలసి వచ్చెను.
క్రీ.శ. 1382 పరి. డన్స్ట్రన్ దినమున (St. Dunstan’s Day) మధ్యాహ్నము రెండు గంటలకు కేంటర్ ్బరి ఆర్చిబిషప్, అతని సహాయకులు, కొందరు వేదాంత పండితులు, న్యాయాధిపతులు, ఆచార్యులు, ఇంక ఇతర మతనాయకులందరు విక్లిఫ్ గ్రంథములను, ఉపన్యాసములను తప్పుపట్టుటకు ఇంగ్లాండులోని బ్లేక్ ఫ్రయర్స్ (Blackfriars) పట్టణములో సమావేశమైరి. అదే సమయములో ఘోర భూకంపము సంభవించి ఇంగ్లాండునంతటిని నాశనము చేసెను. విక్లిష్ను విచారణ చేయుటకు వచ్చిన వారిలో అనేకులు దానిని అపశకునమనిరి. కొందరైతే వారు వచ్చిన కార్యమును వదలివేయుట మంచిదని సలహానిచ్చిరి. మరియొక సభ్యుడు.

అయితే, ఆర్చిబిషప్ అందుకు నిరాకరించి, వచ్చిన కార్యమును కొనసాగించు టలో కృతార్థుడై, విక్లిఫ్ రచనలలో కొన్నింటిని వారికి చదివి వినిపించెను. విక్లిఫ్ సిద్ధాంతములు సుస్పష్టముగ మతద్రోహమని, సంఘముయొక్క సిద్ధాంతములకు, ఉపదేశములకు విరుద్ధమని, అతడు బోధించినవి తప్పుడు ఉపదేశములు మాత్రమేగాక వాటియందు దేవదూషణ కలదని ప్రకటించెను. ఇట్లు విక్లిఫ్, అతని ఉపదేశములమీద వాగ్వివాదము కొన్ని గంటలు కొనసాగెను.
బ్లేక్ఇయర్స్ సమావేశ ఫలితముగ జాన్ విక్లిఫ్, అతనిని బలపరచువారికి వ్యతిరేకముగ కేంటర్్బరి ఆర్చిబిషప్ లండన్ బిషప్నకు ఒక ఉత్తరువును పంపెను. ఆ ఉత్తరువు ప్రకారము :
“సంఘ చట్టముననుసరించి, బిషప్ అనుమతి లేకుండ, నిషేధింపబడిన ఏ మనుష్యుడైనను బహిరంగముగాకాని లేక రహస్యముగాకాని సువార్తను ప్రకటించరాదు. అయితే కొందరు వ్యక్తులు సంఘచట్టములను ధిక్కరించి నరకపుత్రులుగా ఉండి మహా పవిత్రత అను ముసుగులో తమకు తాముగా బోధించు అధికారమును పొంది సంఘములో దుష్ట సిద్ధాంతములను బోధించుచున్నారు.
ప్రజలందరిలో బహిరంగముగా ప్రకటించుటకు, దేవాలయములలోను, వీధులలోను, అనేక ఇతర స్థలములలోను బోధించు టకు వారు భయపడుటలేదు. దేవుని సంఘముచేత వ్యతిరేకించబడిన కొన్ని తప్పుడు సిద్ధాంతములను అనుసరించుచు, పరిశుద్ధ సంఘముయొక్క నిర్ణయములకు విరోధముగా అనేకమంది మంచి క్రైస్తవులను పాడుచేయు చున్నారు. ఏ విశ్వాసములేకుండ రక్షణ లేదో అట్టి కేథలిక్ విశ్వాసముపై దుఃఖపూరితమైన చెడువిమర్శలు చేయుచున్నారను విషయము మా వినికిడికి వచ్చియున్నది.
కనుక ఇప్పటినుండి ఏ మనుష్యుడైనను పైన చెప్పబడిన మత ద్రోహు లను ఆదరించుట, రక్షించుట, బలపరచుట, వారి బోధలవైపు దృష్టి మరల్చుట చేయకూడదు. వారిని బహిరంగముగాగాని, రహస్యముగాగాని సమర్థించకూడదు. వారిని వెంటనే విషమును క్రక్కు పామును వదిలించు కున్నట్లు, అధిక శాపము రాకముందే వారిని విసర్జించవలెను.”
అదే సమయములో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయమునకు క్రొత్త అధ్యక్షునిగా వచ్చిన మాస్టర్ రాబర్ట్ రిగ్గే (Master Robert Rygge) జాన్ విక్లిఫ్ను, అతడు బోధించుచున్న సువార్తను స్పష్టముగ అభిమానించిన వ్యక్తి. ఇతడు విక్లిఫ్కు వ్యతిరేకముగా చేయు ఉద్యమములను ఆపి, సువార్త వ్యాపించుటకు దోహదము చేసెను.
ప్రజలకు ప్రసంగ ములు చేయవలసి వచ్చినప్పుడు, విక్లిఫ్ను, అతని అనుచరులను బోధకులుగా పంపించెను. రాబర్ట్ రిగేవలే విక్లిఫ్ను అభిమానించి, ధైర్యముచెప్పిన మరి ఇద్దరు జాన్ హస్ట్మాన్ (John Huntman) వాల్టర్ డిష్ (Walter Dish) లు.
తరువాత అదే సంవత్సరము (1382) ఆరోహణ పండుగ (Feast of the Ascension), కార్పస్ క్రిస్టి (Feast of Corpus Christi) పండుగలలో ప్రజల నుద్దేశించి ప్రసంగించుటకు ఫిలిప్ రెప్పింగ్టన్ (Philip Reppyngdon), నికోలస్ హెర్ఫోర్డు (Nicholas Hereford) లు నియమింపబడిరి. అయితే వారు పరి. ఫ్రైడ్వైడ్ (St. Frideswide) దేవాలయములో ప్రజలముందు విక్లిఫ్కు అనుకూలముగ ప్రసంగించిరి.
విక్లిఫ్ నమ్మకస్తుడు, మంచివాడు, అమాయకుడని హెర్ఫోర్డు చెప్పెను. అతడు ఆ విధముగ మాట్లాడినందున అక్కడ హాజరైన మతాధిపతులు దిగ్రమచెంది, లేచి తీవ్రమైన మాటలతో అతనిని దూషించిరి. కార్మెలైట్ (Carmelite) సంఘాధ్యక్షుడైన పీటర్ స్టోక్స్ (Peter Stokes) హెర్ఫోర్డును హేళనచేసెను. ఆ తరువాత ఇతడు విక్లిఫ్ బహిరంగ బోధలను అవమానపరచుటకు నియమింపబడెను.
‘కార్పస్ క్రిస్టి’ పండుగ సమీపించుచున్నందున, హెర్ఫోర్డ్ అందించిన వర్తమానము వంటిదే రెప్పింగ్టన్ క్కూడ అందించునేమో అని మతాధిపతులు భయపడి, రెప్పింగ్టన్ ప్రసంగమును రద్దుచేయించమని కేంటర్ ఆర్చిబిషప్‌కు మనవిచేసిరి. కేంటర్ ్బరి ఆర్చిబిషప్ ఆక్స్ఫర్డ్ అధ్యక్షునికి రెప్పింగ్టన్ను ‘కార్పస్ క్రిస్టి’ పండుగకు బోధకునిగా చేసిన నియామకమును పునఃపరిశీలన చేయుమని లేఖ వ్రాసెను.
ఆ లేఖకు అధ్యక్షుడు మండిపడి, విశ్వవిద్యాలయ అధికారమును కించపరచు చున్నందుకు, ప్రశాంత వాతావరణమును భగ్నము చేయుచున్నందుకు ఆర్చిబిషప్ ను, పీటర్ స్ట్రోక్స్‌ను గద్దించెను. విశ్వవిద్యాలయముపై మీకు ఏ అధికారము లేదనియు, ఈ విషయములలో విశ్వవిద్యాలయము తన సొంత నిర్ణయములను చేయగలదని ప్రకటించి, మీకు ఏవిధమైన సహాయము చేయనని బాహాటముగ తెలియజేసెను.
పండుగదినమున రెప్పింగ్టన్ తన సందేశమిచ్చుచూ ‘నైతిక విషయములన్నిటిలో జాన్ విక్లిఫ్ నిజమైన కేథలిక్ వేదాంతి, పండితుడు కనుక నేనతనిని సమర్థించెదన’ని విక్లిఫ్ యొక్క పనిని, సేవను శ్లాఘించుచు తన ప్రసంగమును ముగించెను.
ప్రసంగము ముగిసిన వెంటనే రెప్పింగ్టన్ అనేకమంది స్నేహితులతో పరి. ఫ్రైడ్స్వైడ్ దేవాలయములోనికి వెళ్లెను. రెప్పింగ్డన్మీద ఏదైన ముట్టడి జరిగినచో ఎదుర్కొనుటకు తమ బట్టలలో ఆయుధములను దాచియుంచినారని అతని శత్రువులు అపోహపడిరి.
విక్లిఫ్ శత్రువైన పీటర్ స్టోక్స్ వారు తనను చంపుదురేమోనని భయపడి, దేవాలయము లోని దైవపీఠముండు స్థలములో దాగెను. రెప్పింగ్టన్, అతని పక్షమువారు వెళ్లిపోవువరకు అతడు బయటకి వచ్చుటకు సాహసింపలేదు. అధ్యక్షుని సాహసమునకు విశ్వవిద్యాలయ మంతయు ఆనందముతో నిండెను. రెప్పింగ్టన్ యొక్క చక్కని ప్రసంగము వారిని ప్రోత్సహించెను.
దేశ బహిష్కరణ అనంతరము జాన్ విక్లిఫ్ తాను ప్యారిష్ పాస్టరుగా నియమింప బడిన లుటెర్వర్త్ (Lutterworth) కు తిరిగివచ్చి, 56 సంవత్సరముల వయస్సులో అనగా క్రీ.శ. 1384 డిసెంబరు 31న నిద్రలో మరణించెను. ‘అతడు యువకునిగా ఉన్నప్పుడు ఏ విషయము అతనిని సంతోషపరచెనో, వయస్సు మళ్లిన తరువాతకూడ అదే విషయము అతనిని సంతోషపరచెన’ని అతనిగురించి చెప్పబడెను.
విక్లిఫ్ ముఖ్యశత్రువులందరు సంఘనాయకులే, అయితే అతడు సామాన్య ప్రజల, కొంతమంది సంస్థానాధిపతుల సహకారమును పొందెను. వారిలో జాన్ క్లెన్బన్ (John Clenbon), లెవిస్ క్లిఫ్ఫర్డ్ (Lewis Clifford), రిచర్డ్ స్టురి (Richard Stury), థామస్ లాటిమర్ (Thomas Latimer), విలియమ్ నెవిల్ (William Nevil) మరియు జాన్ మాంటేగ్ (John Montague) వంటి ప్రముఖులు ఉండిరి. అతని సిద్ధాంతములు, బోధల గౌరవార్ధము విక్లిఫ్ మరణానంతరము వారు తమ దేవాలయములనుండి విగ్రహములను, ప్రతిమలను తొలగించిరి.
విక్లిఫ్ మరణానంతరము అనేక సంవత్సరములవరకు అతనిమీద, అతని బోధలమీద వ్యతిరేకత కొనసాగెను. క్రీ.శ. 1415 మే 4న కాన్స్టన్స్ సభ సమావేశమై ఒక తీర్మానమును జారీచేసెను :

విక్లిఫ్ మరణించిన ముప్పది ఒక్క సంవత్సరముల అనంతరము కాన్ స్టాన్స్ సభ అతని సమాధి స్థలమునుండి అతని అవశేషములను తీసి వాటిని కాల్చి, భస్మమును రైన్ నదిలో విసరెను. ఆ విధముగ చేయుటద్వారా అతని ప్రభావమును రూపు మాపగలిగినామని అతని హంతకులు తలంచిరి. కాని ఆ విధముగ జరుగలేదు.
పరిసయ్యులు క్రీస్తును చంపి, ఆయన శరీరమును చీకటి సమాధిలో పెట్టి, ఆయన ఎన్నటికి తిరిగి రాకుండ వెళ్లినాడని తలంచినట్లే జాన్ విక్లిఫ్ను వ్యతిరేకించిన సభ కూడ – మతద్రోహిని పూర్తిగ నాశనముచేసి, అతని భస్మమును నదిలో నిమజ్జనము చేయుటద్వారా అతని అనుచరులలో అతని జ్ఞాపకము నశించిపోయినదని తలంచి నది. పరిసయ్యులు ఆశ్చర్యపడినరీతిగ యేసుక్రీస్తును, ఆయన సత్యమును ఏదియు అడ్డుకొనలేకపోయెను.
అలాగే విక్లిఫ్ శరీరమును దహనముచేసి, చితాభస్మమును నదిలో నిమజ్జనము చేసినను, విక్లిఫ్ సిద్ధాంతములలోని సత్యమును వారు నాశనము చేయలేకపోయిరి. అతడు ప్రారంభించిన పనిని అతని అనుచరులు కొనసాగించుచున్నారు.