పరలోక దర్శనం

పరలోక దర్శనం

జాన్ వ్రాసిన నిప్పులాంటి పత్రికయైన “తెరువబడిన కొన్ని సువార్త సత్యాలు”ను క్వాకర్లు చదివారు. క్వాకర్ల తీవ్రమైన బహిరంగ అభ్యంతరాలతో ఈ కరపత్రం అనామకంగా అదృశ్యమైపోవడానికి బదులుగా అది విస్తృతంగా ప్రచారమైంది.

‘బహుశ ఇంగ్లాండ్ అంతా వీధుల్లో చేరి ఈ దినాల్లో మతం గురించి వాదోప వాదాలు చేసికుంటున్నట్టుగా కనబడుతోంది’ జాన్ అనుకున్నాడు.

అతని పేరు బెడ్ఫోర్డ్ షైరుకు దాదాపు ఐదువందల చదరపు మైళ్ళ పరిధిలో వ్యాప్తిచెందింది. సాధారణ ప్రజలు అతడొక పాత్రలకు కళాయి వేసేవాడన్న ఆశ్చర్యాన్ని ప్రకటించకుండా అతని మాటలు విన్నారు. సంపన్నులు ‘ఈ యిరవై ఎనిమిదేండ్ల నిప్పురవ్వ కేవలం ఒక కళాయి వేసేవాడా?’ అని ఆశ్చర్యచకితులయ్యారు.

కొందరు ఆనందించారు. మరికొందరు హెచ్చరికనొందారు. బెడ్ఫోర్డ్లోని ఫ్రీ చర్చి సభ్యులు ‘బన్యన్ మనుష్యులు’గా తెలియబడసాగారు. పాస్టర్ బర్టన్ గారు దీర్ఘకాలం అనారోగ్యంగా ఉండకుండా చురుగ్గా ఉండి ఉంటే యీ గుర్తింపు అతనికి వచ్చేదికాదు.

“తెరువబడిన కొన్ని సువార్త సత్యాలు” అనే కరపత్రానికి జవాబుగా 1657 లో క్వాకర్ బరో ఒక కరపత్రాన్ని విడుదల చేశాడు. ఇది బన్యన్మీద నేరుగా జరిపిన ఆటవిక దాడి. అందులో “పాపి, దుర్మార్గుడు, దయ్యపు స్వభావం కలవాడు” అంటూ అతడు బన్యను వ్యక్తిగతంగా దూషిస్తూ, “అతని సిద్ధాంతాలు ఖండించదగినవనీ, అవి లోపభూయిష్టమైనవనీ” ఆరోపించాడు.

కాగితంమీద దాడులూ, బహిరంగ ప్రకటనలూ జాన్ స్థానాన్ని యింకా పటిష్టపరిచాయి. ఏ ఒక్క క్వాకర్ కూడా జాన్కు విరోధంగా తాము చేసే వాదాలను సమర్థించుకోలేక పోయాడు. అలాగే వాళ్ళు బైబిల్కు దూరంగా ఉండటంలోని ప్రమాదాన్ని జాన్ విస్మరించలేకపోయాడు.

ఆ తర్వాత “తెరువబడిన కొన్ని సువార్త సత్యాలు అను కరపత్రంపైన ఆరోపణలకు. స్పష్టమైన జవాబు” అనే శీర్షికన మరో కరపత్రాన్ని జాన్ వ్రాయడం ప్రారంభించాడు. బరోలాగా జాన్ పెద్ద పదజాలాన్ని ఉపయోగించలేదుగాని ‘అడ్డుకర్రలు’, ‘మోసాలు’, ‘గుబురు చెట్లలో గ్రుడ్డివాడు’లాంటి ఘాటైన పదాలతో కొనసాగించాడు. స్పష్టంగానూ, తర్కబద్ధంగానూ, బుజ్జగింపుగానూ ఉండే ఒక భాగాన్ని చదువుదాం :

“ఈ దినాన క్వాకర్లు వెలిబుచ్చిన అభిప్రాయాలు చాలా కాలం క్రిందట రాంటర్లు వెలుబుచ్చిన అభిప్రాయాలే! రాంటర్లు వాటిని ఒక పాడుబడిన సత్రంలా చేస్తే ఈ క్వాకర్లు దానిమీద పైపై మెరుగులు నూతనంగా తొడిగి, బాహ్యసంబంధమైన పవిత్రతతో దాన్ని అలంకరించి …”

బరో కరపత్రానికి జవాబుగా వ్రాయబడ్డ ఈ కరపత్రం అదే సంవత్సరం అనగా 1657వ సంవత్సరంలో అచ్చయింది. దీన్నికూడ బరో ఖండించాడుగాని జాన్ దానికి ఎటువంటి ప్రతిస్పందనా చూపించలేదు. మరోసారి “తెరువబడిన సువార్త సత్యాలను” అతడు సమర్థించాడు. ఇప్పుడతడు వాక్యం బోధించడంలో తీరికలేకుండా ఉన్నాడు.

1658వ సంవత్సరానికల్లా బెడ్ఫోర్డ్లోని పర్ణశాలలాంటి అతని గృహం పిల్లల కేరింతలతో ప్రతిధ్వనిస్తోంది. అపురూపమైన ఎనిమిదేళ్ళ మేరీ, నాలుగేళ్ళ బెట్సీ, రెండు సంవత్సరాల జానీ, మరో నూతన శిశువు థామస్ లు చేసే అల్లరితో ఇప్పుడు ఇల్లంతా ఎంతో సందడిగా ఉంటోంది.

తాను ఒకప్పుడు శత్రువుగా భావించి ద్వేషిస్తూ వచ్చిన తన తండ్రిని ప్రేమించి అభిమానించడానికి జాన్కు చాలా ఏళ్ళు పట్టింది. ఆయన తనకిప్పుడు శత్రువు కాదు. తన కుమారునికి తన తండ్రి ‘థామస్’ పేరు పెట్టుకొని ఆయనను బహిరంగంగా గౌరవించే అవకాశం చివరకు జాన్ కు లభించింది.

తాను చేసిన తప్పులన్నింటికీ జాన్ తన తండ్రిని క్షమాపణకూడా వేడుకున్నాడు! తన తండ్రిని ద్వేషించటం అనే పాపం శాశ్వతంగా సమాధి అయ్యిందని అతడు భావించాడు.

తన భార్య మేరీ ఏదో సమస్యతో బాధపడుతోందని జాన్ గ్రహించాడు. థామస్ పుట్టిన తర్వాత ఆమె మళ్ళీ శక్తిని పొందలేకపోయింది. వాస్తవానికి దాన్ని దాచాలని ఆమె ఎంత ప్రయత్నించినా దాచలేకపోయింది. జాన్కు భయమేసింది. తల్లీ చెల్లీ యిద్దరూ చనిపోవడం తాను చూశాడు. అనుకోకూడనిదాన్ని ఆలోచించాల్సి వస్తోంది. ‘మేరీ యిక కోలుకోలేదా? మేరీ లేకుంటే తాను బ్రతకగలడా?”

ఆమెకు జ్వరం అధికమౌతుంటే నల్లని నీడలా భయం అతణ్ణి వెంటాడసాగింది. ‘ఊహాతీతమైంది మళ్ళీ ఏదైనా జరగబోతుందా? లేదు మళ్ళీ అటువంటిది సంభవిం చదు. తన ప్రియమైన భార్య మేరీకి అటువంటిది జరగనే జరుగదు.’

అతడు తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు. అయితే ఒకనాడు ఆమె చెక్కిళ్ళమీది గులాబీరంగు చెదరిపోయింది! బంగారు రంగులో ఉండే ఆమె శరీరం పాలిపోయింది! మేరీ అతని నుండి శాశ్వతంగా వెళ్ళిపోయింది. మరోసారి జాన్ తన అంతరంగంలో తీవ్రంగా రోదించాడు.

‘క్రైస్తవ్యానికి ఫలాలు యివేనా? దీవించబడ్డ వ్యక్తికి దేవునిచే యివ్వబడే బహుమానాలు యివేనా?’ మేరీ చావు భరింపశక్యం కానిదయినప్పటికీ, “ఓదార్పు నొందని దుఃఖం విశ్వాసరాహిత్యానికి చిహ్నమని” జాన్ తనకు తానే జ్ఞాపకం చేసుకొన్నాడు. ‘మేరీ పరదైసులో ఉంది’ – జాన్ తనకుతానే చెప్పుకున్నాడు – ‘దాన్ని నేను నమ్మకపోతే నా వాక్యోపదేశం, నా జీవితం అంతా దగా అవుతుంది.’

“అమ్మ పరదైసులో ఉంది” అతడు తన చిన్నారి బిడ్డలతో అన్నాడు.

“పరదైసు అంటే ఏంటి?” బెట్సీ అడిగింది. అంధురాలైన మేరీ తమ తలిదండ్రుల సంభాషణల్లో జోక్యం చేసుకున్నట్టు బెట్సీ జోక్యం చేసుకునేదికాదు. “అదెలా ఉంటుంది?” అందమైన వస్తువులద్వారా మధురమైన అనుభూతినిపొంది ఆనందించే బెట్సీ తిరిగి అడిగింది.

“ఎలాగుంటుందంటే …” ఆగిపోయాడు జాన్.

“అక్కడికి వెళ్ళడానికి ముందు నువ్వు బ్యూలా దేశంలో ఆగి, విశ్రాంతి తీసు కుంటావు” బిగ్గరగా అరిచింది మేరీ.

“ఎందుకు ?…… మేరీ సరిగ్గా చెప్పింది.” .” మేరీ భావాతీత జ్ఞానానికి జాన్ పులకరించిపోయాడు. “బైబిల్లోని యెషయా గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది:

“విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు. పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు…బ్యూలా భూమికి పేళ్ళు పెట్టబడును యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు.”

“మరి బ్యూలా అంటే అర్థమేంటి?” బెట్సీ అడిగింది.

“ప్రభువుయొక్క భూమి” వివరించాడు జాన్ – “అంతకంటే ఎక్కువైంది. దేవుడా ప్రదేశాన్ని వివాహం చేసుకున్నంతగా అన్నమాట.”

“కాని అదేంటో నాకింకా అర్థంకావటం లేదు” ఫిర్యాదు చేస్తునట్టుగా అంది బెట్సీ.

జాన్ బ్యూలా దేశాన్నిగూర్చి బలవంతంగా ఊహించాల్సి వచ్చింది. ‘తన ప్రియమైన మేరీ అక్కడ యిప్పుడు నడుస్తూ ఉందని ఊహించగలిగితే అది చాలా తేలిగ్గా ఉంటుంది.’ బెట్సీవైపు తిరిగి అతడన్నాడు – “అమ్మ అక్కడున్న ఒక దారివెంట నడుస్తూ ఉంది. అక్కడ వీచే గాలి చల్లగా చాలా హాయిగా ఉంది.

ఆ ప్రదేశమంతా పచ్చగా ఉంది. ఉద్యానవనాలూ, ద్రాక్షతోటలూ, పూలతోటలూ చూసేందుకు చాలా అందంగా కనిపిస్తు న్నాయి. అక్కడి తోటల్లోకి వెళ్ళే గేట్లన్నీ తెరిచేవున్నాయి. అమ్మ అక్కడున్న ఒక తోటమాలిని అడిగింది – “ఈ ద్రాక్ష తోటలూ, మంచి మంచి వనాలూ … యివన్నీ ఎవరివి?” అందుకు తోటమాలి యిలా జవాబిచ్చాడు: “ఇవన్నీ దేవునివి. ఇవి ఆయన ఆనందంకోసం, ఆయన యాత్రికుల ఉపశమనంకోసం యిక్కడ నాటబడ్డాయి.”

“కచ్చితంగా మీరు చెబుతున్నట్టే జరుగుతోంది నాన్నా!” – మేరీ అంగీకరించింది.

జాన్ చెప్పుకుంటూ పోతున్నాడు – “అమ్మ ఒక తోటలోనికి వెళ్ళడం నేను చూస్తున్నాను. ఆ తోటలోని రుచికరమైన పండ్లను ఆమె తింటోంది. అక్కడున్న దేవుని బాటలో షికార్లుచేస్తూ, అచ్చటి పొదరిండ్లలో ఆమె విశ్రాంతి తీసుకొంటోంది.

అక్కడి పక్షులు చెవులకింపుగా చక్కని పాటలు పాడుతున్నాయి. పావురాలూ, గువ్వలూకూడ కూ… కూ… అంటున్నాయి. అక్కడ చీకటిలేదు. ఎందుకంటే అక్కడ ఎప్పుడూ వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది.”

“అయితే పరదైసుకు వెళ్ళక ముందు ఇదొక విశ్రాంతి ప్రదేశంమాత్రమే!” – మధ్యలో అడ్డుకుంది మేరీ.

“అవునవును” సందేహంగానే అన్నాడు జాన్. తన తలలో నిత్యం మోస్తూవున్న బైబిలు గ్రంథపు లోతుల్ని అతడు తడివి చూస్తున్నాడు. “బ్యూలాకు అవతల పరదైసు దేశంలో కనబడుతూ ఉంటుంది.

అక్కడి ప్రకాశమానమైన దూతలు కొందరు సంచరించేందుకు వస్తుంటారు. ‘చూడండి మీ రక్షణ సమీపించింది’ అన్న గంభీరమైన స్వరాలు ప్రశాంతమైన ఆ పరదైసునుండి వినిపిస్తూ ఉంటాయి.”

“ఓహ్, ఆ పట్టణాన్ని వర్ణించండి నాన్నా” మేరీ అడిగింది.

“ఆ పరదైసు ముత్యాలతోనూ రత్నాలతోనూ కట్టబడింది” – జాన్ చెప్పుకు పోతున్నాడు – “దాని వీధులన్నీ బంగారుమయమై ఉన్నాయి. ఆ పట్టణపు మహిమను దాటిన వెలుగు అమ్మను ఆవరించింది. ‘నేను వస్తున్నానని నా ప్రియమైన యేసుకు చెప్పండి’ అమ్మ గట్టిగా అరిచింది” – జాన్ కొద్దిసేపు ఆగాడు.

“ఇంకా చెప్పండి నాన్నా!” – బెక్సీ ఉత్సాహంగా అడుగుతోంది.

“అమ్మ ను అంతంతమాత్రంగానే చూడగలుగుతోంది. ఎందుకంటే స్వచ్ఛమైన బంగారుకాంతి అమ్మ కళ్ళను మిరుమిట్లు గొలుపుతోంది. బంగారు వస్త్రాలు ధరించిన యిద్దరు దేవదూతలు అమ్మను కలుసుకున్నారు. వాళ్ళ ముఖాల్లో స్వచ్ఛమైన వెలుగు ప్రకాశిస్తోంది.

“నువ్వెక్కణ్ణుంచి వస్తున్నావు?” అని వాళ్ళు అమ్మను ప్రేమగా ప్రశ్నించారు. తానెక్కడనుండి వస్తోందీ అమ్మ వారితో చెప్పింది. చివరిగా ఆ దేవదూతలు “మాతో రా!” అని అమ్మను తీసుకెళ్ళారు.

“వాళ్ళు అమ్మను పరదైసులోనికి తీసుకెళ్తున్నారా?” పెద్దగా అరిచింది బెట్సీ.

“అప్పుడేకాదు” – జవాబిచ్చాడు జాన్ – “పరదైసు పెద్ద కొండమీదుంటుంది. దాని పునాదులు మేఘాలకంటే ఎత్తుంటాయి. కాని అమ్మ చాలా సులభంగా వెళ్ళగలుగు తోంది. ఎలాగంటే ఆ దేవదూతలు అమ్మ చేతులను పట్టుకొని తీసుకెళుతున్నారు. అమ్మ మహిమ శరీరం ధరించివుంది.”

“అమ్మను నేను చూడగలుగుతున్నాను” మేరి ఆనందంతో అంది.

జాన్ తిరిగి కొనసాగించాడు “అమ్మతో దేవదూతలు యిలా అంటున్నారు : ‘నువ్వు దేవుణ్ణి విశ్వసించావు గనుక జీవవృక్షాన్ని చూస్తావు. దాని ఫలాల్ని నిత్యం భుజిస్తావు. పరలోకపు కాంతివస్త్రాలు నీకివ్వబడతాయి.

నీవు ప్రతినిత్యం దేవునితో నడుస్తూ, మాట్లాడుతూ ఉంటావు. ఏవిధమైన విచారాన్నీ, వ్యాధినీ, కష్టాలనూ, మరణాన్నీ నీవిక చూడవు. మునుపటి సంగతులు గతించిపోయాయి. ఇప్పుడు నువ్వు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులవద్దకు వెళుతున్నావు.”

“చాలా బాగుంది, ఇంకా చెప్పు నాన్నా” ఆనందంతో గంతులేస్తూ అంది మేరీ. “ఓ ఇంకా చాలా ఉంది మేరీ” – జాన్ అభయమిచ్చాడామెకు –

“అమ్మ పరదైసు ద్వారంవద్దకు వచ్చినప్పుడు పరలోక సైన్యసమూహం పరలోక గవినిగుండా త్వర త్వరగా బయటకు వచ్చి ఆమెను చుట్టుముట్టింది. ‘ఈమె భూలోకంలో ఉండగా మన ప్రభువును ప్రేమించింది. ఆయన పరిశుద్ధనామం నిమిత్తం అన్నీ విడిచిపెట్టింది’ I యిద్దరు దేవదూతలు బిగ్గరగా వారితో అన్నారు.”

“పరలోక సైన్యసమూహం మహదానందంతో, ‘గొట్టెపిల్ల వివాహవిందుకు ఆహ్వానించబడిన ఈమె ధన్యురాలు!’ అని కేక వేశారు” – మేరీ అరిచినట్టుగా అంది.

“అవును సరిగ్గా అదే జరిగింది” – జాన్ అన్నాడు – “దేవుని బూరల్ని ఊదే దేవదూతలు సంగీతంతో పరదైసును ప్రతిధ్వనింపజేశారు. పరలోక సైన్యసమూహం అమ్మ చుట్టూ భద్రతా వలయంగా నిలబడింది. పరదైసులో గంటలు మ్రోగాయి. పరలోకపు ద్వారానికి కొద్దిగా పైన బంగారు అక్షరాలతో వ్రాయబడిన ఈ మాటలను అమ్మ చూసింది :

“ఆయన ఆజ్ఞలను గైకొనువారు ధన్యులు. వారు జీవ వృక్షమునకు హక్కుగలవారగుదురు. వారు గవినిద్వారా పరదైసుకు వెళ్ళగలరు.”

“దేవదూతలు హఠాత్తుగా ద్వారంవైపుకు చూసి ఇలా అన్నారు – ‘ఇప్పుడు ద్వారపాలకులైన హనోకు, ఏలీయా, మోషేలను పిలుస్తున్నాము.’ ఆ ద్వారానికి పైగా ఆ ముగ్గురు పరిశుద్ధులు వెంటనే ప్రత్యక్షమయ్యారు. ‘పరదైసులో మీకేం కావాలి?’ అని వాళ్ళడిగారు.

ఒక దేవదూత ఇలా అన్నాడు – ‘ఈ ప్రదేశపు ప్రభువుయెడల ఈమెకు ఉన్న ప్రేమనుబట్టి ఈమె తన మునుపటి స్థలాన్ని విడిచి యిక్కడకు వచ్చింది.’ అప్పుడు ‘ఆమెను నాయొద్దకు తీసుకొని రండి. నీతిమంతులు ప్రవేశించే ద్వారాన్ని వెంటనే తెరవండి.

ఈమె తన విశ్వాసాన్ని కాపాడుకుంది’ అని పరలోక స్వరం ఒకటి ద్వారం లోపలనుండి బయలుదేరి పరదైసు అంతటా మార్మోగడం అమ్మ వినింది.” “కాని పరలోకంలో అమ్మ ఏం చేస్తుంది?” బెట్సీ అడిగింది.

“ఆమె తాను పడిన శ్రమలన్నింటినుండి విశ్రాంతి తీసుకొంటుంది” – – జవాబిచ్చాడు. జాన్ పరిపూర్ణ విశ్వాసంతో – “అంతేకాదు ఆమె పొందిన దుఃఖమంతటికీ ఆనందాన్ని పొందుతుంది. ఆమె విత్తినదాన్ని కోస్తుంది. ఆమె తన కన్నీళ్ళ ప్రార్థనకు తగిన ఫలాన్ని పొందుతుంది.

ఆమె బంగారు కిరీటాన్ని ధరించి పరిశుద్ధుడైన ప్రభువును ముఖా ముఖిగా చూస్తుంది. ఆమె ఆయనను ఎల్లప్పుడూ స్తుతిస్తూ, కీర్తనలు పాడుతూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటుంది. ఆమెకన్నా ముందుగా వెళ్ళిన ఆమె స్నేహితులతో కలిసి ఆనందిస్తూ ఉంటుంది.

ఇప్పుడామె తనకంటే ముందుగా అక్కడికి వెళ్ళిన వాళ్ళ నాన్నవద్దకు వెళ్ళడం చూస్తున్నాను. అంతేకాదు అమెకు చూచాయగా గుర్తున్న ఆమె తల్లికూడ అక్కడే ఉంది.”

“ఊ, ఇంకా చెప్పు” – బెట్సీ అంది.

“పరదైసులో గంటలన్నీ మళ్ళీ ఆనందంగా మ్రోగుతున్నాయి. అమ్మ రూపాంతరం చెందింది. మహిమ కిరీటంతో అలంకరించబడింది. సూర్యునివలె ప్రకాశించే వస్త్రాలతో ఆమె అలంకరించబడింది.

ప్రతిచోటా సెరాపులు, కెరూబులు, మరికొన్ని జీవులు ఎగురుతూ ఉన్నారు. వారు గుర్తించలేనంతగా మెరిసిపోతున్నారు. పరలోక సైన్య సమూహమంతా ‘సర్వశక్తుడును ప్రభువునైన దేవుడు పరిశుద్ధుడు’ అని కేకలేస్తున్నారు. పరిశుద్ధుడైన ఆ దేవుని చూసేందుకు వారితో అమ్మకూడా చేరింది.”

జాన్ చెప్పిన కథ పిల్లల హృదయాలను పరవశింపజేసింది. దేవుడు వాళ్ళకప్పగించిన ఈ లోకపు బాధ్యతలను నెరవేర్చాలన్నదే దేవుని కోరిక అన్నట్లు జాన్ వారికి గట్టిగా నొక్కి చెప్పాడు. వాళ్ళు దానికి అంగీకరించారు. పిల్లలు యిప్పుడెంతో సమాధానాన్ని పొందడం జాన్ చూశాడు. అయితే మేరీని పోగొట్టుకోవడమనే వాస్తవం తనకు భరింపశక్యంగా లేదు. తన గత మానసిక క్షోభనుండి కొద్దికాలంగా విడుదల పొంది జీవిస్తున్నాడు. కానీ ఈ సంఘటనవల్ల ఆ మానసిక క్షోభ తిరిగి అతనిలో చెలరేగింది.

మేరీ అంత్యక్రియలు జరుగుచున్నప్పుడు జాన్ తన చిన్నాన్న ఎడ్వర్డ్ను, చిన్నమ్మ రోజ్ను యిన్ని సంవత్సరాల తర్వాత మొదటిసారిగా చూశాడు. ఎడ్వర్డ్ బన్యన్, సర్ శామ్యుల్ లూక్ గారి తండ్రియైన ఆలివర్ లూక్ గారి సేవకుడు.

ఎడ్వర్డ్, జాన న్ను లూక్కు చెందిన కోవ్లీ ఉడ్ ఎండ్ ఎస్టేట్కు ఆహ్వానించాడు. రెండు రోజుల తర్వాత జాన్కోసం గుర్రపు బండి వచ్చింది. ఎడ్వర్డ్, రోజ్లు ఎల్రలోని బన్యన్లతో ఎప్పుడో అరుదుగా కలుస్తుంటారు. అయినా వాళ్ళేమీ పెద్దగా మాట్లాడుకోరు. దానిక్కారణం జానికిప్పుడు అర్థమైంది.

కోప్ ఉడ్ ఎండ్ ఎస్టేట్లోని సంపద సామాన్యుణ్ణి నోరు తెరిచేలా చేస్తుంది. భూస్వాములకు చెందిన ఆ ఎస్టేట్ లోని వంట యింట్లోకి ఎడ్వర్డ్తో కలిసి వెళ్ళాడు. జాన్. వంటిల్లంతా తాజా రొట్టె, కైమా ఉండల వంటకాల వాసనతో గుభాళిస్తోంది.

ఆ పెద్ద వంటిల్లు అడుగునున్న భూగృహంలో ఎఱ్ఱని ద్రాక్ష సారాయి, యితర మద్యపానీ యాలను పెద్దపెద్ద పీపాలతో లూక్ వాళ్ళు నిల్వ చేశారన్న విషయం జానక్కు తెలిసింది. వంట గదిలో సంపన్నులు తరచుగా భుజించేవీ, సామాన్యులు కలల్లో మాత్రమే చూడగలిగేవీ అయిన ఎర్రజింకలు, కౌజులు, పీజెంట్ పక్షులు, కోళ్ళు, బాతులు, సాలమన్ చేపలు వగైరా వ్రేలాడదీసి ఉన్నాయి.

వంటగది, సామాన్ల గదీ ఉన్న చతుర్భుజాకారపు గృహంనుండి పనివాళ్ళ కోలాహలంతో నిండివున్న చతుర్భుజాకారపు గృహానికి వారు వెళ్ళారు. విలువైన వస్త్రాలతో క్రిక్కిరిసి ఉన్న ఒక చిన్న గదిలో సర్ ఆలివర్ లూక్ కోసం కుట్టించబడ్డ ఒక పొడవైన అంగీని పరిశీలించేందుకు ఎడ్వర్డ్ ఆగాడు.

నాణ్యమైన ఫ్రెంచ్ ఎరుపు వస్త్రాన్ని గజం రెండు పౌండ్లకు లండన్లో కొన్నారు. దానికి అసాధారణమైన నూలు గుండీలు, దారాలు అమర్చాల్సి ఉంది. ఎడ్వర్డ్ కూడ అటువంటిదే ఒకటి కొన్నాడు.

ఆ మొత్తం నిలువుటంగీ ఖరీదు ముప్పై పౌండ్లు. అంటే జాన్ యుద్ధంనుండి సంపాదించి తెచ్చుకొన్న సొమ్ముకు మూడురెట్లన్న మాట. “ఈ చతుర్భుజ గృహాలపైన పడక గదులున్నాయి” చెప్పాడు ఎడ్వర్డ్ అంకుల్.

ముందున్న చతుర్భుజాకారపు గది ముందుకు మునివేళ్ళమీద నడుస్తూ వెళ్ళాడు. ఎడ్వర్డ్. ఆ యింటి ముందు భాగమే ఆ గృహానికి శోభ. చాలినన్ని విశ్రాంతి గదులకు తోడు భోజనశాల, ప్రార్థనామందిరం, పొడవైన గ్యాలరీ ఉన్నాయి.

ఈ గ్యాలరీ ఖరీదైన చెక్కపలకలతో తాపడం చేయబడి అందమైన వర్ణచిత్రాలతోనూ, అలంకరింపబడిన కిటికీలతోనూ శోభాయమానంగా ఉంది. గ్రంథాలయంతోబాటు అక్కడ అధ్యయన మందిరంకూడా ఉంది.

వందలాది లెదర్ బైండింగ్ పుస్తకాలమధ్య కూర్చొనివున్న శామ్యుల్ లూకు, ఆలివర్ లూకు, మరికొంతమంది పెద్దమనుష్యులను చూసి జాన్ ఆశ్చర్యపడ్డాడు. ఎడ్వర్డ్ అంకుల్ అక్కడ ఆగి తనను గుమ్మంలోనుండి కొద్దిగా ముందుకు తోసినప్పుడు జాన్ మరెక్కువ ఆశ్చర్యపడ్డాడు.

“జెంటిల్మెన్! మీ అనుమతితో చిన్న మనవి … ఇతడు మా అన్నగారి కుమారుడు, జాన్ బన్యన్” – ఎడ్వర్డ్ అంకుల్ వారికి జాన్ను పరిచయంచేశాడు.

“ఓ, జాన్ బన్యన్!” సర్ శామ్యుల్ లూక్ తలపైకెత్తి చూచి దిగ్భ్రాంతి చెందాడు.

“నువ్వు న్యూపోర్ట్ ప్యాగ్నెల్లో ఉండేవాడివని మీ చిన్నాన్న చెబుతుండేవాడు. బన్యన్. అక్కడ నువ్వు నాకు జ్ఞాపకం లేవు. అయినా కొన్ని కారణాలవల్ల నిన్ను జ్ఞాపకం పెట్టుకున్నాను.”

తాను పదమూడు సంవత్సరాల ప్రాయంలో నిష్ప్రయోజకునిగా ఉన్నప్పుడు, గుఱ్ఱపు రౌతుచే కొరడాదెబ్బలు తిన్న సందర్భంలో మొట్టమొదటిసారిగా సర్ లూక్ను కలుసుకున్నప్పటి సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ … “కష్టించి పనిచేసే వేలాది మంది సాధారణ ప్రజల్లో నేనూ ఒకణ్ణి” అని సమాధానం చెప్పాడు జాన్.

“నువ్వు ‘తెరువబడిన కొన్ని సువార్త సత్యాలు’ అనే కరపత్రం వ్రాశావని తెలిసింది!” అర్థాంతరంగా అన్నాడు అక్కడున్న మూడో పెద్దమనిషి.

“ఔనండి.”

“నువ్వు వృత్తిరీత్యా పాత్రలకు కళాయి వేసేవాడివి కదూ?”

“ఔనండి.”

“అంతా దగా మోసం” అంటూ ఆ మూడవ పెద్దమనిషి చాలా అనాగరికంగా జానన్ను ప్రశ్నించడం మొదలుపెట్టాడు.

జాన్కు తెలుసు. తనలోని కోపాగ్నిని దాచుకోవలసిన దినం యిదేనని. తన ముఖంమీద నిండైన ప్రశాంతతను ధరించుకొని, ఒకదానివెంట మరొకటిగా తనపై సంధింపబడుతోన్న ప్రశ్నలను ప్రక్కకు నెడుతూ అతడు మౌనంగా నిలుచొన్నాడు. సైన్యంలో ఉన్న దినాలనుండి తానో పెద్ద వాగుడుగాయ.

అయితే లేఖనాలను ఆలింగనం చేసుకున్ననాటినుండి తన నోటివెంట మాటలే కరువయ్యాయి. ఇప్పుడు తాను సత్య నిష్ఠతోను, అసాధారణ ఆత్మవిశ్వాసంతోను మాట్లాడగలుగుతున్నాడు.

చిట్టచివరకు ఆ మూడో వ్యక్తి తన తల అడ్డంగా ఊపుతూ ఇలా అన్నాడు – “దాన్ని నమ్మలేకుండా ఉన్నాను. వందనాలు బన్యన్ గారు!” హఠాత్తుగా ఎడ్వర్డ్ అంకుల్ అతణ్ణి తీసుకొని ప్రక్కకు వెళ్ళాడు.

ఆ మూడోవ్యక్తి విలియం రసెల్ అని తాను అక్కడి పనివారి యిండ్లలో భోజనం చేస్తున్నప్పుడు తెలిసింది జాన్కు. తనను పిలుచుకు రమ్మని ఎడ్వర్డ్ అంకుల్ను అతని యజమానులే పురమాయించారన్న విషయంకూడా జాన్కు అప్పుడే తెలిసింది.

పాత్రలకు కళాయివేసే ఒక సాధారణ వ్యక్తి దగాకోరు బోధలకూ వ్రాతలకూ ముగింపు యిద్దామన్న ఆతృత బహుశ వారికుండవచ్చు. తను వాళ్ళను నిరాశపర్చాడు. ఎడ్వర్డ్ అంకుల్ మీద తనకేం కోపంలేదు. అంతకంటే ఎడ్వర్డ్ అంకుల్ యిక ఏం చేయకలిగి ఉండేవాడు?

దీనికి తోడు సంపదపట్ల యీ సంఘటన జాన్కు ఒక క్రొత్త ధృక్పథాన్ని కలి గించింది. యుద్ధంలో తాను సంపదను నాశనం చేశాడు. దాదాపు సంపన్నులయెడల చాలా జాలికూడ కలిగింది. కూలిపోయిన కోటల శిధిలాలు, దుమ్మును ఆధారం చేసుకున్న వారి మనోభావాల అంచనాలు తారుమారయ్యాయి. ఈ సంపన్నులు యింకా తమకొరకు తాము ఎన్నో ప్రణాళికలను చక్కగా వేసుకుంటూ పోతున్నారు.

‘రస్సెల్ మరియు లూక్లతో తన కలయికకూ, గత దినాల్లో జరిగిన సంఘటనలకూ ఏమైనా సంబంధం ఉందా లేదా?’ అన్న విషయం జాన్కు తెలియదు. ఇది బహుశ బెడ్ఫోర్డ్ షైర్ ప్రాంతాన్ని ఊపేస్తున్న ఒక కళాయి వేసేవాడి ప్రసంగాన్నిగూర్చి ఎడ్వర్డ్ గారి యజమానుల మనస్సుల్లో రేకెత్తిన ఆసక్తికి ప్రతిస్పందన అయి ఉండవచ్చు.

ఈ కళాయివేసే బెడ్ఫోర్డ్షైర్ వ్యక్తి కుశాగ్రబుద్ధిని చూశాక, సంపన్నులు యిక ఏమాత్రం అతనిగురించి హేళనగా వినోదించలేకపోతున్నారు. దేశంలోని ఆయా సంఘాల్లోనూ, ప్రత్యేకించి కేంబ్రిడ్జి ఆచార్యుల నివాసాలకు సమీప తూర్పు ప్రాంతాల్లోనూ బోధించి నందుకు యితనిపై అనేక ఆరోపణలు తీసుకొని రాబడ్డాయి.

‘విషయం యింకా తీవ్రతరం కాకముందే వాళ్ళు నన్ను బహిష్కరించాలని చూస్తున్నారు’ జాన్ ఆలోచించసాగాడు.

తనకు క్రొత్తగా తయారైన వ్యతిరేకతమీద అతడు తన దృష్టిని కేంద్రీకరించాడు. తన ప్రసంగాల్లో సంపన్నుల అసహనాన్ని ఎండగట్టడం ప్రారంభించాడు. అంతేకాదు మరో కరపత్రం “నరకంనుండి కొన్ని నిట్టూర్పులు” అనేదాన్ని వ్రాయడంకూడ మొదలుపెట్టాడు.

ఈ కరపత్రం ప్రధానంగా లూకా సువార్తలోని ధనవంతుడు, లాజరు ఉపమానంమీద ఆధారపడి వ్రాయబడింది. మరణానంతరం ధనవంతుడు నరకంలో బాధతో మెలికలు తిరగడం, మనోవేదన అనుభవించడం, పేదవాడు పరదైసులో అబ్రాహాము ప్రక్కన సుఖవాసం చేయడంవంటి వాటిని ఆధారం చేసుకొని దాన్ని వ్రాశాడు.

ఈ కరపత్రంలో తాను తొలి దినాల్లో చేసిన ప్రసంగాలు, అంటే – తామెంత దుర్మార్గులో, వాస్తవంగా తామెంత పాపభూయిష్టులో ప్రజలు ఎరుగనంతవరకు రక్షణకొరకైన తమ ప్రయాణాన్ని వారు ప్రారంభించనే లేరన్న అంశాలు ప్రస్తావించ బడ్డాయి.

ధనవంతులు మరియు ప్రత్యేక ఆధిక్యతలు గలవారికున్నంత తక్కువ పాప చింతన వేరెవ్వరికీ ఉండదు. జాన్ తన బిడ్డలతో కలిసి తన చిన్న కుటీరంలో ఉంటూ యీ కరపత్రాన్ని వ్రాయడంలో గంటలకొద్దీ సమయాన్ని గడిపాడు. చివరిగా న్యూపోర్ట్ ప్యాగ్నెల్లో యిప్పటికీ పాస్టరుగా ఉన్న తన పాత స్నేహితుడు గిబ్సన్న తన కరపత్రం చదవమని అడిగాడు.

గిబ్స్ కాసేపు దాన్ని చదివిన తర్వాత ఇలా అన్నాడు – “నరకాన్ని గురించిన నీ ఊహలు దాదాపు కవిత్వంలా ఉన్నాయి జాన్. నరకంలో పాపిని ఒక గుంజకు కట్టి, సంవత్సరాలకొద్దీ యుగాంతంవరకు అతని మాంసాన్ని చిన్నచిన్న ముక్కలుగా కోసివేస్తుంటారని యిక్కడ వ్రాశావు. అతని

దేహం కరిగిన సీసంతో నింపబడుతుందనీ, ఎర్రగా కాలిన లోహపు కడ్డీతో అతనికి వాతలు వేస్తారనీ, అక్కడ మిగిలేది రక్తం పీల్చే కీటకాల కాట్లు మాత్రమేననీ వ్రాశావు! అతని బాధలు ఆకాశ నక్షత్రాలను మించిపోతా యనీ, సముద్రపు ఒడ్డునున్న ఇసుక రేణువులను అధిగమిస్తాయనీ, సముద్రంలోని నీటిబిందువులను మించివుంటాయనీ వ్రాశావు! నరకాన్ని కళ్ళకు కట్టినట్లు యింత చక్కగా చిత్రీకరిస్తావని నేను తలంచలేదు సుమా! నువ్వు వ్రాశావంటే నమ్మశక్యంగా లేదు” – ఎటువంటి చాతుర్యం లేకుండా ముగించాడు గిబ్స్.

“నేనుకూడా నమ్మలేకపోతున్నాను” జాన్ అంగీకరించాడు.

పాస్టర్ గిబ్స్ యింకా చదివి యిలా వ్యాఖ్యానించాడు – “దేవుని అల్పజనం ‘పెద్దమనుష్యులు కాదని’ నీవన్నావు” – అతడు అంగీకారంగా చిరునవ్వు నవ్వాడు “వాళ్ళు పొంతి పిలాతులాగ హీబ్రూ గ్రీకు లాటిన్ భాషలు మాట్లాడలేరని నువ్వన్నావు” – అతడు పైకి చూశాడు – “నువ్వు ప్రొఫెసర్లపై దాడిచేస్తున్నావు కదూ బ్రదర్ బన్యన్?”

“వాళ్ళు చాలా అసహనంగా ఉంటారు. తాము తప్ప వేరెవరూ తమ అభిప్రాయా లను వెలిబుచ్చకూడదని వాళ్ళు తలంచుతూ ఉంటారు.”

“అవును, నేను గమనించాను” అంగీకరించాడు గిబ్స్ – “ఇక్కడ ‘పవిత్ర జీవితం గడిపే సన్యాసులు గుహల్లో, సొరంగాల్లో సంచరిస్తూ నివసిస్తుంటే ధనవంతులు తమ కుక్కలకు ఇళ్ళు కడుతుంటారు’ అని వ్రాశావు. ఇది కాస్త ఘాటుగా ఉంది కదూ!

“ఊ…. చదువు”.

.చదువుతూండగా పాస్టర్ గారి ముఖం పాలిపోయింది. “ఇక్కడ ‘ధనవంతులు వీధుల్లో గర్వంగా నడుస్తూ… వేటాడుతూ, చెడు తిరుగుళ్ళు తిరుగుతుంటారు’ అని వ్రాశావు బ్రదర్ బన్యన్!” – ఆశ్చర్యంగా జానైవైపు చూశాడు పాస్టర్ గిబ్స్.

“ఇంకా చదువు …” చెప్పాడు జాన్.

“ఇక్కడేం వ్రాసుందంటే ‘ధనవంతులు బాగా సంపాదించడంకోసం శ్రమ పడతారు … క్రిందపడో, మీదపడో… ఒట్టుపెట్టుకొనో, అబద్దాలు చెప్పో, దొంగతనం చేసో … వారు అణగద్రొక్కుతారో, లంచమిస్తారో, పొగుడ్తారో, ఏ మార్గంలోనైతేనేం . ఏమైనా… ఏదైనా చేస్తారు … ఏంటి బ్రదర్ బన్యన్ యింత ఘాటుగా వ్రాశావు!” – గిబ్స్ ముఖంలో నెత్తురు బొట్టులేదు. మంచులాగ తెల్లగా అయింది.

“దేవా! యీ లోకం నామీద ఏమి మోపనుందో, ఆ బాధలు సహించడానికి నన్ను సిద్ధంచెయ్’ అనే మాట నీకీ సమయంలో గుర్తుచేయనివ్వు” జాన్ అన్నాడు.

“నువ్వు తప్పక బాధపడతావ్. ఏటికి ఎదురీదుతున్నావు బ్రదర్ బన్యన్ .”

“దీనికి నువ్వు ‘ముందుమాట’ వ్రాస్తే అది నాకో గొప్ప గౌరవంగా భావిస్తాను” సూచించాడు జాన్.

పాస్టర్ గిబ్స్ ముందుమాటలో క్వాకర్లు జాన్మీద చేసే అనాగరిక, నీచమైన దాడులను ప్రస్తావిస్తూ … “జాన్ తన యావత్ శక్తినీ వినియోగిస్తున్నాడు… విలుకాండ్రు తమ బాణాలతో అతన్ని మిక్కుటంగా బాధించడానికి అదొక కారణంగా నేను భావిస్తున్నాను” అని వ్రాశాడు.

ఈ క్వాకర్లు కరపత్రాల్లోను, బహిరంగ సభల్లోను జానన్ను హీనంగా బాధిస్తూ… యింకా దిగజారుడుతనానికికూడా సిద్ధపడ్డారు. ఇప్పుడైతే జాన్ గొప్పవారిమీదా, కులీనులమీదా తన దృష్టినుంచాడు.

“నీగురించి నాకు భయంగా ఉంది జాన్” – పాస్టర్ గిబ్స్ అన్నాడు – “అయితే దేవునికి వందనాలు … ఆలివర్ క్రాంవెల్ అసమ్మతిని అనుమతిస్తున్నాడు. గొప్ప వాళ్ళకు వ్యతిరేకంగాకూడా.”

జాన్ తన కరపత్రాన్ని ముద్రించి, పంచి పెట్టిన కొద్ది రోజుల్లోనే ఒక వార్త దేశాన్నంతా తుడిచిపెట్టింది. ఆ వార్త – “మహా గొప్ప విప్లవకారుడు ఆలివర్ క్రాంవెల్ మరణించాడు!”

“పాత ఐరన్ సైడ్స్ చనిపోయాడన్నమాట” గొణుగుతూ అన్నాడు జాన్.

“ఐరన్ సైడ్సా?” ఎప్పుడూ జాగ్రత్తగా గమనిస్తూ ఉండే మేరీ అడిగింది.

“అది యుద్ధంలో ఆలివర్ క్రాంవెల్ పేరు” వివరించాడు జాన్. అది మనస్సులో రేపిన తీవ్రమైన భావసంచలనానికి అతడు ఆశ్చర్యపోయాడు. ఈ పేరును పన్నెండు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ తను పలుకలేదు. “అతడు గుఱ్ఱంమీద కూర్చుంటే మహా భయంకరమైన యుద్ధవీరుడు.”

ఆ తర్వాతి రోజుల్లో క్రాంవెల్నగురించి జాన్ తరచుగా ఆలోచించేవాడు. సంవత్స రాలతరబడి సంరక్షకుడైన ప్రభువుగా క్రాంవెల్ ఇంగ్లాండును పరిపాలించాడు. ఇప్పుడేం జరుగుతుంది? 1658 సెప్టెంబర్ మాసంలో యీ పుకార్లు శీతాకాల ప్రారంభంనాటి తుపానులా ఇంగ్లాండ్ అంతా వ్యాపించాయి. కొందరు పాత రాజుగారి కుమారుడు ఇంగ్లాండును పాలించడానికి తిరిగివస్తాడనీ, మరి కొందరేమో ఆలివర్ క్రాంవెల్ కుమారుడు రిచర్డ్ పరిపాలిస్తాడనీ అన్నారు.

సంవత్సరం చివరికల్లా అంతా స్పష్టమైంది. రిచర్డ్ క్రాంవెల్ క్రొత్త సంరక్షకుడైన ప్రభువు అయ్యాడు. జాన్ చుట్టుప్రక్కల పల్లెసీమల్లో తిరిగేటప్పుడు ప్రజల్లో ప్రత్యేకించి కులీనుల్లో క్రొత్త మనోభావాలను పసిగట్టాడు.

అది క్రాంవెల్ కుటుంబాలయెడల అయిష్టం, కోపం. ఈ క్రొత్త స్వాతంత్ర్యాలను దిగువ తరగతి ప్రజలు అతిగా అనుభవించారు. సామాన్యులకు తమ స్థానమేంటో అతి త్వరలోనే తెలిసిపోయింది. ఇంగ్లాండ్లో పరిపాలన కుటుంబాల మధ్య కొనసాగినంత కాలం వాళ్ళకు అసలైన రాజుతో పనేముంటుంది? ఇది దాదాపు చార్లెస్ రాజుతో అంతమైన పాత పరిపాలన లాగానే మారింది.

“చార్లెస్ రాజుగారి కొడుకులెక్కడున్నారు బ్రదర్ బన్యన్?” – ఎలిజబెత్ అనే ఓ యువతి ప్రశ్నించింది.

తన కుటీరంలో పిల్లలకు సాయపడేందుకు రోజూ వచ్చే యీ ఎలిజబెత్ అంటే జాన్కు బాగా యిష్టం ఏర్పడింది. ఈవిడ చాలా తెలివిగలది, భక్తి గలిగినది. ఈ అమ్మాయి యితనికి 1650 నుండి తెలుసు గనుక జాన్ యీమెను చిన్న పిల్లలా భావించేవాడు. తనెరిగినప్పటికి ఆమె వయస్సు ఎనిమిది లేక తొమ్మిదేళ్ళుంటాయి.

“రాకుమారులు ఫ్రాన్సులో ఉంటున్నారనుకుంటున్నాను.”

“వాళ్ళలో ఏమైనా రాచరిక లక్షణాలున్నాయా?

“ఆఁ, కచ్చితంగా. యువరాజు చార్లెస్ స్కాట్లాండ్ సైన్యంతో కలిసి క్రాంవెల్తో పోరాడినప్పుడు నువ్వు చిన్నదానివి. రాచరికవాదులు ఇప్పుడు అణచివేయబడ్డారు. కాని యువరాజు చార్లెస్ రాజరికానికి మళ్ళీ ప్రయత్నిస్తాడని నా అభిప్రాయం. అతనికిప్పుడు కేవలం ముప్పయి సంవత్సరాల వయస్సే. వాళ్ళ నాన్న ఇరవై ఐదేళ్ళకే రాజయ్యాడు.”

అవివాహితయైన ఎలిజబెత్ ఈ యింటికి ఎంత తరచుగా వచ్చేదో, అంత ఎక్కువగా జాన్ ఆమెమీద ఆధారపడసాగాడు. ఆమె అంటే పిల్లలు బాగా ఇష్టపడేవారు. రాత్రివేళ భోజనాలు అయిన తర్వాత ఎలిజబెత్ యింటికి తిరిగి వెళ్ళాల్సి వచ్చేప్పుడు చిట్టచివరి పిల్ల బిగ్గరగా ఏడ్చేది.

చివరికి, మనుష్యులను బాగా గ్రహించగలిగేదీ, నడకనుబట్టిగాని గుసగుసలనుబట్టిగాని మనుష్యులను యిట్టే గుర్తుబట్టగలిగేదీ అయిన మేరీకూడ. దానికి ఎలిజబెత్ గురించి మంచి సంగతులు తప్ప యితరత్రా చెప్పగలిగినవి ఏవీ ఉండవు.

జాన్ భార్య మేరీ చనిపోయి పూర్తిగా ఏడాది అయిన తర్వాత అతడు తన తండ్రి థామస్తో ఏకాంతంగా మాట్లాడేందుకు వెళ్ళాడు. జాన్ అతడక్కడికెందుకు వచ్చాడో థామస్ కు కచ్చితంగా తెలుసు.

“నువ్వు ఒకవైపు ఎలిజబెత్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావు, మరోవైపు దాన్ని ఘోరమైన తప్పిదంగా భావిస్తున్నావు. అవునా?” అతని తండ్రి స్వచ్ఛందంగా అన్నాడు.

“అవును”.

“నేను మళ్ళీ పెళ్ళి చేసుకున్నప్పుడు అది తప్పని భావించి కోపగించుకొన్నావుకదూ జాన్? మరీ ముందుగా చేసుకున్నానని నీవనుకున్నావ్. అయితే నేనెందుకలా చేశానో నువ్వప్పుడు గ్రహించలేదు.

కళాయి వేసేవాడిగా నేను ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు ప్రయాణం సాగించాలి. నువ్వు ఇంటికి పెద్దవాడివి. నువ్వు నమ్మదగినవాడవైతే నేనంత త్వరగా వివాహం చేసుకొనేవాణ్ణికాను. అయితే పసివాడైన విల్లీకి అప్పట్లో ఒక సంరక్షణ కావాలి.”

“మార్గీ, అమ్మా చనిపోయి పదిహేను సంవత్సరాలయింది కదా? ఈ సంవత్సరా లన్నింటిలో నీవు వెంటనే పెళ్ళి చేసుకోవడాన్ని నేను పరిపూర్ణంగా అర్థంచేసుకోలేక పోయాను. నీవు నాకెందుకు చెప్పలేదు?” – పశ్చాత్తాపంతో అన్నాడు జాన్.

“అప్పుడు నువ్వెలా ఉన్నావో బహుశ నీకు గుర్తుండి ఉండదు. దానికి తోడు నీకు చాలినన్ని సమస్యలు.”

“కాబట్టి ఆ విమర్శను భరించావు కదూ?” జాన్ అన్నాడు

“నన్నప్పుడు చాలామంది అర్థం చేసుకున్నారు. నువ్విప్పుడు వివాహం చేసుకున్నా ప్రజలు అర్థంచేసుకోగలరు. నువ్వూ దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటావు దేవుని సేవకోసం.

అంధురాలైన మేరీ, ఐదేళ్ళయినా నిండని బెట్సీ చిన్నపిల్లల సంరక్షణా బాధ్యతల్ని నిర్వహించలేరు. వాళ్ళకో తల్లి అవసరత ఉంది. నిన్ను నీవు ప్రశ్నించుకో వలసిందేమిటంటే … ‘నీవు నిజంగా ఎలిజబెత్ను ప్రేమిస్తున్నావా? – ఆమెకూడా నిన్ను నిజంగా ప్రేమిస్తున్నదా? అన్న విషయం మాత్రమే”

ఎలిజబెత్ురించి జాన్ బాగా ఆలోచించాడు. ఆవిడ చాలా చిన్నది. తను ఆమె కంటే చాలా పెద్దవాడు. తనకిప్పుడు ముప్పయ్ సంవత్సరాల వయస్సు. ఎలిజబెత్కు పదునెనిమిదేండ్లే. ఆమె తన కూతురంత చిన్నది కానందుకు దేవునికి వందనాలు.

ఇరవై సంవత్సరాల తర్వాత తనకు ఏభై, ఆవిడకు ముప్పయ్ ఎనిమిది. ఇది అసాధారణ మైనదే! కాని తన ఆరోగ్యాన్ని తాను జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోతుంది. ఆ మాటకొస్తే వయస్సు తక్కువున్న భార్యలుగలవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే యిక్కడ తనో పెద్ద ప్రశ్నను ప్రక్కన పెడుతున్నాడు. అది-“తను ఆమెను ప్రేమిస్తున్నాడా?”

అతడామెనుగూర్చి ఆలోచించాడు. ‘ఆవిడకూ మేరీకీ పోలికలే లేవు. ఎలిజబెత్ జుట్టు నల్లగా, అంత ఒత్తుగాకాక గడ్డి మోపులా నిటారుగా ఉంటుంది. కళ్ళు లేత బూడిదరంగులో కాంతివిహీనంగా ఉంటాయి. ఆవిడ సుకుమారి కాదు. అంగసౌష్టవం గలదికూడా కాదు.

దృఢంగా, బలిష్ఠంగా ఉంటుంది. అయితే అత్యంత ప్రాముఖ్యమైన విషయంలో మేరీలాగ ఉంటుంది. ఈవిడ భక్తిపరురాలు. దేవునిపట్ల అంకితభావం మరియు విశేషాసక్తి కలిగిన వ్యక్తి. కొంత కోపిష్ఠికూడా! వాస్తవానికి తాను వివాహం గురించి ఆలోచించడానికి యీ లక్షణాలే కారణమని చెప్పొచ్చు. కాని తానామెను ప్రేమిస్తున్నాడా? తానామెను ప్రేమిస్తున్నట్లయితే అది తాను మేరీ ప్రేమలో పడినదాని కంటే భిన్నమైన ప్రేమగా దీన్ని చెప్పుకోవచ్చు’.

“నిజానికి చాలా రకాల ప్రేమలుంటాయి” – ఆ సాయంత్రం ఎలిజబెత్ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పెద్దగానే గొణుక్కున్నాడు జాన్. “ఒకడు తన భార్యను ప్రేమించిన రీతిగా తన బిడ్డను ప్రేమించలేడు. తన తల్లిని ప్రేమించిన విధంగా క్రీస్తును ప్రేమించడు.

తన భార్యను ప్రేమించిన రీతిలో తన తల్లిని ప్రేమించడు. లేదా తాను క్రీస్తును ప్రేమించినట్లుగా తన పొరుగువాణ్ణి ప్రేమించలేడు. కనుక వివిధ రకాల ప్రేమ లుంటాయి. దీన్నంగీకరిస్తావా మేరీ?” కుమార్తెతో అన్నాడు జాన్.

“అవును. నేనూ అలాగే అభిప్రాయపడుతున్నాను” ఆమె జవాబిచ్చింది. “ఎలిజబెత్ అంటే నీ కిష్టమేనా?”

“ఓ … చాలా యిష్టం”.

“అంటే దానర్థం ఆమెను మీ చనిపోయిన ప్రియమైన అమ్మకంటే ఎక్కువగానా?”

“ఊహు … కాదు. మా అమ్మను ప్రేమించినట్టుగా ఆమెను ప్రేమించడం లేదు.”

“నేనూ ఎలిజబెత్ను ప్రేమిస్తున్నాను. అయితే మీ అమ్మను నేను ప్రేమించినట్లుగా మాత్రం కాదు” జాన్ అన్నాడు.

Leave a Comment