విశ్వాస ప్రయాణం

విశ్వాస ప్రయాణం

హ్యారీ మాటలకు జాన్ అదిరిపడ్డాడు. ఒకప్పుడు జాన్ ఎలాగున్నాడో యిప్పుడు హ్యారీ అచ్చం అలాగే ఉన్నాడు. పాపాన్నిగూర్చిన ఆలోచనే లేదతనికి. పాపం అంటే హ్యారీకి ఒక తమాషాగా ఉంది.

జాన్ యిప్పుడు చాలా నీతిమంతునిగా ఉన్నాడు. పరిశుద్ధుడైన యోహాను, పరిశుద్ధుడైన పౌలు వ్రాసిన గ్రంథాలు తనను ఎంతో ఆకర్షించినా బైబిల్ లోని చారిత్రక గ్రంథాలనుకూడ అతడు ఆసక్తిగా చదివాడు.

“నేనిప్పుడొక దైవికమైన మనిషిని” తనలో తాను ధీమాగా అనుకొన్నాడు జాన్. కొన్ని వారాల తర్వాత ఆకు రాలు కాలంలో ఒక రోజు తన వ్యాపారాన్ని తిరిగి అతడు ప్రారంభించాడు. ఎండవేళ వీధుల్లో శ్రమతో నడుస్తూ – “పాత్రలకు కళాయి వేస్తాం … పాత్రలకు కళాయి వేస్తాం …” అని అభ్యర్థనపూర్వకంగా అరుస్తూ తిరగ సాగాడు.

తనలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ భార్యలు కూతుళ్ళు కాబోలు చాలామంది స్త్రీలు వీధిలో ఒక గుడిసె ముందు కూర్చోవడం జాన్ చూశాడు. వాళ్ళు దేవునిగూర్చి మాట్లాడుకోవడం అతనికి సంతోషాన్ని కలిగించింది.

జాన్ మంచి మాటకారి కాబట్టి ఆ ఆడవాళ్ళను మెప్పించి ఒకటో రెండో పాత్రలకు కళాయివేసే అవకాశాన్ని కల్పించుకోడానికి యిది మంచి సమయమనిపించింది.

“నమస్కారం అమ్మగారు! దేవునిగూర్చి మీరు మాట్లాడుకోవడం విన్నాను.” “మా సహవాసంలో చేరయ్యా” వాళ్ళలో ఒక స్త్రీ జవాబిచ్చింది. తిరిగి జన్మించడాన్ని (నూతన జన్మ) గూర్చి ఆమె మాట్లాడుతూ ఉంది.

వాళ్ళ సంభాషణ మధ్యలో చొరబడేందుకు అవకాశంకోసం జాన్ ఎదురు చూస్తున్నాడు. అయితే ఆ సమయం రానేరాలేదు. వాళ్ళు తనకు తెలిసిన సాధారణ మనుష్యుల్లా మాట్లాడ్డం లేదు. అటువంటి పరిశుద్ధతతోకూడిన స్థితికి మేరీ మాత్రమే రాగలిగింది.

తమ హృదయాల్లో దేవుడెలా జీవిస్తూ ఉన్నాడో, అయినప్పటికీ తాము యింకా ఎంత ఘోరపాపులుగా ఉన్నామోనన్న విషయాలను ఆ స్త్రీలు చర్చించు కుంటున్నారు. వారు యేసుక్రీస్తుపట్ల తమ మితిలేని ప్రేమను వెలిబుచ్చడమేగాక, సాతాను శోధనలను జయించడానికి యేసుక్రీస్తు ఎలా తమకు సహాయంచేశాడో వాటినిగూర్చి ప్రతి స్త్రీ సాక్ష్యమివ్వసాగింది.

వాళ్ళు క్రీస్తుయెడల తమ ప్రేమను వ్యక్తీక రించడంలోని సహజత్వానికీ, వాళ్ళ ముఖాలలో కనిపించే సంతోషానికీ జాన్ ఆశ్చర్య పడ్డాడు. ఈ సాధారణ స్త్రీలు ప్రకాశమానంగా ఉండటమే గాక, పాస్టర్ గారు కూడా మాట్లాడలేనంత అనర్గళంగా, సమర్పణాపూర్వకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అందరిలా లేరు. పరిశుద్ధతతో ప్రత్యేకంగా కన్పిస్తున్నారు.

ఇప్పుడు జాన్కు అర్థమైంది – తిరిగి జన్మించడమనేదాన్నిగూర్చి తనకేం తెలియదని. ఈ స్త్రీలు కనుగొన్న విధంగా తనెప్పుడూ బైబిల్లో ఆనందాన్ని కనగొనలేదు. పాపాన్నిగూర్చి వాళ్ళకున్నంత బలమైన అవగాహన తనకు లేదనిపించింది జాన్కు.

“క్షమించండమ్మా! నేను వెళ్ళాల్సి ఉంది” – చివరగా అన్నాడు జాన్. మరోసారి తన్నుతాను వెర్రిబాగుల అసునేటోస్తో పోల్చుకున్నాడు అతడు.

మేరీతో కలిసి బైబిల్ చదివేందుకు జాన్ త్వరత్వరగా యింటికెళ్ళాడు. ఆ తదుపరి నెలల్లో అతడు బైబిలు చాలా ఆసక్తిగా చదివాడు. పసిపాప మేరీ గ్రుడ్డిదైనా చాలా తెలివిగలదనే సూచనలు కనపడినప్పుడు జాన్ తాను చాలా దీవించబడినట్లుగా భావించాడు.

బెడ్ఫోర్డ్లోని ఆ స్త్రీల దగ్గరకు జాన్ పలుమార్లు వెళ్ళాడు. గతంలో మాదిరి వాగుడుగాయలాగా లొడలొడా మాట్లాడాలనే శోధనను అతడు జయించ సాగాడు. తన ప్రతి ఆలోచనను వాక్య ప్రామాణికతతో పోల్చుకునే ప్రయత్నం ఎప్పుడూ చేసేవాడు.

జాగ్రత్తగా విని ప్రశ్నలు వేసేవాడు. వారి దగ్గర దేవుని సన్నిధిని అనుభవించే విధానాన్ని అతడు నేర్చుకున్నాడు. ఇప్పుడు తన ప్రతి నిర్ణయానికీ అతడు దేవుని అనుమతి తీసుకోసాగాడు. అంతేకాదు, బైబిలె యెడల అతనిలో అచంచల గౌరవభావం ఏర్పడింది.

అది అతని మనస్సులో ఆ స్త్రీలను బిషప్ల స్థాయికి తీసుకెళ్ళింది. అది తననుకూడ ఆ స్థాయిలో నిలబెట్టింది. ఇప్పుడు తాను పరి. పౌలునుగూర్చి అవగాహన చేసుకోగలుగుతున్నాడు. తన ప్రవర్తన ఎంత నీతితో కూడినదైనా అభినందనీయమైనదైనా అది తనను రక్షించలేదని తనకు తెలిసింది. రక్షణ అనేది క్రీస్తుద్వారా వచ్చే బహుమానం. ఇక జాన్ చేయగలిగిందేమిటంటే తాను విశ్వాసాన్ని కలిగివుండటమే! అప్పుడు రక్షణ దానివెంబడే వస్తుంది.

‘అయినా తనకు విశ్వాసం ఉందా, లేదా?’ అనే ప్రశ్న అతణ్ణి ఆవేదనకు గురిచేసేది. ‘తను నిజంగా విశ్వసిస్తున్నాడా? విశ్వాసమనేది ఏమాత్రం లేని హ్యారీ ఎలా మాట్లాడు తున్నాడో అలానే తానుకూడ యితరులతో మాట్లాడుతున్నాడు. “రాంటర్లు”గా తమకు తామే అధ్యయనం చేసుకున్నవారితోకూడ తను అలాగే మాట్లాడుతున్నాడు. అనేకసార్లు యీ రాంటర్లు తనను సందేహంలో పడేటట్లు చేశారు. అతడు మళ్ళీమళ్ళీ బెడ్ఫోర్డులోని స్త్రీలవద్దకు వెళుతుండేవాడు. వాళ్ళు అతని సందేహాలన్నింటినీ నివృత్తిచేస్తుండేవారు.

ఒక రోజు బాగా వర్షం పడిన తర్వాత బెడ్ఫోర్డ్కు వెళ్తూన్న జాను ఏదైనా ఒక అద్భుతం ద్వారా తన విశ్వాసం ఋజువైతే బాగుండునని అనిపించింది. ‘అవును, ఎవరికైనా అవగింజంత విశ్వాసం ఉంటే వాళ్ళు కొండను కదిలిస్తారని ప్రభువు చెప్పలేదా? అలాంటప్పుడు తనకు విశ్వాసం ఉంటే ఆ మాత్రం ఓ చిన్న అద్భుతాన్ని తాను చెయ్యలేడా? ఈ దారిలోనున్న చిన్నచిన్న నీళ్ళ గుంటల్ని ఎండిపొమ్మని ఆజ్ఞాపిస్తే, అది తన విశ్వాసాన్ని ఋజువుచేస్తుందికదా?’ అయితే అతడు హఠాత్తుగా తిరిగి సందేహంలో పడ్డాడు.

‘ఒకవేళ యీ అద్భుతం జరక్కపోతే? అప్పుడు తన భంగపాటును భరించేదెలా? అప్పుడు తానింకా పడిపోయినవాడౌతాడు.’ అలా దీర్ఘంగా ఆలోచిస్తూ, భారంగా నిట్టూరుస్తూ నిరాశగా బెడ్ఫోర్డువైపుకు పయనం కొనసాగించాడు జాన్.

అదే రోజు ఆ స్త్రీలు యథావిధిగా కూడుకొనివుండగా జాన్ అడిగాడు – “అమ్మా! మీకీ జ్ఞానం బైబిల్నుండి వచ్చిందని నాకు తెలుసు. అయితే మీకు మొదటగా దీన్ని పరిచయం చేసినవాళ్ళెవరు?”

“మా పాస్టర్ గిఫర్డ్ గారే! మేము ఆయన నడిపించే ‘ఫ్రీ చర్చ్ ఆఫ్ బెడ్ఫోర్డు’కు వెళ్తాం.”

కొన్ని రోజుల తర్వాత జాను దర్శనం కలిగిందో లేక పగటికల కన్నాడో తెలియదు గాని అందులో బెడ్ఫోర్టులోని స్త్రీలు ఓ కొండ ప్రక్కగా ఎండలో వెచ్చగా కూర్చొని ఉన్నారు. తనేమో నల్లని మేఘాల క్రింద, మంచులో నిల్చొని గజగజ వణుకుతున్నాడు. ఒక ప్రాకారం ఆ కొండను చుట్టుకొని ఉంది.

ఆ గోడలోనుండి ఏదైనా మార్గం ఉందేమో, దానిద్వారా ఆ స్త్రీలను కలుసుకోవచ్చనే ఉద్దేశంతో ఆ గోడను జాగ్రత్తగా అతడు వెదకసాగాడు. చివరగా ఓ మార్గానికి తీసుకెళ్ళే తలుపు కనిపించింది. అది చిన్నగా యిరుకుగా ఉంది.

ఆ తలుపు సందులో తలను దూర్చేందుకు గంటల తరబడి సమయం పట్టింది. అయితే అతడు ఎలాగో అటూ యిటూ కదిలి చివరిగా శరీరాన్నంతా తులుపు సందులోకి దూర్చగలిగాడు. తర్వాత మెల్లగా ఓ త్రోవ వెంట పోసాగాడు. చివరిగా అతడు ఆ కొండ ప్రక్కకు సమీపించి ప్రకాశవంతమైన సూర్యరశ్మిలోని స్త్రీలను కలిసికొన్నాడు.

“మేరీ! మనం వచ్చే ఆదివారంనుండి బెడ్ఫోర్డులోని ‘ఫ్రీ చర్చి’కి వెళ్తున్నాం” – అటు తర్వాత మేరీతో అన్నాడు జాన్.

అలా జాన్ మేరీని బెడ్ఫోర్డులోని ‘ఫ్రీ చర్చి’కి తీసుకెళ్ళడం ప్రారంభించాడు. అక్కడ పన్నెండుమందికంటే ఎక్కువ సభ్యులు లేరు. అది 1650 సంవత్సరంనుండి మాత్రమే నడుస్తోంది. చార్లెస్ రాజు పరిపాలన క్రింద యిటువంటి చర్చిని అనుమతించే వారు కాదు.

యువకుడైన ఆ సంఘకాపరి జాన్ గిఫర్డ్, జాన్కు ఆత్మీయ బోధకు డయ్యాడు. ఒకసారి ఓ ప్రత్యేకమైన సంభాషణలో తను సైన్యంలో ఉండగా పడిన హింసలనుగూర్చి జాన్ చెబుతుండగా పాస్టర్ గిఫర్డ్ గారు మధ్యలో అడ్డుపడి తాను రాజుగారి సైన్యంలో పనిచేశానని చెప్పాడు.

“మీరు రాచరికవాదులా!” ఆశ్చర్యంగా అడిగాడు జాన్.

“అవును. నేనెందుకు చెబుతున్నానంటే క్రీస్తులోనికి నేనెంత బాధకరమైన మార్గం ద్వారా వచ్చానో నువ్వు తెలుసుకోవాలి. ఈ రాజులు మరియు ఘనుల ఆటుపోట్లమధ్య యుద్ధంలో నీ సేవలు కనపర్చడం చాలా మంచిదే.

క్రీస్తునందలి విశ్వాస జీవితంలో కూడ అదే విధమైన ఆటుపోట్లుంటాయి. ఈ సంవత్సరం నీకు ఘనతగా భావించ బడినది వచ్చే సంవత్సరం మరణదండనకు కారణం కావచ్చు.”

“ఈ విషయాన్ని నేను తప్పక జ్ఞాపకముంచుకుంటాను పాస్టర్ గిఫర్డ్! అయితే మీ మార్గం అంత హింసాభరితంగా ఉండటానికి కారణం?”

“నేను లార్డ్ ఫెయిర్ ఫాక్స్కు వ్యతిరేకంగా లండన్కు ఆగ్నేయంగా మెయిడెన్ వద్ద పోరాడి నాలుగు సంవత్సరాలయింది. ”

“ఇంగ్లాండులో రక్తంతో తడవని ప్రాంతమంటూ ఏదైనా ఉందా?”

“నేను మేజర్ని …””

“మేజరా!”

“అవును. నా యీ ఉన్నతమైన హోదాకూ, నా దృఢ చిత్తానికీ నేను పొందిన బహుమానం ఏమిటంటే… మేము లొంగిపోయిన తర్వాత… మరణశిక్ష. ” “మరణశిక్షా!”

“అవును. ఫెయిర్ ఫాక్స్ నన్నూ, మరి పదకొండుమంది యితరులనూ ఆ మరణ శిక్షకు ఎంపికచేశాడు.”

“అయితే మీరు యిక్కడ …”

“అపొస్తలుల కార్యముల గ్రంథములో పేతురు చెరనుండి తప్పించుకున్న రీతిగా నేను తప్పించుకోవడంకూడ ఆశ్చర్యకరంగా జరిగింది.

జాన్ వెంటనే బైబిల్లోని ఆ సంఘటనను గుర్తుచేసుకొని చెప్పాడు :

“ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి – త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతులనుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడా లాగు చేసిన తర్వాత దూత – నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను.”

“జాన్, దేవునివాక్యం విషయంలో నీకు మంచి జ్ఞాపకశక్తి ఉంది! ఏదో ఒక గొప్ప కోసమే యీ వరం దేవునిద్వారా నీకివ్వబడింది.”

“ఇంతకూ మీరెలా తప్పించుకున్నారు పాస్టరుగారూ?”

“నేను చెరసాలలో ఉండగా ఒకసారి నా సహోదరి నన్ను చూడ్డానికి వచ్చింది. ఆవిడ నాతో ‘కావలి వాళ్ళంతా త్రాగిన మైకంలోనూ, గాఢనిద్రలోనూ ఉన్నారని’ చెప్పింది. ఆ సమయంలో నేను కల కంటున్నానా అని నాకనిపించింది. నా సహోదరితో కలిసి నేను చెరసాలలోనుండి తప్పించుకొని బైటికి వచ్చాను.

బెడ్ఫోర్డుకు వచ్చేందుకు పగలంతా పొలాల్లో దాగి, రాత్రివేళల్లో ఉత్తర దిక్కుగా నడుస్తూ ప్రయాణం చేశాను. కచ్చితంగా దేవుడే నన్ను కాపాడాడు జాన్! నా క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ బెడ్ఫోర్డులో వైద్యవృత్తి ప్రారంభించాను. అయితే నేను దేవునికి కృతజ్ఞత చూపలేదు. నేను త్రాగి, జూదం ఆడి శాపగ్రస్థుడనయ్యాను.

ఒక రాత్రి జూదంలో చాలా పెద్దమొత్తం పోగొట్టు కొని కోపంతో నా దురదృష్టానికి దేవుణ్ణి తిట్టడం ప్రారంభించాను. అయితే అనుకోకుండా అపరాధ భావన నన్ను ముంచెత్తింది. నేనెంతగా చెడిపోయానోనని నాకు హఠాత్తుగా అన్పించింది. నేను మోకరించాను. మనిషి గనుక దేవుణ్ణి వెదకితే, అతడు తప్పక దేవుణ్ణి కనుగొంటాడు జాన్.”

పాస్టర్ గారి మాటల్ని వింటూ జాన్ తదేకంగా ఆయనవైపు చూస్తున్నాడు. “ఎంత ఆశ్చర్యకరమైన మార్పు! దేవునివైపు మీ ప్రయాణం, నా ప్రయాణంకన్నా చాలా విశిష్టమైంది” చివరిగా జాన్ అన్నాడు.

“నీ సుదీర్ఘ ప్రయాణంకూడా దాదాపు ముగిసినట్టే జాన్” – సమాధానమిచ్చాడు. పాస్టర్ గిఫర్డ్.

మార్టిన్ లూథర్ వ్రాసిన ‘గలతీ పత్రిక వ్యాఖ్యానాన్ని’ (Martin Luther’s Com- ments on Galatians) చదవమని ఆయన జాన్ కు అందజేశాడు. అందులో లూథర్ తన స్వంత శ్రమానుభవాన్ని అద్భుతంగా వివరించాడు. కాబట్టి జాన్ యిక ఒంటరిగా లేడు. పాస్టర్గారు బాగా శ్రమలకు గురయ్యారు.

చివరకు మహా గొప్ప వ్యక్తియైన మార్టిన్ లూథర్ క్కూడ ఎన్నో వేదనలకు గురయ్యాడు. అయితే కొంత సమయం తర్వాత ఓదార్పు పొందడానికి బదులు జాన్ మళ్ళీ కలతకు గురయ్యాడు. అవును ‘ఈ పాస్టర్గారూ, గొప్ప విశ్వాసులైన లూథర్లాంటి వాళ్ళూ సాతానును ఎదిరించారు. అయితే తను ఎలా ఎదిరించగలడు?’

మార్టిన్ లూథర్రి సందేశం, తన మంచి స్వంత కాపరియైన గిఫర్డ్ పాస్టర్ గారి ప్రోత్సాహం తనకున్నప్పటికీ జాన్ మానసిక క్షోభననుభవిస్తూ ఉండిపోయాడు. ఒక రోజు ఒక బలహీనమైన క్షణంలో “ఆ …. క్రీస్తు ఎటు పోతే మనకెందుకు?” అని అనుకున్నాడు. మరుక్షణం అతడు చాలా కంగారుపడ్డాడు.

తన జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించిన ఏశావులాగ తనెంత అనాలోచితంగా తయారయ్యాడు! కొన్ని వారాలుగా జాన్ తను రక్షణ పొందాడన్న విశ్వాసానికీ, శాపగ్రస్థుడయ్యాడన్న నమ్మకానికీ మధ్య ఊగిసలాడాడు.

1652 నాటికి మేరీ మరో బిడ్డను కనేందుకు సిద్ధంగా ఉంది. ఆమెగాని, జాన్గాని విచారపడాల్సిన పనిలేదు. విచారం లేదా చింత అనేది దేవునియెడల విశ్వాసరాహి త్యాన్ని సూచిస్తుంది. అయితే జాన్ విచారపడాల్సి వచ్చింది.

జన్మించిన శిశువు మృతశిశువుగా దర్శనమిచ్చినప్పుడు జాన్ చాలా నలిగిపోయాడు. ‘మొదటి బిడ్డ గ్రుడ్డిది. రెండోది మృతశిశువు. ఇది తనపై దేవుని తీర్పా? రక్షణ పొందేందుకు సృష్టి ఆరంభంలోనే దేవునిచే ఎంపిక కాబడి ఏర్పరచబడిన ఆత్మలలో తాను ఉండకపోవచ్చు. తనేం చేసినా అది లెక్కకు రాదు. తనెప్పటికీ రక్షింపబడక పోవచ్చు’ జాన్ తనలో తాననుకొన్నాడు.

జాన్ సందేహంలో కొట్టుమిట్టాడసాగాడు. తన చుట్టూ ఉన్న అనేక సంగతులు చాలామంది సైతానుకు లొంగిపోతారన్న దానికి సాక్ష్యాలుగా కన్పించాయి. వృద్ధులు సైతం యింకా భౌతిక విషయాల వెంటబడటం అతడు చూశాడు.

‘ఎందుకు వాళ్ళంత వెర్రివాళ్ళుగా తయారౌతున్నారు? పవిత్రమైన వ్యక్తులుసైతం చనిపోయినవాళ్ళగురించి ఎందుకు విలపిస్తుంటారు? చనిపోయినవాళ్ళు పరదైసులో ఉంటారన్న నిశ్చయత గనుక వాళ్ళకుంటే, వారెందుకని అంత దుఃఖంలో ఉంటారు?’ ఈ చివరి పరిశీలన జాన్ ను కదిలించింది.

“నిజంగానే నేను సాతానుచే మోసగించబడ్డాను. నేను తప్పక విశ్వాసం కలిగి ఉండాలి” అని జాన్ తనలో తాను నిశ్చయించుకున్నాడు.

అతనెంత మానసిక హింసలో ఉన్నాడంటే ఇంగ్లాండులో ఏమి జరుగుతుందోకూడ తెలుసుకునే స్థితిలో లేడు. రాచరిక వాదులకూ, ఐర్లాండ్వారికీ, స్కాట్లాండ్ వారికీ వ్యతిరేకంగా పార్లమెంటువాళ్ళు జరిపిన యుద్ధం ముగిసిపోయింది. ఇప్పుడు ఇంగ్లాండు వారు డచ్వారితో సముద్ర యుద్ధం చేస్తున్నారు.

ఆలివర్ క్రాంవెల్ తన సైన్యం మద్దతుతో పార్లమెంటును రద్దుచేశాడు. అతడు తనకు తాను ‘రక్షక ప్రభువు’గా పిలుచుకొని క్రొత్త రాజ్యాంగాన్ని సృష్టించుకున్నాడు.

“ఓ భగవంతుడా! యితడు తన్ను తానే క్రొత్త రాజుగా ప్రకటించుకున్నాడన్న మాట!” ఎవరో అన్నారు.

“ఆ ఏం లేదు … తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకొని, ప్యూరిటన్ తెగలయెడల మతసహనం కనపరుస్తాడు. రాజు అనే బిరుదును తిరస్కరిస్తాడు” – కొందరన్నారు. “మూడువందల సంవత్సరాల అనంతరం దేశంలోకి మొట్టమొదటిసారిగా యూదు లను అనుమతిస్తున్నాడు” – మరికొందరు దిగులుగా అన్నారు.

“అతడు అన్ని మతాలపట్ల సహనం చూపిస్తున్నాడనడానికి యిది నిదర్శనం” – మరికొందరు సమాధానమిచ్చారు.

జాన్ తన మానసిక ఆందోళనలోకూడ ఇంగ్లాండ్లో విస్తరించిన మత సహనం గూర్చిన విషయాలు తెలుసుకున్నాడు. అతడెప్పుడూ ఆలివర్ క్రాంవెల్ను దుష్టునిగా భావించలేదు. అయితే పార్లమెంటు సైన్యం చాలా ఘోరమైన దురాగతాలు చేసింది.

నెస్బీవద్ద చితగ్గొట్టబడిన ఆ అమాయక స్త్రీలను జాన్ ఈ రోజుకీ మర్చిపోలేదు. ‘అయితే వీటన్నిటికీ ఆలివర్ క్రాంవెల్ బాధ్యుడా? ఉన్నత స్థాయిలోనున్న లార్డ్ ఫెయిర్ ఫాక్స్ ఆ సమయంలో లేడా? దానికి తోడు ఆ పనికిమాలిన యుద్ధం నేడు “పౌర యుద్ధం”గా పిలువబడుతోంది.’

ఈ సమయానికి జాన్ పట్టుదల కాస్త సడలిపోయింది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ చల్లారిపోయాయి. ఏశావులాగ శాపానికి మాత్రం గురికాలేదు. అది కేవలం తన నిరీక్షణను తాను వదిలివేసేందుకు సైతాను పన్నిన పన్నాగంమాత్రమే! చనిపోయిన వారికి సంబంధించినంతవరకు దేవుని దృక్పథంలో అది దీవెనకరమైందే గాని అది తన విశ్వాసాన్ని కొల్లగొడుతోంది.

చనిపోయినవారినిగూర్చి అంగలార్చకూడదు. ఎందు కంటే వారు త్వరగా వెళ్ళిపోయినవారేగాని, పోగొట్టుకున్నవారినిగా వారిని భావించ నవసరంలేదు. అయితే తాను తన నీతిని తిరిగి ఎలా పొందగలడు? యిది కేవలం దేవుని కృపలోని మర్మంద్వారానే తప్ప తన అధిక తర్కజ్ఞానముచేతగాని, మొండి పట్టుదలచేతగాని కాదని అతనికి అర్థమైంది.

అంధురాలైన తన కుమార్తె విషయంలో దుఃఖించడంకూడ తప్పే. తనకు ఆమె అంటే ఎంత ప్రేమంటే … ఆమెకంటే మరో బిడ్డను ఎక్కువగా ప్రేమించడాన్నికూడ తను ఊహించలేడు. ఆమెకూడ తన్ను తాను ప్రేమించుకునేదానికంటేకూడ తన తలిదండ్రులను అత్యధికంగా ప్రేమిస్తోంది.

ప్రతిరాత్రీ తన ఏకాగ్రతను ఏవీ భంగపర చని రీతిలో బైబిల్లోని విషయాలను శ్రద్ధగా విని వాటినిగురించి ఆమె మాట్లాడేది. అలా ఆమె రెండు సంవత్సరాల వయస్సున్నప్పుడు ఐదేళ్ళ పిల్లలా ఎంతో తెలివిగా మాట్లాడుతోంది.

“నాకు యిరవై ఏళ్ళప్పుడు తెలియని విషయాలు దీనికి రెండేళ్ళప్పుడే తెలుసు!” – ఆశ్చర్యంగా అన్నాడు జాన్.

జాన్ పాత్రలకు కళాయి వేస్తూనే ఉన్నాడు. అయినా అతడు గిఫర్డ్ పాస్టరుగారికి బాగా సాయపడుతున్నాడు. సెయింట్ జాన్ చర్చిలో ఆరాధనలు జరిపించుకునేందుకు అనుమతి లభించిన 1653వ సంవత్సరంలో ఫ్రీ చర్చిలో పందొమ్మిదవ సభ్యునిగా సభ్యత్వం పొందేందుకు జాన్ దరఖాస్తు చేసుకున్నాడు.

తగినంతమందిని చేర్చుకునేం దుకు ఫ్రీ చర్చి నూతన సభ్యులను ఆహ్వానించింది. సభ్యత్వాన్ని ఆశించే సభ్యుడు తన ఆత్మలో జరిగించబడిన కృపాకర్యాలను గూర్చి సంఘంముందు చెప్పవలసి ఉంటుంది.

జాన్ వణకుతూనే చాలాసేపు మాట్లాడాడు. “నిజానికి నీ సాక్ష్యం పరిపూర్ణంగా ఉంద”ని ఆరాధనానంతరం పాస్టరుగారన్నారు. మిగతా సభ్యులు జాన్ దగ్గరకు వచ్చారు.

“బ్రదర్ బన్యన్! మీరు చాలా బాగా మాట్లాడారు.”

“నేను నిజంగా కదిలించబడ్డాను బ్రదర్ బన్యన్.”

“నూతన జన్మగురించి యింత కరుణారసాత్మకంగానూ, యింత విపులంగానూ నేనెప్పుడూ వినలేదు. నువ్వెంత మానసిక సంఘర్షణను అనుభవించావ్!” ఉత్సాహంగా అన్నాడు మరొక సభ్యుడు.

“విషయాన్ని చక్కగా వ్యక్తపరచే వరం నీకున్నట్లుగా అనిపిస్తోంది” – పాస్టర్ గిఫర్డ్ గారన్నారు.

“ఆ ఏదో సంపాదనకొరకు మాటకారితనంగా మాట్లాడి మాట్లాడి అలవాటైంది లెండి” – వినయంగా అన్నాడు జాన్.

“ఈ రోజు నువ్వు క్రీస్తుకొరకు మాట్లాడావు” చివరిగా పాస్టరు గిఫర్డ్ అన్నాడు. ఏ విషయాన్నైనా రెండువైపులా సమానంగానూ, అనర్గళంగానూ మాట్లాడగలిగిన తన తలాంతునుగూర్చి ఇంతకు మునుపు జాన్ ఒకలాంటి అపరాధ భావనకు గురయ్యేవాడు.

ఇప్పుడైతే పాస్టర్గారు చెప్పింది అతనికి వాస్తవమనిపించింది. మంచిగానీ, చెడుగానీ, ప్రాముఖ్యతలేని విషయంగానీ బాగా మాట్లాడగలగడం ఒక వరం. అనర్గళంగా మాట్లాడ గలిగిన తన ఈ తలాంతును తాను ఈనాడు అత్యున్నతమైన దేవుని ఉద్దేశానికి వినియోగించాడు. ఇది అతనికి విస్మయం కలిగించింది.

అతిసాధారణమైన కళాయి వేసేవాడైన తనలాంటివాడికి క్రీస్తుకొరకు మాట్లాడే అవకాశం రావడం జాన్కు ఆశ్చర్యమేసింది. అదే సమయంలో ‘తన్ను అనునిత్యం వెంటాడుతోన్న సంశయాల సంగతేంటి?’ అతడు తన్నుతాను ప్రశ్నించుకొన్నాడు.

“జాన్! నేను మరో బిడ్డను కనబోతున్నాను” – 1653 సంవత్సరం ఆకు రాలు కాలంలో ఒక సాయంత్రం మేరీ అంది.

బన్యన్లమీద దేవుని దీవెనలనుగూర్చిన పరీక్షగురించి మరోబిడ్డ జన్మ ఒక శోధన కాబోతోంది. అయితే జాన్ ఈ శోధనపై పోరాటం చేశాడు. మానవ జీవితంలోని ప్రతి సంఘటననూ ఒక సాధనంగా వాడుకొని ‘అది దేవుని అనుమతిని పొందినదా లేక ఆయన అనుమతిని పొందనిదా, దేవుడు ప్రేమిస్తున్నాడా లేక దూరంగా ఉన్నాడా, అసలు దేవుడంటూ ఉన్నాడా, లేడా?’ అనే సందేహాలకు వ్యక్తులను గురిచేయాలని సైతాను ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాడు.

1654 ఏప్రిల్ 14న ఎలిజబెత్ అనే బిడ్డకు మేరీ జన్మనిచ్చింది. బెట్సీ అని జాన్ మేరీలు ముద్దుగా పిల్చుకునే ఆ చిన్న పాప అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంది. జాన్ ఆత్మీయ జీవితం బలపడుతోంది.

ఆర్యోగ్యవంతమైన శిశువు తనకుగానీ మేరీకిగానీ శకునం కాబోదని తనకు తాను అతడు స్థిరంగా గుర్తుచేసుకుంటున్నాడు. ఆరోగ్యంగా ఉండే బెట్సీ జీవితం దేవుని చిత్తానుసారంగానే ఉంటుంది, తన చిత్తానుసారంగా మాత్రం కాదు.

జాన్ యిప్పుడు చర్చి విషయాల్లో పాస్టర్ గిఫర్డ్ గారికి సహాయం చేయడం, తోటి సహోదరులకు సలహాలనివ్వడం, గద్దించడం, ఓదార్చడంలాంటి సవాలక్ష పనుల్లో చురుగ్గా ఉంటున్నాడు. అవసరాన్నిబట్టి జాన్ అప్పుడప్పుడూ సహోదర సహోదరీలతో మాట్లాడుతున్నాడు.

తన స్వీయ ఆలోచనల్లో చాలా బలహీనమైన రీతిలో తనలోతాను అతడు యిలా తలంచేవాడు… ‘తను మాట్లాడేవాటిని విన్న యితరులు అవి చాలా ప్రభావంగలవని చెప్పినప్పటికీ అవి నిజంగా ప్రయోజనకరంగా ఉన్నాయా, లేదా?” అని తన మాటల్ని అతడు లోతుగా పరీక్షించుకునేవాడు.

జాన్ యిప్పుడు ఎక్కువ సమయం బెడ్ఫోర్డ్లోనే గడుపుతున్నందున 1655 సంవత్సరంలో జాన్ మేరీలు బెడ్ఫోర్డ్లోనే నివసించాలని నిశ్చయించుకున్నారు. వర్షా కాలంలో జాన్కు బాగా జబ్బుచేసి విపరీతంగా దగ్గుతూ రోజురోజుకీ బాగా బలహీన పడసాగాడు. మరోసారి అతని మదిలో సందేహాలు కదలాడసాగాయి.

‘క్రైస్తవ్యానికి ఫలితాలు ఇవేనా? దీవించబడిన వ్యక్తికివ్వబడే బహుమానాలివేనా?” తన సందేహాలవల్ల అతడు యింకా బాగా జబ్బుపడ్డాడు. అతని జబ్బు సందేహాలనింకా ఎక్కువ చేసింది. “ఈ సందేహాలు యిక ఎన్నటికీ ఉపశమింపవా?” – తన చిన్న పూరిగుడిసెలో ఎలుగెత్తి రోదించాడు జాన్.

జాన్ నెమ్మదిగా తిరిగి ఆరోగ్యవంతుడయ్యాడు. తను సందేహపడినందుకు తన్ను తాను నిందించుకున్నాడు. పాస్టర్ గిఫర్డ్ గారు బాగా జబ్బుపడ్డారని విన్నప్పుడు తన సందేహాలు పూర్తి స్వార్థసహితమైనవిగా అతనికి కన్పించాయి. ఈ సమయంలో చర్చీలో ప్రసంగించమని జాను కోరారు. ఇది అతణ్ణి మోకరిల్లేట్లుగా చేసింది.

‘తనెలా దీన్ని చేయగలడు? ఒకప్పుడు తను చకాచకా మాట్లాడేవాడు. ఇప్పుడైతే తాను చాలా బలహీనునిగా, అనర్హునిగా, అయోగ్యునిగా తనకు తోస్తోంది.’ అయితే అతడు కొరింథీ మొదటి పత్రికలోని పరి. పౌలు మాటల్ని జ్ఞాపకం చేసుకున్నాడు :

“పరిశుద్దుల సేవకు వారు తమ్మును తాము సమర్పించుకొనిరి. అటువంటి సేవకై మిమ్మును మీరు సమర్పించుకొనుడి.”

జాన్ బోధించడానికి ఒప్పుకున్నాడు. పాస్టర్ గిఫర్డ్ గారు తన రోగశయ్య మీదనుండి అతనికి సలహాలిచ్చాడు. జాన్ ముందుగానే తన ప్రసంగాన్ని సిద్ధపర్చుకోవలసి ఉంది. ఆ విధంగా అతడు తన ఆలోచనలను ఒక క్రమమైన పద్ధతిలో, ఒప్పించే విధంగా ఏర్పాటుచేసుకోగలడు.

అంతేగాక పాస్టరుగారు మరో సలహాకూడ యిచ్చాడు. మేరీలాంటి తెలివిగల వ్యక్తులకు అతని ప్రసంగం అర్థంకాకపోతే, అతడు చర్చీలో మాట్లాడినప్పుడు ఇక అది ఎవరికీ అర్థంకాదన్నమాట. జాన్కు తాను వ్రాసుకున్న ప్రసంగం ఒక ‘రికార్డు’లాగా ఉంది. అది మరెప్పుడైనా ఉపయోగించుకోవడానికి అతనికి అనువుగా ఉంటుంది.

జాన్కు వాస్తవంగా తెలుసు, తాను రెండవసారి ప్రసంగించేది అస్సలుకు ఉండదని. అయినా తన ప్రసంగాన్ని అతడు పదేపదే వ్రాసుకున్నాడు. ఎప్పుడైనా మేరీకి ఏదైనా వాక్యభాగం అర్థంకాకపోతే ఆమెకు అర్థమయ్యేంతవరకు ఆ భాగాన్ని మార్చిమార్చి వ్రాసేవాడు.

అతనికి ఒక విషయం అర్థంకాసాగింది. అది ఏంటంటే తను వ్రాసిన దానిలో కొన్ని భాగాలు మేరీకి అర్థమవడంలేదంటే, దాన్ని అర్థంచేసుకునే జ్ఞానం మేరీకి లేదనికాదుగాని, అర్థమయ్యే రీతిలో తన వాక్యనిర్మాణం లేదని అతనికి తెలిసింది. ఆ సమస్య పరిష్కారానికి అతడు చాలా ఆలోచనా శక్తిని వెచ్చించాల్సి వచ్చేది.

“నా భావ ప్రకటన ఉదయకాలపు తుషార బిందువంత స్వచ్ఛంగా ఉండాలి” అని జాన్ తనలో తాననుకొన్నాడు.

చివరకు జాన్ ప్రసంగించాడు. అతడు ఎంతో క్షుణ్ణంగా సిద్ధపడ్డా, అతని ప్రసంగం అతనికి వెగటనిపించింది. తానిప్పుడు బంధకాలలో ఉన్నానని అతడు తన సంఘంతో చెప్పాడు.

తాను పాపిననీ, ఎవరైనా తాము పశ్చాత్తాపం పొందడానికి ముందుగా తాము పాపులమని వారు గుర్తించాలనీ, పాపాన్ని గూర్చిన నిశ్చయత లేకుండ ఎవడూ రక్షింపబడనేరడనీ, రక్షణ పొందనందువలన ఆత్మ నిత్య నరకాగ్ని శిక్షకు లోనౌతుందనీ అతడు బోధించాడు.

జాన్ ప్రసంగాన్ని ముగించిన అనంతరం మేరీ అతణ్ణి అభినందించింది. ఆ తర్వాత ఆమె అతని చెవిలో అంది – “నువ్వు భయపడ్డావా?”

“మొదట భయపడ్డాను, కాళ్ళు వణికాయి, అయితే ఆ తర్వాత ఉన్నత శిఖరాల కెగసిపోయాను. ముందుగా ఎంత భయం! ఆ తర్వాత ఎంత ఆవేశం! విన్నవారికి నా సందేశం ఎంతవరకు అర్థమైందో, అది ఎంతవరకు వారికి ఉపయోగకరమో నాకు తెలియదు.”

అయితే ప్రసంగం విన్న సహోదర, సహోదరీలు ఆ ప్రసంగం తమ్మును బాగా కదిలించిందనీ, తమ పాపాలనుగూర్చి బాగా ఆలోచింపజేసిందనీ చెప్పి కృతజ్ఞతలు వెలిబుచ్చారు. వాళ్ళు అబద్ధం చెబుతున్నారని అనలేంగాని, వారి వినమ్రత అందులో స్పష్టంగా కనిపిస్తుంది. తాను పెద్దగా ప్రసంగించలేదుగాని ఓ మోస్తరుగా అంటే అంగీకారయోగ్యంగా ప్రసంగించాడంతే.

అలా వాళ్ళకు అవసరమైనప్పుడల్లా ప్రసంగించడానికి జాన్ అంగీకరించాడు. సంవత్సరాల తరబడి అతడు అనుభవించిన వేదన బైబిల్లోని ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథంవరకు ఉన్న దేవుని వాక్యాన్ని జీర్ణించుకొనేందుకు దోహదపడింది. తాను ప్రసంగించేటప్పుడు అవసరమైనచోట దేవుని వాక్యాన్ని చక్కగా ఉదహరించగల సామర్థ్యం తనకున్నట్టు అతడు గమనించాడు.

1655వ సంవత్సరం సెప్టెంబరు నెలలో జాన్ బన్యన్ తన ప్రసంగం తర్వాత సంఘసభ్యులను ఉద్దేశించి యిలా మాట్లాడాడు: “సోదరీ సోదరుల్లారా! పాస్టరు గిఫర్డ్ గారు వ్రాసిన ఈ ఉత్తరాన్ని చదవాలనుకుంటున్నాను. అందులో ఆయన యిలా వ్రాశారు – ‘ఈ లోకంలో కాపరిగా ఉండేందుకు దేవుడు నాకిచ్చిన సంఘానికి …’ పాస్టరు గిఫర్డ్ గారు తాను మరణశయ్యపైనున్నప్పుడు వ్రాసిన ఉత్తరమది. ఆయన ఎంతో జ్ఞానయుక్తంగానూ, గుండెల్ని పిండేసే విధంగానూ ఆ ఉత్తరాన్ని వ్రాశారు.

ఆ తర్వాత జాన్ మేరీతో మాట్లాడుతూ, “అందరూ చూచేట్లు నేను గట్టిగా ఏడ్వ నందుకు జనం నన్ను పాస్టర్ గిఫర్పైన ప్రేమలేని వ్యక్తిగా భావించవచ్చు. అయితే ప్రభువునందు నిద్రించిన పాస్టర్ గిఫర్డ్ గారిని మనకంటే ఆశీర్వదింపబడ్డ వ్యక్తిగా క్రీస్తునందు నాకున్న విశ్వాసాన్నిబట్టి నేను నమ్ముతున్నాను.”

“మన దుఃఖాన్ని ఆయన భార్య, నలుగురు పిల్నల్ని ఓదార్చేందుకు వినియోగించడం చాలా మంచిది.”

“అవును, సంఘం తన విధవరాండ్రను ఆదరించాలి.”

1656వ సంవత్సరం జనవరి వరకు ఫ్రీ చర్చీకి పాస్టరుగారు లభించలేదు. పాస్టరు బన్యన్ గారు విశ్వవిద్యాలయంలో చదివినవాడు కాదుగాని గుర్రపు బండ్లను తయారుచేసేవాడు. అతడు తగినంత పరిశుద్ధ వ్యక్తిత్వం కలవాడేగాని శారీరకంగా బలవంతుడు కాడు. వారాలు గడిచేకొద్దీ సహోదరులు అతనికి చాలా సహాయపడవలసి వచ్చింది. జాన్ బన్యన్ చర్చీలో ప్రసంగించడమేగాక, చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో, వ్యవసాయ గిడ్డంగుల్లో, బహిరంగ ప్రదేశాల్లోకూడ బోధింపసాగాడు. ‘క్వాకర్లు’ అనే ఒక క్రొత్త మతశాఖకు చెందిన వ్యక్తులను జాన్ ఎదుర్కొనవలసి వచ్చింది.

బెడ్ఫోర్డ్లో కొంతకాలం నివసించిన జార్జి ఫాక్స్ అనే వ్యక్తి ఈ ‘క్వాకర్ల’ శాఖ సంస్థాపకుడు. త్వరలో ఈ కాకర్లు చుట్టుప్రక్కల ప్రాకిపోయి ప్రశాంతమైన ఆరాధన కూడికలను ఆటంకపరస్తూ, యితర చర్చీలకు వెళ్ళి వారి విశ్వాసాలను బహిరంగంగా సవాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రొత్త గుంపుపట్ల జాన్కు సదభిప్రాయం లేదు. చాలామంది క్రొత్త క్వాకర్లు తనకు చాలాకాలంనుండి తెలుసు. వాళ్ళలో చాలా మంది యింతకు మునుపు రాంటర్లు, ఈ రాంటర్లు తీవ్రమైన మత ఛాందసవాదులై నందున ఆలివర్ క్రాంవెల్ ప్రభుత్వంద్వారా చాలా హింసించబడి, కొంత మతసహనం కలిగిన ఈ క్వాకర్ల గుంపులో చేరారు.

“జార్జ్ ఫాక్స్ గారు ఈ క్వాకర్లు ఎలా ఉండాలని ఉద్దేశించాడోగాని, నాకు తెలిసి నంతవరకు వారిలో చాలామంది అవినీతిపరులు” అని జాన్ మేరీతో అన్నాడు.

1656వ సంవత్సరంలో ఒక రోజు ఎడ్వర్డ్ బరో అనే ఒక క్వాకర్ బెడ్ఫోర్డ్లోని మార్కెట్ హౌస్ దగ్గరనున్న ప్రధాన వీధిలో ప్రసంగిస్తున్నాడు. అది వినడానికి జాన్ ఆగాడు. బరో ప్రసంగం చాలా శక్తివంతమైన పదజాలంతో కొనసాగుతోంది. అతని మాటలు ఎదుటివారిని ఒప్పించేవిధంగా ఉన్నాయి. జాన్ ఇక మౌనంగా ఉండలేక పోయాడు. ఆశ్చర్యకరమైన రీతిగా బరో మాటల్ని సరిచేస్తూ అతడు చెప్పినదానికి వ్యతిరేకంగా జాన్ మాట్లాడ్డం ప్రారంభించాడు.

బరో మొదట జాన్ను చాలా చులకనగా చూశాడు. అయితే తన వాదనను జాన్ దేవునివాక్య ప్రమాణాలతో ఎదిరించేసరికి బరోకు కోపమొచ్చింది.

“ఎవరీ నరకానికి సంబంధించిన వ్యక్తి?” అని జాన్పై విరుచుకుపడ్డాడు బరో.

తర్వాత తన ధైర్యానికి ఆశ్చర్యపడుతూ యింటి ముఖం పట్టాడు జాన్. ఇప్పుడు చర్చి వెలుపల ఎక్కడైనా జాన్ సువార్త ప్రకటిస్తుంటే అడ్డుకోవడం కాకర్ల వంతయింది. అయితే బహిరంగంగా జాన్తో వాదించడం ఒక వెర్రి సాహసమే అవుతుంది. అతని సమయస్ఫూర్తి, వేగంగా పరుగెత్తే అతని ఆలోచనాశక్తి, అతని పరిపూర్ణ వాక్య స్ఫురణల ముందు ఎవరూ నిలువలేకపోయేవారు. ఒక రోజు తీవ్రంగా కలతపడ్డ ఒక క్వాకర్ మితిమీరిన కోపంతో ఇలా అన్నాడు – “నీ లేఖనాలను తీసి అవతల పారేయ్!” “చిట్టచివరకు నీ నిజమైన విశ్వాసమేంటో బయటకు వచ్చింది” – విజయోత్సా శ్రీ అన్నాడు జాన్ – “దేవుని వాక్యానికి బదులుగా మీరేది నమ్మాలనుకుంటారో దాన్నే నమ్ముతారు. మీరు మాయావాదులు తప్ప మరేం కాదు.”

అయితే ఈ క్వాకర్లు అతనితో పదేపదే ఘర్షణ పడేవాళ్ళు. ఇప్పుడు అతని ప్రసం గాలు ‘పాపాన్ని గుర్తించండి’ అంటూ బ్రతిమలాడే ధోరణినుండి ‘అబద్ధపు బోధల’ మీద తీవ్రంగా దాడిచేసే ధోరణికి మారాయి. తాను న్యూపోర్ట్ ప్యాగ్నెల్లో చదివిన తీవ్రతరమైన కరపత్రాలను జ్ఞాపకం చేసుకున్నాడు జాన్. తన విమర్శకులను ఎదుర్కో డానికీ, వారి అబద్ధ బోధలమీద దాడిచేయడానికీ తన మనోభావాలను కరపత్రాల రూపంలో ముద్రించాలనుకున్నాడు జాన్. ‘కాని తాను చక్కగా వ్రాయగలడా?’

పాస్టర్ బర్టన్ గారి ప్రోత్సాహంతో క్వాకర్లకు వ్యతిరేకంగా ఒక కరపత్రం వ్రాయడం మొదలుపెట్టాడు జాన్. తాను క్వాకర్లతో పదేపదే ఘర్షణకు గురయ్యేకొద్దీ అతని కరపత్రం పెద్దదిగా, వేడివేడిగా తయారవ్వసాగింది. ఒక రోజు పాస్టర్ బర్టన్ గారిలా అన్నారు – “బ్రదర్ బన్యన్! నీ కరపత్రానికి నేను వ్రాసిన ‘ముందుమాట’ యిదిగో!” “ముందు మాటా!” జాన్ ఆశ్చర్యంగా చేతికి తీసికొని చదవడం ప్రారంభించాడు.

ఈ మనుష్యుడు భూసంబంధమైన విశ్వవిద్యాలయంనుండి ఎన్నుకొన బడినవాడు కాదుగాని క్రీస్తు సంఘమనే పరలోక విశ్వవిద్యాలయంనుండి ఎన్నుకోబడ్డాడు… ఇతడు దేవుని కృపచేత మూడు పరలోకపు డిగ్రీలను పొందాడు. అవి క్రీస్తుతో ఐక్యత, పరిశుద్ధాత్మాభిషేకం, సాతాను శోధనలవలని అనుభవం అనేవి. ఇవి ఏ విశ్వవిద్యాలయం యిచ్చే డిగ్రీలకంటేకూడ అత్యంత సమర్థవంతంగా సువార్త ప్రకటనాశక్తిని యితనికి యిచ్చాయి … ఇతని విశ్వాసంలోని పరిపూర్ణత, దైవికమైన యితని సంభాషణ, సువార్త ప్రకటించ డానికి యితనికున్న శక్తి సామర్థ్యాలను యితనితో నాకున్న అనుభవాలద్వారా నేను తెలుసుకున్నాను.

“మీకు చాలా కృతజ్ఞుణ్ణి. కాని నా కరపత్రం యింకా పూర్తికాలేదు” జాన్ అన్నాడు.

“నువ్వు తప్పక దాన్ని త్వరగా ముగించాలి. లేదంటే ఈ రాంటర్లకు విరోధంగా మీరు చేసిన మంచి తర్కాల్ని ప్రజలెలా తెలుసుకుంటారు?” – పాస్టర్ బర్టన్ అన్నాడు . “నీవు ఆలస్యం చేస్తూ వ్రాసుకొంటూ పోతుంటే ఎవరూ చదవడానికి ఇష్టపడనంత పెద్దదిగా అది తయారయ్యే ప్రమాదం కూడ ఉంది”.

మేరీ తన నాలుగో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ మగపిల్లాడ్ని జూనియర్ జాన్ అని పిలవడానికి బదులు జాన్ మేరీలు ముద్దుగా ‘జానీ’ అని పిలిచారు. “మనం ఈ కాకర్లమీద యుద్ధం ప్రకటించడం తప్పదంటావా?” ప్రశాంతంగా జీవించాలన్న తపనతో అంది మేరీ.

“ఇది మనకూ క్వాకర్లకూ మధ్య జరిగే యుద్ధం కాదుగాని, మానవ ఆత్మల క్షేమం నిమిత్తం సత్యానికీ అసత్యానికీ మధ్య జరిగే ఒక పెనుయుద్ధం. ఈ క్వాకర్లు బైబిల్ను విడిచిపెట్టి మాయావాదంలో కొట్టుకొనిపోతున్నారు. యేసు మరణించి తిరిగిలేచిన ఒక చారిత్రాత్మక పురుషుడు. అంతేగాని మరణాన్ని అనుభవించని ఒక మాయాస్వరూపుడు కాదు. అలాగైతే ఆయన పునరుత్థానానికి అర్థమే లేదు.”

“దుర్మార్గులు!” అంధురాలైన మేరీ మధ్యలో జోక్యం చేసికుంటూ అంది. ఇప్పుడామెకు ఆరేండ్లు. “క్రీస్తు గతంలో ఏమైయుండెనో, ప్రస్తుతం ఏమైయున్నాడో బైబిలు గ్రంథం స్పష్టంగా చెబుతోంది.”

జాన్ తన కరపత్రాన్ని ముగించి దానికి శీర్షికగా “క్రీస్తుయొక్క అయోగ్యుడైన దాసుడును, బెడ్ఫోర్డ్ నివాసియు, దేవుని కృపచేత ఆయన ప్రియకుమారుని సువార్తను ప్రకటించువాడునైన జాన్ బన్యన్ వ్రాసిన తెరువబడిన కొన్ని సువార్త సత్యాలు” అని వ్రాశాడు. దీనిని న్యూపోర్ట్ ప్యాగ్నెల్లోని తన పాత మిత్రుడైన మాథ్యూ కౌలీవద్ద అతడు అచ్చువేయించాడు.

‘పాత్రలకు కళాయివేసే ఒక వ్యక్తి ఒక కరపత్రం వ్రాసే చొరవ తీసుకున్నాడంటే ప్రజలేమనుకుంటారు? అసలీ కరపత్రం ఒక కళాయివేసే వ్యక్తి వ్రాసినట్లు ఎవరైనా గుర్తిస్తారా?’ జాన్ అనుకున్నాడు.

Leave a Comment