నిత్యనివాసం చేరిన యాత్రికుడు

నిత్యనివాసం చేరిన యాత్రికుడు

“సరిగ్గా నిలబడు వృద్ధ మిత్రమా” – మెల్లగా తన గుర్రాన్ని తడుతూ, నెమ్మదిగా మూల్గుతూ అన్నాడు జాన్.

పదునెనిమిది సంవత్సరాల వయసున్న ఐరన్సైడ్స్ను వర్షం వణికిస్తుంటే, తన కంటే దానిగురించే ఎక్కువగా చింతించసాగాడు జాన్. ఆ ముసలిజీవి బురదత్రోవలో చక్కగానే నిలబడగలిగింది. జాన్ లండన్కు వెళుతుండగా మధ్యదారిలోనే ఈ వర్షం పట్టుకొని కుండపోతగా కురవడం ప్రారంభించింది.

ఆగస్టు నెలలో కురిసే ఈ వాన శీతాకాలపు మంచులా చల్లగా ఉంది. ఆ గతుకుల బాటలో జాన్ నెమ్మదిగా వెళ్ళాల్సి వస్తోంది. వానకు తడిసి ముద్దై, చలికి వణుకుతూ లండన్లోని న్యూ గేట్ దగ్గరున్న స్నోహిల్కు వెళ్ళడానికి అతనికి పదిగంటలు పట్టింది.

“అయ్యో, మీరు వర్షానికి తడిసి ముద్దైపోయారు పాస్టర్ బన్యన్!” – జాను చూసి బాధతో గట్టిగా అరిచినట్లుగా అన్నాడు జాన్కు ఆతిథ్యమిచ్చే స్ట్రడ్విక్.

“దేవుడు నిన్ను దీవించుగాక. నా గుర్రాన్ని తుడిచి దానిక్కాస్త మేత ఏర్పాటుచెయ్ బ్రదర్ స్ట్రడ్విక్ !” – జాన్ అన్నాడు.

పొయ్యి దగ్గర తాను తడి ఆర్పుకొని వెచ్చబడిన తర్వాత జాన్ కొంత మెరుగ్గా కనిపించాడు. చలివల్ల ఊపిరితిత్తులు బాధగానూ, తలంతా దిమ్ముగానూ అయింది. అయితే చలిమంట అతణ్ణి కాస్త తెప్పరిల్లజేసింది. మరుసటి రోజు ఆగస్టు 19న వైట్ చాపెల్లోని బోయర్స్ హెడ్ యార్డులో గమ్మొన్ గారి కూడికలో జాన్ బోధించాడు.

అతని ప్రసంగం యోహాను సువార్త 1:13 లోని “వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలనైనను, శరీరేచ్ఛలవలనైనను, మనుషేచ్ఛలవలనైనను పుట్టినవారు కారు” అన్న అంశం మీద కొనసాగింది. ఈ అంశంమీద అతడు సంఘాన్ని దాదాపు బ్రతిమాలుతున్నట్టుగా ప్రసంగం చేశాడు.

“నీ పొరుగువాణ్ణి చూడు. అతనిలోని దేవుని స్వరూపంలో ఉన్న ఆత్మ నీకు కనిపించడం లేదూ? అతణ్ణి ప్రేమించు. నీ మనస్ఫూర్తిగా ప్రేమించు. ‘ఈ వ్యక్తీ, నేనూ యిద్దరం కూడ ఒకానొక రోజున పరలోకం వెళ్ళాలి’ అని నీ మనస్సులో తలంచుకో.

ఒకరినొకరు సేవించండి. ఒకరికొకరు మేలుచేసుకొనండి. ఒకవేళ నీలో ఏదైనా తప్పున్నట్లయితే దాన్ని సరిచేయమని దేవుణ్ణి ప్రార్థించు. సహోదరులను ప్రేమించు.” ఆ రాత్రి జాన్ సందేశం స్వచ్ఛమైన క్రైస్తవ ప్రేమపైన కొనసాగింది.

“నీ సంభాషణ అంతటిలో పరిశుద్ధత కలిగివుండు. పరిశుద్ధుడైన దేవుడు నీ తండ్రియని మరిచిపోవద్దు. ఈ భావనను నీవు దేవుని బిడ్డగా జీవించేందుకు పురికొల్పనివ్వు. అలా అంత్యదినాన నీ తండ్రియొక్క ఆదరణతో కూడిన ముఖాన్ని చూసేందుకు నీవు ఆయత్తపడు” అని జాన్ ముగించాడు.

మరుసటి రోజు జాన్ తీవ్రమైన తలనొప్పితో బాధపడసాగాడు. అతని శరీరం వణుకుతోంది. కాని తాను తన గుర్రంమీద బిషప్ గేట్ వద్దనున్న ‘టూ స్వాన్స్’కు వెళ్ళి తన పుస్తకాలు అచ్చువేస్తున్న జార్జి లార్కిన్ను కలవాలి. వెళ్ళడానికి తన ముసలిగుర్రం ఆరోగ్యంగా ఉన్నందుకు జాన్ సంతోషించాడు.

లార్కిన్ జాన్వైపు ఆశ్చర్యంగా చూశాడు – “పాస్టర్ బన్యన్, వేరొక వ్రాతప్రతిని మీరు తీసుకురానట్టుంది!”

“తెచ్చాను మిత్రమా! పశ్చాత్తాప హృదయం యొక్క ప్రభావాలు, దాని స్వభావం మరియు గుర్తులు చూపించే “అంగీకృత బల్యర్పణ” లేదా “విరిగిన హృదయంయొక్క ఔన్నత్యం” అనే పేరుతో ఒక వ్రాతప్రతిని తెచ్చాను చూడు.”

“దాన్ని ఏ లేఖనభాగాన్ని ఆధారం చేనికొని వ్రాశారు పాస్టర్గారూ?”

“నీవు బలిని కోరువాడవు కావు, కోరినయెడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు’ అనే కీర్తన 51వ అధ్యాయంలోని వచనం ఆధారంగా దాన్ని వ్రాశాను.”

“ఇందులో ఎన్ని పదాలుంటాయి?”

“బహుశ 35,000 పదాలకు మించి ఉండవు.”

లార్కిన్ తల ఊపుతూ – “దీనితో యీ సంవత్సరానికి నాలుగు పుస్తకాలు బన్యన్ గారూ.”

“అలానా!” – జాన్ స్థిమితంగా అన్నాడు.

తాను ఈ సంవత్సరంలో నతానియేల్ పాండర్కు ఒక పుస్తకం, డార్మన్ న్యూమన్కు మరో పుస్తకం యిచ్చినట్లు లార్కిన్కు చెప్పి అతని మనోభావాలను జాన్ గాయపరచ దలచుకోలేదు. ఇవిగాక బెడ్ఫోర్డులో తనవద్ద యింకా ప్రచురించబడకుండా ఉన్న పది లేక అంతకన్నా ఎక్కువైన వ్రాతప్రతుల విషయం తెలిస్తే ఈ లార్కిన్ యింకే మౌతాడో! అవి చిన్న కరపత్రాలు కావుగాని పెద్ద పుస్తకాలు. బహుశ ఐదు లక్షల పదాలుంటాయి.

“మీరు చాలా కృశించిపోతున్నట్టుగా ఉన్నారు పాస్టర్ బన్యన్. ఇవాళ మీరు చాలా పాలిపోయినట్లుగా కనిపిస్తున్నారు. మీకు విశ్రాంతి తప్పక అవసరం” – జాన్ వైపు చూస్తూ బాధగా అన్నాడు లార్కిన్.

“మంచి సలహా యిచ్చారు. నేను నేరుగా బ్రదర్ స్ట్రడ్విక్ దగ్గరకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను.”

తన ఆరోగ్యం బాగా క్షీణించినట్లనిపించింది జాన్కు. ‘అవును ఎందుకు పాడవదు? వెనుకబడిన వ్రాతప్రతులను పూర్తిచేస్తూ రాత్రింబవళ్ళు శ్రమించాడాయె!” జేమ్స్ రాజు విషయం జాను కలవరపరచింది.

‘తాను వయస్సులో ఉన్నప్పుడు వ్రాస్తూ, బోధిస్తూ, లేసులు ముడివేస్తూ జైలు శిక్షను సహించగలిగాడు. జైలు శిక్షను సహించగలిగిన శక్తీ, ఓపికా ఈ వయస్సులో యిప్పుడు తనలో లేవు. చెరసాల చాలా చలిగా ఉంటూ బలహీనులను, ప్రత్యేకించి వయస్సులో ఉన్న పెద్దవాళ్ళను బాగా కృంగదీస్తుంది’.

స్ట్రడ్విక్వద్దకు చేరుకునే సమయానికి జాన్ బాగా జ్వరంతో ఉన్నాడు. చాలా నీరసంగాకూడా ఉన్నాడు. జాన్ పరిస్థితికి స్ట్రడ్విక్ ఆందోళన చెందాడు.

స్ట్రడ్విక్ తనవైపు ఆందోళనగా చూడటం గమనించి జాన్ పెద్దగా నవ్వాడు. “ఓహ్, ఇదేమీ ప్లేగు వ్యాధి కాదు బ్రదర్ స్ట్రడ్విక్. నా గురించి నీవేం కంగారుపడకు. కాసేపు కునుకు తీస్తే సరిపోతుంది. అయితే మనం మొదట నా గుర్రం విషయం చూడాలి. అలా చేయలేదంటే నేనొక ప్రేమలేని యజమానినౌతాను.”

జాన్ ఆ రోజంతా పడకమీదనుండి లేవనేలేదు. మామూలుగా అయితే మరుసటి రోజుకు బాగా తేరుకోవాల్సింది. కాని ఒళ్ళు నొప్పులతోనూ, జ్వరంతోనూ అతడు చాలా బాధపడసాగాడు. “నాకు బాగా జలుబు చేసినట్లుగా ఉంది. జ్వరం, ఒళ్ళు నొప్పులు తీవ్రంగా ఉన్నాయి. మీకు యిబ్బందికరంగా యిలా నేను మంచానపడటం నాకు చాలా బాధగా ఉంది” జాన్ నీరసంగా అన్నాడు.

“అబ్బే నాకు ఇబ్బందేంలేదు పాస్టర్ బన్యన్. మీరు బాగా విశ్రాంతి తీసుకోండి. మీరు బాగైతే అంతే చాలు.”

ఆ రోజు మధ్యాహ్నం ఒక డాక్టరు తన గదిలోకి రావడం జాన్ చూసి ఆశ్చర్య పడ్డాడు. జాన్ ఎలాగైనా త్వరగా కోలుకొనేటట్లు వైద్య సలహాలూ, మందులూ యివ్వ వలసిందిగా స్ట్రడ్విక్ డాక్టర్ను కోరాడు. జ్వరంనుండి జాన్ కోలుకొనేలా డాక్టర్ చాలా ప్రయత్నించాడు. కాని జ్వరంకన్నా అతని చెమటగురించీ, అతడు బరువుగా ఊపిరి పీల్చడంగురించీ డాక్టర్ ఎక్కువ ఆందోళన చెందసాగాడు.

శ్వాస తీసుకోవడం చాలా కష్టమౌతోంది. జ్వరం తగ్గనేలేదు. జాన్ దగ్గినప్పుడు నోట్లోనుండి రక్తం పడుతోంది. అతడు దగ్గి దగ్గి అలసిపోతున్నాడు. అతని మనస్సు మొద్దుబారిపోతోంది. అది రాత్రా లేక పగలా అని అతడు తెలుసుకోలేకపోతున్నాడు. చాలా కాలంగా మంచానపడినంత నీరసంగా అతనికి అనిపిస్తోంది. ఒళ్ళంతా భయంకరమైన నొప్పులు.

జాన్ మెల్లగా కళ్ళు తెరిచి స్ట్రడ్విక్వపు చూశాడు – “ఈ రోజు తారీఖెంత?”

“ఇరవై తొమ్మిది.”

“ఇరవై తొమ్మిదా! నేను నా తల ఎత్తలేకపోతున్నాను. నా స్వరం ఎండుటాకులా నిర్జీవంగా పలుకుతోంది. నిత్యత్వంలోకి దేవుడు నన్నాహ్వానిస్తున్నట్టుగా ఉంది. బ్రదర్ స్టడ్విక్, నేను చనిపోతున్నట్టుగా నాకనిపిస్తోంది.”

“అలా జరక్కూడదని దేవుని ప్రార్థిస్తున్నాను.”

“విచారించవద్దు. చావడం లాభకరం. నిత్య మహిమలోకి వెళ్ళనీయకుండా ఆలస్యం చేసేదే ఈ జీవితం.” “యాత్రికుని ప్రయాణం’లోని ఆ నిత్యమహిమను జ్ఞాపకం చేసుకొంటూ జాన్ బన్యన్ చిరునవ్వు నవ్వాడు. ఆ మహిమ తాను ఆ పుస్తకంలో వ్రాసినట్లుగానే ఉంటుంది. కచ్చితంగా అలానే ఉంటుంది. బైబిల్లో కూడ అలానే ఉంది. అవి తన కల్పితాలు కావు. దేవుని మాటలే!

“నేను చెయ్యాల్సిన పనులేమైనా ఉన్నాయా?” మెల్లగా అడిగాడు స్ట్రడ్విక్.

“ఆ నా గుర్రం, ఆ వృద్ధ బాలుడ్ని దయచేసి బెడ్ఫోర్డ్క తీసుకెళ్ళు. ఎలిజబెత్ లేకుండా దాని జీవితం దుర్భరంగా ఉంటుంది” సమీపిస్తున్న తన ముగింపును స్ట్రడ్వాక్ మనసారా అంగీకరించడంతో జాన్ ఉత్తేజం పొందినట్లుగా అన్నాడు.

“అమ్మగారికి ఏం చెప్పమంటారు పాస్టర్ గారూ?”

“ఎలిజబెతూ, పిల్లలకూ నా ప్రేమలు .” హఠాత్తుగా వచ్చిన దగ్గుతో జాన్ మధ్యలో ఆగిపోయాడు. తనకు సమయం చాలా తక్కువగా ఉందని అతడు తెలుసు కున్నాడు.

“ఆస్తంతా ఎలిజబెత్ పేరుమీద యిదివరకే వ్రాశాను. నేను చదువుకునే చిన్న బల్లలో నలభై పౌండ్లు ఉందని ఆమెకు జ్ఞాపకంచెయ్. అది ఈ పనికిమాలిన జాన్ బన్యన్ యొక్క మొత్తం విలువ అని చెప్పు” బరువుగా ఊపిరి పీలుస్తూ అన్నాడు జాన్.

“కేవలం నలభై పౌండ్లేనా? మీరు వేలకొలది పుస్తకాలు అమ్మారు కదా?”

“దేవునికి స్తోత్రం. నా దగ్గర అంతకన్నా ఎక్కువ డబ్బులేదు.”

“సరేలెండి పాస్టరుగారూ!”

‘తాను పూర్తిచేసి ప్రచురించని వ్రాతప్రతుల విషయం ఏం చేయాలి? ఉన్నట్టుండి అతడు దీన్నిగురించి ఆలోచించకూడదనుకున్నాడు. ఈ మరణ సమయంలో దేవుని స్తుతించడం తప్ప మరేమీ మాట్లాడకూడదనుకున్నాడు. అయినప్పటికీ ఆ వ్రాతప్రతుల విషయం చెప్పాలి.

“నేను చదువుకునే గదిలో యింకా ప్రచురించని వ్రాతప్రతులు కొన్ని ఉన్నాయి. వాటిని నీకు తోచినట్లు చెయ్.”

“సరే పాస్టరుగారూ” – స్ట్రడ్విక్ గొంతు సవరించుకొని తిరిగి అన్నాడు – “బెన్హెల్ పొలాల్లో నాకొక సమాధి తోట ఉంది. జాన్ గుడ్విన్, విలియమ్ జెన్కిన్, జాన్ ఓవెన్ లాంటి మంచి నాన్కన్ఫర్మిస్టులు అక్కడే సమాధిచేయబడ్డారు.”

“అయితే నాకక్కడ చాలా మంచి తోడుంటుందన్న మాట.”

“పాస్టర్ ఓవెన్ వెంట వంద బండ్లు వచ్చి ఉండవచ్చు. మీవెంట అంతకంటే తక్కువేమీ రావు. స్నోహిల్ అవతల ప్రాంతంనుండి ఆల్డర్స్ గేట్ వరకు, ఆ ప్రశాంతమైన పొలాలనుండి … ”

ఇహలోక సంబంధమైన ఏ విధమైన గౌరవాలనూ జాన్ లెక్కచేయడు. అయితే ఈ సమయంలో బ్రదర్ స్ట్రడ్విక్ను గద్దించలేనంత బలహీనంగా ఉన్నాడు అతడు. అతడు దీర్ఘశ్వాస తీసుకోడానికి ప్రయత్నించాడు. కాని వీలుకాలేదు. బాగా ఆయాసపడు తున్నాడు.

“బ్రదర్ స్ట్రడ్విక్! నా ప్రియమైన వాళ్ళందరికీ ప్రత్యేకించి నా ప్రియమైన భార్య ఎలిజబెత్కు నా వీడ్కోలు చెప్పు”.

ఇక చర్చించడానికేమీ లేనట్లనిపించింది. జాన్లో క్రమంగా శ్వాస తగ్గిపోతూ, కొద్దిగా కదుల్తున్న స్థితినుండి చలనంలేని స్థితికి చేరుకున్నాడు. శాశ్వతమైన విశ్రాంతి లోకి వెళ్ళిపోయాడతడు. అతని ముఖంలో ఏ బాధా కనిపించడం లేదు.

అతడు చని పోయాడా లేక నిద్రిస్తున్నాడా తెలుసుకోలేనంత ప్రశాంతంగా ఉంది అతని ముఖం. ఆ గదంతా వెలుగుతో నింపబడింది. సూర్యకిరణాలు ఆ గదిలోకి తొంగి చూస్తున్నాయి. అవి ప్రకాశమానమైన ఒక వ్యక్తినుండి ప్రసరిస్తున్నట్టుగా ఉన్నాయి. కాలచక్రం ఆగి పోయింది.

Leave a Comment