హెబ్రీ విశ్వాసుల ఆత్మీయ స్థితి (అధ్యాయము 5:11 – 6:20).
హెబ్రీ పత్రికలో ప్రస్తుత భాగము క్రీస్తు యాజకత్వపు శ్రేష్ట లక్షణము లను వివరించుట అపొస్తలునియొక్క గురిగా ఉన్నది.
ఇక్కడ యేసుక్రీస్తు యాజకత్వపు హుందాతనమును సూచించుటకు మెల్కీసెదెకు యాజకత్వపు సామ్యమును చూపెట్టి, రచయిత తన సందేశమును ఆపివేసి, తిరిగి 7వ అధ్యాయము ప్రారంభములో దానిని మొదలు పెట్టెను.
ఈ మధ్యలోగల వచనములలో అపొస్తలుడు తన పాఠకుల ఆత్మీయ స్థితిని చూపుచున్నాడు. ఆత్మీయముగా వారు మందులగుటవలన తీవ్ర సమస్యలలోను, గొప్ప ప్రమాదములలోను ఉన్నారు.
Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక
వారు పాత నిబంధన సంకేతములకు భాష్యము చెప్పలేకపోవుటయే ఆ సమస్య. ఇది 5:11; 6:1-3 లో సూచింపబడియున్నది. ఆత్మీయముగా వారు చాలా తగ్గు స్థాయిలో నున్నందున కొందరు క్రైస్తవ్యమును వదలి యూదా మతమునకు మరలు ప్రమాదమున్నది.
ఈ ప్రమాదము 6:4-8 లో వివరించబడినది. ఈ మధ్యగల వచనములలోని మిగిలిన భాగములో తన పాఠకుల విషయమై అపొస్తలుని నమ్మిక, నిరీక్షణ వెల్లడించబడినది. (6:9-20).
ఆత్మీయ జ్ఞానమునకు అవరోధము (5:11 – 6:3).
(వచనములు 11-13). అపొస్తలుడు చూపుచున్న ఈ పాఠకులు సత్యము ఎరుగనివారు కాదు, విశ్వాసములో క్రొత్తవారుకూడా కాదు. లేఖనములు అర్థము చేసుకొనని స్థితిలో వారు లేరు.
అసలు సమస్య ఏమనగా వారు “వినుటలో మాంద్యులైరి” కనుక వారిలో ఆత్మీయ ఎదుగుదల స్తంభించిపోయెను. వారు బోధకులుగా ఉండవలసిన కాలము వచ్చినది.
అయితే విచారకరమైన విషయమేమనగా దేవోక్తులలోని మూలపాఠములు సహితము వారికి మరల నేర్పించవలసిన ఆవశ్యకత ఏర్పడినది. వారు బలమైన ఆహారము తినువారుగాక పాలు త్రాగువారుగా ఉన్నారు.
ఇక్కడ అపొస్తలుడు పాలయొక్క ఆహార ప్రాధాన్యతను తగ్గించి మాటలాడుటలేదు. వారు పాలు త్రాగుచున్నారంటే ఆత్మీయముగా శిశువు లనియు, దేవుని నీతియందు వారింకను స్థిరపరచబడవలసియున్న దనియు ఋజువగుచున్నది.
(వచనము 14). మనలను సంపూర్ణమైన క్రైస్తవ సత్యములోనికి నడిపించవలెనని అపొస్తలుని కోరిక. అదే బలమగు ఆహారము.
ఇది దేవునియెదుట ఆయన కుమారుడుగా స్థిరపరచబడిన పరిణతి గలిగిన క్రైస్తవులకు చెందినది. అలాంటివారు మందబుద్ధులు కాక, మంచి చెడ్డలు వివేచించగలరు.
(వచనములు 6:1-3). విశ్వాసుల ఆత్మీయ పురోభివృద్ధికి అవరో ధములేమిటో అపొస్తలుడు వివరించుచున్నాడు. కొరింథులోనున్న పరిశుద్ధులకు మనుష్య జ్ఞానము, తత్వము అడ్డుగా నున్నవి.

హెబ్రీ విశ్వాసులకు వారి పూర్వపు మతము అవరోధముగా నున్నది. అని జె. యన్. డార్బీ భక్తుడు చెప్పియున్నాడు.
ఈ హెబ్రీ విశ్వాసులవలెనే నేడు క్రైస్తవ లోకములో దేవుని వాక్య జ్ఞానము కొరతగా నున్నందున సంప్రదాయములకు, మతాచారములకు ప్రజలు అంటిపెట్టుకొనుచున్నారు.
బాహ్యాచారములు ఉద్రేకములను రెచ్చగొట్టు మతకాండలు ప్రకృతి సంబంధులగు మనుష్యుల మానసిక అక్కరలు తీర్చును గనుక వారు దేవుని వాక్యమందు వెల్లడించబడిన దేవుని కృపాసువార్తను చూడలేక గ్రుడ్డివారుగా ఉన్నారు.
ఈ ఉరినుండి తప్పించుకొనుటకు “క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణులమగుటకు సాగిపోవుదము” అని అపొస్తలుడు హెచ్చ రించుచున్నాడు.
యూదా మతములో సిలువకు పూర్వమున్న కొన్ని ప్రాథ మిక సత్యములను తరువాత అతడు ఉదహరించెను. అవి ఆత్మీయముగా బాల్యదశకు తగినవి.
ఈ సత్యములకు భిన్నమైన క్రైస్తవ్యమునందు వెల్ల డించబడిన యేసుక్రీస్తు వ్యక్తిత్వమును, ఆయన పనిని అపొస్తలుడు వివరించియున్నాడు. దీనినే ఆయన పరిపూర్ణత యనుచున్నాడు.
క్రీస్తు రాకడకు పూర్వమున్న సత్యములను పట్టుకొని వ్రేలాడుచున్నందున వీరు క్రైస్తవ్యములోని క్రీస్తు ప్రత్యక్షతలో సంపూర్ణసిద్ధి పొందలేకపోయిరి.
నిర్జీవ క్రియలు విడిచి మారుమనస్సు పొందుట, దేవునియందు విశ్వాసము, శుద్ధీకరణాచారము, హస్త నిక్షేపణము, మృతుల పునరుత్థా నము, నిత్య తీర్పు అను విషయములను ఇక్కడ అపొస్తలుడు ప్రస్తా వించెను.
ఇవన్నియు యేసుక్రీస్తు శరీరధారి కాక పూర్వము అమలులో నుండెను. ఇక్కడ ఆయన చెప్పిన విశ్వాసము యేసుక్రీస్తునందు వ్యక్తిగత విశ్వాసము కాదు, దేవునియందు విశ్వాసము.
శుద్ధీకరణాచారము అనగా క్రైస్తవ బాప్తిస్మము కాదు, యూదుల శుద్ధీకరణాచారము. హస్త నిక్షేపణ యనగా ఇశ్రాయేలీయులు బలి ఇచ్చునప్పుడు బలి జంతువుపై చేతు లుంచి, దానితో తమను తాము గుర్తింపజేసికొనుట.
మృతుల పునరుత్థాన మనగా క్రైస్తవ్యములో ఉన్నట్టి మృతులలోనుండి తిరిగిలేచుట. యోహాను సువార్త 11వ అధ్యాయములో మార్త మృతుల పునరుత్థానమును నమ్మెను.
కాని, మృతులలోనుండి కొందరు పునరుత్థానులు కానుండగా మరి కొందరు మృతులుగానే ఉందురను క్రైస్తవ సత్యమును ఆమె గ్రహించుట కష్టమైనది.
పాత నిబంధన సత్యములలో దేనినీ తిరస్కరించవలెనని అపొస్తలుడు చెప్పుటలేదుగాని, పాక్షిక వెలుగునుండి క్రైస్తవ పరిపూర్ణతయను సంపూర్ణ వెలుగులోనికి రమ్మని పిలుచుచున్నాడు.
దేవుడు సెలవిచ్చినయెడల మన మాలాగు చేయుదమనుచున్నాడు. వీటివైపు తిరిగిమళ్ళుట మరల పునాది వేయుటే యగును. ఇది క్రైస్తవ పునాది కాదు, యూదా మత పునాది.
భ్రష్టత్వమను ప్రమాదము (6:4-8).
(వచనములు 4-6). యూదా విశ్వాసులు ఆత్మీయ విషయములలో మందులైనందున ఎదురైన సమస్యలను ఎదుర్కొనుట ఎట్లో వివరించిన తరువాత, అపొస్తలుడు వారు ఎట్టి ప్రమాద పరిస్థితిలో ఉన్నారో హెచ్చ రించుచున్నాడు.
వారు యూదా మత ఆచారములను, సంప్రదాయాలను పట్టుకొని వ్రేలాడుతూ ఉండుటనుబట్టి స్పష్టమగునదేమనగా, కొందరు క్రైస్తవ సత్యముచే వెలిగింపబడి, దాని ఆధిక్యతలను రుచిచూచిన తరువాత తప్పిపోయి యూదా మతమునకు మళ్ళియుండవచ్చును.
అట్టివారు మరల మారుమనస్సు పొందుట అసాధ్యము. ఇక్కడ “తప్పిపోయినవారు” నిజమైన విశ్వాసులు కాదు నామకార్థులు అని గ్రహించవలెను. ఈ భాగములో ప్రస్తావించిన “వెలిగింపబడుట” క్రొత్త జన్మ లేదా నిత్యజీవమును సూచించునది కాదు.
క్రైస్తవ్యములోని బాహ్య ఆధిక్యతలు, పరిశుద్ధాత్మ వారితో ఉండుట, దేవుని వాక్య శ్రేష్టత్వము, క్రైస్తవ పరిధిలో బహిరంగముగా వెల్లడియగు శక్తి ఈ భాగములో వివరించబడియున్నవి.
ఇవన్నియు క్రైస్తవుల మధ్యకు వచ్చినవారు, ఆత్మీయ జీవము వారిలో లేకున్నను అనుభవించవచ్చును. అట్టివారు క్రైస్తవుల మధ్య ఉండి, బాహ్య మగు ఆధిక్యతలను అనుభవించి, తిరిగి యూదా మతములో కలిసిపోవు అవకాశమున్నది.
ఆ విధముగా చేయుటవలన వారు మెస్సీయాను సిలువవేయుటతో ముగిసిన వ్యవస్థలోనికి వెళ్ళుచున్నారు. వాస్తవముగా దేవుని కుమారుని సిలువవేసినది వారే. వారు బాహాటముగా ఆయనను అవమానపరచియున్నారు.
వారు క్రీస్తును, క్రైస్తవ్యమును ప్రయత్నించి యూదా మతమే మేలని గుర్తించియున్నారు. వారిలో దైవిక జీవమున్నదనిగాని, వారి ఆత్మలో దైవకార్యము జరిగినట్లుగాని అపొస్తలుడు నమ్ముటలేదు.
వారు కేవలము క్రైస్తవ్యములోని బాహ్య ఆధిక్యతలను క్రైస్తవుల మధ్య అనుభవించిరి. ఈ విధముగా ఈ భాగములో ఎదురగు సందేహములకు నివృత్తి కలుగును.
(వచనములు 7, 8). అపొస్తలుడు ఉపయోగించిన దృష్టాంతము అర్థవంతముగా నున్నది. భూమిపైని పైరులు, ముండ్లతుప్పలు ఆకాశము నుండి కురియు వర్షమును సమానముగా అనుభవించును. అయితే పైరులు పంటనిచ్చును, ముండ్లపొదలు కాల్చబడును.
ఆదరణ – ప్రోత్సాహము (6:9-20).
(వచనములు 9-12). హెబ్రీ విశ్వాసులకు వారున్న దీనస్థితిని గుర్తుచేసి, భ్రష్టత్వమను ప్రమాదము విషయము హెచ్చరించి, ఇప్పుడు అపొస్తలుడు వారిపై తనకున్న నమ్మికను, నిరీక్షణను వెల్లడించుచు విశ్వాసులను ప్రోత్సహించుచున్నాడు.
అపొస్తలుడు వారిని హెచ్చరించినను తప్పిపోయినవారు అను విషయము వీరికి అన్వయించుటలేదు. అందుకు భిన్నముగా వారిలోనున్న మంచి విషయములను, రక్షణ తరువాత జరుగు వాటిని గుర్తుచేయుచున్నాడు.
క్రైస్తవుల మధ్యనున్నప్పుడు రక్షింపబడక పోయినను 4-8 వచనములలో చెప్పబడినరీతిగా కొంతమేరకు బాహ్య మగు ఆధిక్యతలు పొందుట సాధ్యమేనని స్పష్టముగా చెప్పుచున్నాడు.
రక్షించబడిన తరువాత ఒక వ్యక్తిలో కన్పించు లక్షణములు అతనిలో దైవిక జీవమున్నదనుటకు నిదర్శనము. అది “ప్రేమ”, “నిరీక్షణ” మరియు “విశ్వాసము”. వారు ఎల్లప్పుడు దేవుని ప్రజలకు పరిచర్య చేయుటవలన వారిలో ప్రేమ ఉన్నదని ఋజువగును.
యేసుక్రీస్తు ప్రేమచేత ప్రేరితులై చేసిన ప్రేమ పరిచర్యను దేవుడు మరచిపోడు. ఇట్టి ప్రేమకు సంపూర్ణ బహుమానము రాబోవు దినమున లభించును. దీనినిబట్టియే మన యెదుట ఉన్న “నిరీక్షణ”నుబట్టి అపొస్తలుడు మాటలాడెను.
ఈ యూదా విశ్వాసులు ఓపికగా ప్రేమతో సత్కార్యములు జరిగించుచు, సువార్త ప్రయాసకు ప్రతిఫలమగు విశ్రాంతి మరియు బహుమానములయందు నిరీక్షణ కలిగియుండవలెనని ఆశించెను.
సేవ చేయుటకు ప్రేరణ బహుమానము కాకూడదని అపొస్తలుడు చెప్పుచున్నాడు. “ఆయన నామముపట్ల ప్రేమ” దానికి కారణము అని అతడు స్పష్టము చేసెను.
శ్రమలలో ప్రోత్సాహము కలిగించుటకు బహు మానమిచ్చుట కలదు. అంతమువరకు సహించుటకు విశ్వాసము, సహనము అవసరము.
“విశ్వాసముచేతను, ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన దేవుని ప్రజలను పోలి నడచుకొనవలెనని అపొస్తలుడు హెచ్చరించుచున్నాడు.
వారు భవిష్యత్తులో కలుగు ఆశీర్వాదములకొరకు విశ్వాసముతో కనిపెట్టుకొనిరి. గనుక అరణ్య సంబంధమగు శోధనలను ఓపికతో సహించిరి.
(వచనములు 13-15). విశ్వాసమునకు ఆలంబనగా ఒక సంపూర్ణ అధికారము అవసరము. ఇప్పుడు అపొస్తలుడు పితరుల చరిత్రవైపు మళ్ళి దేవుని వాక్యమను స్థిరమగు పునాదిపై విశ్వాసము వ్యక్తపరచిన అబ్రాహామును చూపించుచున్నాడు.
అబ్రాహాము విషయములో దేవుడు ఈ వాక్యమును ఒక ప్రమాణముద్వారా స్థిరపరచెను. అబ్రాహామును సంపూర్ణ ఆశీర్వాదములలోనికి నడిపింతునని దేవుడు తన వాక్యముతో ప్రమాణము చేసెను. ఆ మాట నమ్మినందువలన అబ్రాహాము ఓర్పుతో శోధనలన్నిటిని సహించి వాగ్దానఫలము అనుభవించెను.
(వచనములు 16-18). దేవుడు ఇచ్చిన ఆయన వాక్యము, ఆయన ప్రమాణము అను ఈ రెండంతల అభయము నిచ్చినది అబ్రాహాము ఒక్కడికి మాత్రమే కాదు.
ఆ విధముగా దేవుడు ఏ సూత్రములపై ఆధారపడి క్రియ జరిగించినాడో ఆ సూత్రములు, పూర్వకాలమందు పితరులతో వ్యవహరించిన తీరు “మనకు బలమైన నిరీక్షణ కలుగునట్లు” విశ్వాస సంబంధులకుకూడా వర్తించును.
దేవుడు తన దయాపూర్వక కృపలో తన వాక్యము మార్పులేనిది అను వాగ్దానమునకు వారసులైనవారిని తన దయాపూర్వక కృపలో ఒప్పించుటకు తాను చేసిన వాగ్దానమును ప్రమాణముతో దృఢపరచెను.
మనుష్యులు పరస్పరము వ్యవహరించు విషయములలోకూడా ఇట్లే చేయుట కద్దు. తనకంటే గొప్పవానిపేరున ప్రమాణము చేయు అవకాశము లేనందున దేవుడు తన పేరనే ప్రమాణము చేసెను.
ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా దానిని కనుపరచ వలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని తన వాక్యము, ప్రమాణమను రెండు నిశ్చలమైన సంగతులను మన ఎదుట ఉంచెను.
ఈ రెంటి విషయములలో దేవుడు అబద్ధమాడుట అసాధ్యము. ఆ విధముగా మార్గమందు ఎదురగు కష్టములనుబట్టి వెనుకకు మళ్ళక, తమయెదుట ఉన్న నిరీక్షణను గట్టిగా చేపట్టి క్రీస్తు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగించెను. ఇక్కడ ఆశ్రయపురముల సామ్యము ప్రస్తావించియున్నాడు.
యూదులు తమ మెస్సీయానే హత్యగావించి, తమ నెత్తిమీదికి తీర్పు కొనితెచ్చుకొనిరి. విశ్వసించిన ఆ కొద్ది శేషమువారు వారి పాపమునుండి వేరై సజీవుడైన మహిమగల క్రీస్తును ఆశ్రయించిరి.
(వచనములు 19, 20). క్రీస్తును ఆశ్రయించిన విశ్వాసికి స్థిరమైన, నిశ్చలమైన నిరీక్షణ కలదు. ఎందుకనగా మన ప్రధాన యాజకుడు పరలోకమందలి తెరలోపల ప్రవేశించెను.
క్రీస్తు మన పక్షముగా దేవునియెదుట ప్రధానయాజకునిగా, ఆగమన దూతగా కనిపించు చున్నాడు. ఆగమన దూత తన తరువాత మరికొందరు వచ్చుచున్నారని సూచించుచున్నాడు.
మనకున్నది దేవుని వాక్యముమాత్రమే కాదు. మహిమలో సజీవుడైన క్రీస్తు మనము పొందనున్న మహిమకు సాక్షిగా, మనము అక్కడ ఉందుమనుటకు అభయముగా ఉన్నాడు.
మనము పరలోక విశ్రాంతికి చేరువరకు, మార్గమందు మనలను బలపరచునది మన ప్రధాన యాజకుడగు క్రీస్తే. నాలుగవ అధ్యాయము చివరిలోవలెనే ఇక్కడకూడా అపొస్తలుడు దేవుని వాక్యమును, సజీవుడైన క్రీస్తును మనయెదుట ఉంచుచున్నాడు.
మన విశ్వాసమునకు స్థిరమైన పునాది దేవుని వాక్యమే. సజీవుడైన క్రీస్తు మన ఆత్మలకు లంగరువలె ఉన్నాడు. ఆయన మనలను పరలోకముతో అనుసంధానముచేసి, జీవిత తుపాను లలో ప్రశాంతతనిచ్చువాడు.