గర్వించదగ్గ సిపాయి

గర్వించదగ్గ సిపాయి

పిచ్చిగా నీళ్ళను బాదసాగాడు జాన్. “దేవుడనేవాడివి నీవొకడివి ఉంటే నన్ను కాపాడు” అని తన మనస్సులోనే తాను అనుకున్నాడు. అప్పటికే నీళ్ళు అతని నోట్లోకి, ముక్కులోకి పోవడం ప్రారంభించాయి. అతడు తన కాళ్ళతో, చేతులతో నీళ్ళను కొడుతున్నాడు.

చల్లని నదీజలాలు అతని ప్రాణాల్ని పీల్చేస్తున్నాయి. అతని తల మునిగి పోతోంది. అతనికి ఊపిరాడ్డం లేదు. అంతలో అతని చేతికేదో తగిలింది. అది పడవ ప్రక్క భాగం. ఆ పడవ తనవైపుకే కొట్టుకొని వచ్చింది. జాన్ గట్టిగా దాన్ని కరుచు కున్నాడు.

ముక్కులోనుండీ, నోట్లోనుండీ నీళ్ళు యింకా కారుతూనే ఉన్నాయి. అతని కాళ్ళకు నేల తగిలింది. పడవను వదిలేసి గట్టువైపుకు పరుగెత్తాడు. గట్టుపైన బోర్లాపడుకొని దగ్గుతూ నోటిలోని నీళ్ళను వెళ్ళగక్కడం ప్రారంభించాడు. చావు కొంచెంలో తప్పిపోయి, బ్రతికి బయటపడ్డాడు. అనుకొంటేనే భయంతో వళ్ళు వణికిపోతోంది.

“ఇక్కణ్ణుండి వెళ్లాం పదండి, ఈ పడవను యిక వాడలేము” – బొంగురు గొంతుతో బాధగా అన్నాడు జాన్.

“అవును, వెళ్లాం పదండి” అంగీకారంగా అన్నాడు రోజర్స్.

“రోజంతటికీ సరిపోయినంత జున్ను తిన్నాను” – జాన్ నీళ్ళలో పడి అవస్థపడు తున్నంతసేపూ జున్నుగడ్డలు తింటూ విసిగిపోయిన హ్యారీ అన్నాడు.

కొలిమి వెలిగించి, నాగటికొనను సాగగొట్టేందుకు జాన్ సమయానికే యిల్లు చేరుకున్నాడు. తన బదులు మార్గీ పందులకూ, కోళ్ళకూ మేతపెట్టింది. తన అదృష్టంకొద్దీ కొలిమి వెంటనే అంటుకొంది. జాన్ తండ్రి బయటినుండి వచ్చి జాన్ పని చేస్తుండటం చూసి తృప్తిగా తల ఊపి వెళ్ళిపోయాడు. కొంచెంలో నాన్న దగ్గర తన్నులు తప్పాయి.

ఆ రాత్రంతా జాన్కు నిద్రపట్టనే లేదు. ఏదో కొద్దిసేపు మగతగా నిద్రపోయుంటా డంతే. ‘కొన్ని క్షణాల్లో చావు తప్పి తాను బ్రతికి బయటపడ్డాడు. తానీపాటికి చనిపోయి నరకంలో ఉండాల్సినవాడే! ఇంతకీ తన్ను కాపాడిందెవరు దేవుడా? సైతానా? సైతానుకు తాను సేవకుణ్ణి గనుక వాడు తనను కాపాడాడంటే అర్థముందిగాని దేవుడు కాపాడా డంటే ఎందుకు కాపాడినట్టు? రాత్రంతా ఆలోచిస్తూనే గడిపాడు జాన్.

మరుసటి రోజంతా జాన్ కొలిమికే అతుక్కుపోయాడు. ఆ మరుసటి రోజుకూడ అంతే. కష్టపడి పనిచేయడం మనస్సుకు సంతృప్తిని యిస్తోంది. ఇక కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. జాన్ విశ్రాంతి తీసుకొంటూ ఆలోచించడం ప్రారంభించాడు.

గత సంవత్సరం తన తాతయ్య చనిపోయాడు. తనొక గొప్ప వ్యాపారవేత్తనని డంబంగా చెప్పుకొనే ఆయన చుట్టు ప్రక్క గ్రామాల్లో యిల్లిల్లూ తిరిగి చిన్నచిన్న పాత్రలు అమ్మేవాడు. చనిపోయేనాటికి ఆయన తన నాల్గవ భార్యతో కాపురం చేస్తుండేవాడు. జాన్ సొంత నానమ్మ జాన్ నాన్న పుట్టిన సంవత్సరమే చనిపోయింది.

తనకెవరూ చెప్పలేదుగాని నాన్నను కంటూ ఆమె చనిపోయి ఉంటుందని జాన్ ఊహ. అలా పిల్లల్ని కంటూ చనిపోవడం ఎల్టా ప్రాంతంలో సర్వసాధారణమే. క్రూరమైన తన తండ్రిని కన్నందుకే నానమ్మ చనిపోయి ఉంటుందని జాన్ నమ్మకం.

జాన్ అమ్మమ్మ తాతయ్యలు కూడ చనిపోయారు. అమ్మమ్మ వాడిపోయిన ముఖం, నీళ్ళు నిలిచిన కళ్ళు తనకు కొద్దికొద్దిగా గుర్తున్నాయి. బెంట్లీ తాతయ్య పీక్కుపోయిన ముఖంతో అసలు ముఖముందా లేదా అన్నట్టు ఉండేవాడు. ఇప్పుడు చనిపోయినవారికీ గతంలో ఎప్పుడో చనిపోయినవారికీ ఏం తేడాలేదు.

ఆ తరమంతా చనిపోయింది. వాళ్ళిక కొద్ది కాలానికి పూర్వం చని పోయినవారిలాగే ఎవరికీ గుర్తుండరు. చనిపోయిన వాళ్ళంతా ఒకటే. వారిలో ఏం తేడా ఉండదు. “అయితే ఈ చనిపోయినవాళ్ళంతా ఎక్కడికి వెళ్ళుంటారు, స్వర్గానికా? నరకానికా?” ఈ ప్రశ్నకు జాన్వద్ద జవాబు లేదు.

తనకు జ్ఞాపకమున్నంతవరకు తన చిన్నతనంలో నాన్న తనను ఎల్తో చర్చికి బలవంతంగా పంపేవాడు. తనకు తెలిసినంతవరకు నాన్న చేసిన మంచి పని అదొక్కటే. ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం స్థానికంగా ఉన్న చర్చికి తప్పక హాజరు కావాలి. అది ఇంగ్లాండు దేశ చట్టం.

చనిపోయిన ప్రతి ఒక్కరూ స్వర్గంలోగాని, నరకంలోగాని ఉంటారని పాస్టర్ క్రిస్టఫర్ హాల్ చెప్తుండేవాడు. స్వర్గం-నరకం, ఈ రెండూకూడ జాను ఉత్సాహాన్నిచ్చేవి కావు. స్వర్గానికి వెళ్ళే అవకాశం తానెప్పుడో పోగొట్టుకొన్నాడు. నరకంకూడ స్వర్గంతో సమానంగా ఆశించదగిందేనని తనలో తాను తృప్తిపడుతుంటాడు. ఎందుకంటే తాను వెళ్ళబోయేది అక్కడికే కాబట్టి.

“అయితే నరకంలో యితరులను హింసించేందుకు సైతానుకు సేవకుడిగా తాను అర్హత సంపాదించాలంటే ఈ లోకంలో బాగా పాపం చేయాలి. దుర్మార్గుడిగా జీవించాలి” – జాన్ తనకు తాను తిరిగి జ్ఞాపకం చేసుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత జాన్ తన స్నేహితుల్ని కలిసికొన్నాడు. తాను యింట్లో పడే హింసను గూర్చి వారికి చెప్పాలనీ, మరో తుంటరిపనికి ప్రణాళిక వేయాలనీ అతడు ఉబలాటపడ్డాడు. కాని వాళ్ళ మాటలు యుద్ధంవైపు వెళ్ళాయి.

1642వ సంవత్సరం అక్టోబరు 23వ తేదీన ఎల్టాకు నైరుతి దిశగా కేవలం ఇరవై మైళ్ళ దూరంలో ఎక్జిల్ వద్ద రాజుగారి సైన్యం, పార్లమెంటు సైన్యం తలపడ్డాయి. కొంతకాలం క్రితం నది ఒడ్డున తాము చూచిన సైన్యం ఈ యుద్ధం చేసుంటుంది.

ముప్పైవేలమంది సైనికులు కత్తులు, ఈటెలు, గొడ్డళ్ళు, తుపాకులతో భీకరంగా యుద్ధం చేశారు. సర్ లూక్కూడ ఆ యుద్ధంలో పాల్గొన్నాడు. ఐదువేలమంది సైనికులు తమ రక్తాన్ని ఆఖరి బొట్టువరకూ చిందించి చనిపోయారు. సర్ లూక్ మాత్రం బ్రతికాడు.

దీని తర్వాత చార్లెస్ రాజు తన సైన్యాన్ని ఉపసంహరించుకొని పశ్చిమ దిశగా ఆక్స్ఫార్డ్లోని పెద్ద కోటకు తరలివెళ్ళాడు. ఎస్సెక్స్ ప్రభువు తన సైన్యాన్ని తీసికొని దక్షిణ దిక్కుగా తమకు సురక్షిత ప్రదేశమైన లండన్కు వెళ్ళాడు. ఇరువైపులవారూ విజయం తమదేనని ప్రకటించుకొన్నారు.

“దేశం రెండు ముక్కలైంది” కోపంగా అన్నాడు రోజర్స్.

“రాజుగారు వాయవ్య దిక్కునూ, పార్లమెంటువారు ఆగ్నేయ ప్రాంతాన్నీ తమ అదుపులో ఉంచుకొన్నారు” జోడించాడు హ్యారీ.

“మన బెడ్ఫోర్డ్ మాత్రం ఈ రెండింటి మధ్యనున్న సరిహద్దు ప్రాంతంలో ఉంది” చింతించాడు రోజర్స్.

“సైనికులకు పదహారు సంవత్సరాల వయసుండాలనడం ఏం బాగా లేదు” దుఃఖించాడు జాన్. “అబ్బ, సైతాను పనులకు యుద్ధంలో ఎంత మంచి అవకాశం !” ఎక్కడో చూస్తూ కలకంటున్నట్టుగా అన్నాడతడు.

ఎక్జిల్ యుద్ధం అయిపోయాక, మళ్ళీ మరిన్ని యుద్ధాలనుగూర్చిన వదంతులు వచ్చాయి. మొదట పార్లమెంటు సైన్యం అడ్వాల్టన్ మూర్ వద్ద రాజుగారి సైన్యంతో ఓడిపోయింది. తర్వాత పార్లమెంటు సైన్యం రాజుగారి సైన్యాన్ని రౌండ్ వే డౌన్స్ వద్ద ఎదుర్కొంది.

ఆ యుద్ధం పార్లమెంటు అత్యున్నత సైన్యాధికారి విలియం వాలరూ, రాజుగారి వీర యోధుడు ప్రిన్స్ రూపర్ట్కూ మధ్య జరిగింది. ప్రిన్స్ రూపర్ట్ చేతిలో వాలర్ చావుదెబ్బ తిన్నాడు. బెడ్ఫోర్డ్ షైర్ తూర్పుభాగం, ఆ చుట్టు ప్రక్క ప్రాంతాలు తిరుగుబాటుదారులైన పార్లమెంటు సైన్యంతో చేతులు కలిపాయి. యుద్ధం త్వరగా ముగియటం జాన్కు సంతోషంగా లేదు.

“బహుశా నాకోసమైనా సైతాను యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంటాడు” – తనలో తాను చెప్పుకొన్నాడు జాన్.

తన పదిహేనవ పుట్టినరోజుకు ఒక నెలముందు జాన్ తమ పెరట్లో తన తండ్రి కొలిమివద్ద పనిచేస్తున్నాడు. చీకటి ఆలోచనలు అతని మనస్సులో యధేచ్చగా ముసురు కుంటున్నాయి. వర్షం బాగా కురిసింది. జాన్ యింటి దగ్గరనున్న చిన్న నది ఎప్పటి లాగానే బాగా పొంగి ప్రవహిస్తోంది.

ఇంటి వెనుక పొలం బురదమయంగా ఉంది. ఇంగ్లీషువారి చట్టం ప్రకారం బీడు భూముల్లో ఎవరి పశువులైనా మేయవచ్చు. అందుకే ఎలోలో ఉన్న పందులన్నీ జాన్ వాళ్ళ బీడు భూముల్లోని బురదలో ముట్టెలు పైకెత్తి పొర్లాడుతున్నాయి. వాటి కంపునూ, అరుపులనూ జాన్ భరించలేకపోతున్నాడు.

రోజర్స్ ఒగర్చుతూ హడావుడిగా పెరట్లో ఉన్న జాన్వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతని ముఖం ఎండకు కమిలిపోయి ఉంది. “రాజుగారి అశ్వకదళం సర్ లూయిస్ డైవే నాయకత్వంలో బెడ్ఫోర్డ్్మద దాడి చేస్తోంది.”

“సర్ డైవేని సర్ లూక్ మట్టుబెడతాడు” – నింపాదిగా జవాబిచ్చాడు జాన్.

“లేదు, రాజుగారి సైన్యమే గెలుస్తుందని విన్నాను” అన్నాడు రోజర్స్.

“రోజర్స్, బెడ్ఫోర్డ్కు వెళ్లాం పద” – గుర్రపు నాడాను మంటలోకి విసిరేస్తూ అన్నాడు జాన్.

“ఏ .. ఏ ఏంటీ, బెడ్ఫోర్డ్క? నాటింగ్ం నుండి ఆనాటి సైనికుడు అక్కడకు వస్తే ఎలా? వాడు నిన్ను తీసుకెళ్ళడానికి వస్తానని చెప్పాడుకూడా.”

జాన్ గంభీరంగా బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అతడు యుద్ధం చేయ డానికి వెళ్తున్నాడా లేక యుద్ధం చూడ్డానికి వెళ్తున్నాడా అనేది తెలీదు. వెళ్ళొద్దని వాళ్ళమ్మ బ్రతిమలాడింది. మార్గీ బ్రతిమలాడింది. రోజర్సక్కూడ బ్రతిమలాడాడు. వీళ్ళెవరూ అతణ్ణి ఆపలేకపోయారు. కాని అతని తండ్రి పిడికిలి ఒక్కటే అతణ్ణి ఆపగలిగింది.

ఆ తర్వాత హ్యారీతో కలిసి జాన్ బెడ్ఫోర్డ్కు జారుకున్న సమయానికి రాజుగారి మనుష్యులంతా వెళ్ళిపోయి బెడ్ఫోర్డు పౌరులు గాభరాగా వీధుల్లో తిరుగుతున్నారు. సర్ డైవే గత సంవత్సరం ఔసె నదిని ఈది సర్ లూకన్నుండి తప్పించుకొనిపోయి యిప్పుడు ప్రతీకారంగా వందలాది సైన్యంతో తిరిగి వచ్చాడు. వారు న్యూపోర్ట్ ప్యాగ్నెల్లోని చిన్న అశ్వకదళాన్ని ఓడించి తరిమికొట్టి రెండువేల మంది జనాభాగల పట్టణాన్ని కొల్లగొట్టారు. సెయింట్ పీటర్స్ గ్రీన్ నుండి సెయింట్ జాన్ హాస్సిటలవరకు రాజమార్గమంతా గుడ్డలతో కప్పిన శవాలతో నిండి ఉంది.

“అదీ యిప్పుడున్న యుద్ధ పరిస్థితి” పురజనుల్లో ఒకడన్నాడు. “ఒక గుంపుకు చెందినవారు బయటికి వెళ్ళినప్పుడు అది తెలిసికొని అవతలి గుంపుకు చెందినవారు వారి స్థావరాలకు వచ్చి దోపిడీలు, హత్యాకాండలు జరిగిస్తున్నారు. సర్ లూక్ తన సైన్యంతో న్యూపోర్ట్ ప్యాగ్నెల్నుండి వెళ్ళిపోయాడని సర్ డైవేకి తెలిసి ఉండొచ్చు”.

ప్రతి ప్రాంతంలోను అవతలివారి పక్షంగా పోరాడుతూ బలమైన తమ ప్రాకారాల్లో దాక్కొనేవారున్నారు. ఎల్లోకూడ అలాంటివారున్నారు. 1644 జనవరి మాసంలో పార్లమెంటుకు చెందిన వందమంది న్యూ ప్యాగ్నెల్ స్థావరంనుండి వచ్చి, ఎల్స్టా చర్చి దగ్గర హిల్లర్స్టాన్ హౌస్లోలో నివాసముండే ఒక రాజుగారివైపు వ్యక్తిని బయటకు లాగారు.

ఆ రోజు చలిగాలి తీవ్రంగా ఉన్నందువల్లనూ, చాలా త్వరగా ఆ పని జరిగినందువల్లనూ కొద్దిమందిమాత్రమే అది చూశారు. జాన్ నివసించే ప్రాంతం అక్కడకు ఒక మైలు దూరంలో ఉన్నందున అతడుకూడ చూడలేకపోయాడు.

జాను గుర్తున్నంతవరకు యింత చలి మునుపెన్నడూ లేదు. లండన్ వాసులు ఆ మహా నగరానికి ముప్పై మైళ్ళ లోపలనున్న ఏ చెట్టునైనా నరికేయవచ్చునని ఎలెలో వదంతులు వ్యాపించాయి. అదే అదునుగా ప్రజలు విండ్సన్ దగ్గరనున్న రాజుగారి చెట్లన్నీ కొట్టేశారు.

జాన్ ప్రతిరోజూ నది ఒడ్డుకు పోయి నీళ్ళలో కొట్టుకొని వచ్చిన చెట్ల కొమ్మల్ని నరికి యింటికి తీసుకురావాలి. కాని జాన్ నది ఒడ్డున తన స్నేహితులతో కాలక్షేపంచేసి యింటికొచ్చేవాడు.

అమ్మకూ, చెల్లికీ చలికాచుకోడానికి కట్టెలవసరమనీ, తానొకవేళ తీసుకెళ్ళకపోతే వాళ్ళెక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుందనీ జాను తెలుసు. కాని తాను కట్టెలు తేవడంలేదన్న విషయాన్ని వాళ్ళు నాన్నతో చెప్పరు కాబట్టి తాను భయపడనవసరం లేదు. జాన్కు వసంత ఋతువంటే భలే యిష్టం. ఈ చలికాలమంటే జాను అస్సలు యిష్టం లేదు. ఎందుకంటే ఈ చలి కాలంలో అమ్మ, చెల్లీ విపరీతంగా దగ్గుతూ బలహీనపడిపోతుంటారు.

“మీ యిద్దరికీ విశ్రాంతి అవసరం” అన్నాడు జాన్.

“మరైతే యింటి పనుల్లో మాకు సహాయపడతావా జాన్?” ఆశగా అడిగింది

“ఇప్పుడు సహాయం చేయడం లేదామ్మా?” – తన్ను తాను సమర్థించుకొంటూ సమాధానమిచ్చాడు జాన్.

మే మొదటి వారం ఎలోలో జరిగే నాలుగు రోజుల సంతకు చుట్టు ప్రక్క ప్రాంతాలనుండి జనం విపరీతంగా వచ్చారు. వర్తకులు సంతల్లోనూ, తమ సొంత పట్టణాల్లోనూ తప్ప వేరెక్కడా వ్యాపారం చేయకూడదన్నది ఇంగ్లాండ్ దేశ చట్టం. సంతలో వస్తువులు జాన్కు ఏమాత్రం నచ్చలేదు.

ఇంద్రజాలం, తోలుబొమ్మలాట, వీధి నాటకం, చలిమంటలు యివేవీ తనను ఆకర్షించలేకపోయాయి. అయితే సంతకు కొద్ది దూరంగా మసక వెలుతురులోనున్న పొలాలను అతడు చాలా యిష్టపడ్డాడు. అక్కడి సంగీతానికి అతని హృదయం గీతాలాపన చేసింది. కోళ్ళ పందాలు, అల్లరి నృత్యాలు, పేకాటలు, అలంకరించుకొన్న స్త్రీలు – అక్కడ పాపం రాజ్యమేలుతోంది.

ప్రస్తుతం తనవద్ద డబ్బు లేదు. అందుకే కేవలం చూచి ఆనందించి తృప్తిపొందు తున్నాడు. ‘అయితే వీటన్నిటినీ అనుభవించి ఆనందించే ఒక రోజు రాకపోతుందా?’ జాన్ తనలోతాను ఊహించుకొంటూ నడుస్తున్నాడు.

“జీవితాన్ని ఎలా అనుభవించాలో సైతానుకు బాగా తెలుసు” హ్యారీతో అన్నాడు జూన్.

జూన్ నెలలో జాన్ తల్లికి బాగా జబ్బు చేసింది. మొదట అతడు అంతగా పట్టించు కోలేదు. పల్లెల్లో స్త్రీలు జబ్బుపడటం మామూలే! అది చాలా కష్టంగా ఉన్నప్పటికీ భరించక తప్పదు. కాని జాన్ అమ్మ మంచంమీదనుండి లేవలేకుండా పోయింది.

“పాపం అమ్మ ఎంత బలహీనమైపోయింది!” తనలో తాను బాధపడ్డాడు జాన్. ఇప్పుడు మార్గీ రొట్టెలు కాల్చడమేగాక, యింటి పనులన్నీ కూడా చేయాలి. చార్లెస్ రాజు తన సైన్యంతోసహా ఎల్టాకు దక్షిణంగా యిరవై మైళ్ళ దూరంలోనున్న లైటన్ పట్టణంమీదకు బయలుదేరాడన్న విషయం జాన్లో ఉత్సాహాన్ని రేపింది. అయిష్టంగానే జాన్ తిరిగి రాజును యిష్టపడటం ప్రారంభించాడు.

“వీళ్ళింకా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారట” – ఒక రోజు సాయంత్రం ఆనందంగా తన స్నేహితులతో అన్నాడు జాన్.

“చార్లెస్ రాజు మత్తు కళ్ళవాడట. మా సవతి తండ్రి చెప్పాడు” ద్వేషంగా అన్నాడు హ్యారీ.
.
“కాని ఆ మత్తు కళ్ళవాడు యుద్ధం చేస్తున్నాడు తెలుసా?” – కోపంగా అన్నాడు

“మనం ఒకటి రెండు యుద్ధాల్లోనైనా పాల్గొనాలి. ఏంటి, యుద్ధం సంగతి వింటూనే నీ ముఖం ఆవు పాలలాగా తెల్లబోయింది రోజర్స్?”

తన తల్లికి జబ్బు ఎక్కువైనప్పుడు జాన్ బాగా కలవరపడ్డాడు. ‘జ్వరంతో ఈ మధ్య చాలామంది చనిపోయారు. ఒకవేళ అమ్మకేమైనా ఐతే!’ అమ్మ లేని యింటిని ఊహించుకోలేకపోతున్నాడు జాన్. ఇప్పుడామె తనకొక జబ్బు మనిషిలాగ కాకుండా చాలా విలువైందిగా కనబడుతోంది.

అమ్మ అలా మంచాన పడి ఉండటం అతనికి చాలా బాధగా ఉంది. ఆమెను స్వస్థపరచమని మనసారా దేవుణ్ణి ప్రార్థించాడు. ఒక రోజు ఆమె గంజి చప్పరిస్తూ కోలుకున్నట్టే కనిపించింది కాని మరుసటి రోజుకంతా పాలిపోయి చల్లగా చలనంలేకుండా రాయిలా పడి ఉంది. తనకెంతో ప్రియమైన అమ్మ యిక లేదు.

అమ్మ చనిపోయింది. ఆమె తనను వదలి శాశ్వతంగా వెళ్ళిపోయింది. దేవుడు మళ్ళీ తనను వదిలేశాడు. సమాధి ప్రక్కన అమ్మ తమ్ముడు జాన్, ఆమె తోబుట్టువులు రోస్, ఎలిజబెత్, ఆనీ మేరీలు మాత్రమే కనిపించారు. తమ తండ్రి, తమ్ముడు ఎడ్వర్డ్, ఆయన ముగ్గురు సోదరీలు బాగా అలంకరించుకొని కనిపించారు.

జాన్ చెల్లి మార్గీ జబ్బుగా ఉన్నప్పటికీ జాన్ను ఓదార్చేందుకు ప్రయత్నించింది కాని అతణ్ణి ఓదార్చలేకపోయింది. ‘అమ్మ బ్రతికున్న రోజుల్లో ఆమె మాట వినకుండా తాను ఆమెనెంతగా బాధపెట్టాడు!’ జాన్ అంతరాత్మ అతణ్ణి గుండెల్ని పిండుతూ ప్రశ్నిస్తోంది.

ఆ మరుసటి నెలలో మార్గీ చనిపోయినప్పుడు జాను ఈ ప్రపంచం శూన్యంగా కనిపించింది. తాను మార్గీకోసంకూడ ప్రార్థన చేశాడు. అయినా దేవుడు తనను మళ్ళీ నిరాశపరిచాడు. ఎర్రని జుట్టుతో, ముఖంపై గోధుమరంగు మచ్చలతో ఎంతో అందంగా ఉండే తన ప్రియమైన మార్గే తనకు దూరమైన దుఃఖాన్నుండి తాను కోలుకోలేకపోతున్నాడు.

ఆలోచనలతో జాన్కు రాత్రిళ్ళు నిద్రపట్టడంలేదు. ఒకవేళ మగతగా నిద్రపట్టినా పీడకలలు తనకు విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి. మార్గీ బ్రతికున్న రోజుల్లో తానామెపట్ల ప్రవర్తించిన తీరు తనను హృదయంలో గుచ్చుతోంది.

కొన్నిరోజుల తర్వాత యార్కుకు సమీపంలో ఉత్తరంవైపున మార్దన్ మూర్ వద్ద భీకర యుద్ధం జరుగుతోందని బెడ్ఫోర్డ్షైర్లో జాన్, అతని మిత్రులు విన్నారు. అక్కడ పార్లమెంటు సైన్యం రాజుగారి సైన్యాన్ని నామరూపాల్లేకుండా చేసింది. ఈ యుద్ధం ఆలివర్ క్రాంవెల్ అనే అశ్వక దళ అధ్యక్షునిద్వారా అపజయంనుండి విజయంవైపుకు తిరిగింది. అజేయుడైన అతనికి సైనికులు ‘ఐరన్ సైడ్స్’ అనే బిరుదు నిచ్చారు.

“హంటింగ్టన్ నుండి ఔసె నదివరకు ఐరన్ సైడ్స్ బాగా ప్రబలమయ్యాడని అందరూ అంటున్నారు” – హ్యారీ కళ్ళు విచ్చుకున్నాయి.

“నేను ఒకప్పుడు రాజుగార్ని అభిమానించేవాణ్ణిగా ఉన్నానన్న విషయాన్ని నమ్మలేక పోతున్నాను” జాన్ తనలో తాను గొణుక్కున్నాడు. “మా అమ్మా, చెల్లీ చనిపోవడానికి కారణమైనాకూడ రాజుగారిని నేను అభిమానించేందుకు కారణమైనందుకు మా నాన్నకు నేను కృతజ్ఞుణ్ణి.” వాళ్ళకున్న కొద్దిపాటి పొలంలో జాన్ గోధుమపంట కోసి, కట్టలు కట్టి వామిగా పేర్చుతున్నాడు.

యుద్ధం యింత త్వరగా ముగింపుకు రావడం అతణ్ణి కలవరపరుస్తోంది. ఇంగ్లాండు చరిత్రలో యింత ఘోరమైన ఉపద్రవం వెనుక సైతాను ప్రమేయం తప్పక ఉండి ఉంటుంది. అయితే తానీ ఉపద్రవంలో పాలుపంచుకొని సైతానుకు ఉపయోగపడే అవకాశాన్ని జారవిడుచుకొంటున్నాడేమో!

జాన్ జీవితం యింకా విషాదమైపోయింది. అతడు గడ్డి నూర్చి గోధుమలను గోతాల్లోకి ఎత్తే సమయానికి వాళ్ళ నాన్న ఒక నూతన వధువుతో యింటికి వచ్చాడు. అర్థరాత్రి జాన్ ఒళ్ళు నొప్పులతోను, తల్లి చెల్లి జ్ఞాపకాలతోను అటకపై రోదించే సమయంలో అతని తండ్రి తన క్రొత్త వధువు ఆనీతో నిద్రిస్తున్నాడు. తన తండ్రిని చూస్తే జాను అసహ్యమేస్తోంది.

జాన్ ప్రక్కకు తిరిగి యుద్ధాన్నిగురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఈ యుద్ధం యిలానే మరికొంత కాలం కొనసాగాలని తాను మనసారా కోరుకొంటున్నాడు. నవంబరు నెలలో కొన్ని వారాల తర్వాత జాన్ తమకున్న కొద్దిపాటి పొలాన్ని దున్ని, గోధుమలు చల్లాడు. ఇదంతా అతడు గుర్రంలేకుండా తనే చేశాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న పాత్రలకు, పనిముట్లకు కళాయి వేయడానికి ప్రక్క గ్రామాలకు వెళ్తూ తన క్రొత్త పెండ్లికూతురుకోసం త్వరగా యింటికి వచ్చేందుకు గుర్రాన్ని తనతో తీసుకెళ్ళేవాడు.

జాను విడుదల దినం ఆసన్నమైంది. అతడు వీడ్కోలు సంజ్ఞగా తన సవతి తల్లి ఆనీవైపు తీవ్రంగా చూస్తూ తన యింటిని శాశ్వతంగా వదిలేశాడు. బెడ్ఫోర్డ్ు వెళ్ళేదారిలో మలుపుదగ్గర విల్లీతో కలిసి వెళ్తున్న జాన్ను రోజర్స్ చూశాడు.

“ఏయ్ జాన్, ఎక్కడికి వెళ్తున్నావు?”

“నా తమ్ముడు విల్లీని స్కూలుకు తీసుకెళ్తున్నాను” – జవాబిచ్చాడు జాన్.

“అలా నీవెప్పుడు చేయవుగదా జాన్. క్రొత్తగా ఈ రోజేంటి యిలా? నీ చేతిలో ఆ సంచి ఏమిటి?” – ఆశ్చర్యంగా అడిగాడు రోజర్స్.

“నీవు తప్పక తెలుసుకోవాలా? అయితే విను. నేను సైన్యంలో చేరడానికి వెళ్తు న్నాను. ఈ రోజుతో నాకు పదహారేళ్ళు నిండాయి.” గంభీరంగా జవాబిచ్చాడు జాన్. “నాక్కూడా పదహారేళ్ళు నిండాయి.

“నేనుకూడ సైన్యంలో చేరాలనుకుంటున్నాను. కాని వాళ్లు మనల్ని పిలిచేంతవరకు ఆగుదాం” – సలహా యిస్తున్నట్టుగా చెప్పాడు. రోజర్స్.

“అప్పటికి యుద్ధకాలం కాస్త అయిపోతుంది.” అలా అంటూనే ముందుకు సాగి పోయాడు జాన్. తాను యుద్ధంలో ఎందుకు చేరాలనుకుంటున్నాడో రోజర్స్కేం తెలుసు? చెప్పినా వాడు అర్థం చేసుకోలేడు. కన్నీళ్ళతో తనకు వీడ్కోలు చెబుతోన్న తన చిన్నారి తమ్ముడు విల్లీవైపు కడసారి ప్రేమగా చూశాడు జాన్. చివరిసారిగా వాడితో ఏదో మాట్లాడాలనీ, వాడికేమేమో చెప్పాలనీ ఉంది కాని, ఏం చెప్పినా అర్థం చేసుకునే వయస్సు కాదు వాడిది.

ఆలోచిస్తూ ముందుకు నడిచాడు జాన్. ఆ తర్వాత అతడు న్యూఫోర్ట్ ప్యాగ్నెల్వద్ద సైనిక స్థావరంయొక్క ముఖద్వారంలో ప్రవేశించినప్పుడు జీవితంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్వేచ్ఛను పొందిన అనుభూతిని పొందాడు. ఇప్పుడు తానొక సైనికుడుగా ‘ఐరన్ సైడ్స్’ అని పిలువబడే ఆలివర్ క్రాంవెల్ సైన్యంలో పనిచేయబోతున్నాడు.

తూర్పు ప్రాంతానికి చెందిన అన్ని పరగణాలనుండి వచ్చిన దాదాపు వెయ్యిమంది సైనికులతో నిండి ఉంటుందీ సైనిక స్థావరం. న్యూపోర్ట్ ప్యాగ్నెల్లో తోటి సైనికులతో పిచ్చాపాటిగా మాట్లాడుకొంటుంటే తెలిసింది వారు భీకరమైన యుద్ధాన్ని చూశారని.

రాజుగారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నింటిలో వారు యుద్ధం చేశారట. వారి సైన్యాధ్యక్షుడు సర్ శామ్యుల్ లూక్. ఆయనను జాన్ యింకా మరిచిపోలేదు. ఆ తర్వాత రోజుల్లో జాన్ ఆయనను చాలా అరుదుగా చూశాడు. తరచుగా తనకు కనిపించే సైనికాధికారులు కల్నల్ కొకేన్, మేజర్ ఎన్నీస్లు.

కొన్నాళ్ళపాటు క్రొత్త సైనికులకు శిక్షణనివ్వడం పూర్తయ్యాక జాన్ అధికారి అతనివద్దకు వచ్చి ఇలా అన్నాడు – “పార్లమెంటు సైన్యంలో నీవు ఏ విభాగంలో చక్కగా సరిపోతావో యిప్పుడు నిర్ణయించాలి.”

“ఐరన్ సైడ్స్ యొక్క అశ్వకదళంలో చేరడం నాకు యిష్టం” – తన యిష్టాన్ని
తెలిపాడు జాన్.

“నీ యిష్టప్రకారం అశ్వకదళంలో చేరడం సాధ్యంకాదు. మంచి విగ్రహంతో నీవు బాగా బలంగానే కనిపిస్తున్నావుగాని, పైకి కనిపించేటంత ధృడంగా ఉన్నావా నీవు?”

“మా నాన్నగారి గుర్రంవద్ద నేను చిన్నప్పటినుండీ పనిచేశాను. గుర్రాన్ని నియంత్రిం చడం నాకు అలవాటే” – తన అనుభవాన్ని వివరిస్తూ చెప్పాడు జాన్.

“ఈటెతో యుద్ధంచేసే సైనికునిగా నిన్ను చేయాలనుకున్నానుగాని నీకున్న తెలివితేటలను గుర్తించి నిన్ను తుపాకీ పట్టే సిపాయిగా చేస్తాను” – తన నిర్ణయం తెలిపాడు అధికారి.

తను తుపాకీ పేల్చే సిపాయి కావడం జాను చాలా ఆనందంగా ఉంది. ఈటెను పట్టే సైనికుడు పదహారడుగుల పదునైన ఈటెను భారంగా మోయడమేగాక, తలమీద శిరస్త్రాణం, ఛాతిని వీపును కప్పే బరువైన ఉక్కు కవచం మొదలైనవి ధరించాలి. అయితే తుపాకీ యోధులుకూడ భారమైన యుద్ధాభరణాలు ధరించడమేగాక వికారంగా కూడ కనిపిస్తారని తన దుస్తులు ధరించాక అతనికి అర్థమైంది.

దాదాపు పది కిలోల బరువుండే తుపాకినీ, ఒరలోనున్న పొడవైన కత్తినీ, ముళ్ళ గరిటెలాగ ఉండే పొడవైన యినుప కడ్డీనీ, ఛాతి చుట్టూ తుపాకీ గుండ్ల బెల్టునూ, తుపాకీ మందును ఉంచుకొన్న కొమ్మునూ మోయాల్సి ఉంటుంది. అంతేగాక ఛాతికి వాలుగానున్న పట్టీనుండి మందు గుండును వెలిగించే చిన్న ప్రేలుడు వత్తులు, మందు దట్టించిన తర్వాత గొట్టాన్ని మూసే దళసరి ఉన్ని బంతులుకూడ వ్రేలాడుతుంటాయి.

అయితే ఈ సైనిక దుస్తులు అతనికి సంతోషాన్నిచ్చాయి. అతని మనస్సును అవి పులకరింపజేశాయి. అతని క్రొత్త బూట్లు నల్లగా మెరుస్తూ నిగనిగలాడుతున్నాయి. తెల్లని ఈకతో వదులుగా ప్రక్కకు వాలి వెడల్పుగానున్న కమిలిన చర్మపు రంగు టోపీని అతడు తలపై ధరించాడు. తెల్లని మేజోళ్ళమీద కమిలిన చర్మపు రంగు ప్యాంటును ధరించాడు. తెల్లని పొడవైన చేతులు కలిగిన చొక్కా వెడల్పైన కాలర్ సింధూర వర్ణపు దట్టీ క్రింద దోపబడి ఉంది.

తుపాకీని తగిలించుకోడానికి ఏర్పాటు చేయబడిన చర్మపు రంగు సంచి ఎర్రని పట్టీతో చాలా అందంగా అమర్చబడి ఉంది. ఇంత చక్కని దుస్తులు జాన్ తన జీవితంలో ఎప్పుడూ ధరించలేదు. తానిప్పుడు ధరిం చిన ప్రతిదీ గతంలో తాను ధరించినదానికన్నా మెరుగ్గా ఉంది. పేదలకు ఒక అర్థ పెన్నీకూడ దానం చేయని ఈ ప్రజలు యుద్ధంకొరకై ఇలాంటి విలువైన వస్తువులకోసం డబ్బును ఉదారంగా సేకరించి పంపడం జాను ఆశ్చర్యంవేసింది. అయితే పేదలకు సహాయంచేసే విషయంలో తాను కొంతవరకు పరవాలేదనిపించింది జాను.

ఒక రోజు మేజర్ ఎన్నీస్ క్రొత్త సైనికులనుద్దేశించి మాట్లాడాడు – “మనది ఒక నూతనమైన ఆదర్శ సైన్యం. ప్రపంచంలోకెల్లా మనదే అత్యాధునికమైనది. ప్రామాణిక మైన జీతభత్యాలను, స్పష్టమైన నియమనిబంధనలను ఏర్పాటుచేసిన ఆలివర్ క్రాంవెలు మనమందరం సదా కృతజ్ఞులం.

నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈటెపట్టే సైనికుడు తుపాకీ పేల్చే సిపాయికి చాలా సన్నిహితుడైన మిత్రుడు. అలానే తుపాకీ పేల్చే సిపాయికూడ ఈటె పట్టే సైనికునికి అత్యుత్తమమైన స్నేహితుడు. నేను చెప్పేది యిప్పుడు మీరు నమ్మకపోతే మీ మొదటి యుద్ధంలో పాల్గొన్న తర్వాత మీరు తప్పక నమ్ముతారు.”

బరువైన తన దుస్తుల్నీ, ఉపకరణాల్నీ ధరించి నడవడాన్ని జాన్ ప్రతి రోజూ సాధన చేస్తున్నాడు. అప్పుడప్పుడు తన తుపాకీని పేల్చడంకూడ అతడు సాధన చేస్తున్నాడు. అయితే తుపాకీ మందు, గుండ్లు చాలా ఖరీదైనవి, చూసి వాడుకోవాలి. తుపాకీని ఎలా పేల్చాలో జాన్ సార్జంట్ అతనికి క్షుణ్ణంగా బోధించాడు.

తుపాకీని మోకాళ్ళ మధ్య ఎలాపెట్టుకోవాలో, సరిపడ్డ తుపాకీ మందును అరచేతిలో వేసికొని తుపాకీ గొట్టంలో ఎలా దట్టించాలో అతడు జాన్కు నేర్పించాడు. జాన్ అప్పుడొక గుండును గొట్టం లోపల వేసి ఒక పేపరు బిరడాను అడ్డం పెట్టాడు. తర్వాత ఒక కడ్డీ తీసికొని బిరడాను గట్టిగా మందు గుండువైపు బిగగొట్టాడు. అప్పుడతడు తుపాకీని స్టాండుమీద కదలకుండా ఉంచి, ఒక తాడుకు నిప్పంటించి, ఫ్లాష్పాన్మాద ప్రాథమిక ప్రేలుడు పదార్థాన్ని చల్లి, గొట్టాన్ని గురివైపుకు సరిచేసి మ్యాచ్ లాక్ను లాగాడు.

ఒక క్షణం తర్వాత గొట్టంలోనుండి ప్రేలుడు పదార్థం పెనుకెరటంలాగ పెద్ద శబ్దంతో విరుచుకు పడింది. తర్వాత గొట్టంలోనుండి పొగ దట్టంగా బయటకు వచ్చింది. తుపాకీ గుండు కొద్ది దూరంలో చెక్కతో తయారుచేసిన ఒక లక్ష్యాన్ని ఛేదించవలసి ఉంటుంది. గుండు అప్పుడప్పుడూ గురివైపుకు చక్కగా వెళ్ళేది. కాని తుపాకీ గొట్టంలో నుండి వచ్చే దట్టమైన పొగ కారణంగా జాన్కేమీ కనిపించేది కాదు.

“నువ్వు నాకెందుకు సన్నిహితమైన మిత్రుడివో నాకిప్పుడర్థమైంది” – జాన్ తనతో నున్న ఈటె పట్టుకొనే సైనికునితో అన్నాడు. “నేను రెండు నిమిషాలకోసారి మాత్రమే నా తుపాకీని పేల్చగలను. మళ్ళీ రెండవసారి నా తుపాకీని సిద్ధంచేసికొని పేల్చే వ్యవధిలో నేను కేవలం భద్రతలేనివాణ్ణి.” పదహారడుగుల పొడవున్న ఈటెల మధ్యలో తాను కాపాడబడటమనే ఆలోచన జాన్కు ఆదరణ కలిగించింది.

న్యూపోర్ట్ ప్యాగ్నెల్ ప్రాముఖ్యతనుకూడ జాన్ తెలుసుకొన్నాడు. ఇది పార్లమెంటు సైనిక స్థావరంలో ఒకటైన ‘తూర్పు సమాఖ్య’లో ఒక భాగం. ఆలివర్ క్రాంవెల్ సొంత కుమారుడు ఈ సైనిక స్థావరంలో ఉంటూ గత సంవత్సరం మశూచి సోకి చనిపోయాడు.

ఈ సైనిక స్థావరం చుట్టు ప్రక్క ప్రాంతాల యువకుల్ని ఆకర్షిస్తోందా అన్నట్టు హ్యారీ, రోజర్స్లు కూడ త్వరలోనే అక్కడకు చేరుకున్నారు. అయితే వారు వేరే సైనిక శిబిరాల్లో ఉంచబడ్డారని జాన్కు ఆ తర్వాత తెలిసింది.

క్రొత్తగా వచ్చిన సైనికుడు ఇంగ్లీషువారి జీవన విధానాన్ని గురించి సైనిక స్థావరంలో చాలా నేర్చుకుంటాడు. తన మొదటి రోజుల్లో జాన్ వేరే సైనికుణ్ణి – “అశ్వకదళానికి ఎక్కడ శిక్షణనిస్తారు?” అని అడిగాడు.

తన ప్రశ్నకు సమాధానమివ్వకుండా ఆ సైనికుడిలా మాట్లాడ్డం ప్రారంభించాడు, “మన అధికారుల్లో మనలాగా నీతినియమాలుండవు తెలుసా? తమ యిష్టాయిష్టాలకు సంబంధించినంతవరకు మన అధికారులు మంచివాళ్ళే.

మన అధికారుల్లో అందరూ సంపన్న వర్గాలవారే. మనలాంటి సామాన్య పేద వర్గాన్ని వాళ్ళ అవసరాలకే వాళ్ళు వాడుకుంటారు. ఆపై ప్రక్కన పడేస్తారు. వాళ్ళకు మనతో పని ఉన్నంతవరకే మనతో మంచిగా ఉంటారు.”

ఎప్పుడూ తిరుగుబాటు మనస్తత్వాన్ని కలిగిన జాన్ న్యూపోర్ట్ ప్యాగ్నెల్లో యితరుల కన్నా తానెంతో మెరుగైనవాడుగా తనకు కనిపించాడు. అతడెప్పుడూ యింత అమర్యాదకరమైన దుర్భాషలు విని ఎరుగడు. అక్కడి మనుష్యుల్లో ఉన్న విరోధభావం జాను విస్మయం కలిగించింది.

ఆ సైనికులు ప్రతి విషయాన్నీ చెడ్డగా మాట్లాడేవారు. ఆహారాన్నిగురించీ, రాజునుగురించీ, ధనికులను గురించీ, పెద్ద మనుషులను గురించీ, స్థానిక బాలికలనుగురించీ, అధికారులను గురించీ, జీవితాన్ని గురించీ, చివరకు దేవుణ్ణి గురించికూడా వారు చెడ్డగా మాట్లాడుకొనేవారు.

“బైబిలు అసలు వాస్తవమైంది కాదు” – ఒక సైనికుడన్నాడు.

“బైబిలు వాస్తవమైంది కాదా?” సైనికులందరితోబాటు తనక్కూడా యివ్వబడిన ప్యాకెట్ బైబిల్ను యిష్టపూర్వకంగా తానెప్పుడూ చదవనప్పటికీ తోటి సైనికుడన్నమాట తననెవరో లాగి చెంపమీద కొట్టినట్టనిపించింది జాను.

“అసలు దేవుడే లేడు” – బ్రౌన్ అనే మరో సైనికుడన్నాడు.

“దేవుడు లేడా?” ఊపిరాడనట్టుగా నోటితో గాలి పీలుస్తూ ప్రశ్నించాడు జాన్.

ఆ రాత్రి తన గుడారంలో జాన్ చాలా కలవరపడ్డాడు. ‘దేవుడు లేడా? అయితే సైతానుకూడ లేనట్టేగా! అలాగైతే చిన్నప్పటినుండి తాను విన్నదంతా అబద్ధమేనా? అవునేమో! దేవుడు ఒకవేళ లేకపోవచ్చు. దేవుడున్నాడని తాను విన్నదంతా అబద్ధమై యుండొచ్చు’.

మొట్టమొదటిసారిగా తన మనస్సులో దేవుణ్ణి గురించి విపరీతమైన తలంపులు దొర్లుకొస్తున్నాయి. తానింతకాలం ఎంత వెర్రివానిలా ఆలోచించాడు! నరకం తనకొక రక్షణదుర్గం అనుకొన్నాడు యింతకాలం. అంతా మిథ్య. తాను అనుకొంటూ వచ్చిందంతా మాయ. ఆలోచించడానికి శక్తి చాలడంలేదు. అంతా మరచిపోవాలి. తన ఆలోచనల్ని ప్రక్కకునెట్టి నిద్రపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు జాన్.

“దేవుడు లేడు. దయ్యం లేదు. ఏమీ లేదు. అంతా అబద్ధం …” – నిద్రకు ఉపక్రమించాడు జాన్.

Leave a Comment