యాజకత్వపు నూతన క్రమము (అధ్యాయము 7)
అయిదవ అధ్యాయము 11 వచనమునుండి ఆరవ అధ్యాయము చివరివరకు ఉన్న వాక్యములలో హెచ్చరిక, ప్రోత్సాహపు మాటలు చెప్పిన తరువాత అపొస్తలుడు – ఇప్పుడు అయిదవ అధ్యాయములోని గొప్ప అంశమును తిరిగి ప్రారంభించుచున్నాడు.
పునరుత్థానుడైన తరువాత క్రీస్తు మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడని సంబోధించుచు ప్రస్తావించి ఆ అధ్యాయములో యాజకత్వమునకున్న హుందాతనమును చాటెను.
ఏడవ అధ్యాయములో అహరోను యాజకత్వముకంటే క్రీస్తు యాజకత్వము శ్రేష్ఠమని చూపుచు ఆ యాజకత్వపు ఔన్నత్యమును మనయెదుట పెట్టుచున్నాడు.
యాజకత్వ క్రమమునకు, యాజక ధర్మమును నిర్వర్తించుటకు ఉన్న వ్యత్యాసమును గుర్తించుట ముఖ్యము. క్రమము విషయములో ఆలోచిం చినయెడల మెల్కీసెదెకు యేసుక్రీస్తు యాజకత్వమునకు చక్కగా సరి పోయిన ముంగుర్తు.
Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక
యాజకత్వము నిర్వహించు విషయము ఆలోచించిన యెడల అహరోను చక్కగా సరిపోల్చుచున్నాడు. అహరోను క్రీస్తు జరిగించిన పనులకు ముంగుర్తుగానున్నాడు.
అహరోను యాజకత్వము బలులు, విజ్ఞాపన, దేవాలయపు సముదాయమును ప్రవేశపెట్టినది. మెల్కీసెదెకు యాజకత్వములో వీటి ప్రస్తావన లేదు. ఆ విధముగా ఏ ఒక్క వ్యక్తియు యేసుక్రీస్తు మహిమలకు పూర్ణమైన ముంగుర్తు కాదని వెల్లడియగుచున్నది.
(వచనములు 1, 2). ఈ వచనములలో రచయిత అబ్రాహాము జీవితములోని ఒక విశేషమైన సంఘటనను సూచించుచున్నాడు. పితరుడైన అబ్రాహాము తనను మించినవాడగు మెల్కీసెదెకును కొద్ది సమయము ఎదురుగా వచ్చి కలిసెను. అదీ ఆ సంఘటన.
ఈయన మన ప్రధాన యాజకుడగు దేవుని కుమారునికి ముంగుర్తుగా నుండునట్లు కొన్ని విషయములలో ఈ సంఘటన వెయ్యేండ్ల పాలనకు సాదృశ్యముగా నున్నది. దేవుని ప్రజలను బందీలుగా పట్టుకొనియున్న రాజులను సంహా రముచేసి తిరిగి వచ్చుచుండగా అబ్రాహామును మెల్కీసెదెకు ఎదుర్కొనెను.

ఆయన పేరు, ఆయన దేశము చూడగా నీతి రాజనియు, సమాధానపు రాజనియు అర్థమిచ్చుచున్నది. దేవుడు రాజులను సంహరించి, తన ప్రజలను వారి శత్రువులనుండి, వ్యతిరేక శక్తులనుండి విడిపించుననుటకు సాదృశ్యముగా ఆయన పేరు “మహోన్నతుడగు దేవుని యాజకుడ”ని కూడా చెప్పబడినది.
స్థాయినిబట్టి చూడగా మెల్కీసెదెకు రాజు. ఆయన పాలన నీతి, సమాధానములతో కూడుకొనినది. ఆయన యాజకధర్మము జరిగించుటలో అబ్రాహాముకు దేవునికి మధ్యన నిలిచియున్నాడు.
మానవుని యెదుట దేవుని ప్రతినిధిగా దేవుని పక్షముగా అబ్రాహామును ఆశీర్వదించెను. దేవునియెదుట మానవుని ప్రతినిధిగా అబ్రాహాము పక్షముగా మహోన్నతు డగు దేవుని స్తుతించెను.
ఆయన దేవునినుండి మనిషికి ఆశీర్వాదములను తీసుకొని వచ్చి, మనిషినుండి దేవునికి స్తుతులను కొనిపోవును. రాబోవు వెయ్యేండ్ల పాలన కాలములో మనుష్యులు దేవునిని ‘మహోన్నతుడైన దేవునిగా’ తెలిసికొందురు.
భూసంబంధులైన తన ప్రజలను విడిపించి ప్రతి దుష్ట శక్తికి తీర్పు తీర్చును. అప్పుడు నిశ్చ యముగా ప్రభువు రాజుగా, యాజకుడుగా ప్రకాశించును. ఈ ప్రత్యక్ష ప్రవచనము ఆయననుగూర్చియే చెప్పుచున్నది.

ఆయనే నిజమైన నీతి రాజు, సమాధానపు రాజు, సర్వోన్నతుడగు దేవుని యాజకుడు.
(వచనము 3). మెల్కీసెదెకు వంశము, జన్మ, లేదా మరణమును గూర్చిన వివరములేవియు ఇవ్వబడలేదు. ఉద్దేశ్యపూర్వకముగానే ఆయన చుట్టూ మర్మము అలముకొనియున్నట్లు గ్రహించగలము.
ఆయన విషయము వ్రాయబడినదేమనగా “తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆదియైనను, జీవమునకు అంతమైనను లేనివాడు”.
ఆయన ఎక్కడినుండి వచ్చెనో ఏమీ తెలియకయే రంగమందు కనిపించెను. ఎక్కడికి వెళ్ళెనో తెలియకయే ఆయన వృత్తాం తము ముగిసెను. ఆయననుగూర్చి ఒక విషయము వ్రాయబడినది.
అహరోనుకు పూర్తి భిన్నముగా “ఆయన నిరంతర యాజకుడు”. ఇన్ని విధములుగా ఆయన దేవుని కుమారునివంటివాడుగా చేయ బడెను.
అందువలన నిరంతరము యాజకుడుగానున్న దేవుని కుమారుని యాజకత్వపు హుందాతనమును చక్కగా చూపెట్టుచున్నాడు.
(వచనములు 4-7). ఈ వృత్తాంతములో మెల్కీసెదెకు యాజకత్వము అహరోను యాజకత్వముకంటే శ్రేష్టమైనదని ఇతర సంఘటనలును వివరించుచున్నవి.
వాటిని మనము ఆలోచించవలెను. మొదటిది, ఈ రాజ యాజకుడు ఎంత గొప్పవాడనగా, పితరుడగు అబ్రాహాము కొల్ల సొమ్ములో ఇతనికి పదియవ భాగమిచ్చెను.
యాజక ధర్మము జరిగించు నప్పుడు “ప్రజలనుండి పదియవ వంతు పుచ్చుకొను” లేవీ కుమారులు కూడా అబ్రాహాము వంశమువారే. వారు పదియవ భాగము తీసుకొనినను తమ పితరుడగు అబ్రాహామునందు వారుకూడా మెల్కీసెదెకుకు పదియవ భాగము ఇచ్చిరి.
మెల్కీసెదెకు అబ్రాహామునుండి పదియవ భాగము పుచ్చుకొనుట మాత్రమేకాదు, వాగ్దానమునకు వారసుడగువానిని ఆశీర్వదించెను.
“అతడు ఆశీర్వదించబడెను, అతని సంతానము భూలోకమందలి సకల జాతులకు ఆశీర్వాద కారణముగానుండున”ని ఎవరిని గూర్చి చెప్పబడెనో ఆ అబ్రాహామును ఇతడు ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువవానిచేత ఆశీర్వదించబడునను మాట నిరాక్షేపమైనది.
(వచనములు 8-10). అహరోను, అతని సంతానము విషయమాలో చించగా వారు చావునకు లోనైనవారు, అయినను పదియవ వంతు పుచ్చుకొందురు. మెల్కీసెదెకు విషయములో ఆయన మరణమును గూర్చిన ప్రస్తావనే లేదు.
ఆ క్రమమును పరిశీలించగా ఆయన జీవించుచున్నాడను సాక్ష్యమున్నది. ఆ విధముగా అహరోను క్రమములోని యాజకులు పదియవవంతులు స్వీకరించి, ఆశీర్వదించుటకు బదులు తమ పితరుడగు అబ్రాహామునందు పదియవ వంతులు ఇచ్చి ఆశీర్వాదములు పొందిరి.
చావునకు లోనైన వారుగా వీరు, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవానికి పదియవ వంతులు చెల్లించిరి. దీనినిబట్టి అహరోను యాజకత్వముకంటే మెల్కీ సెదెకు యాజకత్వము ఎంతో శ్రేష్టమైనదని విశదమగుచున్నది.
(వచనము 11). అహరోను యాజకత్వముకంటే మెల్కీసెదెకు యాజ కత్వము శ్రేష్టమైనదనుట అహరోను యాజకత్వము పరిపూర్ణమైనది కాదనుటకు స్పష్టమైన ఋజువుగా నున్నది.
అహరోను యాజకత్వ లక్షణ ములు తాత్కాలికమైనవి. పని విషయములో చూడగా అసంపూర్ణమైనది. ఈ పత్రికలో తరువాత మనము నేర్చుకొనునదేమనగా ఆ యాజకత్వము మనస్సాక్షికి శాశ్వతమైన నివారణ కలుగజేయలేదు.
ఆరాధకుడు దేవుని సమీపించుటకు వీలు కలుగజేయలేదని అర్థమగుచున్నది. ఈ అసంపూర్ణ తయే మెల్కీసెదెకు క్రమము తరువాత మరియొక యాజకుడు రావలసిన అగత్యమును ఋజువుపరచుచున్నది.
అట్టి యాజకుని ఒకే ఒక సంపూర్ణు డైన యేసుక్రీస్తులో మనము కనుగొనుచున్నాము.
(వచనములు 12-14). యాజకత్వ క్రమములో మార్పు రావలెనంటే ధర్మశాస్త్రములోకూడా మార్పు అవసరమైనది. క్రీస్తు యూదా గోత్రమునకు చెందినవాడు. మోషే ధర్మశాస్త్రములో ఆ గోత్రమునుండి ఎవరునూ యాజకత్వమునకు పిలువబడలేదు.
(వచనములు 15-17). మన ప్రభువు యూదా గోత్రములో పుట్టినను యాజకుడుగా ఉండుటకు పిలువబడినట్లు తేటగా నున్నది.
క్రీస్తు మెల్కీసెదెకు యాజకత్వముతో పోల్చబడినను, ఆయన యాజకత్వము లోకసంబంధమైన ఆజ్ఞలవలన కలిగినది కాదు.
ఆ విధముగా శరీర సంబంధముగా వచ్చియున్నయెడల ఆ యాజకులు చావునకు లోనగుదురు. కనుక మరణానంతరము మరియొక యాజకుడు వచ్చు ఏర్పాటు కలదు.
ఇందుకు భిన్నముగా క్రీస్తు యాజకత్వము ప్రత్యేకముగా నున్నది. ఎందుకనగా అది అనంత జీవముయొక్క శక్తి ననుసరించినది.
ప్రభువు యాజకత్వము ఒక జీవిత కాలమునకు పరిమితమైనది కాదు. ఆయన యాజకుడని పిలువబడినందున నిరంతరము యాజకుడైయున్నాడు.
(వచనములు 18, 19). యాజకత్వమును గూర్చి మోషే ఇచ్చిన ఆజ్ఞ బలహీనము, నిరుపయోగమునైనందున ప్రక్కన పెట్టబడినది.
అది ఎందువలన బలహీనమైనదనగా యాజకుడు చావుకు లోనైనవాడు గనుక దానిని కొనసాగించలేడు. బలి అర్పించు వ్యక్తిని దేవునియెదుట తీర్పు భయములేక నిర్మలమైన మనస్సాక్షి కలిగినవానిగా అది ఉంచలేకపోయెను గనుక అది నిరుపయోగమైనది.
ధర్మశాస్త్రములో సంపూర్ణము చేయగలవి ఏవియు లేవుగాని, అది శ్రేష్టమైనవాటిని సూచించునది మాత్రమే. క్రీస్తు యాజకత్వముద్వారా శ్రేష్టమగు నిరీక్షణ తెచ్చినట్లయినది.

(వచనములు 20-22). అహరోను యాజకత్వముకంటే క్రీస్తు యాజకత్వము శ్రేష్టమైనదన్న వివరణ కొనసాగుచున్నది. అహరోను యాజకత్వమునకు భిన్నముగా క్రీస్తు యాజకత్వపు పిలుపు ప్రమాణముచేత స్థిరపరచబడినది.
దీనిని ఋజువు చేయుటకు అపొస్తలుడు కీర్తన 90:4 ను ఉదహరించెను. ప్రమాణముద్వారా లేవీ యాజకత్వమువలె క్రీస్తు యాజకత్వము రద్దుపరచుట గాని, ప్రక్కనబెట్టుట గాని జరుగదు.
యేసు క్రీస్తు జరిగించిన పనిమీద ఆధారపడిన క్రొత్త నిబంధన ఆశీర్వాదములను ఈ ప్రమాణము మరింత ధృవపరచుచున్నది.
(వచనములు 23, 24). ధర్మశాస్త్రముక్రింద యాజకులను నియ మించుట తరచుగా జరిగెడిది. అయితే మరణము మూలముగా వారు దానిని శాశ్వతముగా కొనసాగించ వీలులేకపోయెను.
యాజకుడు కొంత మేరకు తాను ఎవరి పక్షముగా యాజకత్వము జరిగించుచున్నాడో వారితో సహానుభూతి పొంది, వారిని ఆదుకొనగలడు. అయితే మరణము దానికి విఘాతము కలిగించును.
మరియొక యాజకుడు అతని స్థానములో వచ్చును. మొదటి యాజకునికి సమీపముగా వెళ్ళిన ఆరాధకులకు ఈ యాజకుడు క్రొత్తవాడగును. అందువలన వారి శ్రమలలో సహానుభూతి పొందలేడు.
క్రీస్తు విషయములోనైతే ఎంత వ్యత్యాసము! ఆయన మరణ మును జయించినందున మార్పులేని యాజకత్వమును కొనసాగించు చున్నాడు. “నీవు నిరంతరము నిలిచియుందువు. నీవు ఏకరీతిగానే యున్నావు” (1:11,12).
(వచనము 25). క్రీస్తు యాజకత్వపు శ్రేష్టత్వమును చూపెట్టిన తరువాత, ఆ యాజకత్వముద్వారా సంక్రమించు ఆశీర్వాదములను అపొస్తలుడు మదింపు చేయుచున్నాడు.
నిరంతరము జీవించువాడును, మార్పులేనివాడును, మనలను సంపూర్ణముగా రక్షించుటకు శక్తిగల ప్రధాన యాజకుడు మనకున్నాడు. గనుక ఈ అరణ్యయాత్రలో ఉండగానే ఆయనద్వారా మనము తండ్రిని సమీపించవచ్చును.
ఆయన మనలను ప్రతి శత్రువు నుండి రక్షించును. మనలను దేవునియొద్దకు నడిపించును. మరియు మన బలహీనతలన్నిటిలో మన పక్షముగా విజ్ఞాపన చేయును.
(వచనములు 26, 27). “ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరి పోయినవాడు” అని అపొస్తలుడు పత్రికలోని ఈ భాగమును ముగించెను.
రెండవ అధ్యాయము 10వ వచనములో ఆ ప్రధాన యాజకుడు ‘దేవుడు’ అని నేర్చుకుంటిమి. ఇక్కడ “మనకు సరిపోయినవాడు” అనగా మనవంటి వాడాయెనని భావము.
దేవుడు పరిశుద్ధుడు గనుక క్రీస్తు తప్ప ప్రధాన యాజకుడుగా ఉండగలవారెవరు? మనము బలహీనులమైయుండగా క్రీస్తుమాత్రమే మనకు అందుబాటులోనికి రాగలిగెను.
ఆయన సహజ పరిశుద్ధతనుబట్టి, అనగా ఆయన తలంపులలోని స్వచ్ఛతచేతను – సాధు గుణముగలవాడై ఒక్క చెడు తలంపైనను లేకుండుటవలనను ఆయన మనకు సరిపోయినవాడాయెను.
ఈ లోకములో ఉండగా ఆయన నిష్కల్మ షుడుగా ఉండెను. లోకముయొక్క భ్రష్టత్వము ఆయన దరిచేరలేదు.
ఆయన సిలువపై తనను తాను అర్పించుకొనినప్పుడు, పాపములకొరకైన పని ముగించినప్పుడు ఆయన అత్యున్నతముగా హెచ్చింపబడెను.
(వచనము 28). ఆ విధముగా ప్రమాణపూర్వక వాక్యముద్వారా ఆయన శాశ్వతకాలము యాజకునిగా ప్రతిష్టింపబడెను. ధర్మశాస్త్రము క్రింద నియమింపబడిన యాజకులు అందుకు భిన్నముగా బలహీనతలతో నిండిన వ్యక్తులుగా ఉండిరి.
ఈ అధ్యాయమంతటి సారాంశమేమనగా, మనయెదుట మెల్కీసెదెకు ముంగుర్తుగా క్రీస్తు యాజకత్వపు గొప్పతనము ఉంచబడినది. (1-3 వచనములు).
లేవీయుల యాజకత్వముకంటే మెల్కీసెదెకు యాజకత్వము శ్రేష్టమైన దని వెల్లడించుటనుబట్టి క్రీస్తు యాజకత్వముయొక్క ఔన్నత్యము విశద మగుచున్నది.(4-10 వచనములు).
లేవీయ యాజకత్వమందలి అసంపూర్ణతలు, యాజకత్వపు మార్పుకు దోహదము చేసినవి. (11వ వచనము).
యాజకత్వపు మార్పువలన భూసంబంధమైన యాజకత్వము విషయ ములో ధర్మశాస్త్రమునుకూడా మార్చవలసివచ్చెను. (12-19 వచనాలు).
క్రీస్తు యాజకత్వము ప్రమాణ వాక్యముతో స్థిరపరచబడెను. (20-22 వచనములు).
క్రీస్తు యాజకత్వము నిరంతరముండునది మరియు మార్పులేనిది. (23, 24 వచనములు). యాజక పరిచర్యకు క్రీస్తు సంపూర్ణముగా తగినవాడు. (25వ వచనము).
యాజక ధర్మము నెరపుటకు క్రీస్తుకుగల వ్యక్తిగత యోగ్యతను గమనించండి. (26-28 వచనములు).