విడుదలైన బోధకుడు

విడుదలైన బోధకుడు

“బన్యన్” రొప్పుతూ పిలిచాడు జైలర్.

“ఏంటి మిత్రమా?”

“నీ విషయం నాకు చాలా విచారంగా ఉంది. చూడు, నువ్వు నీ బోధను ఎందుకు వదులుకోకూడదు?”

“రాజుగారు మత స్వాతంత్ర్యాన్ని ఎందుకంగీకరించకూడదు?”

విషయ పరిజ్ఞానమున్న ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు రాజు మత స్వాతంత్ర్యం యివ్వడానికి ప్రయత్నిస్తున్నాడని జాన్ తెలుసుకున్నాడు. మత వ్యతిరేకులకు విరోధంగా రూపొందించబడిన తీవ్రమైన నిషేధాజ్ఞలు పార్లమెంటు బలవంతంగా ప్రవేశపెట్టినవే.

అయితే వాళ్ళకు పైకి అర్థమయ్యిందేమిటంటే ఈ మత స్వేచ్ఛను ప్రోత్సహించడంవలన రాజుగారు కథోలిక్ మతానికి మద్దతు పలుకుతున్నాడని. అతని తమ్ముడు జేమ్స్ ఒక్క పేరు విషయంలో తప్ప అన్నిటిలోను కథోలిక్కేనన్న విషయం అందరికీ తెలిసిన సంగతే.

“ఎటువంటి మెలిదిరిగిన, ఆందోళనకరమైన ప్రపంచాన్ని మనుషులమైన మనం తయారుచేసుకున్నాం?” జాన్ వ్యాఖ్యానించాడు.

జాన్ లేసులు ముడివేస్తున్నాడు, ఖైదీలకు ఆత్మీయ సలహాలిస్తున్నాడు, చివరకు తనను కలవాలని బయటనుండి వచ్చేవాళ్ళకు కూడా జైలర్ అనుమతిమీద అతడు ఆత్మీయ సలహాలిస్తున్నాడు. మిగతా సమయాల్లో వ్రాస్తున్నాడు.

కొంతకాలం “పరలో కానికి సామాన్యుని కాలిబాట”వంటి హాస్యపూర్వకమైన భావార్థ గ్రంథం వ్రాద్దామను కున్నాడు గాని, అంతకంటే సుగంధభరితమైన వచన కావ్యాన్ని, మధ్యమధ్య పద్యాలు చిలకరిస్తూ వ్రాస్తే బాగుంటుందనుకున్నాడు.

తాను వ్రాసిన ‘కృపా సమృద్ధి’ గ్రంథాన్ని చదివినవారు తామా గ్రంథాన్ని చదివి బాగా ఆత్మీయాభివృద్ధినొందామని చెప్పగా జాన్ విన్నాడు. ఇంకా ఎక్కువ ప్రతుల్ని ముద్రించాలని అతడు ప్రేరేపించబడ్డాడు.

కాబట్టి అతడు దాన్ని పునఃపరిశీలన చేశాడు. అది బహుశ అతని ఆత్మీయ యాత్రకు సంబంధించిన విషయమే కావచ్చు. కాని అదే అతని మనస్సులో ఎప్పటినుండో మెదలుతున్న బృహత్ కథావస్తువు.

1666 సెప్టెంబరులో చెరసాల మళ్ళీ లండన్ నుండి వచ్చే వార్తలతో నిండిపోయింది.

“మొదట్లోనేమో ప్లేగు, యిప్పుడేమో యిది!” – ఊపిరి బిగబట్టి అరిచాడో ఖైదీ.

“ఈ వార్త నీకెలా తెలుసు?” అడిగాడు మరొకడు.

“లండన్నుండి గ్రేట్ నార్త్ రోడ్డు వరకూ అందరి నోటా యిదే వార్త. ”

“ఏంటది?” జాన్ అడిగాడు.

“లండన్లో ఓ గొప్ప అగ్ని ప్రమాదం.”

లండన్ అంతా విచిత్రమైన చెక్క నిర్మాణాలతో పక్షిగూళ్ళలా అల్లుకుపోయిందని జాను తెలుసు. “ఎవడైనా సరే ఇళ్ళ కప్పులమీదనుండే లండన్ అంతా పరుగెత్త వచ్చు” జాన్ సణిగాడు.

“కాబట్టి నిప్పుకూడ అలాగేనన్నమాట” – జాన్ ఆలోచనను పూర్తిచేస్తూ ఓ ఖైదీ జోడించాడు.

వాళ్ళంతా మళ్ళీ రాబోయే తాజా వార్తలకోసం ఎదురుచూడసాగారు. అవి ఉర వడిగా రానేవచ్చాయి.

ప్లేగు తన పని ముగించుకోవడానికి తొమ్మిది నెలలు పడితే, యీ అగ్ని తన పనిని ఐదురోజుల్లోనే ముగించుకుంది. మళ్ళీ మరోమారు దేవుని ఉగ్రతనుగూర్చిన చర్చ వచ్చింది.

“చార్లెస్ రాజూ, అతని పార్లమెంటు సభ్యులూ కూడా అలానే భావిస్తారని నేను ఆశిస్తున్నాను. బహుశ తాము అణగద్రొక్కినవాళ్ళను వాళ్ళు స్వేచ్ఛగా వదిలేయవచ్చు” జాన్ అన్నాడు.

వేలాదిమంది లండన్వాసులు కేవలం కట్టుబట్టలు తప్ప సర్వం కోల్పోయారన్న వార్తలు విని ఎవరు సంతోషిస్తారు? ఫ్రాన్సిస్ స్మిత్ గిడ్డంగిలో నిల్వ చేయబడిన తన పుస్తకాల ప్రతులన్నీ కాలిపోయాయని విని జాన్ చాలా దుఃఖించాడు.

జాన్ న్యాయమూర్తులు మరియు కానిస్టేబుళ్ళద్వారా చాలా క్షోభను అనుభవిం చాడు. 1668 హేమంత ఋతువునాటికి అతడు జైలునుండి బయటకూ, బయటి నుండి తిరిగి జైలుకూ పదేపదే త్రిప్పబడ్డాడు. బోధించాలన్న తొందరపాటు యిప్పుడు అతనిలో పెద్దగా లేదు. అది అతడు మళ్ళీ తీవ్రంగా అదుపు చేయబడటానికి మాత్రమే కారణమౌతుంది.

తనకు లభ్యమైనదాన్నే తాను తీసుకోవాల్సి ఉంటుంది. అలా తలంచి అతడు సంఘసభ్యుల సమస్యలకు పరిష్కారాలు సూచించేందుకూ, వివాదాలు పరిష్క రించేందుకూ, బలహీనులకు బోధించేందుకూ తన సమయాన్ని వెచ్చించసాగాడు.

ఏదో తెలియని ఒక గొప్ప భావావేశం ఓ పెద్ద రచననుగూర్చి అతణ్ణి ఆలోచింప చేసింది. అతడిప్పుడు “పరలోక ప్రయాణికుడు” అనే కరపత్రాన్ని వ్రాస్తున్నాడు. ఇది పరలోకంకోసం, రక్షణకోసం ఒక మనిషిచేసే పరుగుపందానికి సంబంధించినది.

ఇది మనిషి విజయానికి పూర్తి అవరోధాలతో కూడుకొన్నట్టిది. తమని విడిచిపెట్టవద్దని స్నేహితులు అతణ్ణి బ్రతిమాలతారు. దారి చుట్టూ తిరిగి చిత్తడి నేలకు తీసుకెళ్ళడం, కొన్ని మార్గాలు మూసుకుపోవడం వంటివి అందులో ఉంటాయి.

ఇతర పందెగాళ్ళు ఎందుకు ఓడిపోయారనేదానికి ఆచార్యులు అబద్ధాలను ఆక్షేపణ లేకుండ అంగీక రించడం, సందేహాలతో బరువెక్కి పోవడంలాంటివి సవాలక్ష కారణాలు చూపబడ తాయి. అతడు దాన్ని వ్రాయడం మొదలుపెట్టాక అది పెరిగి పెరిగి ఒక కరపత్రం పరిమాణాన్ని మించిపోయింది. వాస్తవానికి అదొక చిన్నసైజు పుస్తకమయ్యేట్టుంది. జాన్ ఆ వ్రాతప్రతిని ప్రక్కనపెట్టాడు. ఈ కథావస్తువుతో ఒక విస్తృతమైన రచన ఏదో చేయాలని అతని మనసు అతనికి బోధిస్తోంది.

ఒక పెద్ద రచనను తలపెట్టేందుకు ఏదో శక్తి అతణ్ణి పురికొల్పుతోంది. ఇప్పుడు దేన్ని ముద్రించాలన్నా కష్టమైన పనే. అందుకు జాన్లాంటి కొంతమందికి అస్సలు అనుమతి దొరకదు. అనేక సంవత్సరాల సమయం తీసుకునే బృహత్తర సాహిత్య రచనకు ఉపక్రమించేందుకు సరైన సమయం యిదేననిపించింది జాన్కు.

ప్రక్కన పెట్టలేనంత ఆసక్తికరమైనదీ, మరచిపోలేనంత విజ్ఞానదాయకమైనదీ అయిన ఒక రచనను అతడు సృష్టించాలనుకున్నాడు. చివరిగా “పరలోక ప్రయాణికుడు” అనే కథావస్తువునే తీసుకొని దాన్నే ఒక పెద్ద కథగా మలచాలనుకున్నాడు. తొలిసారిగా తన పాపాన్నిగూర్చి తెలుసుకొన్న ఒక వ్యక్తి తన క్లిష్టమైన గమ్యాన్ని చేరడాన్ని గురించి అతడు ఒక కథ వ్రాయాలనుకున్నాడు.

“అతణ్ణి ఓ యాత్రికుణ్ణి చెయ్” సలహా యిచ్చింది ఎలిజబెత్.

“పరలోకానికి వెళ్ళే యాత్రలో . లోతుగా ఆలోచిస్తూ అన్నాడు జాన్.

“మహిమకరమైన పట్టణానికి” మేరీ బిగ్గరగా అన్నది.

“కాని మహాకష్టాలతో” ఆనందంతో చప్పట్లు కొడుతూ అంది ఎలిజబెత్.

త్వరలోనే జాన్ తన మహాకావ్యంలోని మొదటి భాగాన్ని పూర్తిచేశాడు. అది ఒక వ్యక్తి నిద్రనుండి మేలుకొని తాను కన్న కలను తిరిగి జ్ఞాపకం చేసుకునే రూపంలో వ్రాయబడింది. కథకుడు వినాశపురంలో నివసించే క్రైస్తవుడను పేరుగల వ్యక్తినిగూర్చి కలగంటాడు.

క్రైస్తవుడు బైబిల్ను చదవడం ప్రారంభించాక తన వీపుమీదనున్న గొప్ప పాపభారాన్నిగూర్చి తెలుసుకొని వేదన చెందుతాడు. చాలా దినాలు అతడు మైదానాల్లో ఏడుస్తుంటాడు. చివరిగా సువార్తికుడనే వ్యక్తి అతణ్ణి ఓదార్చి ఆ పాపభారాన్ని వదిలించు కోవాలంటే దూరంగా కన్పించే ఒక చిన్న ద్వారం దగ్గరకు వెళ్ళడమే మార్గమని చెబుతాడు.

క్రైస్తవుని కుటుంబ సభ్యులంతా అతణ్ణి ఒక పిచ్చివాణ్ణిగా తలుస్తారు. తన కుటుంబాన్ని విడిచిపెట్టడం తనకు బాధకరంగా వున్నా తన భారాన్ని వదిలించుకోడానికి తాను తప్పక వెళ్ళాలని అతడు నిర్ణయించుకొంటాడు.

‘మొండివాడు’, ‘మెత్తనివాడు’ అనే పొరుగువారు అతణ్ణి ఆపడానికి ప్రయత్నిస్తారు. తనతో వచ్చేందుకు ‘మెత్తనివాణ్ణి’ క్రైస్తవుడు ఒప్పిస్తాడు. ‘నిరాశ ఊబి’ అనే బురదగుంటలో క్రైస్తవుడు దాదాపు మునిగి పోయేటప్పుడు ‘సహాయకుడు’ అనే వ్యక్తి అతణ్ణి బయటకు లాగుతాడు. ‘మెత్తనివాడు’ అప్పటికే వినాశపురానికి తిరిగి వెళతాడు. క్రైస్తవుని ప్రయాణం చాలా కష్టతరంగా
ఉంటుంది.

క్రైస్తవుడు ఆ ద్వారం దగ్గరకు వెళ్ళకముందే ‘లోకజ్ఞాని’ అనే వ్యక్తి అతణ్ణి కలసి కనిపించే పర్వతం దగ్గరకు వెళ్ళమనీ, అక్కడ ‘నీతి పట్టణం’ ఉంటుందనీ, అక్కడ ‘చట్ట బద్ధత’ అనే వ్యక్తి వద్ద సలహాలు పొందమనీ సూచిస్తాడు. అయితే అదృష్టవశాత్తు సువార్తికుడు క్రైస్తవునిలోని లోపాన్ని కనుగొంటాడు.

అతడు క్రైస్తవుణ్ణి తిరిగి పెద్ద ద్వారం వద్దనున్న ఒక చిన్నద్వారం వద్దకు పంపిస్తాడు. అప్పుడు ఆ పర్వతం యిలా పెద్దగా గర్జిస్తుంది : “ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటించడానికి విఫలమౌతారో వారంతా శాపగ్రస్థులు. ఎందుకంటే, ‘ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన నియమాల్ని పాటించ డానికి ఎవరైతే విఫలమౌతారో వారంతా శాపగ్రస్థులు’ అని వ్రాయబడి ఉంది.”

“ఎవ్వరూ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను నెరవేర్చజాలరు” వివరించాడు సువార్తికుడు.

క్రైస్తవుడు ఎవరితోనూ మాట్లాడేందుకు యిష్టపడక తన మార్గంలో తాను వెళ్ళేందుకు త్వరపడుతుంటాడు. అతడు మరలా మార్గాన్ని కనుగొని చిన్న ద్వారంవద్దకు వస్తాడు. ఆ ఇరుకైన చిన్న ద్వారంమీద ఇలా వ్రాయబడివుంది – b“తట్టుడి, మీకు తీయబడును.”b

అతడు ఆ తలుపు తట్టి ఇలా బిగ్గరగా ఏడుస్తాడు :

నేనిప్పుడు యిక్కడ ప్రవేశించవచ్చా?

లోపలనున్నవాడు నాకు ద్వారం తెరిచేందుకు యిష్టపడతాడా?

విడుదలైన బోధకుడు నేనొకవేళ అయోగ్యుడనూ, తిరుగుబాటుదారుడనైనప్పటికీ ఆయన నాకు ద్వారం తెరుస్తాడా! అలాగైతే యిక నేనెన్నటికీ తప్పిపోను, ఆయనకు నిత్య స్తుతిగానాలు ఆలపిస్తూ నే ముందుకెళతా.

అప్పుడు ‘సహృదయుడు’ అనే వ్యక్తి తలుపుతీసి, నిరంతరం పొంచియుండు సైతాను చివరిక్షణంలో అతనిమీద పడకుండా తక్షణమే అతణ్ణి లోపలికి లాక్కుంటాడు. తన బృహత్కావ్యంలోని మొదటి భాగపు ప్రారంభంలో జాన్ వ్రాసిన కథ యింతవరకే.

5000 పదాలున్న యీ మొదటి భాగపు ప్రారంభాన్ని జాన్తోవున్న కొందరు ఖైదీలు చదివారు. దాన్ని చదివేందుకు అతను కావాలనే మతాసక్తిలేని కొంతమంది నేరస్థులను ఎన్నుకున్నాడు. వాళ్ళు చదివినదాన్ని వివరించమని అతడు అడిగాడు. వాళ్ళ ప్రశ్నలను అతడు సావధానంగా విన్నాడు. తర్వాత పునఃపరిశీలన చేశాడు.

అతడు ప్రకటించిన ప్రతి సత్యాన్నీ లేఖనంతో సమర్థించాడు. ఎప్పుడూ వ్రాసినట్టు కాకుండా తరచుగా ‘మార్జిన్’లో అధ్యాయాన్నీ, వచనాన్నీ అతడు సూచించాడు. అతని కుటుంబ సభ్యులుకూడ వ్రాతప్రతిని పఠించారు గాని, ఖైదీల అభిప్రాయాలే అతని రచనను ఎక్కువగా ప్రభావితం చేశాయి.

రక్షణయాత్రకు సంబంధించిన విషయాలు అతని కుటుంబానికి సుపరిచితమే. అయితే జాన్ రక్షణావశ్యకత ఉన్నవాళ్ళను రక్షించాలనుకున్నాడు. ఖైదీలు అర్థం చేసుకోవడంమాత్రమే కాదు, అది వాళ్ళను హత్తుకునేంతవరకు ప్రతి విభాగంమీదా అతడు పనిచేశాడు.

అతని కథ ఏవిధంగా చూసినా ఒక అసాధారణమైన కథా వస్తువుగా రూపొందు తోంది. క్రైస్తవుడు నిరాశా ఊబినుండి బైటపడటానికి సహాయం పొందేంతవరకు తానున్న ఆ ఊబికి అనేక ఉపరితలాలున్నాయి. ఆ బురద ఊబిని బాగుచేయడానికి ప్రభువు ఒకవేళ పూనుకున్నా అది బాగుపడనటువంటిది.

ఒక పాపి తాను ‘పాపి’ననే నిశ్చయతకు చివరగా వచ్చినప్పుడు భయసందేహాలు ఉత్పన్నమై, అర్థంలేని ఆందోళనలూ అపవిత్రతా ఆ నిరాశలోనికి వస్తాయి.

వెయ్యి సంవత్సరాలుగా లక్షలాది ఉపదేశాలతో ఆ బురద ఊబిని పూడ్చేందుకు బండ్ల కొద్దీ మట్టిని కుమ్మరిస్తున్నారు ప్రభువు సేవకులు. వారు బురదగుంటలోనికి మెట్లు నిర్మించినా, భయాలూ సందేహాలూ పాపుల్ని ముంచివేయగా వాళ్ళు ఆ గుంటలో దబ్బున పడుతుంటారు.

“బన్యన్, దీన్నెప్పుడు అచ్చువేసేవాని దగ్గరకు తీసుకెళతావ్?” బాగా పునఃపరిశీలన చేయబడిన పాఠాంతరాన్ని క్షుణ్ణంగా చదివి ఆమోదించిన ఒక ఖైదీ అడిగాడు.

“ఇదిప్పుడే ప్రారంభించిన కథ” – జవాబిచ్చాడు జాన్ – “ఈ రక్షణ యాత్ర చాలా సుదీర్ఘమైనది. చాలా కష్టమైంది కూడా. నేననుకుంటాను … ముగించబోయే నాటికి యీ కథ నువ్వు చదివిందానికన్నా పది రెట్లుండవచ్చు.”

“నిజమా? అలాగైతే యిలాంటి రచన యింతవరకు ఎవరూ చేసి ఉండరు” ఆశ్చర్యపోతూ అన్నాడా వ్యక్తి.

“బహుశ అందుకేనేమో దేవుడు నన్నీ చెరసాలలో ఉంచాడు. లేకపోతే దీన్ని పూర్తిచేయడానికి నాకు సమయముండేది కాదు.” చాలా రోజులు జాన్ అలానే అనుకునేవాడు. చెరసాల అతనికి ఎవరూ ఆటంక పరచని కార్యాలయం అయింది.

“అంధకారమయంగానున్న నీ జీవితంలో ఓ ఆనందకరమైన స్థితిని తప్పక చూస్తావు” – నొసలు చిట్లించి అన్నాడా వ్యక్తి.

“క్రీస్తువద్దకు రావయ్యా, అప్పుడు ఏ నియంతా నిన్ను ఖైదీగా చెయ్యలేడు” – జాన్ ఆ వ్యక్తితో అన్నాడు.

తన సుదీర్ఘ దినాలన్నింటిలో జాన్ చెరసాలలోనే కూర్చొని ఉన్నప్పటికీ అతడు వ్యర్థంగా తన రోజుల్ని గడపడం లేదుగాని, వాస్తవంగా తన జీవితంలోని ప్రతి క్షణాన్నీ అతడు ఆస్వాదిస్తూ తన బృహత్ కావ్యంలోని వెలుగును చవిచూస్తూ ఉన్నాడు. తన బృహత్ కావ్యానికి తాను వ్రాసిన పీఠికలో ఆ గ్రంథ రచనావిధానాన్ని పద్యరూపంలో యిలా వ్రాశాడు :

మన ఈ సువార్త దినాల్లోనూ ప్రభుని కృపాకాలంలోనూ, పరిశుద్ధుల పరలోక పరుగును గురించి వ్రాస్తూ, ఇరవై అంశాలను గురించి చిత్రీకరించాను;
ఇంకా యిరవై అంశాలు నా మదిలో మెదుల్తున్నాయి, అగ్ని జ్వాలల్లోంచి ఎగిసిపడే నిప్పురవ్వల్లాగా, అవి యింకా నాలో ద్విగుణీకృతమౌతూనే ఉన్నాయి.

నిప్పురవ్వలు నిజంగానే నింగికెగిసాయి. జాన్ ఆలోచించడం ప్రారంభించాడు. అతని మనస్సులోనుండి ఆలోచనలు మెరుపుల్లా బయటకు రాసాగాయి. నదులు, పర్వతాలు, కొండలు, యింకా కవచాలు, యుద్ధాలు … జాన్ తన జ్ఞాపకాల లోతుల్లోకి వెళ్ళిపోయాడు. షార్పెన్హూ (Sharpenhoe) దగ్గరనున్న పర్వతాలను వాటి సౌంద ర్యాన్నిబట్టి అతడు ఎంతగా ప్రేమించి అభిమానించాడో! అవి యిప్పుడు అతని కావ్యంలో మనోహర పర్వతాలుగా మారాయి.

అతడెంతగానో యిష్టపడ్డ హాటన్ గృహం (Hough ton House) యిప్పుడు అతని సౌందర్య గృహం (House Beautiful) అయింది. ఈ సౌందర్య గృహాన్ని విపరీతమైన శ్రమలేకుండా చేరలేరు గనుక జాన్ దీన్ని ‘శ్రమ పర్వతం’ (Hill of Difficulty) అని పేరుగల ‘నిటారు కొండ’ (Precipitous Hill) గా వర్ణించాడు.

అది తన భార్య మేరీ ఆమె బాల్యంలో మోకాళ్ళతో చేతులతో ఎక్కడానికి అవస్థపడ్డట్టు ఆమె వర్ణించిన హెల్స్బీ కొండ (Helsby Hill) నూ, దాన్ని ఎక్కడానికి ఆమె పడ్డ శ్రమనూ జ్ఞాపకం చేసుకుంటూ అతడు వ్రాశాడు.

తన కథలో అతనికి యింకా చాలా పాత్రలు కావల్సివచ్చాయి. ప్రతి పాత్రా సజీవంగా ఉండేందుకు తనకు తెలిసిన వాస్తవ వ్యక్తులనే అతడు దృష్టించాడు. ‘మెత్తనివాడు’ ఒక వాస్తవమైన వ్యక్తి, ‘మొండివాడు’ కూడా వాస్తవమైన వ్యక్తే. అన్ని పాత్రలనూ అతడలాగే తీసుకున్నాడు.

జాన్ తన నిజ జీవితంలోని న్యాయమూర్తియైన కెలింజ్ జడ్జిగారిని క్రైస్తవునియొక్క దుష్ట న్యాయవాదియైన ‘సుగుణద్వేషి’ (Judge Hate-good) గా మల్చడంలో ఒక వింతైన సంతృప్తిని పొందాడు.

రాంటర్లు, కులీనులు, రక్షకభటులు, ఆచార్యులు, పాస్టర్లు, వ్యాపారులు వీరంతా సజీవంగా కాగితంపై దర్శనమిచ్చారు. కొంతమంది చెడు పక్షంగా ఉన్నవాళ్ళైతే, మరికొందరు దేవుని కృపచేత రక్షింపబడినవారికి ప్రాతినిధ్యం వహించారు.

కొద్దిమంది దోషం లేనివాళ్ళుకూడ ఉన్నారు. వాళ్ళ పేర్లు యిలా ఉంటాయి : నిరాడంబరం (Simple), బద్దకం (Sloth), మూర్ఖభావం (Presumption), ఆచారవంతుడు (Formalist), వేషధారణ (Hypocrisy), అపనమ్మకం (Mis- trust), పిరికితనం (Timorous), అశ్రద్ధ (Wanton), అసంతృప్తి (Discontent), అవమానం (Shame), వదరుబోతు (Talkative), పనికిమాలినవాడు (No-good), అపకార బుద్ధి (Malice), మంచి సంభాషణ (Say-well), ధనాశ (Money- love), అజ్ఞాని (Ignorance), వ్యర్థ నమ్మకము (Vain-confidence), ప్రక్కకు తొలగు (Turnaway), అల్ప విశ్వాసం (Little-faith), దుర్బల హృదయం (Faint-heart), అపరాధ భావన (Guilt), నాస్తికుడు (Atheist). ప్రాపంచిక విధానం (Carnal Policy), దయలేని (Graceless), మోసం (Deceit), వెనుదిరుగు (Turnback) అనే పట్టణాలనుండి వారు వచ్చారు.

ఆ దారి పొడుగునా సాతానుని భయంకరమైన సేవకులుంటారు. వాళ్ళు పిశాచులు, (Habgoblins), వన దేవతలు (Satyrs), జలరాక్షసి (Dragons), ఉన్నత దేహులు (Gaints) సింహాలు (Lions), భట్రాజులు (Flatterers), అవినీతిపరులు (Corrupt Men) మొదలైనవారు. వాళ్ళు త్రోవకు ఆవలగా ఉంటారు.

ధైర్యవంతులు కొందరు దారిలోనే చచ్చినవాడి గొంది (Deadman’s Lane), నిరాశ (Despair), విధ్వంసం (Destruction), ప్రమాదం (Danger), పచ్చికల ప్రక్కదోవ (By-path Meadow), మాయా సంత (Vanity Fair), అవమానాల లోయ (Valley of Humiliation), మరణచ్ఛాయల లోయ (Valley of the Shadow of Death), సమ్మోహన ప్రాంగణం (Enchanted Ground) మొదలైన ప్రదేశాల్లో ఉంటారు.

అయినా ప్రభువు సహాయకులు ఆ దారి వెంబడి ఉంటారు. వాళ్ళు సహనం (Patience), సౌశీల్యం (Amity), ప్రకాశమానులు (Shining Ones), వివేకము (Discretion), శ్రద్ధ (Prudence), పవిత్రత (Piety), ఔదార్యము (Charity), జ్ఞానము (Knowledge), జాగ్రత్త (Watchful), విశ్వసనీయత (Sincere), అను భవం (Experience) మొదలైనవారు. ఆ దారి వెంబడి రక్షణ (Salvation), విమోచన (Deliverance), ఆనంద దేశం (Beulah), ఆహ్లాదకరం (Delectable), హెచ్చరిక (Caution) అనే ప్రభువు పట్టణాలున్నాయి.

జాన్ ఆ గ్రంథమంతటా కవిత్వాన్ని చిలకరించాడు. క్రైస్తవుని ప్రయాణం చాలా సుదీర్ఘమైనదైనప్పటికీ అతడు సిలువ దగ్గరకు వచ్చినప్పుడు తన వీపుమీదున్న భార మంతటినీ ఒక్కసారిగా వదిలించుకున్నాడు. క్షమింపరాని అతని నేరం యిప్పుడు క్రీస్తు రక్తంచేత చెల్లింపబడింది. అది అతని వీపుమీదనుండి దొర్లి ఒక సమాధి గుంటలో పడ్డప్పుడు అతడు పట్టలేని ఆనందంతో బిగ్గరగా యిలా పాడాడు :

బహుదూరంనుండి వచ్చాను నా పాపభారంతో, బాధలతో వేదనలతో నిరాశానిస్పృహలతో, నాలోని దుఃఖాన్ని నే పోగొట్టుకోలేకపోయాను; చివరిగా ఈ సిలువచెంతకు నే వచ్చేంతవరకు, నా పరమానందానికి యిదే కావచ్చు అద్భుత ప్రారంభం! దొర్లిపోయినందున నా వీపునుండి నా పాపభారం! నను బంధించిన సాతాను సంకెళ్ళు తెగిపోవుట ఖాయం, నా పరలోక యాత్రలో నా విజయమిక తథ్యం; ఎంత అద్భుతమైనదీ సిలువ! ఎంత అద్భుతమైనదీ స్థలం! ఎంత అద్భుతమైనవాడు నాకై సిలువొందిన నా ప్రియ ప్రభువు!

ఆ తర్వాత తన ప్రయాణంలో ప్రకటన గ్రంథంలోని గొప్ప విధ్వంసకుడైన అపొల్లు యోనును జయించిన పిదప క్రైస్తవుడు ఓ పాట పాడతాడు :

మహా బయల్లైబూబు,విడుదలైన బోధకుడు ఆ పిశాచాల అధిపతి రూపకల్పన చేశాడు నా అంతానికి, ప్రయత్నించాడు నా పతనానికి కట్లనుండి విప్పి పంపాడు వానిని, వాడు రౌద్రంతో
అది భరింపశక్యం కానిది, భీతావహంగా చిక్కుకుపోయాను సహాయం చేశాడు నా దేవుడు దీవెనకరమైన మిఖాయేలుద్వారా కత్తి వేటుతో చేశాను వెంటనే వాడు ఎగిరిపోయేటట్టు. కాబట్టి చెల్లించనివ్వండి ఆయనకు నిత్యస్తుతులు, కృతజ్ఞతలు, దీవించబడునుగాక నిత్యం ఆయన పరిశుద్ధ నామం.

జాన్ తన గ్రంథంమీద ఎంతో శ్రమించాడు. ఎప్పుడూ ప్రశ్నలు వేస్తూనో, వింటూనో, పునఃపరిశీలన చేస్తూనో వ్రాతప్రతిలోని పేజీలతో అతడు తలమునక లయ్యాడు. అతడిప్పుడు జాన్ ఫాక్స్ గారి “హతసాక్షుల గ్రంథం” అనే పుస్తకాన్ని స్వంతం చేసుకున్నాడు. అయితే అతని ప్రధాన గ్రంథాలయము బైబిల్ మరియు స్త్రీల పురుషుల, పేదల ధనికుల, పరిశుద్ధుల పాపుల మనస్సులే.

1670వ సంవత్సరం నవంబర్ జాన్ ఒక దశాబ్దకాలం జైలు జీవితాన్ని పూర్తి చేశాడు. పరిస్థితులు మారుతున్నట్టు జాన్ గమనించాడు. జైలరు అతణ్ణి రాత్రివేళల్లో బయటకు పంపడంవలన మరింత స్వేచ్ఛను అనుభవింపసాగాడు. అయితే ప్రతిసారీ జాన్ వెనక్కురావాల్సిందే.

బోధించడాన్ని నిత్యం మానుకోవాల్సి వస్తోంది. చివరిసారిగా తన బంధకాలనుగూర్చి యింటివద్ద బాధకరంగా గుర్తుచేసుకోవాల్సి వచ్చింది. పద్నాలుగు సంవత్సరాల జానీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు.

“జానీ! నీ భవిష్యత్తును గూర్చి ఏవైనా ప్రణాళికలు వేసుకున్నావా?”

కుర్రాడు నొసలు చిట్లించాడు – “నేను నీలాగా, తాతయ్యలాగా పాత్రలకు కళాయి వేసేవాణ్ణి అవుతాను” కటువుగా జవాబిచ్చాడు.

“మరయితే కళాయి వేయడంలో నీకెటువంటి అనుభవం లేదుగా!”

“ఇది ఇంగ్లాండ్ నాన్నా. నేను కళాయి వేసేవాణ్ణయినా కావాలి లేదా అడుక్కుతినే వాణ్ణయినా కావాలి.”

“మరీ అంత ఎక్కువగా నటించకు జానీ.”

“నీకు తెలుసు కష్టపడకుండా ఎవడూ జీవితంలో తన స్థానంనుండి ఒక్క అడుగుకూడ ముందుకు వెయ్యలేడని. నీ సంగతి చూడు” జానీ అన్నాడు.

అలా జ్ఞానోదయమై జాన్ చెఱసాలకు తిరిగి వచ్చాడు. “యాత్రికుని ప్రయాణం” రచన మందకొడిగా సాగింది. ఈ నూతన స్వాతంత్య్రం అతనిమీద మరింత భారాన్ని మోపింది. ఎందుకంటే అతడు తన సంఘసభ్యులకు సలహాలు యివ్వాలి. తన కుటుంబ బాధ్యతల్ని నిర్వహించాలి. వీటికితోడు అచ్చొత్తించే విషయంలో ఎడ్వర్డ్ ఫౌలర్ అనే వ్యక్తితో అనవసరంగా గొడవపడాల్సి వచ్చింది.

ఫౌలర్ మతవిశ్వాస విషయంలో ఉదార భావాలు కలిగిన వ్యక్తి. తనకు తాను విచక్షణాజ్ఞానం గలవానిగా భావించుకునేవాడు. అతడు నూతన చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు అనుకూలంగా మారాడు. మారుతూ ‘మన క్రైస్తవ స్వేచ్ఛ మనలను మనం నివసించే ప్రదేశ ఆచారాలకు అనుకూలంగా మారేందుకు లేదా అనుగుణంగా ఉండేందుకు అనుమతిస్తుందని” ప్రకటనకూడా చేశాడు. తననూ, తన సిద్ధాంతాలనూ అంగీకరించని వాళ్ళను గర్విష్టులుగానూ, వివాదాస్పదులుగానూ అతడు ఎంచేవాడు.

ఫౌలర్ను తన వాడి కోరలతో జయించాలనుకున్నాడు జాన్. అతడు “విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుట అను సిద్ధాంతాన్ని సమర్థించే ప్రతివాదం” అనే కరపత్రాన్ని వ్రాశాడు. దానిలో ఫౌలర్లాంటి మనుష్యులు “మురికి లాభాపేక్షకొరకూ, మృష్టాన్న భోజనాలతో బద్ధకపు శరీరాలను నింపడంకోసమూ తమ పూర్వపు విశ్వాసాన్ని బ్రద్దలైన ఓడవలె చేసుకొనే మూర్ఖ ప్రజలవలె ప్రవర్తిస్తున్నార”ని జాన్ తెలిపాడు.

ఫౌలర్ పదింతలుగా బదులు పలికాడు. బన్యను పూర్తిగా “నైతికంగా పతనమై దుర్భాషలాడే ఓ పనికిమాలిన వెధవ”, “మూర్ఖుడు”, “ఉన్మాదపూరిత ఉత్సాహవంతుడు”, “భరింపశక్యంగాని అమర్యాదస్థుడు”, “వికృతమైన పనికిమాలినవాడు”, “అహంకారి”, “గర్విష్టి” వీటికితోడు “భయంకరమైన దెయ్యం వంటివాడు” అంటూ వ్రాశాడు.

ఈ సమయంలో 1671 లో చార్లెస్ రాజుగారు మత అసమ్మతివాదులను క్షమించి మత స్వేచ్ఛా ప్రకటన చేస్తాడని ప్రజలు ఎదురుచూడటం జరిగింది. అయితే అటువంటి ప్రకటన ఏమైనా వెలువడితే జాన్ బన్యన్ మాత్రం దానినుండి మినహాయింపబడాలని ఫౌలర్ ఆశించాడు.

“ఈ ఖైదు మత వ్యతిరేకవాదులకు ఎలా కేంద్రం అయిందో అనే విషయాన్ని స్నేహితుడు ఫౌలర్ తెలుసుకోగలిగినట్లయితే ఎంత బాగుణ్ణు! ఎంత అద్భుతమైన యుద్ధాన్ని మనం ఈ చెరసాలలో కల్పిస్తున్నాం!” అని జాన్ వ్యాఖ్యానించాడు.

చెరసాలలో జాన్తోబాటు అనేకమంది అసమ్మతివాదులున్నారు. చివరకు న్యూ ఫోర్టు ప్యాగ్నెల్లోని తన పాత స్నేహితుడు పాస్టర్ గిబ్స్ సైతం కొంతకాలం కటకటాల వెనుక ఉన్నాడు. వాళ్ళు పరస్పరం సలహా సంప్రదింపులు జరుపుకుంటూ తమ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు.

“తాము జైలునుండి విడుద లయ్యాక తమ సంఘాలను పూర్తి వేగంతో నడిపించేందుకు ఎటువంటి అనుకూలమైన విధానాలు చేపట్టాలి” అని వారు ప్రణాళిక వేసుకున్నారు.

ఇప్పుడు జాన్ దాదాపు తన పూర్తి కాలాన్ని సంఘ ప్రణాళికపైనే వెచ్చిస్తున్నాడు.

ఒకవేళ యీ మతస్వేచ్ఛ ప్రకటింపబడితే పాస్టర్ గారికీ, ఆరాధనా స్థలానికీ అనుమతులు మంజూరు చేయబడతాయి. కనుక జాన్ జైలు లోపలా, బయటా ఫ్రీ చర్చీ సభ్యులతో మంతనాలు గావించాడు.

జాన్ ప్రణాళిక ప్రకారం యిప్పుడు కేవలం యాభైమంది అల్పసభ్యత్వం ఉన్న ఫ్రీ చర్చీ 1671 చివరినాటికి ఆరు దేశాల్లో, ముప్పయ్ ఒక్క నిర్ధారితమైన కట్టడాలతో, జాన్తో కలుపుకుని ఇరవైయారుమంది బోధకులతో విలసిల్లబోతోంది.

“కాని జాన్, ఇది అంత పెద్ద సంస్థగా ఎదగడం వాస్తవమా, అవాస్తవమా!” అతని బృహత్ ప్రణాళికను అధ్యయనం చేస్తూ అడిగింది ఎలిజబెత్.

“అది నూటికి నూరు పాళ్ళు వాస్తవం” – నవ్వుతూ, తన తలవైపుకు చూపుతూ – “యిక్కడ వరకు” అన్నాడు జాన్.

“అయితే యిది ఎప్పుడు నిజమౌతుంది?” మేరి అడిగింది.

“రాజుగారూ, పార్లమెంటు వాళ్ళూ అనుకున్నప్పుడు. కొత్తవాళ్ళు యిప్పుడు పార్ల మెంటులో అధికారం చెలాయిస్తున్నారనీ, వీళ్ళు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు పెద్దగా మద్దతు యివ్వడం లేదనీ వదంతులు వస్తున్నాయి. కాబట్టి చివరకు రాజుగారు తన మతస్వేచ్ఛా ప్రకటనను జారీ చేయొచ్చు.”

1672 జనవరి 21న జాన్ చర్చీ సభ్యులు అతని స్వేచ్ఛను ముందుగా ఊహించి అతణ్ణి తమ పాస్టర్గా ఎన్నుకున్నారు. అది ఓ శుభసూచకం. ఆ రోజునుండి అతడూ, అతని కుటుంబం కొద్దిపాటి ఉపకారవేతనం మీద ఆధారపడసాగారు.

“వాళ్ళది ఎంత గట్టి నమ్మకం!” – జాన్ పెద్దగా ఆశ్చర్యపడుతూ అన్నాడు “నేనింకా అధికారికంగా యీ దేశపు ఖైదీనే!”

“రాజుగారు యిప్పుడు యే దినమైనా నిన్ను విడుదల చేయొచ్చు” – మేరీ అంది – “పదకొండు సంవత్సరాలు ప్రతి రాత్రీ నీ విడుదలకోసం నేను ప్రార్థన చేశాను.”

ఒక్క చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కుమాత్రమే అనుమతినిచ్చేట్టు చట్టాన్ని మార్చడానికి పార్లమెంటు సభ్యులు నిరాకరించినందున, 1672 మార్చి 15న ఎట్టకేలకు రాజుగారు మత స్వేచ్ఛను ప్రకటించాడు.

అననుకూలవాదులు ఆరాధనకై సమాజంగా కూడుకో వచ్చు. కథోలిక్కులు తమ మతాన్ని అంతరంగికంగా ఆచరించవచ్చు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండు యెడల తీవ్రవాంఛలేని యిప్పటి పార్లమెంటు సభ్యులు ఈ విషయంలో విజయం సాధించారు.

జాన్ తన “యాత్రికుని ప్రయాణం” కథను దాదాపు మూడొంతులు పూర్తిచేసి “అలా నేను నా కలనుండి మేల్కొని” అనే వాక్యంతో ఆపాడు. చెరసాలనుండి విడుదలైన జాన్ తన కుటీరంకేసి నడవసాగాడు.

అతడు చేయాల్సింది చాలా ఉంది. మే నెల నాటికి ఫ్రీ చర్చీయొక్క విస్తృత కార్యక్రమంకొరకై అనుమతికోసం అతడు అభ్యర్థన పంపుకున్నాడు. రాజుగారు ఈ అనుమతుల విషయం మెరుపు వేగంతో పనిచేస్తున్నట్టు కన్పించింది. అదే నెలలో అనుమతి పత్రాలు జాన్ చేతిలో వచ్చిపడ్డాయి.

ఆగస్టు నాటికి పాస్టర్ జాన్ బన్యన్, ఆయన స్థానిక సంఘ పెద్దలు కలిసి జోసియాస్ రఫెడ్ అనే వ్యక్తికి చెందిన గిడ్డంగి నొకదానిని ఆరాధనా కూడికల కోసం కొన్నారు. బెడ్ఫోర్డుకు తూర్పునవున్న లోతట్టు ప్రాంతంలోని భూభాగంలోవున్న యీ గిడ్డంగికి ఆధారంగా పండ్లతోటకూడ ఉంది.

దాన్ని చూసేందుకు జాన్ తన కుటుంబాన్ని తీసుకెళ్ళాడు. ఇప్పుడు మేరీకి ఇరవై రెండేళ్ళు. బెట్సీకి పద్దెనిమిది, జానీకి పదహారు, థామస్కు పధ్నాలుగేళ్ళు. ఆరేళ్ళ పాప శారా జాన్ చెయ్యి పట్టుకుని నడుస్తోంది. ఇది యింతటితోనే అయిపోలేదు. ఎలిజబెత్ తన గర్భంలో మరో పాపాయిని మోస్తూవుంది.

థామస్ ఆ గిడ్డంగిని చూసినప్పుడు గట్టిగా ఇలా అన్నాడు – “ఎందుకిది గుంటలో ఉంది!”

“లేదు” – జాన్ నవ్వాడు – “ఆ దక్షిణంగా చూడు.”

“అది ఒక గుట్ట లేదా కొండ. ఒకప్పుడు బెడ్ఫోర్డ్ కోట దానిమీద ఉండేది”

“అవును, నాలుగు వందల సంవత్సరాల క్రితం, యీ గుంట ఒకప్పుడు ఆ కోటచుట్టూ ఉన్న కందకం” – జాన్ అన్నాడు.

“ఈ చర్చీలోకి దిగి వెళ్ళడం సులభంగా అయ్యేపనికాదు” – పొడిగా వ్యాఖ్యానించింది ఎలిజబెత్.

“కాని ఆ ఫ్రీ చర్చీ పన్నెండు సంవత్సరాలుగా ఏ కట్టడం లేకుండా ఉండటాన్ని ఆలోచిస్తే … యిది నాకు ఒక రాజభవనంకంటేకూడ రమ్యమైందిగా కనిపిస్తోంది” – జవాబిచ్చాడు జాన్.

ఆ గిడ్డంగి “ప్రార్థనా కూడిక గిడ్డంగి”గా ప్రాచుర్యం పొందింది. తమ తక్కువ స్థాయి ప్రారంభాన్నిగూర్చి ఆ సభ్యులు ఏమాత్రం సిగ్గుపడలేదు. పాస్టర్ జాన్ బన్యన్గారు బెడ్ఫోర్డులో బాగా ప్రాచుర్యం పొందాడు. అతడు ప్యూరిటన్లు ధరించే సామాన్య మైన రంగుదుస్తుల్ని ధరించేవాడు. మోకాళ్ళవరకు ప్యాంటు ధరించి, మేజోళ్లు, బకిల్ ఉన్న బూట్లు అతడు వేసుకునేవాడు.

పొడవైన చేతులున్న తెల్లని చొక్కామీద వెన్కోటు వేసుకునేవాడు. బాగా ఎండలున్నప్పుడు చొక్కాపైన వెస్ట్ కోటు వేసుకొనేవాడు. ఎప్పుడూ వెడల్పైన అంచువున్న పొడవైన టోపీ ధరించేవాడు.

ఆ వీధి వెంబడి భారీ శరీరంతో వచ్చే వ్యక్తి చాలా సంవత్సరాలు జైల్లో గడిపిన “జాన్ బన్యన్” అని క్రొత్తవాళ్ళు ఆసక్తిగా జాన్ వైపు చూసేవారు. వెడల్పైన భుజాలతో కొత్తవాళ్ళు బెదిరిపోయేటంత పొడగరిగా ఉండేవాడు జాన్. ఆ సంగతి జానుకూడా తెలుసు. అయినా తాను వాళ్ళను సమీపించినప్పుడు అతని చుట్టూవున్న గొప్ప ప్రశాంతతను చూచి వారిలోని భయం పోయి అతనిపై అభిమానం, ప్రేమ పుట్టుకొచ్చేవి.

ఆ “బోడి గుండు” రోజులు ఎప్పుడో పోయాయి. జాన్ ఎర్రటి జుట్టు ఇప్పుడు మధ్య పాపిటితో భుజాలవరకు వ్రేలాడుతోంది. మంచి మేనిచ్ఛాయ, భారీ విగ్రహం, ఎర్రటి ముఖంతో ఉండే అనేకుల్లా అతని మీసాలు గడ్డిమోపులా గుబురుగా ఉండేవి. అతని ముఖం గంభీరం, కాని అతని సంభాషణ స్నేహపూర్వకంగానూ ప్రశాంతంగానూ శబ్దాలంకారాలతో రుచికరంగాను తెలివైన పదబంధాలతోనూ ఉంటూ అత్యంత దురభిప్రాయంగలవారిని సైతం వెనువెంటనే వినేందుకు మౌనంలో పడేస్తాయి.

అతడు జైల్లోనుండి వెలుపలికి వచ్చిన తర్వాత మొదటిగా అతణ్ణి ఆశ్చర్యపరచింది తన సంఘంనుండి తనకు అందివ్వబడిన ఒక మంచి బహుమానం. అతడు ప్రసంగ వేదిక ముందు ఉన్నప్పుడు దాన్ని ఆయనకు అందించాలంటే చాలా కష్టం. అందుకే వారి మొదటి ఆరాధన గిడ్డంగిలో జరిగిన తర్వాత అతడు పొందిన విభ్రాంతికి ఆనందిస్తూ అతని సంఘ సభ్యులు ఆయనను బయటకు నడిపించుకొని వచ్చారు.

“స్వేచ్ఛగా సంచరించేందుకు అవసరమైంది ఏంటంటారు?” – వాళ్ళు జాన్ను ప్రశ్నించారు.

“గుఱ్ఱం” పెద్దగా అరిచింది అంధురాలైన మేరీ.

“గుఱ్ఱమా! ఎక్కడ?” – మేరీ సాధారణంగా పొరపాటుపడదని తెలిసి చుట్టూ చుశాడు జాన్.

చెట్ల చాటునుండి సంఘ సభ్యులు మెత్తని చర్మం కలిగిన గుఱ్ఱాన్ని ఒకదానిని నడిపించుకొని వచ్చారు. జాన్ దాని వీపు తట్టి, తర్వాత దాని పెదాలు పైకెత్తి చూసి, “ఇది చాలా చిన్న వయస్సులోనున్న గుఱ్ఱమే” అన్నాడు.

“కేవలం రెండేళ్ళ వయస్సుమాత్రమే పాస్టర్ బన్యన్” ఆ సభ్యుల్లో ఒకతను అన్నాడు -“చాలా బలమైంది. దూర ప్రయాణాలకు చాలా అనువైంది. చాలా సంవత్సరాలవరకు చురుగ్గా పనిచేయగల యౌవనాశ్వం.”

“ఇటువంటి అద్భుతమైన గుఱ్ఱానికి ఒక పేరు అవసరం” – ఆ చురుకైన గుఱ్ఱాన్ని తిరిగి తన కుటీరానికి తీసుకెళ్ళినప్పుడు ఎలిజబెత్ అంది.

“ఓహ్! ఈ గుఱ్ఱం ఎలా ఉందో నాకు చెప్పు?” గట్టిగా అరిచింది మేరీ.

జాన్ ఈ భారీ గుఱ్ఱాన్నిగూర్చి దీర్ఘంగా ఆలోచించాడు

“ఇది భుజాలవద్ద ప్రధాన న్యాయాధికారిగారి గుఱ్ఱంకంటే పొడగరి. దీని చర్మం శుద్ధిచేసిన బంగారం. ఇదిగో, యిక్కడ తడివి చూడు మేరీ, దీని చర్మాన్ని …”

“ఇది చాలా వెచ్చగా, శక్తివంతంగా ఉంది” – చేతి క్రింది కండరాలు చిన్న అలల్లాగా కదులుతూంటే మేరీ నవ్వుతూ అంది.

“దీని జూలూ తోకా చాలా పొడవుగానూ చిక్కగానూ అమావాస్య రాత్రంత నల్లగా ఉన్నాయ్. దీని కళ్ళు సాదరంగా, చురుగ్గా, బెడ్ఫోర్డునంతా ఒక్క గుటకలో మ్రింగివేయ గలిగినంత పెద్దవిగా ఉన్నాయి” దర్పంతో పలికాడు జాన్.

“అయితే ఈ గుఱ్ఱం పేరు ఐరన్సైడ్స్!” పెద్దగా అరిచింది మేరీ.

“అలివర్ క్రాంవెల్, అతని అశ్వదళం లాగానా?” అడిగాడు జాన్. “ఇంగ్లాండ్ సామాన్య ప్రజలకు జై” మేరీ అంది.

“అంతా ఒకప్పటి నా తిరుగుబాటు స్వభావమే” – ప్రశంసాపూర్వకంగా అన్నాడు జాన్ – “ఇటువంటి మాటలెక్కడైనా పలికేటప్పుడు జాగ్రత్త! అయితే మనం నిజంగా ఈ బలిష్ఠమైన గుఱ్ఱాన్ని ‘ఐరన్సైడ్స్’ అనే పిలుద్దాం.”

Leave a Comment