అచంచల బోధకుడు

అచంచల బోధకుడు

మరుసటి రోజు సాయంత్రం భోజనాల అనంతరం ఎలిజబెత్ బెడ్ఫోర్డులోని స్వంత యింటికి వెళ్ళేందుకు సిద్ధమౌతున్న సమయంలో జాన్ ఆమెతో కలిసి కుటీరం బయటకు వెళ్ళాడు. “పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోగలిగిన ఒకర్ని పెళ్ళిచేసుకోవాలను కుంటున్నాను, ఎలిజబెత్!” జాన్ అన్నాడు.

“అయితే నేనేం చేయాలి?” బిత్తరపోతూ అంది ఎలిజబెత్.

“నీలాగా పిల్లలను చూసుకునేవాళ్ళు యింకెవరూ లేరనుకుంటాను. పైగా పిల్లలు కూడా నీ దగ్గర బాగా ప్రేమగా ఉంటారు”.

“నేనా?” రొప్పుతూ అంది ఎలిజబెత్.

“ఈ సాయంత్రమే మీ తలిదండ్రులను కలవాలనుకుంటున్నాను.”

జాన్ ఆ విధంగా ఎలిజబెత్తో పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభించాడు. అతడీ ప్రస్తావన తెచ్చిన మొదటి సాయంత్రంనుండే ఎలిజబెత్ ఆనందంతో తేలిపోతున్నట్లుగా కన్పించింది. ఇంకా తాను రూఢిపరచుకోవలసి ఉంది.

తనను ఆమె బాగా అర్థం చేసుకోవాలనీ, ఆమె మనస్పూర్తిగా యిష్టపడితేనే తన భార్యగా ఆమెను చేసుకోవాలనీ తలంచాడు జాన్. అనేక సాయంత్రాలు దాపరికం లేకుండా అన్ని విషయాలూ ఆమెతో మాట్లాడుతూ వచ్చాడు.

వివిధ సమయాల్లో దేవుని ప్రేమలో ప్రత్యేకించి స్తుతిగీతా లాపనలో అతడు అత్యంత ఆనందభరితునిగా ఉన్నప్పటికీ, మిగిలిన సమయాల్లో అంత రంగపు ఆలోచనల్లో తాను ఏదో కోల్పోతున్నట్లు, ఆత్మీయంగా చల్లారిపోయినట్లూ, దేవుణ్ణి సమీపించరాని విధంగా ఉన్నట్లు అతనికి అనిపించేది.

జాన్ నూతన గృహిణిని కనుగొన్న తరువాత దక్షిణాన లండన్ పరిసరాలవరకు ఊరూరా తిరిగే బోధకునిలా మునుపటికన్నా యిప్పుడు మరింత తీరికలేని, చురుకైన బోధకుడయ్యాడు. అతడు తూర్పున కేంబ్రిడ్జ్ నుండి దక్షిణాన లండన్ పరిసరాల వరకు ఊరూరూ తిరిగి బోధిస్తున్నాడు.

అనేకమంది ఒక కళాయివేసేవాడి బోధ వినడానికి ఎంతో కుతూహలంతో వచ్చేవారు. తిరిగి వెళ్ళేటప్పుడు అతను కళాయివేసే వాడన్న ఆలోచన లేకుండా వెళుతున్నారు.

అయితే కొంతమందికి అతని బోధలు అంతగా నచ్చేవికావు. “క్రొత్త నిబంధనకు తల్లిలాంటిదైన గ్రీకు భాషలో లేఖనాలను చదువకుండా సువార్త బోధించడానికి నీకెంత ధైర్యం?” – కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన ఓ పండితుడు తిరస్కారంగా అన్నాడు.

“అయ్యా! మీ దగ్గర ఆదిమ సంఘానికి చెందిన పరిశుద్ధులు మరియు అపొస్తలులు వ్రాసిన అసలుసిసలైన గ్రంథపు చుట్టలున్నాయా?” జాన్ అడిగాడు.

“లేవనుకో, అయితే వాటి నకళ్ళు నా దగ్గరున్నాయి. ఆ ప్రతులు దేవుని సత్య వాక్యమని నేను నమ్ముతాను.”

“నా దగ్గరకూడ ఓ ప్రతి ఉందండి” – తన బైబిల్ను కత్తిలా ఝళిపించాడు జాన్ -“ఇదికూడ దేవుని సత్యవాక్యమని నేను నమ్ముతాను.”

మొదటి రెండు సంవత్సరాలూ, ఒక వ్యక్తి రక్షింపబడటానికి ముందు పాపాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకతనుగూర్చి జాన్ బోధించాడు. తర్వాతి రెండు సంవత్సరాలు క్వాకర్లు మరియు రాంటర్లచేత రెచ్చగొట్టబడ్డాడు. వాళ్ళ అబద్ధ బోధలనుగూర్చి అతడు ప్రసంగించాడు. ఇటీవలి ప్రసంగాలలో క్రీస్తు స్వభావాన్నిగూర్చి జాన్ మరీమరీ బోధింపసాగాడు.

1659 మే నెలలో ఒక రాత్రి కేంబ్రిడ్జికి కొంత దూరంలోని ఓ ధాన్యాగారంవద్ద జాన్ ప్రసంగించాడు. మొదటి తిమోతి పత్రిక నాల్గవ అధ్యాయం తన ప్రసంగాంశంగా తీసుకొని ఒక విషయంలో తన శ్రోతలలో అధిక భాగం అవిశ్వాసులుగా ఉన్నారని నేరారోపణ చేశాడు.

ప్రసంగం తర్వాత గౌను ధరించిన ఒక వ్యక్తి రాజసం ఒలకపోస్తూ జాన్ను ఎదిరించాడు – “నేను థామస్ స్మిత్ని, గాక్యాట్ మతాధిపతిని, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో అరబిక్ ప్రొఫెసర్ని, గ్రంథాలయాధ్యక్షుడనుకూడ. మాలో అత్యధికులు అవిశ్వాసులని ఆరోపించడానికి నీకెన్ని గుండెలు? మాలో అధిక సంఖ్యాకులను యీ రాత్రి తప్ప మునుపెన్నడూ నీవు చూడలేదు!”

“నాకున్న అధికారమంతా నా ప్రభువేనండీ!” – జవాబిచ్చాడు జాన్ – “మత్తయి సువార్త పదమూడో అధ్యాయంలోని ఉపమానంలో విత్తనం విత్తబడిన నేలలు నాల్గు రకాలని ప్రభువు బోధించాడండీ! ఒక్క రకం నేలమాత్రమే బాగా పండింది.”

ప్రచురణ పొందిన జాన్ వ్రాతల్ని స్మిత్ ఎండగట్టసాగాడు. ప్రత్యేకించి జాన్లాంటి సామాన్యులు బోధింపతగరన్న విషయంమీద అతడు జాన్ ను విసిగించాడు. జాన్ ఏ విధంగానూ స్పందించలేదు. ఆ అవసరంకూడ అతనికి లేదు.

తన బోధించే హక్కును గూర్చి మరో విశ్వవిద్యాలయ పండితుడు హెన్రీ డేన్ సమర్థించాడు. మరో విశ్వవిద్యా లయ పండితుడైన పాస్టర్ విలియం డెల్, ఎల్డెన్లోని తన సంఘంలో బోధించేందుకు జాన్ను ఆహ్వానించాడు.

క్రీస్తు స్వభావాన్నిగూర్చి ఉపన్యసించడంనుండి ప్రక్కకు తొలగిపోవాలని జాన్ కోరుకోవడం లేదు. 1659 వేసవిలో తాను ప్రచురించిన “ధర్మశాస్త్రముయొక్క సిద్ధాంతము మరియు బయలుపరచబడిన కృప” (Doctrine of Law and Grace Unfolded) అనే పుస్తకంలో తనను తాను “బెడ్ఫోర్డుకు చెందిన ఒక తిరస్కరింపబడిన పాపి”గా అతడు అభివర్ణిస్తూ వ్రాశాడు.

ఇది రెండు నిబంధనలనుగూర్చిన పుస్తకం. ఇందులో క్రీస్తు ఏ విధంగా తన ప్రజలను కృప అనే నూతన నిబంధన క్రింద ఉంచాడోనన్న విషయాలను అతడు వివరించాడు.

1659 హేమంత ఋతువు చివర్లో ఎలిజబెత్ ఆ ఇంట్లోకి జాన్ భార్యగా వచ్చినప్పుడు జాన్ నలుగురు పిల్లలు ఎటువంటి సణుగుడు, అయిష్టం లేకుండా ఆమెను అంగీకరించారు.

ఆమెను వారు మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. ఆమె ఫ్రీ చర్చి సభ్యురాలు గనుక వాళ్ళకామె ఎప్పట్నుంచో తెలుసు. ఆవిడ మేరీ, బెట్సీలకు ఓ పెద్ద అక్కలా కన్పిస్తుండేది.

ఒక శీతాకాలపు సాయంసమయంలో చలిమంట దగ్గర ఎలిజబెత్ జాన్తో యిలా అంది – “చాలా కాలంగా నువ్వు ఎక్కువగా మాట్లాడడం లేదు. ఏదైనా తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నావా, ఏంటి?”

“నీకు అనుమానంగా ఉన్నట్లుంది, అంతేనా?” ఆశ్చర్యంగా జాన్ బదులిచ్చాడు. “అవును, నీ ఈ నిశ్శబ్దం మామూలైంది కాదు.”

“సరిగ్గా చెప్పావు. దేవుని జలతారు పనిలో నేయబడటం చాలా బాధాకరమైందే!” “నీవు నన్ను బాగా సిద్ధపరచావు.”

“ఆలివర్ క్రాంవెల్ తన ప్రభుత్వ పతనానికి తానే విత్తనాలు నాటాడు. అతడు రాచరిక వాదులను పారద్రోలి, నీచమైన పార్లమెంట్ అవశేషంతో పాలన సాగించాడు. ఆ తర్వాత వాళ్ళను కాస్త రద్దుచేసి, అంతర్యుద్ధంకు ముందు ఎలా పాలించారో అలాగే యితడూ నియంతృత్వంగా పరిపాలించాడు.

ఒక్క క్రాంవెల్ మాత్రమే తన క్రొత్త ప్రభుత్వాన్ని ఏకత్రాటిమీద నడపగల సమర్థుడు. ఇతని కొడుకు రిచర్డ్ యీ నీచ పార్లమెంటు అవశేషాన్ని పునరుద్ధరించాలని ప్రయత్నించాడు గాని, సంరక్షక ప్రభువుగా నిరూపించుకోవడంలో భంగపడ్డాడు.”

“ఇంతకూ దీనర్థం ఏంటి?”

“పాత రాచరిక వాదులూ, కొంతమంది పార్లమెంట్ సభ్యులూ కూడా రాచరికాన్ని పునరుద్ధరించేందుకు ఒత్తిడిచేస్తున్నారు. దాంతోపాటే పూర్తి పార్లమెంటునుకూడ తిరిగి పునఃస్థాపితం చెయ్యగలమని అంటున్నారు.”

“అయితే యిది మెరుగుపడటం కాదా జాన్? ఎందుకంత విచారంతో కృంగి పోతున్నావ్?”

“ఎందుకంటే యీ క్రొత్త రాజు నాలాటి అననుకూలవాదులైన బోధకులయెడల సహనం కనపరచకపోవచ్చు.”

“నువ్వు అననుకూలవాదులనే పదాన్ని ఉపయోగించడం యింతకు ముందెప్పుడూ నేను వినలేదు సుమా!” ఎలిజబెత్ అంది.

“ఈ మాట యీ రోజుల్లో బాగా ప్రచారంలో ఉంది. రాజు రాకతోపాటు అసహనం కూడ తిరిగొస్తుందని నా భయం.”

కొన్ని రోజుల తర్వాత రిచర్డ్ క్రాంవెల్ రాజీనామా చేసి ఇంగ్లాండు విడిచి పారి పోయాడు. 1660 ఫిబ్రవరి నాటికి జనరల్ జార్జి మాంఖ్ లండన్మీదకు సైన్యాన్ని నడిపి రిచర్డ్ క్రాంవెల్ నీచపు పార్లమెంట్ అవశేషం బలవంతంగా రద్దు అయ్యేట్లు చేశాడు.

సాధారణ జనానికి త్వరలోనే తెలియవచ్చినదేమిటంటే బ్రేడా ప్రకటన అని గొప్పగా పిలువబడే ఒక ఆమోదింపబడిన చట్టం ప్రకారం పార్లమెంట్తో కూడిన ప్రభుత్వాన్నీ, మత స్వేచ్ఛనూ, రాజకీయ ప్రత్యర్థులకు క్షమాభిక్షనూ ప్రసాదించడానికి ప్రిన్స్ చార్లెస్ అంగీకరించాడని. మే నెల నాటికి యితడు రెండవ చార్లెస్ రాజుగా ఇంగ్లాండ్కు తిరిగి వచ్చాడు.

జాన్ యధావిధిగా బోధించడం కొనసాగించాడు. తనకో బిడ్డ కలుగబోతోందని ఎలిజబెత్ అతనితో చెప్పింది. అది తప్ప మిగిలిన వార్తలన్నీ మంచివి కావు. దేశ మంతటా, ముఖ్యంగా న్యాయమూర్తుల విషయంలో చాలా మార్పులొచ్చాయి.

క్రొత్త న్యాయమూర్తులంతా రాచరికవాదులే. అయితే ట్రేడావద్ద రెండవ చార్లెస్ వాగ్దానం చేసిన ప్రకారం దయార్ద్ర హృదయుడైన రాజుగా ప్రవర్తింపనున్నాడా? తెరచిన సమాధి నుండి వచ్చే దుర్గంధంలా బెడ్ఫోర్డుకు వార్తలు అలలు అలలుగా రాసాగాయి.

ఒక రోజు సాయంత్రం ఎలిజబెత్ ఇలా అంది – “ఏంటి జాన్, తెల్ల కాగితంలా అలా నీ ముఖం పాలిపోయి ఉందెందుకు?”

“లండన్నుండి వార్తలు వస్తున్నాయి. ఇవి నీకు చెప్పాలని నేననుకోవడం లేదు. ఎలిజబెత్. ఎలాగైతేనేం నువ్వు వాటిని వింటావులే. అవి బహుశ చాలా చెడ్డవైయుంటాయి.”

“అవి ఏవైనాసరే, నేను భరించాలని అంటావు. అంతేనా?”

“ఈ క్రొత్త రాజు తన తండ్రి మరణశాసనం మీద చేవ్రాలు చేసిన ప్రతి ఒక్కరినీ నిర్బంధిస్తున్నాడట. వాళ్ళు విచారణకూడ ఎదుర్కోవలసి ఉన్నారట. వాళ్ళు మరణశిక్ష పొందబోతున్నారని నా భయం.”

జాన్ భయాలు కాస్త వాస్తవాలయ్యాయి. మరణ శాసనంమీద సంతకాలు పెట్టిన పదిమందికి మరణశిక్ష ఖరారయ్యిందన్న విషయం ఇంగ్లాండ్ అంతా తెలిసిపోయింది. ఫ్రీ చర్చి వాళ్ళు సెయింట్ జాన్లో యిక యేమాత్రం కూడికలు జరిగించరాదన్న వార్తలు వచ్చిన మరుక్షణం సెప్టెంబరు నెలలో పాస్టర్ బర్టన్ గారు చనిపోయారు.

అంతర్యుద్ధం తర్వాత బయటకు వచ్చిన పాస్టర్లంతా వాళ్ళ వాళ్ళ చర్చీల్లో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు సంబంధించి వ్రాయబడిన ప్రసంగాలు మాత్రమే బోధించాలని పార్లమెంటు చట్టం చేసింది. ఆ రోజు అరెస్టులను గురించి ఎలిజబెత్తో చెప్పినప్పుడు బ్రేడా ప్రకటనపట్ల చార్లెస్ చేసిన ద్రోహంగురించి జాన్ ఆమెకు చెప్పలేకపోయాడు.

‘మత సహనానికి యిది ముగింపు’ – తనలో తానే చెప్పుకున్నాడు జాన్. పాస్టర్ బర్టన్ గారిని గూర్చిన దుఃఖంలోనూ కలవరంలోనూ తాము కూడికలను ఏర్పాటుచేసు కునేందుకు ఏదైనా ధాన్యపుకొట్టుగానీ మరేదైనా కట్టడంగానీ దొరుకుతుందేమోనని ఫ్రీ చర్చికి సంబంధించిన సహోదర సహోదరీలు వెదకసాగారు.

ఇప్పుడు వారి సంఖ్య దాదాపు రెండొందలు ఉంది. వారి గుంపులో పెద్దవారైన కొందరు విధవరాండ్రు చాలా సంవత్సరాల క్రితమే జాన్ హృదయాన్ని చూఱగొన్న స్త్రీలు.

ఆలివర్ క్రాంవెల్ గత ప్రభుత్వంలోని పదిమంది లండన్లో ఉరితీయబడ్డారు. ఆ చర్య రాచరికవాదులను సంతృప్తిపరచలేదు. చనిపోయినవారి దేహాలను యీడ్చు కొచ్చి, నాలుగు ఖండాలుగా విభజించి, దేహఖండాలను పట్టణంలో వ్రేలాడదీశారు.

వాళ్ళలో యిద్దరి తలలను మొదటి చార్లెస్ రాజు ఎక్కడైతే విచారణకు గురయ్యాడో ఆ వెస్ట్ మినిస్టర్ హాల్లో ప్రదర్శనకు పెట్టారని తెలియవచ్చింది. ఇటువంటి అనాగరిక చర్యలను ఎలిజబెత్ నమ్మలేకపోయింది. జాన్కూడ ప్రత్యేకించి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించలేదు. అయితే యుద్ధంలోని అతని జ్ఞాపకాలు మట్టుకు యీ వదంతులు పూర్తిగా సత్యమేనని అతనికి చెప్పాయి.

జాన్ ఆ పల్లెప్రాంతాలన్నిట్లో బోధిస్తూనే ఉన్నాడు. నవంబర్ లో ఒక రోజు బెడ్ఫోర్డుకు దక్షిణంగా పదిమైళ్ళ దూరంలోని లోయర్ శామ్సల్ గ్రామానికి అతడు ప్రయాణంచేశాడు. ఇది జాన్కు ఎంతో యిష్టమైన పల్లె ప్రాంతం.

తమ చుట్టుప్రక్కల ఉండే పల్లపు మట్టి మైదానాలు హారింగ్టన్ సుద్ద కొండలకు నడిపిస్తాయి. అలాగే నైరుతీమూలగా షార్పెన్ హూ దగ్గరగా ఉండే కొండల దగ్గరకుకూడా. ఈ కొండలు క్లాపర్స్ ఉడ్ అడవులతో కప్పబడి ఉన్నాయి. దానికి దిగువగానున్న మనోహర దృశ్యం హాటన్ హౌస్. ఇది ప్రత్యేకించి జాన్ అనుభవంలో చాలా శ్రేష్ఠమైన విశాల భవనం.”

కాని తాను తరచుగా బోధించే ప్రదేశం లోయర్ శామ్సల్కు తూర్పున ఉన్న పాత సంస్థానం. ఇది విస్తారమైన ఎల్మ్ వృక్షాలతోనూ, కృంగిపోయి పూడుకుపోయిన కందకాల అవశేషాలతోనూ చుట్టబడి ఉంది.

మంచి వాతావరణంలో ఒక ముండ్ల పొదలాంటి హాథార్న్ చెట్టుక్రింద నిలబడి బోధించడాన్ని జాన్ యిష్టపడేవాడు. అయితే చెట్లకు ఆకులు రాలిపోయివుండే నవంబర్ నెలలోమాత్రం యిళ్ళలోపల బోధించేవాడు.

“ఈ రోజు మీ ముఖాల్లో బాధను చూస్తున్నాను ఎందుకని?” – ఆ యింట్లో అప్పటికే చేరిన జనాన్ని ప్రశ్నించాడు జాన్.

“ఈ రోజు మీరు వాక్యం చెప్పకూడదు” – గృహ యజమాని దిగులుగా అన్నాడు – “హర్లింగ్టన్ మెజిస్ట్రేటగు సర్ ఫ్రాన్సిస్ వింగేట్ మీరు బోధించిన పక్షంలో మిమ్మును అరెస్టు చేయించేందుకు వారంటుకూడ పంపాడు.”

జాన్ ఏమాత్రం తొందరపడలేదు – “కేవలం ఈ కారణంవల్ల ఈ కూడికను రద్దుచెయ్యబోను. ఓహ్! అందుకేనా మీరు అలా ఉన్నారు. సంతోషంగా ఉండండి. మన ఉద్దేశ్యం న్యాయమైందే. దేవుని వాక్యం ప్రకటించడంవల్లనూ, వినడంవల్లనూ మనకందరికీ మంచి బహుమానం లభిస్తుంది. దాని నిమిత్తమై యిప్పుడు మనం శ్రమలననుభవించవలసివస్తేకూడ దాన్ని విరమించకూడదు.”

జాను తెలుసు ఇప్పుడు తను విరమించుకోజాలనని. సంఘకాపరులు క్రీస్తుకోసం నిలబడలేకపోతే సహోదర సహోదరీలు తమ విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకోగలరు? చుట్టు ప్రక్కల పల్లె ప్రాంతాలనుండి మిగిలినవాళ్ళు వచ్చిన అనంతరం ఎప్పటిలాగా జాన్ ప్రార్థనతో కూడికను ప్రారంభించాడు. అతడు తన ప్రసంగాన్ని ప్రారంభించగానే తనను ఆటంకపరచేందుకు ఒక వ్యక్తి ముందుకొచ్చాడు.

“నేను కానిస్టేబుల్ని బన్యన్గారూ! మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు నా దగ్గర వారెంటు ఉంది.”

వెంటనే జాన్ హర్లింగ్టన్లోని మేజిస్ట్రేట్ యింటికి కొనిపోబడ్డాడు. అక్కడ మేజిస్ట్రేట్ కోసం రాత్రంతా జాన్ ఎదురుచూడాల్సి వచ్చింది. మరుసటి ఉదయం న్యాయమూర్తి అయిన సర్ ఫ్రాన్సిస్ వింగేట్కు ఎదురుగా జాన్ నిల్చున్నాడు.

“పాత్రలకు కళాయివేసేవానిగా పిలిపించుకోడానికి నువ్వెందుకు తృప్తిపడటం లేదు బన్యన్?” న్యాయమూర్తి అన్నాడు.

“ప్రజలు నశించిపోకుండునట్లు తమ పాపాలను విడిచిపెట్టి క్రీస్తును నమ్మమని ప్రజలకు బోధిస్తూ సలహాలిస్తున్నాను. నేను యీ పనీ చెయ్యగలను, కళాయివేసే పనికూడ చెయ్యగలను.”

“చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు వెలుపల బోధించడం చట్టవిరుద్ధమని నీకు తెలియదా?” – కొఱకొఱలాడాడు న్యాయమూర్తి.

“అటువంటి క్రొత్త చట్టం గురించి నాకేం తెలియదు.”

జడ్జి రెచ్చిపోయినట్టు కనబడ్డాడు – “చట్ట వ్యతిరేకంగా సమావేశమై చట్టాన్ని ధిక్కరించినందుకు నువ్వు అపరాధివని నేను తెలుసుకున్నాను …”

“ఎలిజబెత్ రాణి కాలంనాటి పాత చట్టాన్ని గురించేనా మీరు మాట్లాడేది?” – జాన్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు – “అది వందల సంవత్సరాల కాలం నాటిది, దాన్ని ఆలివర్ క్రాంవెల్ భూస్థాపితం చేశాడు.”

“లేదు! ఆలివర్ క్రాంవెల్లే భూస్థాపితమయ్యాడు!” – వింగేట్ కోపంతో ఊగి పొయాడు – “నేను మీ అననుకూలవాద సంఘం మెడ విరిచివేస్తాను బన్యన్ ! ఇప్పుడు నువ్వొక అంగీకార పత్రం వ్రాసివ్వాల్సి ఉంటుంది. ”

“ఏమని వ్రాసివ్వాలి?” “బోధించడం మానుకుంటానని”

“నేను మానుకోను.”

“మానుకోకపోతే జైలు కెళతావ్!”

కానిస్టేబుల్తో జాన్ వెళ్ళకముందు వింగేటు సేవచేసే లిండేల్ అనే పాస్టరొకడు తానో గొప్ప విజయం సాధించినట్టు జాన న్ను వ్యంగ్యంగా దూషించాడు. యీ వింగేట్ పెడుతున్న హింస వెనుక లిండేల్ ఉన్నాడని అప్పుడు జానకర్థమైంది.

దేశంలోని చట్టానికి వ్యతిరేకంగా జాన్ నేరం చేసినట్లు భావించబడినందున బెడ్ఫోర్డులోని గ్రామ చెరసాలకు అతడు తరలించబడ్డాడు. ‘తాను విచారణకై మరో న్యాయమూర్తి ఎదుటికి వచ్చినప్పుడు లిండేల్లాంటి ప్రతీకారేచ్ఛ ఉన్న ఒకడి ప్రోద్బలంచేత పాత చట్టాలను తిరిగి ప్రయోగించడం జరిగిందని చెప్పాలి. తాను జైలునుండి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయంపై తీవ్రంగా ప్రతిఘటించాలి’ అని జాన్ తనలో తాననుకొన్నాడు.

బెడ్ఫోర్డులోని యీ గ్రామ చెరసాల హై సిల్వర్ స్ట్రీట్స్క వాయవ్యంగా ఉన్న రెండంతస్థుల రాతి కట్టడం. జాన్ మూడు పొరల ఓక్ కొయ్యద్వారంగుండా చెరసాల లోనికి ప్రవేశించాడు.

ఖైదీలకు సువార్త ప్రకటించేందుకు అతడు అనేకసార్లు యీ ద్వారంగుండా వెళ్ళాడు. అయితే ఇనుప ఊచలతో భద్రంచేయబడ్డ యీ చెరసాలనుండి తప్పించుకోవడం ఎంత అసాధ్యమో జాన్కు యిప్పుడే తెలిసింది.

అప్పు తీసుకున్న వాళ్ళు రెండవ అంతస్థులోని నాలుగు లాకప్ గదుల్లోను, ఒక పగటిగదిలోను ఖైదు చేయబడతారని జాన్కు తెలుసు. క్రింది అంతస్థులో నేరస్థులకోసం లాకప్ గదులు, పగటి గదులు ఉన్నాయి. మొదటి అంతస్థులోని లాకప్ గదికి జైలర్ తనను తీసుకొని పోయినప్పుడు జాన్ సంతోషపడ్డాడు.

ఎందుకంటే క్రిందున్న రెండు పెద్ద గదుల్లో ఒక గది మరీ చీకటిగది. ఖైదీలు ఈ గదుల్లో గడ్డి పరుపులమీద నిద్రపోతారు. సాధారణంగా ఒక గదిలో ముగ్గురు లేక నలుగురు నేలమీద పడుకుంటారు, అదీ చలికి ముడుచుకొని.

అప్పుడప్పుడు ఒక్కో గదిలో పదిమందివరకూ పడుకొంటూ ఉంటారు. పగటి సమయంలో పగటిగదుల్లో నిరుత్సాహంగా అటు యిటు తిరుగు తుంటారు. లేదా మంచి వాతావరణంలోనైతే ఆవరణంలో పచార్లు చేస్తుంటారు.

ప్రారంభ దినాల్లో జాన్ ఎలిజబెత్వద్దనుండీ స్నేహితులనుండీ వచ్చిన దుప్పట్లు మరియు బట్టలతో కాలం గడిపాడు. చిన్న చలిమంటలు అప్పుడప్పుడూ పగటి గదుల్లో వేస్తుంటారుగాని లాకప్ గదుల్లోనైతే బయట ఎంత చలిగా ఉంటుందో లోపలా అంతే చలిగా ఉంటుంది.

కాని, అతని బైబిలు మరియు వ్రాతపరికరాలకంటే అతనికి ఎక్కువ వెచ్చదనాన్నిచ్చేవి మరేముంటాయి? ఖైదీలు చెప్పుకోనే మాటల్నిబట్టి ఖైదీ ఎప్పుడైనా ఒకసారి తన కుటుంబాన్ని సందర్శించవచ్చునన్న విషయం జాన్కు ప్రోత్సాహాన్నిచ్చింది. అక్కడి జైలరు ఖైదీలయెడల దయగా ప్రవర్తించేవాడు. అతడు జాన్కు ఎప్పుడూ కష్టం కల్గించలేదు. ఒకసారి రెండు పెన్నీలు జాన్ చేతిలో పెట్టాడుకూడ.

జాన్తో మాట్లాడిన ప్రతి ఖైదీ కూడ జాన్ ను హెచ్చరించాడు – “ఇక్కడ అతిగా సౌకర్యాన్ని పొందుతూ ఇక్కడే స్థిరపడాలని అనుకోవద్దు. ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా విచారణకు సిద్ధంగా ఉండు … నీమీద వాళ్ళకేం లేదు.”

“ఇదంత సులువైందా?” – సందేహంగా అడిగాడు జాన్.

చివరిగా ఒకతను అన్నాడు – “లేదు, అది అంత సులువైందేం కాదు. నీ అనుమానం నిజమే నేస్తం” – అతని స్వరం దయతో నిండినట్లుగా ఉంది.

“మీకెలా తెలుసండీ?” జాన్ అడిగాడు.

“నేను ప్లీడర్ గుమస్తాను. ఈ పర్యాయం చట్టం తలక్రిందుగా ఉంది” – అతడు కాపేపు ఆగి మరలా – “ఇంగ్లాండ్ అంతా ఒక రాజుక్రింద ఎలా పని చేస్తుందో నీకర్థమయ్యిందా బన్యన్?”

“ఎందుక్కాదు. మా కుటుంబం యీ రాజుగురించి. ఆయన ఆస్థానం గురించి మాట్లాడటం నాకెప్పుడో గుర్తుంది.”

“అవును, ఇంగ్లాండ్ను అదుపుచేసే అధికార కేంద్రం రాజు. అయితే, అంతకంటే మించి రాజుగారికి ఒక రహస్య సలహా సంఘం, ఇద్దరు మంత్రులూ ఉన్నారు. అంతేకాదు ఒక రాజగృహం, అందులో బట్టల బీరువా, ప్రత్యేక మందిరం, యించు మించుగా ఓ రాజధనాగారం ఉంటాయి. ఒక రాచ సరఫరాల అధికారికూడా అతనికి ఉంటాడు. అతని ఆర్థిక శాఖలోని ఒక భాగం ఖజానా.

వినటానికి అది అహేతుకంగా అనిపించినాకూడ ఖజానా అనేది న్యాయస్థానాల్లో ఒక భాగమే! అది సాధారణ న్యాయస్థానాలైన మూడింటిలో ఒకటి. మిగిలిన రెండు రాజుగారి న్యాయస్థానం, సాధారణ విన్నపాలు స్వీకరించేవి.

ఈ సాధారణ న్యాయస్థానాలకు తోడు లార్డ్ ఛాన్సలర్ యొక్క ఉన్నత న్యాయస్థాన విభాగం, స్టార్ చాంబరుకూడ ఉన్నాయి. రహస్య సమాలోచన సంఘానికికూడ కొన్ని న్యాయాధికారాలున్న సంగతి నువ్వు అసలు మరచిపోనేకూడదు.”

“నా తల తిరిగిపోతోంది.”

“ఒక రాజుగారి క్రింద అతని పౌరుడుగా ఉండటం అంత సులభం కాదు.”

“నువ్వింకా పార్లమెంటును ప్రస్తావించలేదు.”

“అవును. ప్రస్తావించలేదు. ఎగువ సభ సంపన్నవర్గాలతోనూ మతాధిపతులతోను నిండివుంటుంది. రాజుగారు ఈ సంపన్నవర్గాల సంఖ్యను అధికం చెయ్యవచ్చు. అంటే ఎగువ సభలోని సభ్యులు పెరుగుతారన్నమాట. అయితే మతాధిపతుల సంఖ్య స్థిరంగా చేయబడినందున, సంఘాధికారాన్ని యిది తగ్గిస్తుందికూడ.”

“మరి దిగువ సభ మాటేమిటి?

“ఓ…. వాళ్ళుకూడ భూకామందులే. కొద్దిమందిమాత్రం ధనవంతులైన వ్యాపారులు. మిగిలినవాళ్ళూ అలాంటివాళ్ళే. వాళ్ళు ఎన్నిక కాబడినవాళ్ళు. కాని నీకు తెలుసా, యీ ఎన్నిక చాలా మండలాల్లో భూస్వాములకు, సంపన్నులకుమాత్రమే పరిమితమౌతోంది. ‘నాణ్యమైన ప్రజలు’ అన్నదే నినాదం.”

“ఇది చాలా విచారకరం” – నిట్టూర్చాడు జాన్.

“నేను యిప్పటివరకు చెప్పినదానికంటే చాలా విచారకరమైంది యింకొకటుంది. ఈ పార్లమెంటు సభ్యుల మధ్య గొప్ప ఏకాభిప్రాయం ఉంటుందని నీవనుకుంటే పప్పులో కాలేసినట్టే. వాళ్ళ మధ్యకూడ రాచరికవాదులనీ, రాచరిక వ్యతిరేకవాదులనీ, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్వాళ్ళనీ, ప్రెస్బిటేరియన్లనీ విభేదాలున్నాయి.”

“దేశాన్ని పరిపాలించే వ్యక్తి దీన్నంతా అర్థం చేసుకోగలిగితే …”

“ఆలివర్ క్రాంవెల్ అర్థం చేసుకున్నాడు. అటువంటి మనిషే యిప్పుడున్నాడు.”

“సామాన్య ప్రజలకోసం పాటుపడే క్రాంవెల్ లాంటివాడా?” – ఆశగా అడిగాడు

“అవును. లార్డ్ క్లారెన్ డన్ అనే రాచరికవాది.”

ఒక దినాన ఖైదీలలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వాళ్ళు కిటికీల ఊచల దగ్గర గుమికూడారు. సాధారణంగా వాళ్ళ కుటుంబాలవాళ్ళు కోరుకున్న రోజున సిల్వర్ స్ట్రీట్నుండి వారితో మాట్లాడేందుకు ఖైదీలకు అనుమతివుంటుంది.

అయితే ఈ రోజున యీ ఉద్రిక్తతకు కుటుంబాల రాక కారణం కాదు. అలా తేరిపార జూస్తున్న ఖైదీలతో జాన్ కూడా కలిశాడు. వాళ్ళ ఎడంవైపు దూరంగా హై స్ట్రీట్మీద జనం బారులుతీరి ఉన్నారు.

“ఇదేదో కవాతులా ఉంది” అన్నాడో ఖైదీ. వాళ్ళు సైనిక వందనంతో తుపాకులు పేలుస్తున్నారు. “వచ్చేవాళ్ళెవరో గొప్ప సైన్యాధిపతియై ఉంటాడు” మరొకరన్నారు. జాన్కు బాగా తెలిసిన ఓ క్వాకర్ సకిలిస్తూ ఇలా అన్నాడు – “సైన్యాధిపతి కాదు.

ప్రధానాకర్షణగావున్న ఆ పెద్దమనిషిని చూడు. బిషప్ ధరించే గొప్ప తలపాగా ధరించివున్నాడు. బంగారు సిలువదండాన్ని చేబూనాడు. అతడు అత్యద్భుతమైన ఊదారంగు వస్త్రాల్ని ధరించి ఉన్నాడు.”

“అతనో బిషప్పు” – నిర్జీవంగా అన్నాడు జాన్.

“పాత చర్ఛాఫ్ ఇంగ్లాండ్ తన పాత వైభవం, నిరంకుశత్వంతో తిరిగి వచ్చిందన్న మాట.”

జనవరి ప్రారంభంలో జరిగే తదుపరి త్రైమాసిక సమావేశంలో జాన్ విచారణకు కొనిపోబడ్డాడు. హియర్నే చాపెల్ అనే భవనంలోనికి జాన్ను తీసుకెళ్ళారు. ఇది జాన్ చదువుకున్న పాత స్కూలు భవనానికి కుడి ప్రక్కనే ఉంది.

ఒక భవనంనుండి మరో భవనానికి వెళ్ళడం ఎంత కష్టమైందో జాన్ ఆలోచించలేక పోయాడు. ఆ రోజు న్యాయపీఠంమీద అయిదుగురు న్యాయమూర్తులు ఆసీనులైవున్నారు. వాళ్ళు కెలింజ్, చెస్టర్, బ్లండెల్, బీచెర్, స్నాగ్ అనే న్యాయమూర్తులు.

ఈ న్యాయమూర్తులంతా రాచరికవాదులనీ, కెలింజ్ అనే ప్రధాన న్యాయమూర్తి లండన్లో క్రాంవెల్ను బలపరచిన పదిమందిని మరణశిక్షకు గురిచేసిన న్యాయమూర్తుల్లో ఒకడనీ జైల్లో పుకార్లు వ్యాపించాయి. .

మొదటగా కోర్టు గుమస్తా మాట్లాడాడు. “జాన్ బన్యన్ అనే సామాన్య కార్మికుడు పైశాచికంగా, ప్రమాదకరంగా మారి దైవారాధనలను వినేందుకు దేవాలయానికి రాకుండా వాటిని బహిష్కరించి సార్వభౌముడైన రాజుగారి శాసనాలకు వ్యతిరేకంగా అనేక చట్టవిరుద్ధ కూడికలను జరిపిస్తున్నట్టు యితనిపై నేరారోపణలు చేయబడ్డాయి. – ఈ ఆరోపణలను గూర్చి నీవేమైనా వాదింపదలచుకున్నావా, ఖైదీ?”

జాన్ కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత మాట్లాడడం ప్రారంభించాడు. “మొదటి భాగం విషయమైతే, నేను సాధారణంగా చర్చ్ ఆఫ్ గాడ్ సంఘానికి వెళు తుంటాను. దేవుని కృపచేత క్రీస్తు శిరస్సుగావున్న ప్రజలలో ఒక సభ్యుడనుకూడ”.

న్యాయమూర్తి కెలింజ్ అన్నాడు. – “కాని నీవు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ స్థానిక సంఘానికి వెళుతుంటావా?”

“లేదండి! నేను వెళ్ళడం లేదు. అటువంటి యేదీ దేవుని వాక్యంలో నాకు కనిపించలేదు.”

“ప్రార్థించాలని ఆజ్ఞాపించాం” – తటాలున అన్నాడు కెలింజ్.

“అంతేగాని స్థానికసంఘ సాధారణ ప్రార్థనలను వల్లెవేయమని కాదుగా. ఆ ప్రార్థనలు యితర మనుష్యులచేత వ్రాయబడ్డాయి.”

“నువ్వుకూడ నీ సొంత ప్రార్థనలు వ్రాసి నేర్పిస్తున్నావేమో! మాకెట్లా తెలుస్తుంది?” – నవ్వాడో జడ్జి.

“లేదండీ, నేనెప్పుడూ అలా చేయను” – జవాబిచ్చాడు జాన్. వెంటనే జాన్కు ఒక వాక్యం మనస్సులో మెదిలింది – “గౌరవనీయులైన పెద్దలారా! రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకోవలసిందిగా ఈ సమయంలో మీకు మనవి చేస్తున్నాను –

‘అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదుగాని, ఉచ్ఛరింప శక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు.’

జాన్ బైబిల్ను ఉపయోగించుకున్న తీరునుబట్టి న్యాయమూర్తులు మౌనం వహించి నట్లు కనబడ్డారు. జాన్ కొనసాగించాడు, “అవును, మనమందరం ప్రభువు నేర్పిన ప్రార్థనను చెప్పవచ్చు.

అయితే ఎంతమంది ఆ ప్రార్థనలోని ‘పరలోకమందున్న మా తండ్రీ’ అనే మాటను తమ హృదయంలో పరిశుద్ధాత్మతో కలిసి అనగలరు? వాళ్ళు తిరిగి జన్మించనివారైతే ఆ ప్రార్థన కేవలం సణుగుడూ గొణుగుడే కదా?”

“అది వాస్తవమే” – న్యాయమూర్తి కెలింజ్ అన్నాడు.

“ప్రార్థన అనేది దేవునివాక్య ప్రకారం చెయ్యాల్సివుంది” జోడించాడు జాన్.

“స్థానికి సంఘానికి యితను చాలా ప్రమాదకారి” అన్నాడో జడ్జి. “అవును ఇతడు బోధించడానికి వీల్లేదు” – జతకలిపాడు కెలింజ్ -“నీకీ అధికారం ఎక్కడనుండి వచ్చింది?” జాన్ ను అడిగాడు.

“మొదటి పేతురు నాల్గవ అధ్యాయంలోని వచనాలనుండి :

“ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయ వలెను.

ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసు క్రీస్తుద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభా వమును ఆయనకుండునుగాక, ఆమేన్.”

“ఒక్క నిమిషమాగు” – ఒక జడ్జి అరిచాడు.

“ఇతడు మనల్ని మోసం చేస్తున్నాడని అనుకుంటున్నాను. ఇతడు వాక్యాలు బాగా తయారుచేసుకున్నట్టుంది. ఇదిగో గుమస్తా, ఆ బైబిల్ యిలా తీసుకురా!”

న్యాయమూర్తులు బైబిల్మీద మూకుమ్మడిగా మూగిన తర్వాత జాన్ను యిది వరకటికంటె ఎక్కువగా రెచ్చగొట్టి, వేధించనున్నట్టు కనబడసాగారు. కెలింజ్ యిప్పుడు కూడ జాన్వైపు శతృత్వంతో చూశాడు. అమూల్యమైన యీ కళాయివేసేవాడితో యిక విరోధించలేకపోయాడు. బెదిరిపోయినవాడిలా అయ్యాడు.

తరువాత కెలింజ్ కోపంగా ఇలా అన్నాడు – “నీకియ్యబడిన వరాన్ని నీ కుటుంబంవరకే ఏకాంతంగా వాడుకోవాలి లేకపోతే కుదరదు.”

“నా కుటుంబానికి బోధించడం దేవుని దృష్టిలో మంచిదైనప్పుడు అది యితరులకు బోధించడంకూడా మంచిదౌతుంది కదా?”

“నేను నీ బైబిల్ను ఎదిరించలేను” – పెద్దగా అరిచాడు కెలింజ్. జాన్ బైబిల్ వాక్యాలను ఎక్కువగా ఉదహరించాడని తలుస్తూ అతడు – “నువ్వు కలవరపెడుతున్నావ్” అన్నాడు.

“ఇతరులతో కలిసి ప్రార్థించడం, వాళ్ళు నన్ను ప్రోత్సాహపరుస్తుంటే నేను వాళ్ళను ప్రోత్సాహపరచడం తప్ప నేను తప్పేం చేయలేదు” జాన్ అన్నాడు.

కెలింజ్ ముఖం ఎర్రబడింది. “నిన్ను మరలా జైలుకు పంపుతున్నాను బన్యన్. మూడు నెలల అనంతరం నువ్వు నీ బోధను విడిచిపెట్టి స్థానిక సంఘంలో హాజ రయ్యేందుకు లోబడమని అడుగుతాం. నువ్వు తిరస్కరిస్తే నిన్ను అమెరికా దేశానికి రవాణా చేస్తాం. నువ్వు మళ్ళీ ఇంగ్లాండ్ గనుక కన్పిస్తే నీకు ఉరి తప్పదు. ఇది మా తీర్పు!”

“వాళ్ళు కేవలం నిన్ను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు బన్యన్. నువ్వు ఈ జైలు నుండి బయటకు వెళ్ళాలంటే చేయవలసిందల్లా యికపై బోధించడం మానుకోవడమే! యిది మాత్రం స్పష్టం” – ఆ తర్వాత పగటిగదిలోని ఒక ఖైదీ జాన్తో అన్నాడు.

జాన్ కోర్టు గుమాస్తా దగ్గరకు వెళ్ళి, యీ ఉత్తర్వులను గూర్చి అతనితో మాట్లాడాడు – “వాళ్ళు కేవలం నన్ను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని నీవు నమ్ముతావా?”

“నే చెప్పదలచుకున్నది యిదే – చార్లెస్ రాజుకు మద్దతిచ్చినందుకు జడ్జి కెలింజ్ పదునెనిమిది సంవత్సరాలు విండ్సర్ కోటలో బందీగావించబడ్డాడు.”

జనవరి మధ్యకల్లా రాజు పార్లమెంటును రద్దు చేసినట్టు లండన్ నుండి వచ్చిన వదంతులతో జైలు అట్టుడికిపోయింది. పైకిమాత్రం అవి తగినంత సమూలమైన మార్పుల్లా కనబడలేదు. రెండవ చార్లెస్ అసాధారణ ద్రోహచింతనగల రాజుగా తన్ను తాను ఋజువు చేసుకుంటున్నాడు.

“జైలునుండి నేను బయటపడటం చాలా కష్టమని నీవనుకుంటున్నావా?” జాన్ మరో ఖైదీని అడిగాడు.

“ఇప్పట్లో నువ్వు బైటకు వెళ్ళలేవు. ఈ విషయాన్నిగూర్చి ఇక నీవు పెద్దగా ఆలోచించ నవసరం లేదు” – అడగని ప్రశ్నకు జవాబిచ్చాడు క్వాకర్.

“లండన్లో యింకా ఏం సంభవించాయో నీకు తెలుసా?”

థామస్ వెన్నెర్ నాయకత్వంలోని మతోన్మాదులు కొందరు ఒక గుంపుగా లండన్ నగరంలో చాలామందిని హత్యచేశారనీ, ప్రభుత్వాన్ని కూలద్రోయాలని యీ మతోన్మా దులు పట్టుదలతో ఉన్నారనీ, త్వరలోనే వాళ్ళెవరో అందరికీ తెలిసిపోతుందనీ జాను తెలిసింది.

ప్రతి అననుకూలవాది, ప్రతి క్వాకరు, జైల్లోవున్న ప్రతి ప్రెస్బిటేరియన్కుకూడ తెలిసిందేమిటంటే మత వ్యతిరేకులమీద రాజు ఓ సరిక్రొత్త అణచివేత విధానాన్ని ఆరంభించబోతున్నాడని. అటువంటప్పుడు దానికోసం ఈపాటికే జైల్లో ఉన్నవాళ్ళకంటే మించినవాళ్ళెక్కడ దొరుకుతారు? ఆ మాటకొస్తే వీళ్ళు సాధారణంగా అత్యంత దుస్థితినే అనుభవిస్తున్నారు.

ఎందుకు వీళ్ళు ఆ విషయమై మొదటి బంధితులు కాకూడదు? “ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకు రవాణా చేయబడటమే నిజంగా సాధ్యమైన విషయంగా కన్పిస్తోంది బన్యన్” ఫిబ్రవరి ప్రారంభంలో పగటిగదిలో చెప్పాడు క్వాకర్. “నీకు మళ్ళీ రెండవ అవకాశం వీళ్ళివ్వకపోవచ్చు.”

“నీవు దేన్ని కోరుకుంటావు సోదరా? వర్జీనియానా లేక న్యూ ఇంగ్లాండ్నా?” – జాన్ అడిగాడు.

“మంచి వాతావరణానికిమాత్రం వర్జీనియానే నేను కోరుకొంటాను. అయితే మిగతా విషయాల్లో యిది అంత మంచిది కాదు బ్రదర్ బన్యన్. మనుషులు గొట్టాల్లో నింపుకుని పొగత్రాగే ఆ ఘాటైన పిచ్చిమొక్కకు పుట్టినిల్లు యీ. వర్జీనియానే.

ఈ పొగాకు పండించే తోటల్లో నల్ల ఆఫ్రికన్లు బానిసలుగా ఇప్పుడు పనిచేస్తున్నారు. నువ్వూహించినట్టు యిది రాచరిక వాదులకేగాని మనలాంటి వాళ్ళకు కోరుకోదగ్గ స్థలంకాదు.”

“అలాంటప్పుడు న్యూ ఇంగ్లాండ్ కోరుకోదగిందేనా?”

“అక్కడకూడ రోడ్ ఐలండ్లో మకాం వేయవచ్చు. ఎందుకంటే న్యూ ఇంగ్లాండ్ లోని మిగిలిన భాగమంతా అక్కడ స్థిరపడ్డ ఒక సంఘ నిరంకుశత్వం క్రింద ఉంది!” “చాలా బాగా చెప్పావ్” – మూడో మనిషి అన్నాడు – “అయినా అమెరికాకు తీసుకొని పోబడటం ఒక విధంగా దీవెనే. ఇంగ్లాండ్లో యిప్పుడు ప్రతివారినీ ఉరి తీస్తున్నారు. చివరకు ఆలివర్ క్రాంవెల్నకూడ.”

“ఆలివర్ క్రాంవెల్నా?” – ఆశ్చర్యంతో పెద్దగా అరిచాడు క్వాకర్.

“అతనెప్పుడో చనిపోయాడు” జాన్ అన్నాడు.

“అయినప్పటికీ రక్తపిపాసులు ఆలివర్ క్రాంవెల్ సమాధి గొయ్యిని త్రవ్వి తీసి, రెండేళ్ళ క్రితంనాటి అతని అస్తిపంజరాన్ని ఛారింగ్ కూడలివద్ద ఉరితీశారు. కుళ్ళిపోయిన అతని తలను వెస్ట్ మినిస్టర్లో ప్రదర్శనకు పెట్టారు.”

‘ఇంతకన్నా దురదృష్టకరమైన వార్త యింకేముంటుంది?” – జాన్ తనలో తాను అనుకొన్నాడు.

Leave a Comment